శ్రీమద్భగవద్గీత -21 - అచ్చంగా తెలుగు
ఓం శ్రీ సాయిరాం
శ్రీమద్భగవద్గీత -21
అక్షర పరబ్రహ్మయోగము
8వ అధ్యాయం 
రెడ్లం రాజగోపాల రావు
పలమనేరు

కిందిటి సంచిక తరువాయి భాగం...

ఇంద్రియముల ద్వారా బహిర్గతమైన మనస్సు ప్రాణాయామ సాధన ద్వారా స్వాధీనపడును. ఉన్నత స్థితి పొందిన యోగులు కొన్ని ముద్రలు (హఠయోగం) వేసి మనస్సును స్వాధీనపరచుకొని గాలిలేని చోట దీపము వెలుగునట్లు వారి స్వస్థానంలో ఆనందాన్ని పొందగలరు.
యోగిరాజులు శ్రీ శ్యామాచరణ్ లాహిరి శిష్యపరివేష్ఠితులై  సత్సగం జరిపిస్తూ బ్రహ్మానుభూతిని పొంది అసంకిల్పితంగా శాంభవీముద్రాస్థితులయ్యేవారు. గృహస్థ యోగిగా వారు అధిరోహించని యోగ భూమికలు లేవంటే అతిశయోక్తి కాదు. క్రియా యోగాన్ని అభ్యసించి, గృహస్థ జీవనాన్ని సమతుల్యమొనర్చి, సాధన ద్వారా వారు పొందిన యోగవిభూదులు అజరామరములు. శాంభవీ ముద్రా స్థితులైన పావన జీవనుల మనస్సు స్వస్థానమైన ఆత్మలోలయమై బ్రహ్మానుభూతి ఆనందముగా అనుభవించెదరు. ఆత్మ సాక్షాత్కారం కలగనంత వరకూ బ్రాహ్మీస్థితి ప్రాప్తించదు. భ్రూమధ్య స్థానంలో కూటస్థ చైతన్య దర్శనం కలగనంత వరకు మానవజీవితం సఫలంకాదు. ప్రాణాన్ని స్థిరం చేయటానికి శ్రేష్ఠమైన ఉపాయం ప్రాణాయామం. సాధనలన్నింటిలోకీ శ్రేష్ఠమైనదీ, శాస్త్రసమ్మతమైనదీ ప్రాణాయామం అనేక రకాల ప్రాణాయామాల్లో సుషుమ్నాలోపల జరిగే ప్రాణాయామం శ్రేష్ఠమైనది.
 
మనస్సును హృదయమందు జేర్చుట

శ్రీ తీన్ కౌడి లాహిరి  గారు తమ తండ్రిగారైన శ్రీ శ్యామాచరణ్ లాహిరి గారి వద్ద క్రియాయోగ దీక్ష తీసుకుని అత్యున్నత యోగానుభూతులను పొంది తండ్రికి తగ్గ తనయుడనిపించుకున్నారు. శ్రీ తీన్ కౌడి లాహిరిగారి మహాప్రస్థాన సమయంలో యోగ ధారణతో ప్రాణాన్ని భృకుటిలో స్థిరపరచిన స్థితిని వారి పుత్రులైన శ్రీ సత్యాచరణ్ లాహిరి ఇలా తెలియజేశారు.
మా నాన్న గారి మరణాన్ని కళ్ళారా చూసాను. ఇంకా చాలామంది చూశారు ఆయన సమస్త ప్రాణవాయువును సంపూర్ణంగా నొసటి మధ్యచోటికిలాగి, మనస్సును అక్కడ పూర్తిగా నిలిపి శరీరాన్ని విడిచిపెట్టారు. ఆ సమయంలో భ్రూమధ్య స్థానంలో ఎంత కంపనం (అంటే అదురుపాటు) కలిగిందో వర్ణించి చెప్పడం సాధ్యంకాదు. పేల్చిన తుపాకి గుండులోపలి నుండీ బయటకు దూసుకుంటూ వస్తున్నట్లు అనిపించింది. ఆ సమయంలో వారు మూర్తిమంత స్నిగ్ధ ప్రశాంతుడైయున్నారు. వారి సుందర మృధు దేహం కంటికి ఎంత ఇంపుగా కనిపించిందో వారి శరీరమంతా తాజా ఎర్ర గులాబీ పువ్వు వికసించినట్లుగా ఉంది. ఇదే భ్రుశోర్మధ్యే ప్రాణమావేశ్య సద్యుత్

ప్రాణవాయువును శిరస్సునందు నిలుపుట

మూలాధార చక్రంలో నిబిడీకృతమైన కుండలినీ శక్తిని యోగ ధారణా బలముచే సహస్రారమునకు చేర్చుట. ఈ సందర్భంలో శ్రీ కావ్యకంఠ గణపతిమునివారిని ప్రస్థావించవలసినది. వారు అరుణాచలంలో శ్రీ రమణ మహర్షుల వారి ఆశ్రమం, స్కందగుహలో తపస్సు చేస్తుండగా ప్రాణవాయువు ఊర్థ్వముఖమై శిరస్సుపైన చిన్నగాయమైంది. ప్రాణశక్తి ఊర్థ్వలోకాల్లో విహరిస్తూవుంది. రెండురోజుల వరకూ వారికి బాహ్యస్మృతి లేదు. శ్రీ రమణులవారు ఇద్దరు శిష్యులను  శ్రీ గణపతిముని గారి శరీరానికి కాపలాపెట్టించారు.అచేతనమైన శరీరం చేతనమైన తరువాత శ్రీ రమణులవారు గణపతిముని శిరస్సుపై చందనాన్ని అద్ది ఆశీర్వదించారు. అనితర సాధ్యమైన ఈ యోగ ప్రక్రియ శ్రీ పతంజలి మహర్షి ఇలా వర్ణించారు. ప్రాణవాయువును సహస్రారానికి చేర్చిన యోగి ఊర్థ్వముఖుడై ప్రత్యగాత్మను పరమాత్మలో విలీనం చేసి చూవు పుట్టుకల చక్ర భ్రమణాన్ని అధిగమించగలడు.

ఇక్కడ శ్రీ కావ్యకంఠులు మరలా వారి బాహ్య జీవనాన్ని కొనసాగించడం పరమాత్ముని అద్భుతం. శ్రీ కావ్యకంఠ గణపతిముని గారు భగవాన్ రమణ మహర్షుల వారి ప్రధమశ్రేణి శిష్యులు. ఓమిత్యేకాక్షరంబ్రహ్మః గాఢమైన నిశ్శబ్ధంలో భగవద్వాణి వినిపించును. ప్రతియణువులో నిండియున్న ప్రణవధ్వని గాఢమైన నిశ్శబ్దంలోనే వినిపిస్తుంది. సమస్త విశ్వాన్ని నడిపించే శక్తియే ఓంకార ధ్వని. ధారణ, ధ్యానము, సమాధి అను 3 అంగములు అష్టాంగ యోగానికి ముఖ్యమైనవి. సమాధి స్థితిననుభవించిన యోగికి తన శరీరంలో ప్రతి అణువులోనూ వినిపిస్తున్న ప్రణవధ్వనిని వింటూ ఆనందమగ్నుడై దైవసామ్రాజ్యంలో ప్రవేశిస్తాడు. శ్రీ పరశురామపంతుల లింగమూర్తి గారు వ్రాసిన శ్రీ సీతారామాంజనేయ సంవాదమను గొప్ప ఆధ్యాత్మిక గ్రంధంలో ఓంకారనాదాన్ని గురించిన వివరములు, షట్చక్రాలలో ఉద్భవించే దశవిధ నాదములు తెలియజేశారు. చిరుగజ్జలమోత, ఘటానాదము, ఘంటానాదము, శంఖనాదము, వీణానాదము, తాళనాదము, వేణునాదము, భేరీనాదము, మృదంగనాదము మరియు మేఘనాదమనునవి దశవిధనాదములు...

జగద్గురు శ్రీ శంకరాచార్యులవారు ప్రధమంగా ప్రతిష్ఠించిన శృంగేరి శారదాపీఠానికి 35వ పీఠాధిపతిగా ఎన్నికైన శ్రీ అభినవ విద్యాతీర్థస్వామి వారు అధిరోహించిన యోగభూమికలు ప్రస్థావించాలి. శ్రీ అభినవ విద్యాతీర్థస్వామి వారు సాక్షాత్తూ శివావతార స్వరూపులు. వారు పూర్ణ సమాధి స్థితిలోనున్నపుడు శిరస్సుపై భాగాన్నుండి అమృతము స్రవించి బాహ్యంగా ధారగా కారుతుండేది. వారి శిష్యులు అమృతబిందువులు రుచుచూచెడివారు.


శ్రీకాకుళం జిల్లా, ఇచ్ఛాపురం దగ్గర హరిపురం అనే ఊళ్ళో ఒక యోగి నిశ్చల సమాధి స్థితిలో శిరస్సు నుండి అమృతం స్రవించుట చాలా మంది గమనించినారు. 
(ఇంకా ఉంది...)

No comments:

Post a Comment

Pages