శ్రీమద్భగవద్గీత -24 - అచ్చంగా తెలుగు
ఓం శ్రీ సాయిరాం
శ్రీమద్భగవద్గీత -24
రెడ్లం రాజగోపాలరావు

10 వ అధ్యాయము: విభూతియోగము

మహర్షయస్సప్తపూర్వే చత్వారోమనవస్త ధా
మద్భావ మానసాజాతా యేషాంలోక ఇమాంప్రజాః
6 వ శ్లోకము

విభూతి అనగా ఐస్వర్యము భగవంతునిస్పురణ యే ఐశ్వర్యము, భగవంతుని ఉనికియే అష్టైశ్వర్య ప్రదాయము. ఈ సృష్టియందు ప్రతి అణువులోనూ భగవద్విభూదినిండియున్నది. పంచభూతములు , మూడు కాలములు , ఆరు ఋతువులు, వర్షము,చలి,వేడి, సూర్యచంద్రాదులు, సమస్త ప్రాణులు, నదీనదములు, సముద్రములు, కొండలు, వృక్షములు మొదలగు విభూదులును వర్ణించుట మన తరముకాదు. వాటిని ఆశ్వాదించి, ఆనందించి ఆయనకు శరణాగతి పొందుటయే నిజమైన విభూదియోగము.
లోకమునందలి జనులు యెవరియొక్క సంతతియైయున్నారో అట్టివారైన సనకసనందనాలు, సప్త మహర్షులు, మానవులు నా మనోసంకల్పము వలననే పుట్టిరి. వీరి నుండియే ప్రపంచమున మానవ సమాజమేర్పడినది. గొప్పసృష్టి రహస్యములీ శ్లోకము ద్వారా బోధపడుచున్నవి.భగవంతుడు అపార శక్తి సంపన్నుడనియు సంకల్పము చేతనే అతడు జీవులనుగాని, లోకములనుగాని,సృష్టించగలడనియు తెలియుచున్నది. అట్టి సర్వశక్తిమంతునకు అంజలి ఘటించి, అతనియెడల భక్తి భావము కలిగియుండుటే మన కర్తవ్యము.
పైన దెల్పిన మహర్షులు మున్నగు వారందరునూ సామాన్యులు కారు నిర్మల దైవ భక్తి సంపన్నులు దర్మపరాయనులు కనుకనే వారిని గూర్చి " మధ్భావాః " అని వచింప బడినది అనగా నిరంతరము దైవ భావముతో గూడియుండువారు, ఆత్మజ్ఞాన సంపన్నులు అట్టి మహా మహులనుండియే మానవజాతి నిర్మించబడినది అని చెప్పబడినది ఎవరు నిరంతరం దైవ భావ సంయుతులై ఒక్క క్షణమైనను భగవంతుని భావన లేకయుండలేదో అట్టి వారికి జన్మించి ఎల్లప్పుడూ దృశ్య వ్యామోహమున కొట్టు కొనుచు , అశాశ్వతమైన ప్రాపంచిక భోగ వస్తుజాలములకై వెంపర్లాడుచు భగవంతుని స్మరించుట ఎంత శోచనీయం 
నిరంతరము భగవంతుని స్మరించుచు ఆతని దివ్యవిభూదుల ననుభవించు అట్టి దివ్య జ్ఞానుల నుండి ఉద్భవించిన మనుజులు తాము వారాల వలే జ్ఞాన సంపన్నులు కావలెను. జ్ఞాన ధనమే జీవుని జన్మ, మృత్యువుల నుండి తప్పించునది గాని తక్కినవి సంపదలు కావనియు దీనిచే స్పష్టమగుచున్నది.

మచ్చిత్తా మద్గత ప్రాణా బోధయన్తా: పరస్పరం
కథయన్తశ్చమాం నిత్యం తుష్యంటిచరమన్తిచ
9 వ శ్లోకం

భగవద్భక్తి కలవారెట్లు ప్రవర్తించేదరో ఈ శ్లోకమున చక్కగ తెలియజేయబడింది సామాన్య జనుల యొక్క మనస్సు, చిత్తము, ప్రాణము, ఇంద్రియములన్నియు ప్రాపంచిక విషయములందే తిరుగాడును భగవన్మహిమను గుర్తెరిగిన మహనీయుల యొక్క కరణములన్నియు పరమాత్ముని యందే లగ్నమై యుండును. ఏ లక్ష్యమునైనను పొందవలెనని, మనస్సు తదేక నిష్టతో దానిని గూర్చియే చింతన చేయు చుండును. అజ్ఞానులు నశ్వరమగు భౌతిక పదార్థములను, జ్ఞానులు శాశ్వతమగు దైవమందును తమ దృష్టిని కేంద్రీకరించుచుందురు. భక్తులు, జ్ఞానులు, పరమభాగవతోత్తములు భగవంతుని అవ్యయత్వమును, మహిమను గుర్తెరిగినవారై ఎల్లప్పుడు ఆ పరమాత్మను గూర్చియే ఒకరికొకరు బోధించి, చెప్పుకొనుచుందురు. ఇదియే బ్రహ్మాభ్యాసమనబడును. వారి త్రికరణములు దైవమునందే అర్పితములైయుండును. కావున వారిదే చేసిననూ, మాట్లాడిననూ అంతయూదైవసంబంధమైనదిగానేయుండును. వారి చర్యలన్నియు దైవగంధమును వెదజల్లుచుండును. ఒకరికొకరు చెప్పుకొనుచు ఆనందపరవశులై కంటినీరుకార్చుచుందురు.
భగవద్విభూదినెరిగిన మహనీయులు తమ జీవితమును ఆ పరమాత్మ కొరకే అంకితము చేయుదురు. అట్టి తీవ్రనిశ్చయము, తీవ్రత్యాగము కలిగినపుడే లక్ష్యము సులభముగా సిద్ధించును.

తేషామేవానుక మ్పార్ధమహమజ్ఞానజంతమః
నాశయామ్యాత్మభావస్థోజ్ఞానదీపేన భాస్వతా
- 11వ శ్లోకము

సదా భగవంతుని చింతించు భక్తుల యెడల పరమాత్మునికి కనికరము కల్గును. తత్పలితముగ వారిననుగ్రహింప సమకట్టినవాడై ప్రపంచములో గల సమస్త పదార్ధములకంటేను విలువైనదేదియో వివరించి, ఎద్దానివలన జీవునకు భగవత్సాక్షారము, నిరతిశయానంద రూపకైవల్యము సంప్రాప్తించునో అట్టి జ్ఞానమే అన్నింటికంటెను మేటియని నిశ్చయించి దానినే యాతనికొసంగుచున్నాడు. ఆ జ్ఞానమెట్టిది ? అది ఒక దీపమువంటిది. ప్రకాశమానమగు జ్యోతి అనేక జన్మార్జితమగు అజ్ఞానమను చీకటిని, మోహాంధకారమును జీవుని హృదయము నుండీ పారద్రోలునది. భౌతికమైన దీపములు కొంతసమయమునకు ఆరిపోవును. ఈ జ్ఞానదీపమట్టిది కాదు. దాని ప్రకాశము దిన దిన ప్రవర్థమానమగునే కాని మనుజునికి అజ్ఞానమనే చీకటిని దరిజేరనీయదు.ఎవరు భగవంతుని ప్రీతితో నిరంతరము భజించుచున్నారో వారికిచ్చుచున్నారు.

అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థితః
అహమాదిశ్చ మధ్యంచ భూతానామన్త ఏవచ
- 20 వ శ్లోకం

ఓ అర్జునా... సమస్త ప్రాణులయందున్న ప్రత్యగాత్మనేనైయున్నాను. మరియు ప్రాణాలయొక్క ఆదిమధ్యాంతములున్ను నేనే అయియున్నాను.చెప్పవలసినదానినంతనూ ఒక్క వాక్యములోనే భగవానుడు చెప్పవివైచెను. ప్రతిజీవియందును దేహేంద్రియ మనోబుద్ధులకు సాక్షిగా ప్రత్యగాత్మ వర్తించుచున్నాడు. అతనినే జీవాత్మయని అందురు. అతడు పరమాత్మకంటే వేరుకాదని ఇచట పెర్కొనబడినది. అనగా జీవాత్మయే పరమాత్మయను అఖండ మహావాక్యబోధ ఇచటగావించబడినది. ఇదియే అద్వైతబోధ, అనగా పంచకోశములనుండీ( అన్నమయకోశము,మనోమయకోశము, విజ్ఞానమయకోశము,ఆనందమయకోశము,) తనను వేరు పరచుకొని, దేహీంద్రయమనోబుధ్ధ్యాదులకు సాక్షిగా నున్న ప్రత్యగాత్మను సాక్షాత్కరించుకొనవలెను, ఆ ప్రత్యగాత్మయే పరమాత్మ ఉపనిషత్తులన్నియు ఈ సత్యమునే భోధించుచున్నవి.

ప్రతిజీవియందును భగవానుడు వశించుచున్నట్లు స్పష్టముగా తెలుపబడినందువలన ఏ జీవియు అల్పుడని చెప్పుటకు లేదు. ప్రతి ప్రాణియందును భగవంతుడు నివశించుచున్నాడను విశ్వాశమును ధృఢపరచుకొని ఏ జీవికిని హానిచేయక పరోపకార పారీణుడై వర్తించవలెను. "సర్వభూతాశయస్థితః" అను వాక్యమునందలి సర్వ అను ప్రయోగమువలన ఏ ప్రాణియందైనా తాను లేకుండా ఉండునదిలేదనియు, స్పష్టమగుచున్నది. జీవులు ఆనందమునుపొంది, దుఃఖరాహిత్యమును బంధవిముక్తిని శాశ్వత కైవల్యమును బడయవలయును 
గుడాకేశ =  గుడాక + ఈశ - నిద్రను జయించినవాడు అర్జునుడు. ఆహారము, నిద్ర అను ఇరువురు దొంగలు మనుజుని జీవితమును హరించివేయుచున్నారు. కావున ముముక్షువు ఆ రెండింటినీ అదుపునందుంచుకొని సంయమశీలుడై ప్రవర్తించవలెను. మిత నిద్ర, మితాహారము సేవించుట జీవులకు గొప్ప ఆధ్యాత్మిక పురోగతిని ప్రసాదించుచున్నవి.

(సశేషం)
ఇట్లు
సర్వజన శ్రేయోభిలాషి
మీ రెడ్లం రాజగోపాలరావు
పలమనేరు
9482013801

No comments:

Post a Comment

Pages