రంగనాయక శతకము - బొమ్మరాజు నరసింహదాసు - అచ్చంగా తెలుగు

రంగనాయక శతకము - బొమ్మరాజు నరసింహదాసు

Share This
రంగనాయక శతకము - బొమ్మరాజు నరసింహదాసు
పరిచయం : దేవరకొండ సుబ్రహ్మణ్యం 

కవి పరిచయం

రంకనాయక శతక కర్త బొమ్మరాజు నరసింహదాసు శ్రీవత్సస గోత్రులు, ఆర్వేల నియోగి బ్రాహ్మణులు. యజుర్వేదీయ ఆపస్థంభ సూత్రులు. తల్లి వెంకమాంబ. తండ్రి శ్రీనివాసమంత్రి. ఈ కవి శాలివాహనశక 1731 సం. సరిపడు విక్రమనామ సంవత్సరమున శ్రీరంగమున జన్మించినట్లు చరిత్రకారుల నిర్ణయం. బాల్యమునుంచే ఈ కవి సంస్కృతాంధ్రములు అభ్యసించీందు ఎనలేని ప్రజ్ఞ సంపాదించారు. వీరి గురువులు శ్రీనదళహశింగరు భట్టరార్య ద్వారా పంచసంస్కారములు పొంది ఆపైన శ్రీమాన్ విక్కిరాల శేషాచార్యుల వద్ద శిశ్యునిగా అనేక గ్రంధములనభ్యసించారు. నిరంతర శ్రీనివాస జపనిష్ఠతో అనేక భగవన్నామ సంకీర్తనలను గేయములను రచించినారు. వీరు అనేక తీర్థయాత్రలు చేయుచు పురాణప్రవచనములతో భక్తబృందములను అలరించేవారు. ఈ విధంగా భగవత్సేవలో గడుపుతూ శాలివాహన శకం 1780 సం> కి సరిపడు రక్తాక్షి నామ సంవత్సరం చైత్ర బహుళ 2 పుణ్యదినాన పరమపదించారు. 
వీరి రచనలు 1. శ్రీరంగనాయక శతకము, 2. శ్రీరామ శతకము 3. జితంతే స్తోత్రము, 4. యతిరాజ పంచవిశంతి గ్రంధ ఆంధ్రీకరణము, మరియూ భగవన్నామ సంకీర్తనలు, గేయములు. వీరు విద్వత్కవులు. వీరి కవనము ద్రాక్షపాకం. పదమధ్య యతులు కలిగి పద్యములు పాటలు శ్రణసుఖము కలిగించును. 

శతక పరిచయం

రంగనాయక శతకము చంపకోత్పలమాలలో రచించిన 111 పద్యములు గల భక్తిరస ప్రధానమైన శతకము. కవి చివతిలో గద్యంలో తనగురించి ఈవిధంగా చెప్పికొనినాడు

ఇది శ్రీవత్ససగోత్ర పవిత్ర వేంకమాంబా శ్రీనివాస మంత్రి పుత్ర బొమ్మరాజు వంశకలశ వారాసి కుముదమిత్ర నరసింహదాస నామధేయ విరచిత శ్రీరంగనాయక శతకస్తోత్రము సమాప్తం.

110 వ పద్యములో కూడా ఇలా చెప్పికొనినాడు 
చం. వసుమతి బొమ్మ రాజకులవార్థివిధుండగు శ్రీనివాస మం
త్రిసుతుడు సంతతంబు భవదీయపదాశ్ర్యుడౌ నృసింహుడిం
పెసఁగ భవత్ప్రియంబుగ రచించిన పద్యశతంబు సత్కృపా
రసమతి చిత్తగింపుమి పరాకుని సేయక రంగనాయకా

భక్తి రస ప్రధానమైన ఈశతకంలో రామాయణ భాగవతాది పురాణములలోని సంఘటనలను వర్ణిస్తూ చెప్పిన పద్యాలు మనోహరంగా ఉన్నాయి.  దశావతారవర్ణలు ఈశతకంలో పొందుపరిచారు. 
కొన్ని పద్యాలను చూద్దాం.

చం. లలితమణిమయాద్భుత కలాప కలాపపరిపూర్ణసుందరో
ల్లలదల కాంచి తానన కలాప కలాపవిభాసితాళిమం
డలజయశీల కుంతల కలాపకలాప హరితారిభూప, కో
మలకమనీయరూప సురమౌని విధేయక రంగనాయకా

ఉ. నీదు ప్రభావనున్ దలచి నేను సమర్ధుడనే నుతింప, బ్ర
హ్మాదులు వేదముల్ బొగడ నంతము గల్గదు గాన నీదు శ్రీ
పాదసరోజముల్ దలచి పల్ మారు మ్రొక్కెద వాసుదేవ దా
మోదరకేశవాచ్యుత నమో భవతేయని రంగనాయకా

గజేంద్రమోక్షం

చం. కరివరుడార్తితోడ నను గావు పరాత్పరా యన్న దేవతో
త్కరము మొరాలకించియు స్వతంత్రతలేమినియూరకున్న స
త్వరగతివచ్చి గ్రాహమునదల్చి గజేంద్రునిగాచినట్టియో
పరమవికుంఠధామునిను బ్రస్తుతి జేసెద రంగనాయకా 

పద్యములు 43 నుండి దశావతారవర్ణన కొనసాగించినాడు

ఉ. దానవులున్ సుపర్వులమృతార్జనవాంఛ మహీధరంబుమం
ధానముగా నొనర్చి ఫణినాధుని రజ్జువుజేసియప్ప యోం
భోనిధిద్రచ్చ భారమున మున్గిన మంధనగంబు ంYపునన్
బూనిన కచ్ఛపాకృతి విభున్ నిను గొల్చెద రంగనాయకా  (కూర్మావతార వర్ణన)

చం. చటులతరార్భటీపటిమ స్తంభమునందుదయించి రౌద్రవి
స్ఫుట నరసింహరూపమున శోభిలి వజ్రనఖాంకురంబులన్
కుటిలతరాత్ము దైత్యకులకుంజరు వ్రక్కలుచేసి తత్సుతున్
వటుగతిబ్రోచినట్టి నిను ప్రస్తుతిజేసెద రంగనాయకా   (నరసింహావతారము)

ఇదేవిధంగా శ్రీకృష్ణుని బాల్యలీలలు, రామాయణమునందలు ముఖ్య సంధటనలకు సంబందించిన అనేకపద్యములు ఈశతకంలో చోటు చేసుకున్నాయి.
చక్కని సైలిలో సాగిపోయే ఈశతకం అందరూ చదవతగ్గది. మీరు చదవండి. ఇతరులచే చదివించండి

No comments:

Post a Comment

Pages