సౌందర్య లహరి -2 - అచ్చంగా తెలుగు
సౌందర్య లహరి - 2
మంత్రాల పూర్ణచంద్రరావు 

సదాశివసమారంభాం - శంకరాచార్య మధ్యమామ్ ||అస్మదాచార్యపర్యంతాం - వందే గురుపరంపరామ్ ll
శ్లో: 11. చతుర్భిః  శ్రీకంఠైః - శివయువతిభిః  పంచభిరపి
ప్రభిన్నాభిః  శంభో - ర్నవభి రపి మూలప్రకృతిభిఃl
చతుశ్చత్వారింశ- ద్వశుదళ కళాశ్ర త్రివలయ
త్రిరేఖాభిః సార్ధం - తవ శరణకోణాః పరిణతాః ll

 తా: అమ్మా ఈశ్వరీ ~ శ్రీచక్రం~ నాలుగు శివచక్రాలు, వాటి‌నుండి విడివడిన ఐదు‌ శక్తి  చక్రాలతో ఉన్నది. ప్రపంచానికి మూలకారణమైన తత్త్వముతో కూడిన నీ నివాసమైన శ్రీచక్రంలోని కోణాలు~ అష్టదళాలు~ షోడశదళ పద్మాలు~ మేఖలాతంత్రంగా మూడు భూపురాలు కలిసి నలభైనాలుగు అంచులు కలిగి‌ వున్నాయి.‌ 
బిందు~త్రికోణ~ వసుకోణ~ దశారయుగ్మ~ మన్వస్ర~ నాగ దళ షోడస పత్ర యుక్తంచ~ ధరణీ సదనత్రయంచ~ శ్రీచక్ర రాజ ఉదితః పరదేవతాయాః అను నీ నివాసమగు శ్రీచక్ర వర్ణనలో అత్యంత శోభాయమానముగా అత్యంత సౌష్టవరీతిలో బ్రహ్మాడ~పిండాండ, సృష్టి~ప్రళయ విజ్ఞాన సమస్త రహస్యములను సంకేత పూర్వకముగా పొందుపరచబడిన యంత్ర రాజమే శ్రీచక్రము. అన్ని తంత్రములకు~ అన్ని‌ యంత్రములకు ~ అన్ని‌ మంత్రములకు దీని యందు సమన్వయము దొరుకును. అందుచేతనే దీనిని యంత్ర రాజము~ శ్రీచక్రరాజము అని అందురు. అటువంటి శ్రీచక్ర స్వరూపమైన మీఇరువురికీ నా నమస్సులు తల్లీ!!!
శ్లో: 12. త్వదీయం సౌదర్యం- తుహినగిరి కన్యే! తులయితుం
కవీంద్రాః కల్పంతే- కథ మపి విరంచిప్రభృతయఃl
యదాలోకౌత్సుక్యా - దమరలలనా యాంతి మనసా
తపోభిర్దుష్ప్రాపా-మపిగిరిశసాయుజ్యపదవీమ్ll

తా : ఓహిమవత్పర్వత రాజ తనయా ! నీ సౌందర్యమును పోల్చుటకు బ్రహ్మదేవుడు మొదలయిన  కవి పుంగవులు కూడా సమర్ధులు కాకుండిరి.ఎందువలన అనగా సృష్టి లోని సౌందర్య రాశులు అయిన అప్సరసలు కూడా నీ అందమునకు ఆశ్చర్యము పొంది, తాము నీతో సరిపోలము అని మనస్సులో  శివునితో ఐక్యము కోరుతున్నారుట.  
శ్లో: 13. నరం వర్షీయాంసం- నయనవిరసం నర్మసు జడం
తవాపాంగాలోకే - పతితమనుధావంతి శతశఃll
గళద్వేణీబంధాః - కుచకలశవిస్రస్త సిచయాః
హఠా త్తృట్యత్కాంచ్యో విగళిత దుకూలా యువతయః

తా : అమ్మా ! ఏ పురుషుడు ముదుసలి అయి శరీరము ముడుతలు పడి, కళ్ళనిండా పుసులు ఉండి మసక చూపు కలిగి,శృంగార భాషణములు కూడా చేయలేని మూఢుడయిన వాడు అయినా నీ క్రీగంటి చూపులకు పాత్రమయిన వానిని చూచుటకు వందల కొలది మదవతులు తమ జుట్టు ముడులు విడిపోవుచున్ననూ, పయ్యెదలు జారిపోవు చుండగా, బంగారు మొలనూలులు జారిపోవుచుండగా వానిని చూచుటకు పరిగెత్తుకుని వెంట పడుతున్నారు కదా . 
శ్లో: 14. క్షితౌ షట్పంచాశ- ద్ద్విసమధికపంచాశ దుదకే
హుతాశే ద్వాషష్టి - శ్చతురధికపంచాశదనిలే
దివి ద్విష్షట్త్రింశ-న్మనసి చ చతుష్టష్టిరితి యే
మయూఖా స్తేషామ ప్యుపరి తవ - పాదాంబుజ యుగమ్

తా: అమ్మా ! సాధకుని దేహమందు పృధ్వీ తత్వముతో ఉన్న మూలాధారమునందు ఏబది ఆరును,జల తత్వముతో ఉన్న మణిపూరము నందు ఏబది రెండునూ, అగ్నితత్వమగు స్వాదిస్ఠానమునందు అరువది రెండునూ,వాయుతత్వముతో కూడిన అనాహతమునందుఏబది నాలుగునూ,ఆకాశతత్వమయిన విశుద్ధచక్రమునందు డెబ్బది రెండునూ,మనస్తత్వముతో కూడిన ఆజ్ఞాచక్రమందు అరువది నాలుగున్నూ కిరణములు గలవో వాని పై భాగమున ఉండు సహస్రదళ మధ్యనున్న బైందవ స్థానమున నీ యొక్క పాదముల జంట నర్తించును,
శ్లో: 15. శరజ్జ్యోత్స్నా శుధ్ధాం - శశియుత జటాజూటమకుటాం
వరత్రాసత్రాణ స్ఫటికఘటికా పుస్తక కరామ్
సకృన్నత్వా  న త్వా కథమివ సతాం సన్నిదధతే
మధుక్షీర ద్రాక్షా మధురిమ ధురీణాః ఫణితయఃll

తా: అమ్మా ! శరత్కాలమునందు ఉండు వెన్నెల వలె నిర్మలమయిన శరీరము కల దానవు,పిల్ల జాబిల్లితో కూడిన జడ ముడి ఉన్న కిరీటము కల దానవు,కోరికలు తీర్చు వరముద్ర, భయమును పోగొట్టు అభయముద్ర కల దానవు,స్ఫటిక పూసల జపమాలను, పుస్తకమును చేతుల యందు ధరించిన నిన్ను ఒక్క పరి అయినా నమస్కరించు సజ్జనులకు తేనె,ఆవుపాలు,ద్రాక్ష పండ్ల యొక్క మధురములను అందించు  వాక్కులు రాకుండా యెట్లు ఉండును. తప్పక వచ్చును కదా !
శ్లో: 16. కవీంద్రాణాం చేతః - కమలవనబాలాతపరుచిం
భజంతే యే సంతః - కతిచి దరుణా మేవ భవతీమ్l
విరించి ప్రేయస్వా స్తరుణ తర శృంగార లహరీ
గభీరాభి ర్వాగ్భి - ర్విదధతి సతాం రంజన మమీ ll

తా: అమ్మా ! కవి శ్రేష్ఠుల చిత్తములనెడిపద్మ వనములకు బాల సూర్యుని కాంతివగు అరుణ అను నామము కల నిన్ను ఏ కొందరు సత్పురుషులు సేవించుచున్నారో వారు బ్రహ్మ ప్రియురాలు అగు సరస్వతీదేవి వలె మిక్కిలి శృంగార రస ప్రధానములతో  గంభీరములు అయిన వాక్కులతో సత్పురుషుల హృదయాలను రంజింప చేయు చున్నారు కదా ! 
శ్లో: 17. సవిత్రీభిర్వాచాం - శశిమణిశిలాభంగరుచిభి
ర్వశిన్యాద్యాభిస్త్వాం సహ జనని సంచింతయతి యఃl
స కర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభి
ర్వచోభిర్వాగ్దేవీ - వదన కమలామోదమధురైఃll

తా: అమ్మా ! చంద్ర కాంత మణుల శిలా కాంతి వంటి కాంతి కలిగి వసిన్యాది అష్ట శక్తులతోనూ ద్వాదశ యోగినులూ  కలిగిన నిన్ను ఎవ్వడు చక్కగా ధ్యానము చేయు చున్నాడో అతడు కాళిదాస వ్యాసాదులు మొదలుగా గల మహాత్ముల రచనల వలె మనోహరములయినట్టియు సరస్వతీదేవి ముఖ కమలము యొక్క పరిమళములు  గల రచనలు చేయుటకు సమర్ధులు అగుచున్నారు కదా ! 
శ్లో: 18. తనుచ్ఛాయాభిస్తే తరుణతరణి శ్రీ సరణిభిః
దివంసర్వా ముర్వీ మరుణిమ నిమగ్నాం స్మరతి యఃl
భవంతస్య త్రస్య ద్వనహరిణ శాలీన నయనాః
సహోర్వశ్యా వశ్యాః కతికతి నగీర్వాణ గణికాఃll

తా:  అమ్మా ! ఉదయపు సూర్యుని శోభను పోలిన శోభ కలిగిన  నీ శరీరమును ఎఱ్ఱ దనముతో నిండిన ఆకాశముగా ఎవ్వరు పూజించు చున్నారో  అట్టి వారు, తొట్రుపాటు పడుచూ అడవుల యందున్న లేళ్ళ కన్నుల వంటి కన్నులు కల అప్సరసలకు సైతము వశము కారు కదా !
శ్లో: 19.ముఖం  బిందుం కృత్వా కుచయుగ మథ స్తస్య తదథో
హరార్ధం ధ్యాయోద్యో హరమహిషి తే మన్మథ కలామ్l
స సద్యః సంక్షోభం నయతి వనితా ఇత్యతిలఘు
త్రిలోకీ మప్యాశు భ్రమయతి రవీందుస్తన యుగామ్ll

తా:  అమ్మా! పరమశివుని పత్నీ~ పార్వతీ~ శ్రీచక్రం లోని బిందువును నీ ముఖముగాను~ దాని‌ క్రింద స్తనములు~ ఆ క్రింద శివుని శరీరం లోని సగమైన శక్తిని~  బిందువు క్రింది త్రికోణం లో 'క్లీం ' బీజాన్ని భావిస్తూ ఎవడు ధానిస్తాడో అతడు త్రిలోకాలనూ మోహపెట్టగలడు కదా తల్లీ... అంతటి గొప్పదనం నీ మేరు స్వరూపానిది కదా !
శ్లో: 20. కిరంతీ మంగేభ్యః - కిరణ నికురుంబామృతరసం
హృది త్వామాధత్తే - హిమకరశిలామూర్తిమివ యఃl
స  సర్పాణాం దర్పం - శమయతి శకుంతాధిప ఇవ 
జ్వరప్లుష్టాన్  దృష్ట్యా - సుఖయతి సుధాధారసిరయాll

తా: అమ్మా ! పాదముల మొదలు శరీరము అంతటి కిరణముల నుండి ప్రసరించు చున్న అమృతము ను కురిపించుచున్న చంద్రకాంత శిల్పా మూర్తిగా  నిన్ను ఏ సాధకుడు ప్రార్ధించు చున్నాడో అట్టి వాడు గరుత్మంతుని వలె పాముల నుండీ వెలువడుచున్న విషమును హరింప చేయు చున్నాడు,జ్వరముతో భాధింప పడు  వానిని  అమృతము ధారగా కలిగిన తన నాడుల యొక్క శీతలమయిన చూపుచేత జ్వరబాధను తగ్గించి సుఖమును కలుగ చేయుచున్నాడు కదా! 
శ్లో: 21. తటిల్లేఖాతన్వీం - తపనశశి వైశ్వానరమయీం
నిషణ్ణాం షణ్ణామ ప్యుపరి కమలానాం తవ కలామ్ 
మహాపద్మాటవ్యాం - మృదితమలమాయేన మనసా
మహాంతః  పశ్యంతో దధతి  పరమాహ్లాదలహరీమ్ll

తా: అమ్మా! మెరపు తీగవలె సూక్ష్మముగా పొడవుగా ఉన్న, సూర్యుడు చంద్రుడు మరియు అగ్ని రూపముగా యున్న ఆజ్ఞా మొదలగు ఆరు చక్రముల పైన బిందు స్థానమయిన తామరముల అడవి ( సహస్రారము ) నందు కూర్చున్న దానివి అవిద్య అహంకారము అను మాయలను విడిచి నిన్ను చూచుచున్న మహాత్ములు పరమానందము కలిగి జీవించుచున్నారు కదా.!
శ్లో: 22. భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణా
మితి స్తోతుం వాంఛ న్కథయతి భవాని త్వమితి యః 
తదైవత్వం తస్మై  దిశసి నిజసాయుజ్య పదవీం
ముకుంద బ్రహ్మేంద్రస్ఫుట మకుట నీరాజితపదామ్ll

తా:  అమ్మా ! భవానీ నీ యొక్క దాసుడు అయిన నా మీద నీ యొక్క దయతో కూడిన చూపులు ప్రసరించుమని వేడుటకు సిద్ధపడి అమ్మా భవానీ అని రెండు పలుకులు నోటి వెంట రాగానే బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు మొదలగువారి కిరీటములచే నీరాజనము చేయుచున్న పాదపద్మములు  గల నీ సాయుజ్యమును ఇచ్చుచున్నావు కదా !
శ్లో: 23. త్వయా హృత్వా వామం వపు రపరితృప్తేన మనసా
శరీరార్ధం శంభో రమరమపి శంకే హృతమభూత్ః
యదేతత్వ ద్రూపం సకలమరుణాభం త్రినయనం
కుచాభ్యా మానమ్రం కుటిల శశిచూడాల మకుటమ్ll

తా:  అమ్మా ! నీవు శివుని యొక్క వామ భాగమును హరించి తృప్తి పడక కుడి భాగమును కూడా అపహరించినావు ఏమో అని శంక కలుగుచున్నది,ఎందుకు అనగా నా హృదయ కమలము నందు ప్రకాశించు నీ రూపము కుడి ఎడమల భాగముచే కూడిన ఉదయపు భానుని వలె ఎఱ్ఱని కాంతి కలదియు మూడు కన్నులు కలదియు కుచాభారముచే వంగినదియు అయిన చంద్రుని ఖండమును శిరస్సున ధరించినట్లు అనిపించుచున్నది కదా ! 
శ్లో: 24.జగత్సూతే ధాతా హరిరవతి రుద్రఃక్షపయతే
తిరస్కుర్వన్నేతత్ స్వమపి వపురీశ స్తిరయతిl
సదా పూర్వః సర్వం తదిద మనుగృహ్ణాతి చ శివ
స్తవాజ్ఞా మాలంబ్య క్షణచలితయో ర్ర్భూలతికయోఃll

తా: అమ్మా ! బ్రహ్మ ఈ జగత్తును సృష్టించు చున్నాడు ,విష్ణువు సంరక్షించుచున్నాడు, రుద్రుడు లయము చేయుచున్నాడు.మహేశ్వర తత్వమయిన ఈశ్వరుడు ఈ మువ్వురనూ తనలో లయము చేసుకొని తన యొక్క శరీరమును కూడా సదాశివుని యందు లయము చేయు చున్నాడు. సదా శివ తత్వమయిన సదాశివుడు బ్రహ్మాండము ఉత్పత్తి చేయవలెనని కోరిక కలిగి క్షణ మాత్రము చలించిన నీ లతలవంటి కనుబొమ్మల అనుజ్ఞను స్వ్వీకరించి మరల బ్రహ్మవిష్ణు రుద్ర సహిత జగత్తును సృష్టించుచున్నాడు కదా !
శ్లో: 25. త్రయాణాం దేవానాం త్రిగుణ జనితానాం తవ శివే
భవేత్పూజా పూజా తవ చరణయో ర్యా విరచితాl 
తథాహి త్వత్పాదోద్వహన మణిపీఠస్య నికటే
స్థితాహ్యేతే శశ్వన్ముకుళిత కరోత్తంసమకుటాఃll

తా: అమ్మా !  సత్వరజో స్తమో  గుణములు కలిగిన త్రిమూర్తులకు నీ పాదములకు జరిగిన పూజయే వారికి కూడా పూజ అగుచున్నది కదా , అది సమంజసమే కదా, ఎందువలన అనగా వారు నీ పాదములను వహించిన మణి పీఠిక వద్ద ముకుళిత హస్తములతో   వర్తించు చున్నారు కదా !
(సశేషం)

No comments:

Post a Comment

Pages