జై పరమేశ్వరా ! - అచ్చంగా తెలుగు
మా బాపట్ల కధలు -26
జై పరమేశ్వరా !
భావరాజు పద్మిని

“అమ్మోయ్ జై పరమేశ్వరా వచ్చారు...” అమ్మవద్దకు వెళ్లి అంది చిట్టి.

“చాల్లేవే, పెళ్లై, పిల్లలు పుట్టినా నీ అల్లరి తగ్గలేదు. జై పరమేశ్వరా ఏమిటి? పేరు చెప్పలేవూ?” సున్నితంగా కసిరింది సీతమ్మగారు పిండి రుబ్బుతూ.

“అయ్యో, పేరు గుర్తుంటే కదమ్మా, చిన్నప్పటి నుంచి అలాగే పిల్చేదాన్ని కదూ, పేరు గుర్తు లేదు,” నవ్వుతూ అంది చిట్టి.

“హారి దేవుడా, మరిచావూ ! అతని పేరు నరసిమ్మూర్తి.  లోపలకు పిల్చి, కూర్చోపెట్టు, వస్తున్నా.” అన్నారు సీతమ్మ గారు చెయ్యి కడుక్కుంటూ..

చిట్టి నర్సిమ్మూర్తిని లోనికి పిల్చి, హల్లో ఉన్న చెక్క బల్ల మీద కూర్చోపెట్టింది.

“ఏం పాపగారూ బాగున్నారా? ఊళ్ళో అంతా బాగేనా? పిల్లలా?” ప్రశ్నలు కురిపిస్తూనే “అయినా బాగుండక ఏముంది లెండి, ఏదో పరమేశ్వరుడి దయ, జై పరమేశ్వరా !” అంటూ బొమ్మ కారుతో ఆడుతున్న చిట్టి కొడుకును చేరదీసి ఒళ్లో కూర్చోపెట్టుకున్నాడు మూర్తి. వాడు కూర్చుంటూ, “జై పరమేశ్వరా !” అంటూ తిరిగి పలికాడు.

“హహ్హహ, బాబుకు మీ పోలికలే పాపగారు? పేరేంటి? ఎన్నేళ్ళు?” అడిగాడు మూర్తి.

“మొన్న హనుమజ్జయంతికి ఐదు నిండి ఆరోచ్చాయి మూర్తి, పేరు హనుమ”  అని చిట్టి చెబుతుండగానే “ఏం మూర్తీ, బాగున్నావా? ఎండన పడి వచ్చావు, ఇంద కాస్త మజ్జిగ తీసుకో,” అంటూ అందించింది సీతమ్మగారు.

“ఆ, ఆ ఆ పరమేశ్వరుడి దయ, అంతా బాగున్నామమ్మా, జై పరమేశ్వరా !” అన్నాడు మూర్తి మజ్జిగ తాగుతూ.

“జై పరమేశ్వరా!” తిరిగి పలికాడు హనుమ నవ్వుతూ.

కాసేపు ఆ కబురూ ఈ కబురూ చెప్పి, ఊరి నుంచి సీతమ్మ గారి అన్న పంపిన కొత్త అటుకులిచ్చి, వెళ్ళిపోయాడు మూర్తి.

"జై పరమేశ్వరా," అంటూ చిన్నప్పుడు తనలాగే అంటూ,  గుర్రం నడుపుతున్నట్టు  పరిగెడుతూ కలయతిరగసాగాడు చిట్టి కొడుకు. వాడిని చూస్తూ తన చిన్నప్పుడు నరసిమ్మూర్తిని చూసిన తొలిరోజు జ్ఞాపకాల్లోకి జారుకుంది చిట్టి.
***
నరసిమ్మూర్తిది బాపట్ల, ఎస్.ఎన్.పి. అగ్రహారం. తండ్రి చిన్నప్పుడే పోవడంతో  వెన్న జున్ను పెట్టి ఒక్కగానొక్క కొడుకైన మూర్తిని వంటలు చేసుకుంటూ, అపురూపంగా పెంచుకుంది అతని తల్లి జానకి. తల్లి అతిగారాబమో, చదువు మీద ఆసక్తి లేకపోవడమో కాని అతనికి పెద్దగా చదువబ్బలేదు. పది పాస్ అయ్యేసరికే మూర్తికి ఇరవయ్యేళ్ళు నిండాయి. ఇక చదువబ్బదని అతడిని ఇరుగుపొరుగుకు కావలసిన చిన్న చిన్న పనులు చేసి పెట్టేందుకు పంపింది తల్లి.‌

తాడు బొంగరం లేని కొడుకును చూసి జానకమ్మ పడే బాధ చూసి, అతడికి ఒక ఆఫీస్ లో ప్యూన్ ఉద్యోగం ఇప్పించారు వారికి దూరపు బంధువైన మాచిరాజు విశ్వేశ్వరయ్య గారు. చిట్టి తండ్రి వాసుదేవరావు గారు, ఉద్యోగ రీత్యా బాపట్ల వచ్చినప్పుడు, అక్కడే ప్యూన్ గా మొదటిసారి తారసపడ్డాడు మూర్తి. 

 చెప్పిన పని చురుగ్గా చేసుకుపోవడం, అందరికి తల్లో నాలుకలా ఉండడంతో త్వరలోనే అందరికి ఆప్తుడయిపోయాడు మూర్తి. ఆఫీస్ పనులతో పాటు ఇంటి పనులు కూడా చెప్పి పదో పరకో ఇస్తుండేవారు. 

జమ్ములపాలెంలో తన తండ్రి ఏడాదికి సరిపడా మినుము కొన్నారు. ఆ ఊరెళ్ళి మినుముల బస్తా తీసుకురావడానికి ఆఫీస్ అయ్యాకా ఇంటికి రమ్మన్నారు. అప్పుడే అతడిని మొదటిసారి చూసింది చిట్టి. అప్పుడు తనకు పదేళ్ళు ఉంటాయేమో.

బొంగురు గొంతు మూర్తిది.‌ 'పాపగారూ, ఇలారండి, ' అంటూ చేతులు చాస్తే, ఆ బొంగురు గొంతు విని భయపడిపోయింది తను.

"డబ్బులు జాగ్రత్త మూర్తి, బస్సులో జేబుదొంగలుంటారు," అన్న వాసు గారితో, " ఏం పర్లేదు సర్, ఆ పరమేశ్వరుడే ఉన్నాడు, జై పరమేశ్వరా!" అనుకుంటూ వెళ్తున్న మూర్తిని చూసి, గమ్మత్తుగా అనిపించి, "జై పరమేశ్వరా," అని అనుకరించింది చిట్టి. అందరూ భళ్ళున నవ్వారు.

ఆ తర్వాత అడపాదడపా మూర్తి రావడం, నమ్మిన బంటులా ఉంటూ పనులు చేసి పెట్టడం ఓ రెండేళ్ళపాటు కొనసాగింది. ఎప్పుడైనా పిల్లలు సముద్రానికి వెళ్తామని గొడవచేస్తే, మూర్తినిచ్చి, చెక్కరిక్షా మీద పంపేవారు. "ఓయ్, జయ్ పరమేశ్వరా, " అని అల్లరిగా పిలుస్తూ, మీసాలు లాగుతూ, జుట్టు పీకుతూ ఎంత గొడవ చేసినా నవ్వుతూనే ఉండేవాడు తప్ప విసుక్కునేవాడు కాదు మూర్తి. అలా వాసు గారి కుటుంబం తో మూర్తికి అనుబంధం ఏర్పడింది.

కొన్నాళ్ళకు తమకు పక్కూరికి బదిలీ అయినా వస్తూనే ఉండేవాడు మూర్తి. తను పదో క్లాసు చదువుతుండగా, ఓ రోజలాగే దిగులు మొహంతో వచ్చాడు.
" తెలియక చేసిన చిన్న తప్పు వల్ల ఉద్యోగం పోయిందమ్మా, ఇక నా బ్రతుకు ఎలా గడుస్తుందోనని అమ్మ బెంగ పడుతోంది. ఎందుకో ఆ పరమేశ్వరుడు చిన్న చూపు చూసాడు. ఆయన దయ, జై పరమేశ్వరా," అన్నాడు.

మామూలుగా సుఖాల్లో అంతా దేవుడిని తల్చుకోకపోయినా, కష్టాల్లో ఖచ్చితంగా తిడతారు. కాని, ఉద్యోగం పోవడం‌కూడా పరమేశ్వరుడి దయే అంటున్న మూర్తి వైఖరి చిత్రంగా అనిపించింది చిట్టికి.

ఆ తర్వాత రెండు నెల్లకు ఏదో పనిమీద మూర్తిని పిలిపించారు. ఉద్యోగం లేని మనిషి ఎలా ఉన్నడోనని తొంగిచూసింది తను. మునుపటికంటే ఆనందంగా ఉన్నాడు.

"బాగున్నావా మూర్తి, ఏం చేస్తున్నావు? " అనడిగింది అమ్మ.

"బాగున్నా తల్లీ అన్నపూర్ణా. ప్రస్తుతం తద్దినం భోజనాలకు భోక్తగా వెళ్తున్నాను. అదీకాక ఊర్లో వాళ్ళకు ఇంకేమన్నా పనులుంటే చేసి పెడుతున్నాను. ముందు కన్నా ఓ రూపాయి ఎక్కువే వస్తోంది.‌ అమ్మ నాకు సంబంధాలు చూస్తోంది. చీమ నుంచి మనిషి దాకా పెంచి పోషించే ఆ పరమేశ్వరుడు ఉండగా నాకేం లోటమ్మా.‌ జై పరమేశ్వరా!" అన్నాడు.

"సరైన వాడివి మూర్తి. దేవుడి మీద నీకున్న నమ్మకమే నిన్ను ఎలాగోలా నిలబెడుతోంది. శుభం." అంది అమ్మ.

మరో నెలకే పెళ్ళి కార్డుతో వచ్చాడు మూర్తి. అందరం ఆశ్చర్యపోయాము. పిల్ల బీద కుటుంబం నుంచి వస్తోందట. పెద్దగా చదువుకోలేదట.

చూస్తుండగానే పదేళ్ళు గిర్రున తిరిగాయి. తను పెళ్ళై బొంబాయి వెళ్ళిపోయింది. మూర్తికి ఇద్దరు పిల్లలు కలిగి పెద్దయ్యారు. ఈ మధ్యకాలంలో మూర్తి రైసు మిల్లులో లెక్కల ఉద్యోగం, పొలం పనుల వద్ద కూలీలిచ్చే ఉద్యోగం, ఆలయ వస్రాల వేలం పాట ఉద్యోగం, ఇలా అందిన పనల్లా చేస్తూ పోయాడు. ఏ పని చేసినా అదే తృప్తి, సంతోషం, పరమేశ్వరుడి దయన్న భావం. ఈ మధ్యనే సొంతిల్లు కూడా కట్టాడని అమ్మ చెప్పింది.
***
"జై జై జై పరమేశ్వరా!" కొడుకు అరుపుతో ఆలోచనల నుంచి బయటికొచ్చింది చిట్టి. సిటి లైఫ్ లో ఎందరినో చూస్తూ ఉంటుంది తను.

ఈ రోజుల్లో సైకిలున్న వాడికి బైక్ కావాలి, బైకున్న వాడికి కార్ కావాలి, కారున్న వాడికి ఇంకా పెద్ద కారు కావాలి. ఒకిల్లున్న వాడికి మరో ఇల్లు కావాలి. ఒక ఉద్యోగం ఉన్నవాడికి మరో ఉద్యోగం కావాలి. ఇలా సముద్రం లో అలల్లా పుట్టుకొచ్చే కోరికలన్నీ దేవుడు తీర్చలేదని ఆయన్ను నిందిస్తూ ఉంటారు. తమకంటే మంచి సోఫా మరొకరింట్లో ఉన్నా అసూయ పడతారు. పరులతో తమను పోల్చుకుని బాధపడిపోతారు. ఆకాశంలో ఉన్న కాయ అందలేదన్న భావనతో అరచేతిలో ఉన్న ఉసిరికను ఆస్వాదించడమే మర్చిపోతారు. 

అలాంటిది ఒక నికరమైన చదువు, ఉద్యోగం, జీవిక ఏవీ లేని మూర్తి ఏ పని దొరికినా తృప్తి పడిపోతూ, అదే పరమేశ్వరుడి దయే అనుకుంటూ, జీవితమంతా తృప్తిగా గడిపేసాడే!  ఆ దయను నమ్మకున్న అతడికి ఏ లోటూ జరగలేదే!

మూర్తి గురించే ఆలోచిస్తుంటే, ఇప్పుడర్ధమైంది చిట్టికి. మనిషికి లోపించింది ఏమిటో.... ఉన్నదానితో ఆత్మ సంతృప్తి!!! 

"ఎంతైనా పరమేశ్వరుడు గొప్పవాడు. ఆయన్ను నమ్మినవాడికిక దిగులు లేదు,  జై పరమేశ్వరా!" అంటూ మనసారా భగవంతుడిని స్మరించుకుంది చిట్టి.

***


No comments:

Post a Comment

Pages