ఆడాళ్ళూ !! మీకు జోహార్లు - అచ్చంగా తెలుగు
ఆడాళ్ళూ !!  మీకు  జోహార్లు.
ఆలూరు కృష్ణ ప్రసాద్ 

సాయంత్రం  మొహం ముట ముట లాడించుకుంటూ ఇంటికి  వస్తాడు భర్త.
"ఉదయం నా  బట్టలు విస్త్రీ చెయ్యమని చెప్పాను . చేసావా ?"  విసురుగా  అడిగాడు.
"లేదండి  . బేబి  వాళ్ళ  టీచర్  అర్జెంట్ గా  స్కూలుకు  రమ్మని  ఫోను చేసింది . అందువల్ల చేయలేదు . రేపు  చేస్తాను." నెమ్మదిగా  సమాధానం  చెప్పింది  భార్య.
"24 గంటలూ  ఇంట్లోనే  ఖాళీగానే  ఉంటావు. నువ్వు వెలగపెడుతున్న రాచకార్యం  ఏమిటి ?"  విరుచుకు పడ్డాడు  భర్త.
నిజానికి  24 గంటలూ  అన్ని  పనులు  మానేసి  అస్తమానం టి.వి. లో   తెలుగు సీరియళ్ళు  చూస్తూ కూర్చుంటుందా, ఆ ఇంటి  ఇల్లాలు?

అలాంటి  వారు  నూటికి  మహా అయితే  ఓ  20  శాతం  మంది ఉండవచ్చునేమో ?
మరి  ఉద్యోగం  చేయని  గృహిణులు  మిగిలిన  సమయంలో  ఏం చేస్తున్నారు  ? ఆ తల్లి పడే కష్టాన్ని  అర్ధం  చేసుకునే  మగవారు  ఎంతమంది  ?
నిష్కర్షగా  మోహమాటం లేకుండా  చెప్పాలంటే   పూర్వకాలంలో  అంటే  ఓ 40 ,  50  సంవత్సరాల  క్రితం స్త్రీలే  ఎంతో  సుఖపడ్డారు . బజారు పనులు  చేయాల్సిన  అవసరం  ఉండేది  కాదు. ఉద్యోగం  చేసే ప్రసక్తే లేదు. పనిమనుషులు , చాకళ్ళు  రోజంతా  చేతి కింద ఉండే వారు . పిల్లల్ని  చదివించాల్సిన అవసరం గృహిణికి  ఉండేది కాదు. అత్తగారు  లేక  ఇతర కుటుంబ సభ్యుల  సహకారం  ఆమెకు  ఎల్లప్పుడూ  ఉండేది . అప్పుడు  ఆమె  పనల్లా  వంట గదికే  పరిమితమై  ఉండేది .

ఒంటి  గంట కల్లా  వంట పూర్తి చేసి , భగవంతునికి  నివేదన చేసి , భర్త  భోజనము  చేసేదాకా  తను  భోజనము  చేయదు కనుక, భర్త  కోసం నిరీక్షిస్తూ  ఎక్కడో  గడప మీద  తన చీరె  చెంగు వేసుకుని  పడుకునేది .
మరి  ఈ కాలం ఆడవాళ్ళు?
ఉద్యోగం  చేసి తీరాలి. నూటికి  80 శాతం ఆడవాళ్ళు  ఈ రోజుల్లో  ఉద్యోగాలు చేస్తున్నారు .

ముఖ్యంగా  ఉదయం  కాఫీలు , టిఫిన్ లు , మధ్యాహ్నము  భోజనాలు , పిల్లల స్నానాలు , బట్టలు లు వేసి వాళ్ళని తయారు చేయించాలి , వాళ్ళతో  హోం వర్క్ చేయించాలి , వాళ్ళ టిఫిన్  బాక్సులు సర్దాలి , వాళ్ళని  ఉదయం 7.30 కల్లా సందు చివర ఆగి ఉన్న  స్కూలు  బస్ దగ్గర  దింపి రావాలి.
అయిదు నిముషాలు  ఆలస్యమయినా  బస్ వాడు  తుర్రున పారిపోతాడు. 
ఇక ఆరోజు  వేరే ఆటో  మాట్లాడి పిల్లల్ని  స్కూల్ కి  పంపేదాకా  ఆమెకి  ప్రత్యక్ష నరకమే.

భర్త గారిని  ఆ రోజుకు  తన స్కూటర్  మీద  దింపి  రమ్మంటే  సవాలక్ష సాకులు చెప్పి దింపకపోగా , ఎదురింటి  ఎల్లమ్మతోనో , పక్కింటి  పుల్లమ్మతోనే  పోల్చి , "నీకసలు  పిల్లల్ని  పెంచడమే  చేతకాదు. You are unfit to the mother Post" అని ,  ఆఫీసులో వాళ్ళ బాసు,  భర్త గారి  కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్  రాసినట్టుగా ఓ  తిట్ల దండకం మొదలేడతాడు. ఏ  అత్తగారో ఇంట్లో ఉంటే  తన కొడుకుకు  ఒకటి రెండు  క్లూలు అందించి , అగ్నిలో ఆజ్యం పోసి  ఇతోధికంగా  తన వంతు సాయం చేస్తుంది.
ఈ తద్దినం కన్నా  అడగక పోవడం మేలని  , సగంలో వదిలేసిన వంటను పూర్తి చేసి , భర్త గారి లంచ్ బాక్స్ లు సర్ది,  అత్తగారి  భోజనానికి అన్నీ టేబుల్ పై  అమర్చి ,తను  హడావుడిగా  రెడీ  అయి, తన బాక్సు సర్దుకుని , ఆఫీసుకు  హడావుడిగా  బస్ ను పట్టుకుని  పరుగు పరుగున  ఆఫీసులో  అడుగు పెట్టే సరికి  గడియారం   10. 30  చూపిస్తుంది .
ఇక అదను కోసం ఎదురు చూస్తున్న బాస్  చేత అక్షింతలు  వేయించుకుని, మూడ్ ఔట్ తో సీట్లో కూలపడి,  ఏం చేస్తున్నదో  తెలియని  స్థితిలో  ఆ రోజు పని  ముగించి,  తిరిగి  ఇంటికి  చేరేసరికి  సమయం  ఆరు అవుతుంది .
ఇంక  స్కూలు నుండి  తిరిగి వచ్చిన  పిల్లలకు టిఫిన్ లు , భర్తకు అత్త గారికి  సాయంత్రం టిఫిన్ లు అయ్యేసరికి  రాత్రి 7.30 అవుతుంది . ఇంక పిల్లల హోమ్ వర్క్ లు , చదువులు , రాత్రి భోజనాలు, అత్తగారికి  టిఫిన్ లు  , భోజనాలు  అవి పూర్తి  అయి  శయన మందిరం చేరే సరికి  గడియారం రాత్రి   11 గంటలు  చూపిస్తుంది.
మళ్ళీ  ఉదయం  5  గంటలకే  పనిమనిషి  వచ్చి కాలింగ్ బెల్  కొడుతుంది .
ఇంక  శని  , ఆదివారాలు  ఆ గృహిణికి విశ్రాంతి  అనుకున్నారా ?
ఎన్నటికీ ఉండదు. 
శని  ఆదివారాలు  బజారుకు వెళ్ళడం , కూరలు తెచ్చుకోవడం , సరుకులు తెచ్చుకోవడం , భర్త గారు , అత్తగారు శని, ఆది వారాలు  శలవు దినాలే  కనుక  (  ఎవరికి  శలవు ?  ) బంధువుల్ని  లేదా  స్నేహితుల్ని భోజనాలకు  పిలిస్తే  వారి భోజనానికి  మరిన్ని వంటకాలు  చేయడంలో , అతిధులకు  మర్యాదలు చేసి వారిని పంపించడంలో, ఆ శని ఆది వారాలు  ఎలా గడిచిపోయాయో తెలియకపోగా, చేద్దామనుకున్న మిగిలిన  పనులన్నీ  వచ్చే వారానికి వాయిదా  పడి పోతాయి .
మధ్యలో  ఉద్యోగ బాథ్యతగా 'వర్క్ ఫ్రొం హోం' , శని , ఆది  వారాల్లో ఆఫీస్  కు  వెళ్ళవలసిన అవసరం కూడా  ఉన్న  మహిళలు  పడే  కష్టం ఇంక వర్ణించ నలవి కాదు .
ఇంకా  నేను చాలా  విషయాలు  సమయానికి  జ్ఞప్తికి  రాక  ప్రస్తావించలేక పోవచ్చును  ?
చాలా మంది,  "రోజుల్లో  మీరు చెప్పిన వన్నీ  ఏ ఇల్లాలు  చేయడం లేదు . అత్తమామల్ని  ఎవరూ చూడటం లేదు ," అని అనవచ్చు.
ఒకటి  మాత్రం నిజం. చెయ్యదల్చుకున్న వారికి  దారి దొరుకుతుంది . చెయ్యదల్చుకోని  వారికి  సాకు  దొరుకుతుంది .

ఈ రోజుల్లో  పైన  తెలిపిన  పనులన్నీ చేస్తున్న గృహిణికి, తన బాధ్యతగా, చేసే  పనుల్లో  భర్త సహకారం అడుగడుగునా  తప్పనిసరి.
ఆమె సంపాదనే నాకు  ముఖ్యం . చేసుకుంటుందో  మానుకుంటుందో  అది  ఆవిడ  సమస్య, నాకు ఎంత  మాత్రం  సంబంధం లేదని భర్త  భావించిన పక్షంలో  " అమ్మ  రాజీనామా " ప్రతి వారు చూస్తారు.  ఇది తథ్యం.
స్త్రీ  సహనానికి  కూడా  ఓ  హద్దు ఉంటుంది కదా. 
ఇంటి వారి సుఖసంతోషాల కోసం అనుక్షణం పరితపించే  ప్రతి  గృహిణికి, ప్రతి  ఇల్లాలికి  పేరు పేరునా  పాదాభివందనములు .

No comments:

Post a Comment

Pages