సౌజన్య-ఈ కాలం అమ్మాయి - అచ్చంగా తెలుగు

సౌజన్య-ఈ కాలం అమ్మాయి

Share This
సౌజన్య-ఈ కాలం అమ్మాయి
మంథా భానుమతి 


“ఎలా వదినా! ఉన్నపళంగా వచ్చెయ్యమంటే, ఎన్ని చూసుకోవాలి?”

  “……….”

  “మీ తమ్ముడికేం ఫరవాలేదనుకో! మా అత్తగారు చూసుకుంటారు. అందు గురించి కాదు..” విమల పూర్తి చెయ్యలేకపోయింది.

  “...........”

  “సరే.. రేపు బస్ కి బయల్దేరుతాను, ఇంట్లో ఓ మాట చెప్పి. నాలుగు రోజులు మాత్రమే సెలవు పెట్టగలను.” విమల ఇంట్లోనే కిండర్ గార్టెన్ స్కూల్ నడుపుతోంది. ఇద్దరు డిగ్రీ పాసయిన అమ్మాయిల్ని టీచర్లుగా పెట్టుకుంది. నలభై మంది వరకూ పిల్లలున్నారు.

  వీధి తలుపు టక్టక్ శబ్దం.. చెవిలో ఫోన్ తోనే తలుపు తీసింది. చేతిలో కవరుతో ఒక కుర్రాడు. పాతికేళ్లుంటాయేమో! వేసుకున్న బనీను మీద ‘విహంగ యాత్ర’ అని రాసుంది.

  “ట్రావెల్ ఏజంట్ కుర్రాడేనా? రేప్పొద్దున్న ఫ్లైట్ కి బయల్దేరు. రానూ పోనూ టికెట్లిస్తాడు వాడు.” వదిన ఫోన్ కట్ చేసింది, విమల ఆశ్చర్యంగా చూసుండగానే.

  ఏదోతీవ్రమైన సమస్యే! రానూ పోనూ విమానం ఖర్చులు పెట్టుకుని రమ్మందంటే..

  అందుకే, వదినగారి దాష్టీకానికి కోపం రాలేదు.

  విమల ఒక్కగానొక్క అన్న హైదారాబాద్ లో రియలెస్టేట్ వ్యాపారం చేస్తాడు. ఆ మధ్యన వచ్చిన బూమ్లో బాగా సంపాదించి, బిల్డర్ అయ్యాడు. ఇంక.. డబ్బు అలా కురిసిపోతోంది. ఆ ఐశ్వర్యం అంతా వదినగారికి వంటబట్టేసింది. విమలంటే కొంత తేలిక భావం. విజయవాడలో ఉంటూ, పక్కనే ఉన్న పల్లెలో వ్యవసాయంతో జీవనం గడిపే విమల భర్త అంటే చులకన. అందుకే.. వదినగారి పిలుపు అయోమయంలో పడేసింది.

  ఇంత కాలానికి తన అవసరం ఏమొచ్చిందో! వసుదేవుడంతటి వాడు గాడిద కాళ్లు పట్టుకున్నాట్ట.. తన పోలికకి తనకే నవ్వొచ్చింది. మూడేళ్ల క్రితం, సంక్రాంతి పండక్కి.. అదీ అన్నగారు పిలుస్తేనే వెళ్లినప్పుడు, వదినగారు తనని ఇంచుమించు గాడిదని  చేసేసింది. బ్రహ్మాండంగా బొమ్మలకొలువు పెట్టి, ఇంటికొచ్చిన ఆడపడుచుని పదిమందికీ పరిచయం చెయ్యలేకపోయింది. అన్నకీ, వదినకీ, మేనకోడలికీ బట్టలు తీసికెళ్తే ముక్కు చిట్లించి పక్కన పడేసింది. 

  అంతే కాదు.. ఆవిడ తనకి పెట్టిన బట్టలు ఎంతో నాసిరకంవి. ఆ తేడా కూడా తెలుసుకోలేనంత వెర్రిబాగుల్దనుకుంది. 

  ఇంక అన్నగారు.. ఇంట్లో ఉంటే రెండే మాటలు.. అంతలో బల్లమీదున్న నాలుగు ఫోన్లు ఒకదాని తర్వాతొకటి మోగుతూనే ఉంటాయి.  

  అక్కడున్న ఒకే ఆశాకిరణం మేనకోడలు సౌజన్య. పేరుకి తగ్గట్లే ఉంటుంది. అది మాత్రం తను తెచ్చిన బట్టలు కట్టుకుని, పేరంటాళ్లందరికీ బొట్లు పెట్టింది. 

  అత్తా.. అత్తా అంటూ అక్కడున్నంత సేపూ తన వెనుకే ఉంది. ఇంక ఎప్పటికీ అన్నగారింటికి వెళ్లకూడదని నిర్ణయించుకుని వచ్చేసి నప్పట్నుంచీ, వారానికోసారి ఫోన్లో పలకరిస్తూ, ఎన్నో విషయాలు ముచ్చటిస్తూ ఉంటోంది సౌజన్య.. తనకి అమ్మ లేని లోటు తీరుస్తోందనుకుంటుంది విమల.
దె  అప్పుడు తట్టింది విమలకి..

  సౌజన్యేనా సమస్య? అత్తతో మనసు విప్పి మాట్లాడుతోందని తెలుసుకుని ఉంటుంది వదిన. అందుకే.. ఇన్ని ఏర్పాట్లు చేసి మరీ పిలుస్తోంది.

  సౌజన్యకి ఇరవై ఎనిమిదేళ్లొస్తున్నాయి. పెద్ద సాఫ్ట్ వేర్ కంపనీలో పెద్ద ఉద్యోగం. నెలకి రెండో మూడో లక్షలు జీతం. ఇంత కాలం చదువు, కెరీర్ అంటూ కాలం గడిపింది. వదినగారు కూడా అమ్మాయి అభివృద్ధికి ఆనంద పడ్డం తప్ప అంత పట్టించుకోలేదు. ఇప్పుడు.. వేడి పుట్టినట్లుంది.


  “ఎంత సుందర నగరం? ఎంతటి చరిత్ర ఉందీ.. ఇంద్ర కీలాద్రి అందాలు, ఆ పక్కనే కృష్ణమ్మ సరాగాలు.. పచ్చని పంటలు..” తమ పొలాలున్న ఊరి మీదనుంచి వెళ్తుంటే.. విమానంలో, పక్కనున్న గాజు కిటికీలోంచి, విజయవాడ నగరాన్ని చూస్తూ అనుకుంది విమల. కనకదుర్గమ్మ సన్నిధిలో, ఈ నగరంలో నివసించడానికెంత పెట్టి పుట్టాలి!

  అంతే కాదు.. అనుకూలమైన, అర్ధం చేసుకునే భర్త. బాగా చదువుకుని, బెంగుళూరులో పెద్ద కంపెనీలో ప్రాజెక్ట్ మానేజర్ గా పని చేస్తున్న ఒక్కగానొక్క కొడుకు. అప్రయత్నంగా పెదవులమీదికి చిరునవ్వు వచ్చింది విమలకి.

  అన్నగారి ఆదరణ లేకపోతేనేం.. తనకి అన్నీ ఇచ్చాడు దేవుడు. దేనికీ లోటులేదు. సీటు వెనక్కి జరుపుకుని వాలి కళ్లు మూసుకుంది విమల. ఆడంబరాల మీద తనకెప్పుడూ మోజు లేదు. అందమైన చిన్న సంసారం. నిత్యం సరదాగా స్నేహితులతో, బంధువులతో గడుపుతూ.. తోటి వారికి వీలైన సహాయం చేస్తూ.. తృప్తిగా గడిచిపోతోంది.

  ఇంక కోడలు రావడం ఒక్కటే మిగిలింది. ఈ సంవత్సరం చేసుకుంటానంటున్నాడు. తమతో కలిసిపోయే అమ్మాయొస్తే చాలు.. ఇంకేం అక్కర్లేదు.


  “అత్తా!” విమానాశ్రయంలో, బైటికి రాగానే గట్టిగా పట్టేసుకుంది సౌజన్య.

  ఊహించలేదేమో, ఆనందంతో కళ్లలో నీళ్లు తిరిగాయి విమలకి.

  “ఇంతేనా సామాను.. ఇంకా ఉన్నాయా?” చేతిలోని చిన్న పెట్టె అందుకుంటా అడిగింది సౌజన్య.

  “రెండురోజులేగా.. నాలుగు చీరలిందులోనే పడేసుకున్నా..” మేనకోడలి చెయ్యి ఆప్యాయంగా పట్టుకుంటూ అంది విమల.

  “ఎలా ఉన్నారత్తా?” కారులో పక్కన కూర్చో పెట్టుకుని తను ఢ్రైవ్ చేస్తూ అడిగింది సౌజన్య. ఎంతో లాఘవంగా, సిటీ లో అడ్డదిడ్డంగా నడిచే, వాహన సమూహాలని తప్పించుకుంటూ వెళ్తున్న సౌజన్య, కత్తితో వాన చినుకుల్ని తప్పించుకుని వెళ్తున్న నకులుడిలా కనిపించింది విమలకి.

 “బాగా వున్నాం తల్లీ. మామూలేగా.. మామయ్య ఏదో సేంద్రియ వ్యవసాయం అంటూ ఎన్నో మార్పులు చేయిస్తున్నారు. ఆరు ఆవులు కొనుక్కొచ్చారు. ఒక ఎకరం లో వేపచెట్లు పెంచుతున్నారు.. అదివరకున్నవి సరిపోవంట.”

  “ఓ! ఆర్గానికి ఫామింగ్.. మామయ్య రియల్లీ గ్రేట్.”

  “ఇటెక్కడికీ?” ఔటర్ రింగ్ రోడ్ నించి కిందికి దిగాక, ఇంటి కెళ్లే దోవ వదిలేసి ముందు కెళ్తున్న మేనకోడల్ని అడిగింది విమల.

  “నిన్ను ఇంటికి తీసుకొచ్చే లోగానే నీతో క్లాస్ తీయించుకోమని చెప్పింది అమ్మ. మంచి రెస్టారెంట్ కి వెళ్లి వేడిగా, చల్లగా తింటూ చీవాట్లు పెట్టచ్చు నువ్వు.” కనుబొమ్మలెగరేసి చిరునవ్వు విసిరింది. ముగ్ధ మనోహరంగా ఉన్న సౌజన్య మొహాన్ని అలా చూస్తుండి పోయింది విమల.

  “అంతలా చూడకు. నువ్వే దిష్టి తియ్యాలి.” 

  పక్కకి తిరిగి ఆలోచనలో పడింది విమల. సమస్య యేంటో, తీర్చడానికి ఎలా సాయం చెయ్యాలో.. అందులో తన ప్రమేయమేంటో.. అని ఎన్నో ఆలోచించుకుంటూ వస్తే, ముందు రోజే ప్రశ్నాపత్రం ఇచ్చి పరీక్షకి తయారవమన్నట్లుగా ఉంది తన పరిస్థితి. మాట్లాడకుండా కిటికీలోంచి  దారంతా చూస్తూ కూర్చుంది. కారు ఎడం పక్కకి తిరిగింది..

         విశాలమైన ఆవరణ.. ప్రాకారపు గోడల మీద రకరకాల ముగ్గులు, లోపలికి వెళ్తూనే కొమ్మలూపుతూ స్వాగతం పలుకుతున్న పొగడ చెట్ల పూలు, ఆకాశం రాలుస్తున్న అక్షింతల్లా కార్ల మీద పడుతున్నాయి. 

  ఆవరణ మధ్యలో చిన్న భవనం. అదే ప్రధాన లావాదేవీ స్థలం లాగుంది. అనేకమంది, తలలకి పాగాలు, చొక్కాల మీద పేరు రాసిన ఏప్రాన్ల తో, చేతుల్లో పళ్లాలున్న ట్రేలు పట్టుకుని హడావుడిగా తిరుగుతున్నారు. 

  కారు ఆగగానే యూనిఫామ్ వేసుకున్న డ్రైవర్ వచ్చి కారు పట్టుకు పోయాడు.

  పెద్ద తోట, మధ్యలో సిమెంట్ బాటలతో కలుపుతూ, చిన్న చిన్న కుటీరాలు. ఒక కుటీరంలోకి దారి తీసింది సౌజన్య. మట్టితో కట్టిన పిట్టగోడలు, వాటి మీద అందంగా తీర్చిదిద్దిన రంగవల్లులు. చుట్టు పక్కల కనిపించకుండా కుటీరం మీదికి అందంగా పాకించిన పూల తీగలు.. తీగ బఠాణీ, బోగన్ విల్లా, జాజి, తీగ గులాబీ.. అన్నీ కలిసి ఒక వింత పరిమళాన్ని వెదజల్లుతున్నాయి. లోపలికి వెళ్లగానే, సర్వర్ వచ్చి మంచినీళ్లు, మెనూ కార్డ్ ఇచ్చి, ఫాన్ వేసి వెళ్లి పోయాడు.

  “ఏం చెప్పమంటావు?” మెనూ కార్డ్ తిరగేస్తూ అడిగింది సౌజన్య, మంచి నీళ్లు తాగుతూ, విమల గ్లాసులోకి కూడా జగ్గులోంచి నీళ్లు వంపింది.

  నీళ్లు తాగుతుంటే, ఏదో చక్కని పరిమళం..

  “తులసి, పుదీనా ఆకులు వేస్తారు నీళ్లలో..” వివరించింది సౌజన్య.

  మెచ్చుకుంటున్నట్లు కళ్లెగరేసి, నెమ్మదిగా తాగ సాగింది విమల.

  “సరే.. నేనే చెప్పేస్తాను. ఇక్కడ పెసరట్టు చాలా బాగుంటుంది.” బల్ల మీదున్న గంట మోగించగానే ప్రత్యక్షమయ్యాడు సహాయకుడు.

  “ముందుగా రెండు కాఫీ, ఆ తరువాత తీరిగ్గా రెండు పెసరట్లు, మూడు ముక్కలు బాగా వేసి, నేతితో కాల్చి..” అత్త కేసి తిరిగి..

  “ఇది విజయవాడవారి హోటల్.. మన భాష బాగా వచ్చు..” నవ్వుతూ అంది.

  “అత్తయ్యా! నేను ఉద్యోగం మానేశాను.” నెత్తి మీద పిడుగు పడ్డట్లు ఉలికి పడింది విమల. గొంతు కొరబోతే, సౌజన్య లేచి, నెత్తి మీద నెమ్మదిగా కొట్టి మంచినీళ్లిచ్చింది.

  ఐతే.. సమస్య తీవ్రంగానే ఉంది.

  “నేను ఉద్యోగం మానేసినందుకు అమ్మకేం బాధగా లేదు కానీ.. అమెరికావో, ఆస్ట్రేలియావో సంబంధాలు ఒప్పుకోవడం లేదని నిష్ఠూరం వేస్తోంది.”

  “ఒప్పించి ఇక్కడి సంబంధమే చేసుకో.. దానికి ఉద్యోగం మానెయ్యడం..”

  “నాకు ఆ ప్రోగ్రాములు చెయ్యడం, సాఫ్ట్ వేర్ అప్డేట్ల పరుగులు నచ్చటం లేదత్తయ్యా. ఆ కుర్చీలో కూర్చుని కూర్చుని విసుగేస్తోంది. నా డిగ్రీ ఆర్కిటిక్చర్. దానికి మంచి జీతాలు రావని, సాఫ్ట్ వేర్ కోర్సులు నేర్చుకోమని పోరితే, నేర్చుకుని ఇందులో చేరాను. అవే బాగా డెవలప్ చేసుకుని మానేజర్ అయ్యాను. కానీ నాకు ఇష్టం లేని పని.. బోర్ కొట్టేస్తోంది. ఎంత సేపూ డబ్బేనా చెప్పు..” 

  “అది కాదు సౌజీ..”

  “ఎంత ఉంటే చాలనిపిస్తుంది అత్తయ్యా? ఇప్పుడు నాకు, నగల మీదా, బట్టల మీదా దేని మీదా ఆసక్తి లేదు. అంతా రొటీన్ లైఫ్ అయి పోయింది.”

  నిజమే అనుకుంది విమల. పిల్ల పాపల ఆటపాటలతో గడపవలసిన జీవితం.. జీవంలేని ఖరీదైన జీవితం.. ఎన్ని రోజులైనా మార్పు లేని..

  “ఇంత కాలానికి నాకు పెళ్లి చెయ్యాలనే ఆలోచన వచ్చింది అమ్మకి. ఇన్నాళ్లూ, పెళ్లైతే ఇంట్లోంచి వెళ్లిపోతాననే బెంగ కాబోలు.. ఇప్పడింక తప్పలేదు. కనిపించిన వాళ్లంతా తినేస్తున్నారు.” 

    ఆశ్చర్యంగా చూసింది విమల. ఎప్పుడూ ఇలా మాట్లాడని సౌజన్యని.

  “అవునత్తయ్యా! ఇన్ని రోజులు నాకు తెలియలేదు. చదువు, పని, ఫ్రెండ్స్.. ఈ మధ్యనే అనిపిస్తోంది. మా ఫ్రెండ్సందరికీ పెళ్లిళ్లైపోయాయి. ఎదిగి ఉన్న ఆడపిల్లకి పెళ్లిచెయ్యాలనే.. “ ఆపేసి తల దించుకుంది సౌజన్య, ఎలా పూర్తి చెయ్యాలో తెలీక సగం, సిగ్గుతో సగం. 

  “తప్పు లేదమ్మా. ఇది నీ జీవితం. నీకు ఆలోచించుకునే హక్కు ఉంది. అలాగే నీ జీవిత భాగస్వామిని కూడా ఎంచుకునే హక్కుంది. ఈ మధ్యని ఆడపిల్లలు కూడా మాట్రిమొనీ సైట్ లకి వెళ్లి సెలెక్ట్ చేసుకుంటున్నారని విన్నాను. అలా మన వాళ్ల కుర్రాళ్ల నెవర్నైనా.. నీకు అన్ని విధాలా సరిపోయే అబ్బాయిని చూడచ్చు. కావాలంటే నేను సహాయం చేస్తాను.”

  “నిజంగానా అత్తయ్యా?” మెరుస్తున్న కళ్లతో అడిగింది సౌజన్య..”అసలే నేను సాఫ్ట్ వేర్ మానేసి ఆర్కిటెక్ట్ దగ్గర చేరానని మండి పడుతోంది అమ్మ.”

  “అవునా? నిజంగా చేరావా?”

  “ఎన్విరాన్ మెంటల్ ఫ్రెండ్లీ కాటేజీలు డిజైన్ చేసే కంపెనీ.. చాలా ఎంజాయ్ చేస్తున్నాను. జీతం తక్కువే. కానీ మాకేవన్నా డబ్బు తక్కువా చెప్పు. రోజూ గొణుగుతుంటుంది.”

  “అది ఫరవాలేదులే. నేను నచ్చ చెప్తాను. కంప్యూటర్ కుర్చీలో కూర్చుంటే, పిల్లకి మెడనొప్పెడుతోందనీ, నరాలు పట్టేస్తున్నాయటనీ, ఆరోగ్యం ముఖ్యం అనీ..” ఆవిరి వదుల్తున్న పెసరట్టు పట్టుకొస్తున్న సర్వర్ ని చూసి ఆపేసింది విమల.

  “థాంక్యూ.” సర్వర్ కి చెప్పి, గిన్నెలో విడిగా ఉన్న నెయ్యి తన అట్టు మీదికి వంపుకుంది సౌజన్య.

  “నీక్కూడా వెయ్యనా? ఇప్పటికిప్పుడు వెన్న కాచిన నెయ్యి ఇస్తారిక్కడ.”    

  బిత్తరపోయి చూసింది విమల.

  “అవుత్తయ్యా! నెయ్యి, నూనె హాయిగా తినచ్చు, అన్నం, రొట్టెలు వగైరాలు మానేసి. ఇప్పటి థియరీ. బాగా పని చేస్తోంది.” 

  నిగనిగ లాడుతున్న సౌజన్య మొహం చేతులు, చక్కని శరీరసౌష్టవం చూస్తూ తల ఊపింది విమల.   

  “ఇంతకీ ఎవరా అదృష్టవంతుడు? మా బంగారం ఎన్నిక చేసుకున్నవాడు?” డొంక తిరుగుడు మాని విషయంలోకి వచ్చేసింది విమల. 

  “అది, ఎల్లుండి.. నీ తిరుగు ప్రయాణం రోజున చెప్తా. అప్పటి వరకూ మీ వదినకి, తెలుగు మాట్లాడే, తెలుగు దేశంలోనే ఉండే అల్లుడు వస్తాడని చెప్పి కన్విన్స్ చెయ్యాలి. అతను వ్యవసాయం చేస్తాడు. సిటీలో ఉండడు. నేను కూడా అక్కడే ఉంటాను.”

  గుండె గుభేలు మంది విమలకి. ఇదేవంత చిన్న సమస్య కాదు. అమెరికా కాకపోయినా హైద్రాబాద్ హైటెక్ లోనో, జుబిలీ హిల్స్ లోనో ఉండే అల్లుడైతే సర్ది చెప్పచ్చు కానీ..

  “నువ్వు ఈ సంగతికి బెంగపడద్దత్తా. అది నేను మానేజ్ చేస్తాను. కాస్త చల్ల బర్చు అంతే. ఇంకొక ఫేవర్ చేస్తావా నాకు?” 

   ఎదురుగా ఉన్న మేనకోడలి చెయ్యి తన చేతిలోనికి తీసుకుని నిమిరింది విమల.

  “ఒక వేళ అమ్మ ఒప్పుకోకపోతే నా పెళ్లి నువ్వు చేస్తావా? ఆ తరువాత ఏ ప్రాబ్లమ్ వచ్చినా నేను చూసుకుంటాను. అమ్మ నిన్ను ఏమీ అనకుండా చూస్తాను. నాన్న ఏమీ పట్టించుకోరనుకో..” 

  “తప్పకుండా తల్లీ. నువ్వు నా కూతురే అనుకుంటా. అయినా నువ్వంటే ప్రాణం వదినకి, వదులుకుంటుందనుకోను.” నిమురుతున్న చేతిని గట్టిగా పట్టుకుని అంది విమల.

       వదిన గారికి నచ్చ చెప్పటం, ఓదార్చడం.. అనుకున్న దాని కంటే కష్టమే అయింది విమలకి.

  విమల ఉన్న గదిలోనే పడుకుని, అర్ధరాత్రి లేచి కూర్చుంటుంది. సౌజన్య పుట్టినప్పట్నుంచీ జరిగిన విశేషాలన్నీ మరీ మరీ తలుచుకుంటుంది. మధ్య మధ్య వెక్కిళ్లు. అప్పుడు మాత్రం ఊరుకోలేక పోయింది విమల.

  “ఏంటొదినా.. ఏమయిందిప్పుడు? పిల్ల శుభమా అని పెళ్లి చేసుకుంటానంటుంటే ఆ శోకాలేమిటి? ఆపుతావా లేదా?” లేని చనువు తీసుకుని గట్టిగా కోప్పడింది.

  “ఫరవాలేదంటావా? పల్లెటూరుట. బాగా చూసుకుంటారంటావా? ఎంతో గారాబంగా, అడిగింది అడిగినట్టు అమర్చాం. ఏ కష్టం తెలీదు.”

  “తప్పకుండా చూసుకుంటారు. సౌజి బంగారు తల్లి. ఈ కాలం అమ్మాయి. అందరితో చక్కగా మసలి, కలిసి పోతుంది. నువ్వే చూస్తావు కదా.. ఒక్కేడాది అయ్యాక వాళ్లు సౌజిని వదల్లేమంటారు.”

  “ఐతే.. మా ఇంటికే పంపరా?” గొంతులో జీర.. వదిన గారిని చూసి తల పట్టుకుంది విమల.

  “అబ్బా.. వాళ్లు పంపకపోతే నువ్వే వెళ్లి వస్తుండు, వారానికోసారి. ఐనా, సిటీ వాళ్లకంటే పల్లెల్లో ప్రేమాభిమానాలు ఎక్కువే. హాయిగా పడుక్కో. రేప్పొద్దున్నే నా ప్రయాణం. ఐదింటికే లేవాలి.”

                                     …………………

  తనతో లేచి కాఫీ తాగుతున్న వదిన గారికి ఇంకొకసారి నచ్చచెప్తోంది విమల.

  “హాయ్ అత్తయ్యా!” పసుపు పచ్చని కుర్తా, సెల్వార్ లో మెరిసి పోతూ మెట్లు దిగి వచ్చింది సౌజన్య. తన భారమంతా అత్తకి అప్పచెప్పిందేమో, ప్రశాంతంగా నిద్రపోయినట్లుంది. కళ్లు, మొహం తేటగా ఉన్నాయి.

  వదిన కేసి చూస్తే, ఆవిడ కూడా తేరుకున్నట్లే ఉంది.

  తల్లి దగ్గరకెళ్లి వెనకనుంచి తల మీదికి వంగి ముద్దు పెట్టి, హత్తుకుంది సౌజన్య.ముందుకి వచ్చి, కాళ్లకి దణ్ణం పెట్టింది.

  “పెద్ద గొప్పేలే..” కళ్ల నిండా నీళ్లతో, పైకి లేపి పక్కన కూర్చో పెట్టుకుంది.

  “ఒప్పుకున్నట్లేనా?” అమ్మకేసి ఆత్రంగా చూస్తూ అడిగింది.

  “నువ్వు సుఖంగా ఉంటానంటే.. అంత కంటే ఏం కావాలి? ఎవరా అబ్బాయి? మన వాళ్లేనా?”

  “చెప్పాక, వేరు మాట మాట్లాడవు కదా? కులం, మతం అంటూ..”

  “ఏం అనదురా! నాదీ గారంటీ. మీ అత్తయ్య మంచి లాయర్ అవాలిసింది. టఫ్ కేసుని ఇట్టే తేల్చేసింది.” విమల అన్నగారు లోపల్నుంచి వస్తూ అన్నాడు. సౌజన్య తండ్రి దగ్గరకి కూడా వెళ్లి కాళ్లకి దణ్ణం పెట్టింది.

  “ఇంతకీ ఎవరా లక్కీ ఫెలో?”

  “ఇతను కూడా జాబ్ రిజైన్ చేసి, వాళ్ల ఊరెళ్తున్నాడు. ఆర్గానికి ఫామింగ్ ఆధునిక పద్ధతుల్లో చెయ్యడానికి.” సెల్ లో ఫొటో తీసి చూపించింది. 

  గబగబా లేచి భర్త పక్కకి వెళ్లిన విమల వదినగారు నోట్లో మాట లేకుండా నిలబడిపోయింది. విమలని, ఫొటోనీ మార్చి మార్చి చూస్తూ.

  విమల అయోమయంగా చూస్తూ లేచి అన్నగారి చేతిలో సెల్ అందుకుంది..

  నవ్వుతూ చూస్తున్నాడు, కృష్ణమోహన్.. విమల ఒక్కగానొక్క కొడుకు.

  *-------------------*

5 comments:

  1. ఏకబిగిన చదివేశాను. చివరికొస్తుండగా ముగింపు గ్రహించేశాను !!

    ReplyDelete
  2. బాగున్నది అక్కా. అభినందనలూ.. కథ సగంలోకి రాగానే కనిపెట్టేసానోచ్ యండింగూ.. సూపరూ.

    ReplyDelete
  3. ఈకాలం అమ్మాయి అనిపించుకుంది. చాలా బగుంది కథ..

    ReplyDelete
  4. అక్షరము విడువకుండా చదివి హాయిగా హమ్మయ్య అనుకునేంత బాగా వ్రాసారు భానక్కయ్యా..ఈ తరానికి రావలసిన మార్పు చక్కగా సూచించారు...అభినందనలు అక్కయ్యా..

    ReplyDelete
  5. ఈ కధ బాగుంది, నచ్చింది

    ReplyDelete

Pages