బుజ్జి తల్లి - అచ్చంగా తెలుగు

బుజ్జి తల్లి

Share This
బుజ్జి తల్లి

మాలా కుమార్ 

“అమావాస్య అర్ధరాత్రి బలవంతుడైన పిశాచం , బలహీనులైన ఆత్మలను లోబరుచుకొని వారికి నాయకత్వం వహిస్తారు. అట్టి పిశాచం బ్రతికి ఉన్నప్పుడు దుష్టుడైన రాజకీయ నాయకుడై ఉంటాడని తలుస్తాడు చిరంజీవి.దయ్యాలకు కూడా స్నేహితులు కావాలి. ఒక బలహీనుడైన మనిషిలో చోటు దొరుకుతే అది వెళ్ళి మరికొన్ని దయ్యాలను వెంటబెట్టుకొని వస్తుంది.
 ****

భీకరాకార వికృత రూపాలలోనున్న ప్రేతాత్మలు ఆ ఇంటిని కాపలా కాస్తున్నట్లు నిల్చున్నాయి. ప్రేతాలకు సూక్ష్మ శరీరం వుండదు. వాయురూపంలో శాపగ్రస్తుల్లా గాలితో పాటు సంచరిస్తూ వుంటాయి.
హంతకులు దోపిడీదారులు, చనిపోయిన దుఃఖం లో , కష్టంలో ,నష్టంలో, బాధలో నున్నవారి ఇంట్లో దొంగలించినా ఆశించినా చనిపోయి ప్రేతాలుగా మారి ఆకలిదప్పులతో అలమటిస్తుంటారు.వాటికి కనుగుడ్లు బయటకి పొడుచుకు వస్తాయి.కోరల్లాంటి దంతాలు చేతులవేళ్ళు పాముల్లా మెలితిరుగుతూ నలువైపులా పాకుతున్నట్టుగా ఉన్నాయి.వాటి చేతుల్లో పుర్రెలు, వాటి నిండుగా రక్తం.”
టింగ్ . . . . టింగ్ 
శబ్ధానికి ఉలిక్కి పడ్డాను.ఒక్క క్షణం ఏమీ అర్ధం కాలేదు. శరీరం భయం తో కొద్దిగా వణికింది. చిన్నగా తేరుకొని ,చదువుతున్న , చిట్టారెడ్డి  నవల "పూల పల్లకి " నుంచి తలెత్తి చూసాను. అప్పటికీ ఏమండీ లాప్ టాప్ లో ఆడుతున్న బ్రిడ్జ్ గేం నుంచి తలెత్తకుండా ఎవరో బెల్ల్ కొట్టారు చూడు అన్నారు. ఇంత అర్ధరాత్రి ఎవరొస్తారులెండి అని నవలలో కి కళ్ళు తిప్ప బోయాను. మళ్ళీ,
టింగ్ . . . టింగ్ . . . అని బెల్ శబ్ధం వినిపించింది. ఇక తప్పదురా దేవుడా, ఐనా ఇంత రాత్రి ఎవరబ్బా అనుకుంటూ సోఫాలో నుంచి లేచి వెళ్ళి తలుపు తీసాను. ఎవరూ లేరు! చల్లటి గాలి మొహానికి తగిలింది. ఆ చల్లగాలికి పరవశిస్తూ బాల్కనీలోకి వెళ్ళాను. ఆ రోజు అమావాస్య మూలంగా నేమో అంతా గాఢాంధకారం!చిక్కటి, నల్లని చీకటి.వీధి దీపం పిశాచాలకు భయపడి ఆరిపోయినట్లుంది. పగలు రణగొణ ద్వనుల తో హడావిడి గా ఉండే వీధి భయంకరమైన నిశబ్ధంగా ఉంది.ఎక్కడా పిట్టపురుగు చప్పుడు లేదు.పూల సువాసనలూ లేవు ఎందుకో మరి! “నీలా ఆస్మా సోగయా “పాట గుర్తొచ్చింది.ఆ నిశబ్ధ, నిశీధి కి ఒక్కసారిగా వళ్ళు జలదరించింది! ఆ చిమ్మ చీకట్లో కొద్దిగాలికే ఊగినట్లున్నాయి కొబ్బరాకులు చల్లటి గాలి వణికించింది. ఎక్కడి నుంచో ఏ పిశాచమో నన్ను చూస్తున్న భావన కలిగి , గబుక్కున ఇంట్లోకి వెళ్ళి, తలుపు వేసాను.లోపల కూడా ట్యూబ్ లైట్ వేసి లేదు.మేమిద్దరమూ కూర్చొని ఉన్న చోట మాత్రం లైట్ వేసుకున్నాము. అందుకని హాలంతా కూడా మసక చీకటిగా ఉంది. భయం వేసి ట్యూబ్ లైట్ వేసాను. 
"లైట్ ఎందుకు వేసావు ?   ఇది చాలు కదా, కరెంట్ దండగ తీసేయి." అన్నారు ఏమండి.
"ఈ మధ్య మీకు మరీ పొదుపు ఎక్కువైంది. ఉండనీయండి " అని చెప్పి పూలపల్లకీ లోకి తల దూర్చాను.
"గది లోకి అడుగు పెట్టిన దగ్గర నుండి తనకు ఎలాగో ఉంది.మనసంతా గుబులుగా ఉంది.అంతలో చల్ల గాలి వళ్ళంతా ప్రాకి పోయింది.ఆ గాలి బయట నుంచి వచ్చినట్లు లేదు.అక్కడే ఏదో గూడు కట్టుకున్న చలి చెల్లా చెదురై పైకి లేచి తన మీదకు వచ్చి వాలిన భావన కలిగింది.శరీరం మీద వెంట్రుకలు సూదులై నిక్క బొడుచుకున్నాయి.చేతి మీద లేచి నిల్చున్న వెంట్రుకలు చూసి నొసలు చిట్లించింది.ఎవరో ఊపిరి బిగబట్టి చూస్తున్నట్లనిపించి కిటికీ లో నుంచి అప్రయత్నంగా చెట్టువైపు చూసింది.ఏమిటీ భావం?  ఏమిటీ ఆలోచనలు? పారద్రోలినట్లుగా ధైర్యం తెచ్చుకొని,కూనిరాగం తీస్తూ బీరువా రెక్కతీసింది.ఎవరో నక్కి దాక్కునట్లనిపించింది.అరలో దాక్కునేదెవరు?   అని నవ్వుకుంది.”
"టింగ్. . . టింగ్ . . . " మళ్ళీ చప్పుడు! విసుగ్గా తలెత్తాను.ఏమండీ తల కూడా తిప్పకుండా బ్రిడ్జ్ ఆడుతున్నారు.నేను లేవక పోవటం గమనించి " ఊ " అన్నారు చూడమన్నట్లుగా. 
"అబ్బా ఏం చప్పుడో ఏమో, ఐనా ఇప్పుడెవరొస్తారండీ ?  " అన్నాను భయంగా. అవును మరి నేను చదువుతున్న పూలపల్లకీ లోని భూతాలు, పిశాచాలు నా చుట్టూ తిరుగుతున్నాయి.
"ఏమో మనలాగా నిద్ర పట్టని వాళ్ళు ఎవరొచ్చారో చూడు." అన్నారు ఏమండి.
హుం ఏమండీగారి ఆర్డర్ తప్పదు మరి అనుకుంటూ సోఫాలోనుంచి లేఛి  వళ్ళు విరుచుకుంటూ , ఎందుకో పైకి చూసాను. షాండిలీయర్ కొద్దిగా కదిలినట్టు అనిపించింది."హేవమండీ , షాండిలీయర్ కదులుతోంది." పైకే చూస్తూ భయం భయం గా అన్నాను.
"నీ మొహం షాండిలీయర్ కదలటం ఏమిటి?   అదేమన్నా చిన్న వస్తువా? " ఏమండి సమాధానం!
ఇంతలో పక్క ఫ్లాట్ వాళ్ళు లేచినట్లున్నారు. లైట్ వేసారు. హాల్ లోని లైట్, పక్కవాళ్ళ లైట్ తో హాలంతా వెలుతురు పరుచుకొని షాండిలియర్ స్పష్టంగా కనిపించింది. దాని మీద నల్లగా ఏదో కూర్చొని ఉన్నట్లుగా కనిపించింది.
ఏ దయ్యమో  రాలేదుకదా ?
కళ్ళ ముందు మెరుపులు మెరిసినట్లై " హేవండీ . . . . అక్కడేదో నల్లగా కనిపిస్తొంది." గజగజా వణికి పొతూ అన్నాను.
"ఏహే ఊరుకో. ఏమీ లేదు ." అన్నారు. 
" అది కాదండి నల్లగా ఉంది ఏ దయ్యమో వచ్చిందేమో.ఈ  నవలలో క్లియర్గా ఉంది దయ్యాలున్నాయని." ఇంకా ఇంకా వణికి పోతూ అన్నాను.
"అందుకే చెపుతాను ఆ దయ్యాల నవలలు చదవకు అని.దయ్యాలు లేవు భూతాలు లేవు . చదివింది చాలు పోయి పడుకో." కోపం చేసారు.
"కాదు చూడండి ప్లీజ్ ." నోట్లో నుంచి మాటనే స్పష్టంగా రావట్లేదు భయం తో!
ఇక నా గోల భరించలేకనో, ఆ గేం ఐపోయిందో తలెత్తి చూసారు ఏమండి. అప్పుడే షాండిలీయర్ మీద నుంచి ఏదో నల్లటిది కదిలి రేలింగ్ మీదకు వెళ్ళింది.ఏమండీ కూడా ఆశ్చర్యపోతూ అటే చూస్తున్నారు.
"చూసారా నేను చెప్పితే నమ్మలేదు మీరు," అన్నాను నిష్ఠూరంగా. నా మాట పట్టించుకోకుండా , మెట్లెక్కి పైకి వెళ్ళారు. 
"వద్దు . . . వద్దు . . . ఆ దయ్యం ఏమి చేస్తుందో!" కీచుగా అరిచాను. 
ఆ అరుపుకు అది అక్కడి నుంచి మళ్ళీ షాండిలీయర్ మీదకు వచ్చింది. అక్కడి నుంచి రేలింగ్ మీదకు రివ్వున పోయింది.దాని విన్యాసాలు నేను కళ్ళప్పగించి చూస్తూ చలనం లేకుండా నిలబడ్డాను. ఏమండీ కుదుపుతూ " అది ఏదో బుజ్జి పిట్ట." అన్నారు.
"కాదు. చిన్న పిల్లలు చనిపోతే ఇలా అమాయకమైన పిట్టల్లాగా బుజ్జి దయ్యాలవుతాయి.అది ఏ బుజ్జితల్లి దయ్యమో! అందుకే  మనలనేమీ చేయక పాపం అదే అయోమయంగా తిరుగుతోంది." అన్నాను అప్రయత్నంగా!
"అది బుజ్జితల్లి దయ్యమైతే వాళ్ళ ఇంటికి పోతుంది కాని మనింటికెందుకొస్తుంది?  " ఏమండీ గారి వేళాకోళం.
కాసేపు దానినే దీక్షగా చూస్తూ  "దానికి నువ్వంటే ఇష్టమేమో.?   అందుకే ఆ బుజ్జితల్లి దయ్యం నీ దగ్గరకు వచ్చింది." అన్నారు ఏమండి.
బాబోయ్ ఉష్. . ఉష్ . . అని దాన్ని వెళ్ళ గొట్టే ప్రయత్నం చేసాను. నీ లెక్కేమిటి అంటూ అది అట్లాగే అటూ ఇటూ తిరుగుతూ ఉంది.
"పాపం మధ్యాహ్నం ఎండకు తాళలేక ఇంట్లోకొచ్చి ఉంటుంది. తిరిగి వెళ్ళలేకపోయిందేమో.ఇప్పుడెక్కడికి వెళుతుంది ఉండనీయిలే నీ బుజ్జితల్లిని ." అన్నారు దయగా.
ఏమండీ మాట విని దాన్ని అనుమానంగానే చూస్తూ  పూలపల్లకీ తీసాను!
మళ్ళీ పాపం బుజ్జి తల్లి, ఎప్పటి నుంచి అట్లా ఉందో అనుకొని వంటింట్లోకి వెళ్ళి, కాసిని బియ్యం గింజలు, ఒక గ్లాస్ లో నీళ్ళు తీసుకున్నాను. దేవుడి గదిలో , దీపావళికి కొన్న పెద్ద మట్టిప్రమిదలల్లో మిగిలిన ఒక దానిని తీసుకొని , పైకి వెళ్ళాను. బుజ్జితల్లి అలాగే రేయిలింగ్ మీద కూర్చొని ఉంది. గోడ వారగా ప్రమిద పెట్టి నీళ్ళుపోసి, బియ్యంగింజలను పక్కన చల్లాను. ఓసారి దానివైపు తిను అన్నట్లుగా చూసి, మెట్ల మీద లైట్ ఉంచేసి, కిందకు వచ్చాను. 
"ఊ ఐయిందా నీ బుజ్జితల్లి సేవ ?   ఇక చాలా రాత్రైంది పడుకో.పొద్దున తలుపు తీయగానే వెళ్ళిపోతుందిలే."అన్నారు ఏమండి నవ్వుతూ.
అయ్యో వెళ్ళిపోతుందా, అవునులే దాని అమ్మ దగ్గరకు అది వెళ్ళాలికదా అనుకుంటూ బెడ్రూం లోకి నడిచాను!
***

1 comment:

  1. నా కథ ప్రచురించినందుకు ధన్యవాదాలండి . ఫోటో చాలా బాగా వేసారు థాంక్ యు .

    ReplyDelete

Pages