వైద్యో నారాయణో హరి - అచ్చంగా తెలుగు

వైద్యో నారాయణో హరి

Share This
 వైద్యో నారాయణో హరి
బి.ఎన్.వి.పార్ధసారధి 


రవీంద్ర సుమిత్ర లకి పవన్ ఏకైక సంతానం. ఒక్కగా నొక్క కొడుకు అవటంతో అల్లారుముద్దుగా పెంచారు. పవన్ ఏడు ఏళ్ల వయసులో వున్నప్పుడు ఒకరోజు స్కూల్ నుంచి వచ్చాక రాత్రి మామూలు గా నే పడుకున్న వాడు కాస్తా మర్నాడు ఉదయం  లేచే సరికి రెండు కాళ్ళు కొయ్య ముక్కల్లా అయిపోయాయి. మంచం మీద అతి కష్టం మీద లేచి కూర్చున్నాడు. కానీ కాళ్ళు  ఎంతమాత్రం కదల్చ లేని స్థితి. రవీంద్ర సుమిత్రలు చాలా కంగారు పడ్డారు. ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి. రవీంద్ర తమ ఫ్యామిలీ ఫ్రెండ్ హోమియోపతి డాక్టర్ చంద్ర శేఖర్ గారికి ఫోన్ చేసాడు. ఆయన వున్న పళంగా ఆఘమేఘాల మీద వెంటనే రవీంద్ర ఇంటికి వచ్చాడు.  పవన్ ని ఎత్తుకుని వెళ్లి  మల మూత్ర విసర్జన అతి కష్టం మీద  చేయించారు. ఇంతలో ఉదయం తొమ్మిది గంటలు అవటం తో అందరు కలిసి కార్లో పవన్ ని తీసుకుని  పిల్లల వైద్య నిపుణుడి దగ్గరకి వెళ్లారు. ఆయన పవన్ ని పరీక్షించి , రక్త పరీక్ష తో పాటు మరి కొన్ని పరీక్షలు చేయమని చీటీ రాసి ఇచ్చాడు. ఒకవేళ అవసరం అయితే పవన్ కాళ్ళకి ఆపరేషన్ చేయవలసి వుంటుందని సూచన ప్రాయంగా సంకేతం ఇచ్చాడు. ఆయన మాటల వల్ల సుమిత్రా రవీంద్రలు గ్రహించినది ఏమిటి అంటే పవన్ కి నరాలకి సంబంధించిన వ్యాధి సంక్రమించి ఉండవచ్చును. ఈ వ్యాధి లక్షణం ప్రకారం భవిష్యత్తులో పవన్ కి నరాలు క్రమేపి క్షీణించి మనిషి కదలలేని పరిస్థితి వచ్చే అవకాశం వుంది. మెడికల్ లాబ్ లో పవన్ కి అన్ని పరీక్షలు చేసి రిపోర్టులు ఆ పిల్లల వైద్య నిపుణుడి దగ్గరకి తీసుకుని వెళ్లారు. రక్తం లో క్రియాటినైన్ బాగా ఎక్కువగా వుందని మరోసారి క్రియాటినైన్ పరీక్ష చేయించుకోమని ఆ డాక్టర్ సలహా ఇచ్చాడు. ఇంతకు ముందు వెళ్ళిన మెడికల్ లాబ్ లోనే రెండోసారి పరీక్ష చేయిస్తే మొదటిసారి పరీక్షకి రెండోసారి పరీక్షకి బాగా తేడా వచ్చింది. ఏమిచేయాలో తోచక అప్పటికే బాగా రాత్రి అవటంతో ఇంటి ముఖం పట్టారు. ఆ రోజంతా రవీంద్ర ఫ్యామిలీ ఫ్రెండ్ హోమియోపతి డాక్టర్ చంద్ర శేఖర్ 


వాళ్ళతో పాటు వున్నాడు.       “ ఎలాగూ  రాత్రి అయింది కాబట్టి రేపు ఉదయం ఎంచెయ్యాలో ఆలోచిద్దాం. రాత్రి మీకు ఎమన్నా అవసరం వస్తే నాకు ఫోన్ చెయ్యండి. వెంటనే వస్తాను. “ అని చెప్పి ఆయన తన ఇంటికి వెళ్ళాడు. ఆ రాత్రంతా సుమిత్రా రవీంద్ర లకు కంటిమీద  కునుకు లేదు. రవీంద్ర దైవ ప్రార్ధనతో రాత్రంతా గడిపితే తమ కొడుకు పవన్ కి నయమవ్వాలని సుమిత్ర అందరు దేవుళ్ళకి మొక్కుకుంది. 
తెల్లవారింది. పవన్ కి మెలకువ వచ్చింది. లేచి మంచం మీద కూర్చున్నాడు. ఆ వెంటనే మంచం దిగి బాత్రూం కి మామూలుగా నడుచుకుంటూ వెళ్ళాడు. దాదాపు రెండు గంటల పాటు సుమిత్రా రవీంద్ర లు పవన్ కదలికలని గమనించారు. పవన్ నార్మల్ గానే వున్నాడు. ఒక్కసారి కూడా కాలు నొప్పి అని అనలేదు. సుమిత్రా రవీంద్ర ల ఆనందానికి అవధులు లేవు. డాక్టర్ చంద్ర శేఖర్ కి ఫోన్ చేసి శుభ వార్త చెప్పారు. ఆయన మరో గంటకల్లా ప్రత్యక్షమయ్యాడు. ఆయనని చూసిన వెంటనే పవన్ , “ అంకుల్. నాకు ఇవాళ కుడా మీ తీపి మందులు ఇస్తారా?” అని అమాయకంగా అడిగాడు. సుమిత్రా రవీంద్ర లు విస్తుపోయి చూసారు. డాక్టర్ చంద్ర శేఖర్ చిరునవ్వు నవ్వి, “ నేను మీకు చెప్పకుండా నిన్న రెండు గంటలకోసారి హోమియోపతి మాత్రలు పవన్ కి రోజంతా ఇస్తూ వచ్చాను. మీ అనుమతి లేకుండా మాత్రలు ఇచ్చినందులకు మీరు నన్ను మన్నించాలి” అన్నాడు. ముక్తకంఠంతో “ మీరు అలా అనద్దు” అని సుమిత్రా రవీంద్ర లు ఆయన చేతులు పట్టుకున్నారు.     “ మీరిద్దరు నిన్న ఆందోళనగా ఆ పిల్లల వైద్య నిపుణుడి దగ్గర, మెడికల్ ల్యాబ్ లో పడిగాపులతో తలమునకలై వున్నప్పుడు నేను పవన్ చాలానే మాట్లాడుకున్నాం. ఆ మాటల్లో నాకు తెలిసింది ఏమిటి అంటే అంతకు ముందు రోజు పవన్ స్కూల్ లో మధ్యాన్నం చాలాసేపు పిల్లలతో ఆడుకున్నాడు. ఆ ఆడుకోవడం లో బహుశా బాగా పరుగెత్తడం వల్ల కాళ్ళలో నరాలు మొద్దుబారి బిగుసుకు పోవటం తో రాత్రి నిద్రపోయి ఉదయం మెలకువ వచ్చేసరికి కాళ్ళు కదపలేక పోయాడు. కొన్నిసార్లు ఈ నరాలు బిగుసుకుపోవటం తీవ్రంగా వున్నప్పుడు మనిషి కొన్ని గంటలపాటు కాలు కదపలేడు. పవన్ విషయంలో అదే జరిగివుంటుందని నేను ఊహించాను. నా ఊహ నిజమయ్యింది. మీరు పవన్ బొత్తిగా కాలు కదపలేక పోతున్నాడని ఫోన్ చేసినప్పుడు నేను నాతో పాటు కొన్ని హోమియోపతి మాత్రలు ముందు జాగ్రత్తగా తీసుకుని వచ్చాను. పవన్ కోలుకోవటానికి అవి కాస్త 

ఉపయోగపడ్డాయి. “ అన్నాడు డాక్టర్ చంద్ర శేఖర్. ఆయనకి ఎలా తమ కృతజ్ఞతలు తెలపాలో తెలియక తెల్లబోయి చూస్తున్నారు సుమిత్రా రవీంద్ర లు. “వైద్య శాస్త్రం ప్రకారం  అది అల్లోపతి లేదా హోమియోపతి ఏదైనా కానివ్వండి రోగి ని క్షుణ్ణంగా పరిశీలించి, అతని దినచర్యని, అలవాట్లని, అన్నీ వివరంగా అడిగి తెలుసుకొని రోగికి వచ్చిన వ్యాధికి అతని దినచర్యకి, అలవాట్లకి ఎమన్నా సంబంధం వుందా అని విశ్లేషించాలి. అప్పుడే  వైద్యుడు సరిగ్గా రోగ నిర్ధారణ చెయ్యగలడు. వచ్చే రోగుల సంఖ్య పెరగటంతో వైద్యులు తమ సమయాన్ని సరిగ్గా కేటాయించలేక ముందు పరీక్షలు చేయించుకోండి అని ఒక పెద్ద జాబితా రాసి రోగులని అవసరం వున్నా లేకపోయినా మెడికల్ లాబ్ లకి తరుముతున్నారు. అవి కొన్ని సార్లు తీవ్రమైన పరిణామాలకి దారి తీస్తున్నాయి.  మన పవన్ అదృష్టవంతుడు. దేముడి దయ వల్ల ఒక పెద్ద ఉపద్రవం నుంచి బయట పడ్డాడు.” అన్నాడు చంద్ర శేఖర్. 
“ ఔషదం జాహ్నవీ తోయం, వైద్యో నారాయణో హరి అని నా బాల్యం లో చదివిన శ్లోకం ఇప్పుడు గుర్తుకు వస్తోంది. మందు పవిత్ర గంగా తీర్ధం తో సమానం అయితే ఆ మందు ఇచ్చే వైద్యుడు శ్రీమన్నారాయణుడి తో సమానుడు. మీరు మాపాలిట సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే” అన్నాడు రవీంద్ర  స్వరంలో కృతజ్ఞత ఉట్టిపడగా.
***
     

No comments:

Post a Comment

Pages