ఈ దారి మనసైనది -6 - అచ్చంగా తెలుగు
ఈ దారి మనసైనది -6
అంగులూరి అంజనీదేవి
anjanidevi.novelist@gmail.com

angulurianjanidevi.com


(జరిగిన కధ: మెడికల్ కాలేజీలో కొత్తగా చేరిన అనురాగ్ తొలి చూపులోనే దీక్షిత కళ్ళలో తనను తాను కోల్పోతాడు. ఆమెకు చేరువ కావాలని ఆరాట పడుతూ ఉంటాడు. అదే కాలేజీలో చేరుతుంది మన్విత. చూస్తుండగానే మెడిసిన్ మొదటి ఏడాది పూర్తవుతుంది. అనురాగ్ అంటే తనకున్న ఇష్టాన్ని, బయట పడనివ్వకుండా చదువు మీదే దృష్టి పెడుతుంది దీక్షిత, అందుకు కారణం ఆమె చాలా పేద కుటుంబం నుంచి కష్టపడి చదివి మెడికల్ కాలేజి దాకా రావడమే. అతి కష్టం మీద మెడిసిన్ లో సీటు సంపాదించి. పట్టుదలగా చదువుతూ ఉంటుంది ఆమె. దీక్షిత, అనురాగ్ కాలేజిలో కలిసి లాబ్ కు వెళ్తారు. తన గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది మన్విత. ఇక చదవండి. )
ఆమె వెనకాలే వున్న అనురాగ్ ఆమెను తన చేతులతో లేపి స్టేజి విూదకూర్చోబెట్టాడు. మన్వితకూర్చోలేక అలాగే ఒరిగి పడుకొంది. ఆమెకు కళ్ళు తిరుగుతున్నాయి. 
మిగతా పిల్లలు భయంతో బిక్కుబిక్కు మంటూ నిలబడ్డా అనురాగ్ కి ఏంచేయాలో తోచక ఒక్క క్షణం కంగారుగా చూసి, వెంటనే తన వాటర్ బాటిల్ తెచ్చి మూత తీసి, కొన్ని నీళ్లను తన చేతిలోకిఒంపుకొని ముఖం మీద చల్లాడు. 
నీళ్లు ముఖం విూద పడగానే, ఉలిక్కి పడ్డట్లు కనురెప్పల్ని ముడుచుకొని తర్వాత కళ్లు విప్పి అనురాగ్ని చూసింది. 
స్కూల్ టీచర్ హడావిడిగా వాళ్ల దగ్గరకి వచ్చి "ఏమైంది ? అంటూ మన్వితను పట్టుకొని, చేయిపట్టుకొని, చూసింది. 
అప్పటి వరకు ఆత్రంగా మన్వితనే చూస్తున్నపిల్లలంతా టీచర్ రాగానే ఎవరి క్లాసులోకి వాళ్లు వెళ్లిపోయారు.
"కొద్ది సేపు రిలాక్స్అవు. తగ్గిపోతుంది. అంటూ క్లాసులోకి వెళ్ళిపోయింది టీచర్.
అనురాగ్ మాత్రం అక్కడే వున్నాడు.
"ఇప్పడెలావుంది?" అన్నాడు.
ఆకలిగా వుండటంతో కడుపును చేత్తోనొక్కుకుంటూ "ఇట్స్ ఓ.కె”అంటూ లేచి క్లాసులోకి నడవబోతూ మళ్లీ అలాగే కూర్చుంది.
అనురాగ్ వెళ్లి... తన స్నాన్స్ బాక్స్ తెచ్చి అందులోంచి బిస్కెట్స్ తీసి మన్వితకు తినిపించాడు. 
వద్దనకుండా తిన్నది మన్విత.
తింటున్నంత సేపు తల్లి, నానమ్మ మాటలే గుర్తొస్తూ కళ్ళు చెమర్చాయి.
"ఏం కాదు భయపడకు" అంటున్న అనురాగ్ వైపు చూస్తూ వాటర్ బాటిల్ చేతిలోకి తీసికొని మూత తీస్తూ తల వంచుకొంది.
"వాటర్ తాగు. క్లాసులోకి వెళ్దాం" అన్నాడుఅనుగాగ్ . 
వాటర్ తాగి అతని వెంట క్లాసులోకి వెళ్ళింది మన్విత.
అనురాగ్, మన్విత టెన్స్ క్లాసు చదువుతున్నారు. 
ఒకే క్లాసు అయినా వాళ్లిద్దరిమధ్యన చెప్పకోతగిన పరిచయం లేదు. క్లాసులో ఆచివరన ఒకరు కూర్చుంటే ఈ చివరన ఒకరు కూర్చుంటారు. అతను వేసే జోకులకి, చేసే పనులకి క్లాసులో అందరు నవ్వుతున్నా ఆమెకి ఇంటి దగ్గర విషయాలే గుర్తోస్తూ అందరిలా ఎంజాయ్ చెయ్యలేకమూడీగావుంటుంది ఆమెను ఎవరూ కదిలించరు. ఎవరి ద్యానలో వాళ్లు హ్యాపిగా మూవ్ అవుతూవుంటారు. 
లంచ్ టైంలో ఫ్రెండ్ బ్రతిమాలటంతో ఆమె బాక్స్లో వున్న అన్నం షేర్ చేసుకొని తిన్నది మన్విత.
ఈవినింగ్ గ్రాండ్లో అందరు ఆడుతున్నా మన్విత వెళ్లలేదు. క్లాస్ రూంలో అలాగే కూర్చుంది. 
స్కూల్ బెల్ కొట్టగానే ఆలోచిస్తూ అడుగెయ్యడంతో-బెంచీ తట్టుకొని క్రింద పడింది మన్విత.
అప్పడు కూడా అనురాగ్ అమెను లేపటం యాదృచ్చికంగానే జరిగింది. 
మన్వితమోచేయి, మోకాళ్లు కొట్టుకొని ముఖ్యంగా గడ్డం చిట్లి రక్తం కారుతుంటే మోచేతిని , గడ్డాన్ని అతనే కర్పీప్తో తుడిచాడు.
"ఏంటి ! ఈరోజు పడిపోవటమే పనిగా పెట్టుకున్నావా! అంటూ తన బెంచిమేట్  అంటుంటే.....
కన్నీళ్లు తుడుచుకుంటూ మోచేతిని ముఖానికి దగ్గరగా పెట్టుకొని దెబ్బవైపు చూసుకుంటూ 'ఉఫ్, ఉఫ్ అనుకొంది మన్విత.
పిల్లలంతా పుస్తకాలున్న బ్యాగుల్ని వాటర్ బాటిల్ని భుజాలకి తగిలించుకొని, ఒకచేత్తో లంచ్ బాక్స్ వున్నచిన్నసైజు ప్లాస్టిక్ బుట్టని పట్టుకొని ఆటోలవైపు, కార్లవైపు పరుగులు తీస్తుంటే...
మన్వితకి నడవాలంటే కష్టంగా అన్పిస్తోంది. ఆమె ఇబ్బందిని గమనించి...
'మా కారులో వెళ్దాంరామన్వితా ! మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను' అన్నాడు అనురాగ్.
ఈలోపలే అనురాగ్ బ్యాగ్ను తీసుకొని, కారులో పెట్టాడు డ్రైవర్.
మన్వితకి నడుస్తుంటే మోకాళ్లు చురుక్కుమంటూ మంటగా వుంది.
అనురాగ్ చెప్పిన మాట వినటమే బెటర్ అనుకొంది.
మారు మాట్లాడకుండా కారెక్కింది. 
అనురాగ్ మన్విత వెనక సీట్లో కూర్చున్నారు. 
రోడ్డువైపు చూస్తున్న అనురాగ్ని చూస్తూ ... 
'అనురాగ్! మీ ఇల్లెక్కడ ? అంది మన్విత .
"ఇదే మా ఇల్లు " అని అనురాగ్ అంటుండగానే.... 
కారు ఆగింది.
" నేను మీ ఇంటికి రావొచ్చా?" అంది వెంటనే అతను కారుదిగాబోతుండగా.
"నేను కూడా అదే చెబుదామనుకుంటున్నా.. రా మన్విత, అంటూక్రిందకు దిగగానే కారు డోర్  పట్టుకొని పిలిచాడు. 
దిగింది మన్విత . 
మన్వితకి అప్పడే ఇంటికి వెళ్ళాలని లేదు. ఇల్లు గుర్తొస్తేనే ఒక విదమైన దడ. వెళ్లకుంటే తల్లి వూరుకోదు. ఎదురుచూస్తుంది.
(సశేషం)

No comments:

Post a Comment

Pages