శివం -43 - అచ్చంగా తెలుగు


శివమ్మ కధ -16
శివం -43
రాజ కార్తీక్

(శివమ్మ ఒడిలో ఉన్నాడు మహాదేవుడు. అందరూ మహాదేవుడ్ని విక్షిస్తున్నారు. మహాదేవుడు మాత్రం తన హావ భావాలతో లతో అందర్నీ అలరిస్తున్నాడు. )
విష్ణు దేవుడు "అవును నారదా ..నీవు ఎవరికైనా కలహాలు పెట్టగాలవేమో కాని, ఇప్పుడు నువ్వు కలహం పెట్టలేని ఒక బంధం అది." అన్నాడు.
నారద ముని "స్వామీ, నేను లోక కళ్యాణం కోసం  ఏదైనా చేస్తా గాని భక్తుల జోలికి మాత్రం పోను సుమీ " అన్నాడు ముక్కున వేలేసుకుంటూ.
బ్రహ్మ దేవుడు "మహాదేవుడు ఏమిటి, ఏదో  కుస్తీ వీరుడు లాగా, సరదాగా చేతులు వాళ్ళ అమ్మతో కలుపుతున్నాడు " అన్నారు.
పార్వతి మాత "చమత్కారం ప్రభువులవారికి ..ఆనందం వాళ్ళ అమ్మని ఎలాగైనా ఆనందింప చేయాలి అని "అంది.
శివమ్మ ఇంతలో "ఏమి కన్నయ్య ! నీ బుజ్జి చేతులు చూపిస్తున్నావా "అని ముందుకు వాలింది.
అంతే, నేను మా అమ్మ బుగ్గలను నా  చేతులతో ముద్దాడాను.
అక్కడ ఉన్న నంది, భృంగి, నాగరాజు ఎంతో నవ్వారు.
ఆ స్నాన ఘట్టంలో  నేను చేసిన అల్లరి అంతా ఇంతా కాదు.
నేను మా అమ్మ కొసం ఎంతో అల్లరి చేశాను .అటువంటి ఆనందాలు చూసి కన్నవాళ్ళు తమ బిడ్డలమీద ఎంతో మమకారం పెంచుకుంటారు. నిజం గా మా అమ్మ నాతో గడిపిన క్షణం ఆమె మనసులో, తన బిడ్డకు ఎన్నో చేయల్సినివి ఉన్నాయని తను అనుకున్నది. అందుకే ఆమె కోరిక, అతి చిన్నది ఐనా తీర్చాను.
ఇక మా అమ్మ నాకోసo ఏదో తెచ్చింది .అది సున్నిపిండి అనుకుంటా ఒళ్ళంతా రాసింది.
శివమ్మ "ఇప్పుడే కదా అయ్యా పుట్టావ్. అప్పుడే ఇంత మట్టి ఏంటి అయ్యా .." అంది మురిపెంగా.
నేను సరదాగా జటలతో ఉన్న నా తలని ఆడించాను.
ఇక నా నాసికంలో మా అమ్మ ఏదో పెట్టి తిప్పింది, ఇక చుడండి నా హావభావాలు, తుమ్ములే... తుమ్ములు ..అందరు ఒకటే నవ్వు ..
శివమ్మ "కన్నయ్య నీకోసం నీరు  తెస్తా ఉండు. స్నానం చేసి బజ్జుందువుగాని ,అరె మరిచిపోయనే, నీ జటలకు  తైలం దట్టించ లేదు    "అంటూ నా తలలో తైలం పెట్టి, గట్టిగ మర్దన చేసి, ఒక్క ఉదుటన లాగింది.‌అంతే నా తలలో నుండి ఏదో ఎగిరి వెళ్ళి, గట్టిగా నంది భృంగి దగ్గరకు పడింది .
అంతే అది నా తలలో ఉండే అర్ధ చంద్రుడు.
నంది "చంద్ర స్వామి, నువ్వు ఏంటి కనపడలేదు అనుకున్నా...ఓహో ప్రభువు జటలో
దాక్కున్నావా ..." అన్నాడు ఆటపట్టిస్తూ.

చంద్రుడు "నువ్వు ఉండవయ్యా నంది స్వామి. ముందు నన్ను లేపు" అనగానే...
అందరూ ఒకటే నవ్వు.

లక్ష్మి మాత "ఇతగాడు ఏమయ్యాడు అనుకున్నా "
అంది.

విష్ణు దేవుడు "తమరి సోదరుడు కదా, యుక్తి లో అందర్నీ మించిపోయాడు ..మహాదేవుడు దగ్గరే ఉండి, ఆమె ప్రేమను ఆస్వాదించాడు " అన్నాడు చిరునవ్వుతో.
లక్ష్మి మాత "ఊరుకోండి స్వామి ! మాకు అంత తెలివే ఉంటే, మీ పాద పద్మాల దగ్గర ఎందుకు ఉంటాములే " అంది.
నారద ముని "అలా అను తల్లి "అంటూ వత్తాసు పలికాడు. అందరూ ఆ చమత్కారం ముగించారు.
శివమ్మ తల్లి మాత్రం, ఒక బిడ్డకు తల్లి చేసేవన్నీ నాకు చేస్తోంది.
నేను  మా అమ్మ ప్రేమకు బానిసని అవుతున్నా . ఒక తల్లి ప్రేమలో, భగవంతుడి తత్వం ఎలా క్రోడీకరించబడిందో  కదా! ఆ తల్లి తన బిడ్డకి అన్నీ చేస్తుంది. అవసరమైతే తనకు శక్తీ ఉంటే, విధిని ఎదిరించి, కూడా తన బిడ్డ కోసం పోరాడుతుంది. కానీ ,ఆ బిడ్డ నుండి ఏమి ఆశించదు. కేవలం ప్రేమను తప్ప. భక్తులారా నిజంగా మీరూ ఇలాగే చేయండి. నా  నుండి ప్రేమ అశించండి చాలు. అన్ని అవే దొరుకుతాయి.
ఇక మా అమ్మ నాకోసం కుంకుడు రసం తెచింది తల స్నానం  చేయించడానికి.
కుంకుడు రసంతో మరోమారు నా  దేహం  అంత శుభ్రపరిచింది. ఇక నా జటలకు తలంటుపోసింది మా అమ్మ. అంతే, అది నా కళ్ళలో పడింది. ఇక నేను పసి బాలుడిని కదా ముద్దుముద్దుగా  ఏడిచాను.
పార్వతి మాత "ఎంత చక్కని బాలుడు, ఎంత ముద్దుగా అందంగా ఏడుస్తున్నాడో .."అంది.
సరస్వతి మాత, లక్ష్మి మాత మాత్రం అక్కడ నుండే దిష్టి తీస్తున్నారు.
విష్ణు దేవుడు "నారదా ! ఇక లాభం లేదు. నేను ఈ మాతృ వాత్సల్యం కోసం ఐనా త్వరగా అవతారాలు ఎత్తాల్సిందే .."  అన్నాడు.
శివమ్మ "ఏడవకు కన్నయ్యా. కళ్ళలో కుంకుడు రసం పడ్డా మంచిదయ్యా. చక్కగా నిద్రపోతావు ...కళ్ళు శుభ్రంగా అవుతాయి. " అన్నాడు.
నేను కావాలని గుక్క పట్టి, ముద్దుగా మూతి ముడిచి ఏడిచాను. అంతే, మా అమ్మ ఎంత ముద్దులాడిందో.
నంది "నాకొక సందేహం వచ్చింది .." అన్నాడు.
(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages