విశ్లేషణ - అచ్చంగా తెలుగు
సుబ్బుమామయ్య కబుర్లు!
విశ్లేషణ

పిల్లలూ మీరు ఏ విషయం అన్నా తీసుకోండి అందులో మంచి, చెడూ (ప్రోస్ అండ్ కాన్స్) ఉంటాయి.
ఉదాహరణకు మనం సాయంత్రం అమ్మానాన్నలతో సినిమా కెళదామనుకున్నాం అనుకోండి, సినిమాకెళితే ఆహ్లాదంగా ఉంటుంది. ఇంటర్వెల్లో అవీఇవీ కొనుక్కుని తింటూ, కూల్ డ్రింక్స్ తాగుతూ మరీ సినిమా చూడొచ్చు. మనకు నచ్చిన హీరో అయితే ఇహ చెప్పనక్కరలేదు, కదా! అయితే మూడు గంటల సమయం, డబ్బూ వృధా అవుతాయి. హోం వర్కులేమన్నా పూర్తి చేయలేకపోతే మరుసటిరోజు టీచర్ తో తిట్లూ, దెబ్బలూ ఉంటాయి. రాత్రి ఆలస్యంగా తిని, పడుకోవడం వల్ల మరుసటి రోజు బద్ధకంగా ఉంటుంది. క్లాసులో టీచర్ పాఠం చెబుతుంటే శ్రద్ధగా వినలేకపోతాం. ఇలా నెగెటివ్స్ కూడా ఉంటాయన్నమాట.
అదే మనం ఏ సెలవుల్లోనో వెళ్లాలనుకోండి, ఇంకేం ఆలోచించుకోనక్కర్లేదు. కాకపోతే డబ్బూ, కాలం వృధా అవుతాయేమో ఒక్కసారి చూసుకోవాలి. 
మనం ఏ పని చేయాలన్న సాధక బాధకాలు బేరీజు వేసుకోవాలి. ఆ తర్వాతే చెయ్యాలా, వద్దా అన్నది నిర్ణయించుకోవాలి. 
మనం ఒక్కసారి ఒక్క పనినే ఏకాగ్రతగా చేయగలుగుతాం. అందుచేత మనం రెండు మూడు పనులు చేయాల్సి వస్తే దేనికి ప్రాధాన్యత(ప్రయార్టీ) ఇస్తే మంచిదో ఇలాగే చూసుకోవాలి. అప్పుడే చక్కగా, అనుకున్నట్టుగా, పని సకాలంలో, సంతృప్తిగా చేయగలుగుతాం.
ఇలా డబ్బు, సమయాల విషయంలో ఎవరైతే విశ్లేషించుకుంటూ కచ్చితంగా ఉంటారో, వాళ్లు జీవితంలో కచ్చితంగా పైకి వస్తారర్రా.
ఒకవేళ మీరు ఆలోచించుకోలేకపోతే ఒక పని చేయండి.
ఒక కాగితం తీసుకుని మధ్యలో ఒక గీత గీసి, ఇటు ఆ పని వల్ల లాభాలు, అటు నష్టాలూ రాసుకోండి. అలా వరసగా రాస్తూ పోయాక, మీకే ఆశ్చర్యం అనిపిస్తుంది. అన్ని పాయింట్లు ఆలోచించారా అని.
నిజానికి ఇది చాలా మంచి ప్రాక్టీస్. ఇలా చేస్తూ పోతే మన మనసు దానికి అలవాటై, ఏవైనా సెలెక్ట్ చేసుకోవలసి వస్తే అదే హోంవర్క్ చేసి మనకు మంచి అవుట్ పుట్ ఇస్తుంది.
డిబెట్ లలో ఒక విషయంపై మాట్లాడడానికి ముందు ఇదే మంచి హోం వర్క్.
మీరు కూడా ఇలాగే అన్ని విషయాలలో తగిన విశ్లేషణ చేసి ఏ పని చేయాలో నిర్ణయించుకుంటారు కదూ! గుడ్!!
ఇట్లు
మీ సుబ్బుమామయ్య

No comments:

Post a Comment

Pages