ఆలస్యం అమృతం విషం (వ్యాసం ) - అచ్చంగా తెలుగు

ఆలస్యం అమృతం విషం (వ్యాసం )

Share This
ఆలస్యం అమృతం విషం (వ్యాసం )
జీడిగుంట నరసింహ మూర్తి  

మనం ఏ పని చెయ్యాలన్నా రేపటి పని ఈ రోజు చెయ్యి. ఈ రోజు పని ఇప్పుడే చెయ్యి అని చెప్తూ వుంటాం. అలాగే సమయాభావాన్ని కూడా పాటించితే మనం ఎన్నో సమస్యలనుండి బయట పడగలం. విద్యార్ధులు “పరీక్షలు ఇంకా చాలా రోజులు ఉన్నాయిగా ఇప్పటినుండే ఎందుకు చదవడం? తీరా పరీక్షల టైమ్లో చదివిందంతా మరిచి పోతాం” అంటూ చివరి రోజు వరకు పుస్తకం తియ్యరు. తీరాచూస్తే అప్పడు ఏ జ్వరమో ఇంకేదో సమస్య వచ్చి పరీక్షలు సరిగ్గా వ్రాయలేక ఫెయిల్ అవుతూ ఉంటారు. 
ఇక ఆఫీసుకు వెళ్ళే వాళ్ళు చివరి క్షణం వరకు తయారవకుండా మొహం కడుక్కోవడం మొదలు అన్ని పనులు చివరి అరగంటలో చేసేసుకుంటే చాలు అనుకోవడం చూస్తూ వుంటాం. ఇలా చెయ్యడం వల్ల వాళ్ళల్లో బీపీలు పెరిగిపోయే అవకాశం ఉంది. సమయానికి ఐడెంటిటీ కార్డ్ కనపడక పోవడం, బండిలో పెట్రోల్ లేదని గుర్తు రావడం, ఒకవేళ బస్సులో వెళ్ళేవారైతే ఆ రోజు బస్సు ఆలస్యం అవడం జరిగితే వారి ప్రోగ్రాం అస్తవ్యస్తం అవుతూ వుంటుంది.. 
ఇంకా దూర ప్రయాణాలు పెట్టుకున్న వాళ్ళు ఉంటారు. “ ట్రైన్ బయలు దేరేది మూడు గంటల తర్వాత ఇప్పుడే స్టేషన్లో ఎందుకు వేలాడి పోవడం ?” , అని పనులు మెల్లి మెల్లిగా చేసుకుంటూ ఉంటారు. స్నానాలు త్వరగా ముగించరు. బట్టలు సర్దుకోరు. అసలు ఏ పెట్టిలో బట్టలు పెట్టుకొవాలో లగేజ్ ఎంత తీసుకెళ్ళాలో కూడా చివరి వరకు ప్లాన్ చేసే వాళ్ళు ఉండరు. చివరకు మనం ఎక్కిన క్యాబ్ ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుని స్టేషన్కు మనం చేరి ప్లాట్ ఫారంలు దాటుకుంటూ వెతుక్కుని వెళ్లేసరికి ట్రైన్ కదులుతూ ఉండటం జరుగుతుంది. ఎందుకు ఇలా ప్రయాస ప్రయాణం చేస్తున్నాం ? ఒక గంట ముందే స్టేషన్లో ఉండేటట్టు చూసుకుంటే కొంప ఏం ములిగిపోతుంది ? ఏదైనా జరగరానిది జరిగి ఏ కాళ్ళు విరక్కోవడమో జరిగి ఒక్కోసారి అసలు ప్రాణానికే ప్రమాదం అని తెలుసుకోవాలి. ఇంకొంతమంది పిల్లలతో బయలు దేరి ఎవరు లోపలికి ఎక్కారో , ఏ పెట్టిలో ఎక్కారో తెలియని అయోమయ పరిస్తితి . 
అలాగే పిల్లల పెళ్ళిళ్ళ విషయంలో తల్లి తండ్రులు కూడా ఇప్పుడే ఏం తొందరా అని అలసత్వం చూపిస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఉద్యోగాలు చేసుకుంటూ సంపాదనలో పడి ముందు ఇంట్లో అన్ని వస్తువులు సమకూర్చుకున్నాకనే ఆ విషయం ఆలోచిద్దాం అనుకునే వారు ఉంటారు. అటువంటి వారిలో ఒక కారు, ఇల్లు కూడా పెళ్ళికి ముందే ఉండాలని అనుకోవడం ఇప్పుడు చాలా మంది విషయంలో జరుగుతోంది. కల్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అంటూ కొంతమంది చాదస్తపు తల్లితండ్రులు కూడా తాత్సారం చేస్తూ ఉంటారు. 
ఇక నూతన దంపతులు పిల్లల విషయంలో “మేము ఇప్పుడే వద్దనుకుంటున్నాం” అంటూ కొన్నాళ్ళు జాలీగా గడిపేస్తారు. ఆ తర్వాత పిల్లల కోసం డాక్టర్ల చుట్టూ సంవత్సరాల తరబడి తిరుగుతుండే వాళ్ళను చాలామందిని చూస్తూనే ఉన్నాం. ఇలా కొన్నాళ్ళు గ్యాప్ ఇవ్వడం వల్ల కూడా జీవక్రియలో మార్పులు వచ్చి సంతానోత్పత్తికి సంబంధించిన కణాలు తగ్గుతూ వచ్చి పిల్లలు కలిగే అవకాశాలు సన్నగిల్లుతాయి అని కొన్ని సర్వేలు చెపుతున్నాయి. 
అరవై సంవత్సరాలు దాటిన వారికి స్త్రీ అయినా పురుషులైనా ఏవో ఒక అనారోగ్య సమస్య తప్పడం లేదు. అయితే చాలా మంది వాటిని సీరియస్సుగా తీసుకోక మెడికల్ షాపుల కెళ్ళి వాళ్ళిచ్చిన మందులతో కాలక్షేపం చేస్తూ ఉండటం చూస్తూ ఉంటాం. అవి చాలా సార్లు వికటించి వేరే రోగాలకు దారితీయడమో లేదా ఉన్న రోగాల తీవ్రతను మరింత పెంచడం జరుగుతూ వుంటుంది. ఇప్పుడు ఒక వయసు వచ్చిన వారికి ఏదో రకంగా ఇన్సూరెన్స్ ఉండటం జరుగుతున్నదే. అటువంటి వారు సంవత్సరానికి ఒకసారి పూర్తి మాస్టర్ చెక్ అప్ చేయించుకుంటే రాబోయే రుగ్మతలను అరికట్టడం విషయంలో కాని, ఉన్న రోగాలను కనిపెట్టి సకాలంలో వాటికి నివారణోపాయాలను చూపే అవకాశం ఉంది. ఇప్పుడు చెప్పుకున్నవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. 
ఏదైనా ఆలస్యం చేస్తే అమృతం కూడా విషం అవుతుందన్న సామెత చాలా విషయాలలో వర్తిస్తుంది.

No comments:

Post a Comment

Pages