శ్రీధరమాధురి -53 - అచ్చంగా తెలుగు

శ్రీధరమాధురి -53

Share This

శ్రీధరమాధురి -53
(మతం మారడం గురించి పూజ్య గురూజీ అమృత వాక్కులు )

మతం మారడం అనేది నాకు కమర్షియల్ వ్యాపారంలా అనిపిస్తుంది. తన గురించి ప్రచారం చెయ్యమని దైవం మిమ్మల్ని ఎన్నడూ కోరరు. ఆయన ఉత్పత్తి అయిన ‘ప్రేమ’ ను మార్కెటింగ్ చెయ్యడానికి ఆయనకు మార్కెటింగ్ వ్యక్తుల అవసరం లేదు. మీరు ఏ మతానికి చెందినవారైనా, మీ నమ్మకాన్ని, దానిపట్ల మీ నిబద్దతను అంటిపెట్టుకుని ఉండండి. చిన్న చిన్న వ్యక్తిగత కారణాల కోసం మీ మతాన్ని త్యజించకండి.

మీరు నిజంగా దేన్నైనా ప్రేమిస్తే, దాన్ని ఎన్నడూ వదలరు.
మనం మన తల్లిదండ్రులను ప్రేమిస్తాము. వాళ్ళను విడనాడము.
మనం మన సంబంధీకులను ప్రేమిస్తాము. వాళ్ళను విడనాడము.
మనం మన మిత్రులను ప్రేమిస్తాము. వాళ్ళను విడనాడము.
మనం మన సంస్కృతిని, సంప్రదాయాన్ని ప్రేమిస్తాము. వాటిని విడనాడము.
మనం మన దేశాన్ని ప్రేమిస్తాము. దాన్ని విడనాడము.
అలాగే, మనం మన మతాన్ని ప్రేమించినప్పుడు, దాన్ని విడనాడము. మీరు దాన్ని వదిలేస్తున్నారంటే, ఇన్నాళ్ళు అందులో ఉన్నది కేవలం మొక్కుబడి కోసమో, లేక మీ స్వీయ స్వార్ధ ప్రయోజనాల కోసమో అని అర్ధం. మనం మతం మారుతున్నాము అంటే, అది మీపరంగా మీకున్న స్వేచ్చో, లేక ప్రాధమిక హక్కో కావచ్చు, దీన్ని ఎవరూ ప్రశ్నించలేరు, కాని అది మీ దురాశను చూపుతుంది. మనం ఇంతకాలం ఒక మతాన్ని పాటించినప్పుడు దాన్ని ఎన్నడూ ప్రశ్నించలేదు. కాని, ఇప్పుడు మన వద్ద కొన్ని స్వార్ధ ప్రయోజనాల జాబితా ఉంది కనుక, మనం మతాన్ని విడనాడుతాము. ఇది మన స్వార్ధాన్ని, దుష్టపు ఆలోచనలను చూపుతుంది. మనం మోసపుచ్చుతున్నాము, మోసపోతున్నాము కూడా.


విశ్వాసానికి సంబంధించిన అంశాలపై మీ పిల్లలు మిమ్మల్నిప్రశ్నిస్తే, వారిని తర్కంతో సమాధానపరిచే ప్రయత్నం చెయ్యకండి. మతం వంటి విశ్వాసానికి సంబంధించిన అంశాలను తర్కం ద్వారా కాని, విజ్ఞాన శాస్త్రం ద్వారా కాని, నిరూపించాల్సిన అవసరం లేదు. తర్కం/విజ్ఞాన శాస్త్రం వంటివాటి ఆధారంగా పెద్దలు పిల్లలను సమాధానపరిచే ప్రయత్నం చేసినప్పుడు, విశ్వాసం అన్నది దాని అర్ధాన్ని కోల్పోతుంది. అటువంటి పెద్దలకు విశ్వాసాన్ని అర్ధం చేసుకోవడంలో పరిణితి ఉండదు.

 ఒకరు ఆధ్యాత్మికంగా లేక మతపరంగా ఉండడానికి పెద్ద అవరోధం వారి బుద్దే.
బుద్ధి సందేహాలను రేకెత్తిస్తుంది. దానికి విశ్వాసం అన్నదే తెలీదు.


మీ తల్లిదండ్రులను
మీ సంస్కృతిని
మీ సంప్రదాయాన్ని
మీ మతాన్ని
మీ దేశాన్ని
మీరు గౌరవిస్తే,
మీరు ఇతరుల తల్లిదండ్రులను, సంస్కృతిని, సంప్రదాయాలను, మతాలను, దేశాలను గౌరవించడం నేర్చుకుంటారు.

మీరు మీ వాటినే గౌరవించనప్పుడు, మీరు ఇతరుల అంశాలను అసలు పట్టించుకోరు. అందుకే మీరు మతం మారినా, లేక సంస్కృతికి మారినా, లేక సంప్రదాయానికి మారినా, లేక దేశానికి మారినా కూడా, అందులో మీ ప్రమేయం, దానిపట్ల మీ విశ్వాసం కేవలం మరో బూటకం అవుతుంది. ఇదంతా వ్యర్ధ ప్రదర్శన అవుతుంది.
***

No comments:

Post a Comment

Pages