శ్రీ రామ కర్ణామృతం - 44 - అచ్చంగా తెలుగు

శ్రీ రామ కర్ణామృతం - 44

Share This
 శ్రీరామకర్ణామృతం - 44
  సిద్ధకవి
  డా.బల్లూరి ఉమాదేవి

  
చతుర్థాశ్వాసము.
21శ్లో: రామం రాక్షస మర్ధనం రఘుపతిం శక్రారి విధ్వంసినం
  సుగ్రీవేప్సిత రాజ్యదం సురపతేః పుత్రాంతకం శార్జ్ఙిణమ్
  భక్తానామభయప్రదం భయహరం పాపౌఘ విధ్వంసినం
  సీతాసేవిత పాదపద్మయుగళం రామంభజే శ్యామలమ్.
భావము:
.రాక్షస మర్ధనుడును రఘునాథుడును రావణుని సంహరించిన వాడును సుగ్రీవుని కిష్టరాజ్యము నిచ్చిన వాడును వాలిని సంహరించిన వాడును శార్ఙధనుస్సును గలిగినట్టి వాడును భక్తులకభయమిచ్చునట్టియును భయమును హరించునట్టియు బాపసమూహమును బోగొట్టునట్టియు సీత తేత సేవించబడు పాదపద్మములు గలిగినట్టియు నల్లనైనట్టియు రాముని సేవించుచున్నాను.
తెలుగు అనువాదపద్యము:
శా:రామున్ రాక్షస మర్ధనున్ రఘుపతిన్ రాజేంద్రు పాపాపహున్
శ్యామాంగున్ రవిజేప్సితున్ వరదు భక్తార్తిఘ్ను శార్ ఙ్గిన్ పరం
ధామున్ వాలి విమర్ధనున్ ధరణిజాతా సేవితాంఘ్రిద్వయున్
శ్రీమంతున్ భయసంహారున్ గొలిచెదన్ శ్రీరామ చంద్రప్రభున్.

22శ్లో:భవభయహరమేకం భానుకోటిప్రకాశం
    కరధృత శరచాపం కాలమేఘావభావమ్
     కనక రుచిర వస్త్రం రత్నవత్కుండలాఢ్యం
     కమల విశద నేత్రంవసానుజం రామమీఢే.
భావము:సంసారభయమును హరించు నట్టియుముఖ్యుడైనట్టియు కోటిసూర్యులకాంతి కలిగినట్టియు చేత ధరించబడిన ధనుర్బాణములు గలిగినట్టియు నల్లమేఘమువలె ప్రకాశించుచున్నట్టియు బంగారముచే సొగసైన వస్ప్రములు గలిగినట్టియు రత్నములుగల కుండలములతో  గూడినట్టియు పద్మములవలె నిర్మలములగు కన్నులు కల్గి తమ్మునితో గూడినట్టియు రాముని స్తుతించుచున్నాను.
.
తెలుగు అనువాదపద్యము:
చం:భవభయ మోచనున్ వికచ పంకజ లోచను గాంచనాంబరున్
రవిశతకోటి తుల్యు మణి రంజిత కుండల కర్ణయుగ్ము రా
జవరలలాము హస్త ధృత చాప శిలీముఖు గాలమేఘ భా
సి విమలు సానుజున్ వలదు శ్రీ రఘురాము సమాశ్రయించెదన్.

23శ్లో:రామం శ్యామ పయోదనీల మమలం రాజీవ నేత్రం సదా
     ౾హల్యాశాప నివారణ ప్రణయ పాదోంభోజ ముర్వీశ్వరమ్
      విద్యుత్కోటి సహస్ర దీధతిలసత్కోటీరమస్తోజ్జ్వలం
     ధ్యాయే తారకనామ మీశ్వర సఖం దైత్యేయ వంశాపహమ్.
భావము:నల్లమేఘమువలె నల్లనైనట్టి నిర్మలుడైనట్టి పద్మములవంటి నేత్రములు గలిగినట్టి అహల్యశాపమును మాన్పుట యందు ప్రేమల పాదపద్మము గలిగినట్టి  భూమి కధిపతియైనట్టి అమితములైన మెరుపులవలె ప్రకాశించుచున్న కిరీటము గల శిరస్సుచే ప్రకాశించుచున్నట్టి సంసారమును తరింప చేయు పేరు గలిగినట్టి శివునికి మిత్రుడైనట్టి రాక్షసవంశము నపహరించినట్టి రాముని ధ్యానించుచున్నాను.
.
తెలుగు అనువాదపద్యము:
మ:మునికాంతాగత శాపమోచన పదాంభోజాతు బ్రావృడ్ఘనా
ఘనగాత్రున్ వికచాబ్జనేత్రు గిరిజాకాంతాప్తు దైత్యారి పా
వన విద్యుచ్ఛతకోటి దీప్త మకుట ౙ్రాజోత్తమాంగున్ జనా
ర్ధనునిన్ దారక నాము రాము నియతిన్ ధ్యానింతు నశ్రాంతమున్.

24.శ్లో:దశరథ సుత మీశం దండకారణ్య వాసం
    శతమఖమణి నీలం జానకీ ప్రాణలోలమ్
    సకలభువన మోహం సన్నుతాంభోద దేహం
     బహుళ నుతసముద్రం భావయే రామభద్రమ్.
భావము:దశరథుని కుమారుడైనట్టి అధిపతియైనట్టి దండకారణ్యమందునికి గలిగినట్టి యింద్రనీలములవలె నల్లనైనట్టి సీతయొక్క ప్రాణనాథడై నట్టి అన్ని లోకములను మోహ పెట్టు నట్టి నుతించబడు మేఘము వంటి దేహము గలిగి నట్టి మిగుల సముద్రునిచే స్తుతింప బడు చున్నట్టి రామభద్రుని ధ్యానించుచున్నాను.
.
తెలుగు అనువాదపద్యము:
చం:శతమఖ రత్ననీలఘన సన్నిభగాత్రుని దండకాటవీ
     స్థితు జనకాత్మజాధిపు నదీపతి సన్నుతు విశ్వ మోహనున్
        క్షితిపతి నీశ్వరేశ్వరుని జిన్మయు దాశరథిన్ దయానిధిన్
  వితతచరిత్రు సత్యు రఘువీరుని సంతత మాశ్రయించెదన్.

25శ్లో:సరయూ తీరవనే లతానివసనే సద్రత్నవేదీతటే
సుమ పర్యంకతలే విదేహసుతయా సార్థం పరిక్రీడతే
 కస్తూరీ ఘన సార చందన మిళిద్గంధోల్లసత్పావనీ
పాయాన్మూర్తి రనామయా రఘుపతేర్భద్రాత్మకా నోనిశమ్.
భావము:సరయూ నదీ తీరమందలి వనమందలి లతాగృహమందు రత్నపుటరుగునందు బువ్వుల శయ్యయందు సీతతో క్రీడించుచున్నట్టియు కస్తూరి కర్పూరము గంధము వీనితో గూడిన పరిమళముచే ప్రకాశించుచ న్నట్టియు  పవిత్రమైనట్టియు బాధలేనట్టియు మంగళరూపమైనట్టియు రాముని రూపము మమ్ము నెల్లప్పుడు రక్షించు గాక.
తెలుగు అనువాదపద్యము:
సరయూ తీరవనిన్ లతాగృహమునన్ సద్రత్న వేదీస్థలిన్
విరిశయ్యన్ జనకాత్మజాసహితుడై వేడ్కన్ లసచ్చంద్రక
స్తురి సంయుక్త సుగంధ లేపనమునన్ శోభిల్లి క్రీడించు సుం
దరసన్మూర్తి యనామయుండు రఘునాథ స్వామి నను బ్రోవుతన్.

26శ్లో:వైదేహీ ప్రియవల్లభం విజయినం వాతాత్మజాధీశ్వరం
       వాణీవారిధి వానరాది వినుతం వందారు మందారకమ్
      విశ్వామిత్ర వశిష్ఠ వాసవ శివావాణీ శశశ్వన్నుతం
   దేవేశం వినతాత్మజాభి వినుతం వందే సదా రాఘవమ్.
భావము:సీతకు నిషటవల్లభుడైనట్టి జయము గలిగినట్టి ఆంజనేయుని కధిపతియైనట్టి  సరస్వతి సముద్రుడు వానరులు మొదలగు వారిచే నుతింపబడినట్టి నమస్కరించువారికి కల్పవృక్షమైనట్టి విశ్వామిత్రునిచే వశి ష్ఠునిచే నింద్రునిచే శివబ్రహ్మలచే నెల్లపుడు నుతింపబడునట్టిదేవతల కధిపతియైనట్టి గరుడునిచే నుతింపబడునట్టిరాము నెల్లపుడు నమస్కరించు చున్నాను.
.
తెలుగు అనువాదపద్యము:
మ:ధరణీజాప్రియవల్లభున్ జయకరున్ దాసామరానోక హున్
 గరుడాంభోధి సరస్వతీ ప్లవగ సంఘస్తోత్రు బ్రహ్మేశ ని
ర్జర నాథా త్రివశిష్ఠ గార్గ్యముని విశ్వామిత్ర సంసేవితున్
వరదున్ రాఘవు వాయుపుత్ర విభు గీర్వాణేశ్వరున్ గొల్చెదన్.

27శ్లో:విశాల నేత్రం పరిపూర్ణగాత్రం
     సీతాకళత్రం సురవైరి జైత్రమ్
     జగత్పవిత్రం పరమాత్మతంత్రం
   శ్రీరామ చంద్రం ప్రణమామి చిత్తే.
భావము:
గొప్ప కన్నులు కలిగి నట్టియు నిండైన దేహము కలిగి నట్టియు సీత భార్యగా కలిగినట్టియు రాక్షసులను జయించినట్టియు జగత్తులయందు పవిత్రుడైనట్టియు పరబ్రహ్మ వ్యాపారుడైనట్టియు రామమూర్తిని చిత్తమందు నమస్కరించుచున్నాను.
తెలుగు అనువాదపద్యము:
చ: వికసిత పుండరీకదళ  విస్తృత నేతరు జగత్పవిత్రు సే
వకనుతి పాత్రు నీలఘనసువర్ణ సుగాత్రు సురారి జైత్రు దా
రకు పరమాత్మ తంత్రు రఘురామ ధరాధిపతిన్ విదేహ భూ
పకతనయా కళత్రు బదపంకజ సేవ యొనర్పు చిత్తమా.

28శ్లో:సౌమిత్రి మార్ణవ పూర్ణచంద్ర
    సీతాలసల్లోచన పూర్ణచంద్ర
    సురారి వక్త్రాబుజ పూర్ణ చంద్ర
   సంరక్షమాం రాఘవ రామచంద్ర.
భావము: లక్ష్మణుని యభిమానమనెడు సముద్రమునకు పూర్ణచంద్రుడైనట్టియు సీతయొక్క ప్రకాశించుచున్న నేత్రములకు పూర్ణచంద్రుడైనట్టియు రాక్షసుల నేత్రపద్మములకు పూర్ణచంద్రుడైనట్టియు రఘువంశమందు పుట్టినట్టియు ఓ రామచంద్రా !నన్ను రక్షింపుము.
.
తెలుగు అనువాదపద్యము:
చం:ధరణికుమారికాక్షి కుముద ప్రమద ప్రద పూర్ణచంద్రు డా
     సురవిసరాననాంబు రుహసోముడు లక్ష్మణ భవ్య మన సా
     గర పరిపూర్ణచంద్రుడు జగత్పరిపూరిత కీర్తి సాంద్రు డం
  బరమణి వంశ చంద్రు డసమానుడు రాముడు నన్ను బ్రోవుతన్.

29.శ్లో:యస్యకించదపి నో హరణీయం
        కర్మకించిదపి నో చరణీయమ్
          రామనామచ సదా స్మరణీయం
          లీలయా భవజలం తరణీయమ్.
భావము:ఎవని కొంచెపు పనినైనను మరలింప శక్యము కాదో ఎవని యొక్క పూజాది కర్మ చేయ శక్యముకాదో  అట్టి రాముని నామమెల్లపుడు స్మరించ దగినది.సంసార సాగరము దాటదగినది.
.
తెలుగు అనువాదపద్యము:
ఉ:ధారుణినేమహాత్ము నవతారసుకర్మలు పోవిడంగరా
    దేరికి నన్యకర్మముల నించుక నేయుట పాడిగాదు దు
    ర్వార దురంత పాప జలరాశి దరింపగ హేతువైన యా
     శ్రీరఘురామనామము స్మరింపదగున్ బరమాత్మసిద్ధికిన్.

30.శ్లో:రంగమాణ మభితో గృహాంగణే భృంగనీల మలకావృతాసనమ్
        మంగళప్రద మమంగళాపహం సంగృణే దశరథాత్మజం హృది.
భావము:ఇంటి ముంగిటి యందు సంచరించుచున్నట్టియు తుమ్మెదల వలె నల్లనైనట్టియు ముంగురులచే నావరించబడిన మోము కలిగినట్టియు శుభముల నిచ్చునట్టియు నశుభములను హరించునట్టియు దశరథ పుత్రుడైనట్టియు రాముని మనస్సునందు తలచుచున్నాను.
.
తెలుగు అనువాదపద్యము:
చం:అళిసముదాయ నీల చికురావృత వక్త్రసరోజుడై సము
    జ్జ్వల భవనాంగణ ప్రకట సంతత సంచరణాఢ్యూడైయమం
     గళ పరిహారుడై లలిత కాంచన భూషణ భూషితాంగుడై
  యలరిన రాఘవున్ దశరథాత్మజు జిత్తము నందు నిల్పెదన్.
 (ఇంకా ఉంది )

No comments:

Post a Comment

Pages