Friday, March 23, 2018

thumbnail

అమ్మమ్మ పెద్దరికం

అమ్మమ్మ పెద్దరికం
ఆండ్ర లలిత

మానస ఎనిమిదొవ తరగతి పరీక్షలు రాసి ఇంటికొచ్చిందో లేదో అమ్మమ్మ నాగరత్నం దగ్గర్నుంచి  ఫోన్ వచ్చింది. “అమ్మమ్మా నీతో మాట్లాడాలని నిన్నటి నుంచి అనుకుంటున్నాను. ఏవో మాట్లాడనిపిస్తోంది మీతో..నువ్వెలా ఉన్నావు. నువ్వూ తాతయ్య రావచ్చుకదా ఇక్కడికి!” అంది మానస నీరసంగాఫోన్ ఎత్తిఅమ్మమ్మతో.
“కుదరదు మానసా, శ్రీ రామనవమి వేడుకలున్నాయి మీరే రండి. ఎప్పుడో ఊహ తెలియని వయస్సులో చూసారంతే. తరువాత మీ చదువులు పెరగటంతో, రాలేకపోయారు... సర్లే ఆ విషయం గురించి తరువాత మాట్లాడుకుందాం అమ్మడూ! నా విషయంకి వస్తే, నేను బానేవున్నాను. నువ్వు ఎలా ఉన్నావో చెప్పు అమ్మడూ.అదేమిటే అంత నీరసంగా ఉన్నావు. తరువాత ఫోన్ చేస్తానులే. ఏమన్నా తినమ్మా”అంది  అమ్మమ్మ మనుమరాలు నీరసముగా ఉందని కనిపెట్తూ.
“అంత నీరసంగా లేను. అలసిపోయానంతే.. చదివిచదివీ! ఇంకేమిటి? ఫోన్ పెట్టకు అమ్మమ్మ. నేను తరువాత తింటానులే! అవునుకానీ అమ్మమ్మా నేను వేసంగిలో మన పల్లెసీమలలో జరుపుకునే ఒకవేడుక నేను అనుభవించిదాని గురించి క్లుప్తంగా రాయాలి. అదీను ఒక పోటీకి. అది ఆలోచిస్తే తలనొప్పి వస్తుంది. నువ్వు రా ఇక్కడికి. నువ్వు ఏదన్నా తాటిపాకలో జరిగే వేడుకల గురించి చెప్తే నేను రాస్తాను.. ఏమంటావు!”అంది మానస నీరసంగాఅమ్మమ్మ మాటలలో సమాధానం విందామని ఆలకిస్తూ. మానస అలసిపోయినప్పుడు  అమ్మమ్మన్నా ఫోన్ చేస్తుంది లేదూ తనన్నా అమ్మమ్మకి చేస్తుంది. చిన్నప్పటినుండి అదొక అలవాటు. అమ్మమ్మా తాతయ్యల మాటలలో ఏదో చెప్పలేని ఆత్మీయానుభూతులు అనుభవిస్తుంది మానస. ఏదో చెప్పలేని ఉత్సాహం వస్తుందిఅమ్మమ్మా తాతయ్యల మాటలలోఅనితనలోతానుఅనుకుంటూ ఏదో పరధ్యానంలో పడిపోయింది మానస.
“మానసా!  వింటున్నావా? లేక, ఏదో ఆలోచిస్తున్నావా?” అన్నప్పుడు అమ్మమ్మ మాటలకి ఉలిక్కిపడి, అమ్మమ్మకి ఎలా తెలిసిందా అనిపించింది మానసకి.
“నీ గురించే ఆలోచిస్తున్నాను అమ్మమ్మ.నువ్వు వస్తున్నావో లేదోనని. నీకెలా తెలిసింది, నేను ఏదో ఆలోచిస్తోనట్టు! కాని నేను వింటున్నాను చెప్పు!” అంది మానస
“లేదు నాన్నా! పరీక్షలు బాగా రాసావా! తమ్ముడు కార్తీక్  పరీక్షలు రేపౌతాయని అమ్మ చెప్పింది!అమ్మమన తాటిపాక వస్తోంది కదా పదిరోజుల్లో.మీరిద్దరూ కూడా అమ్మతో బయలుదేరండి. శ్రీ రామనవమి వేడుకలు వచ్చేస్తున్నాయి కదా, చూసుకుని వెళ్దురు గాని అమ్మడూ”అంది  అమ్మమ్మ మనుమరాలు మానస మనసాకట్టుకుందామనివాత్సల్య బంధంతో పెనవేస్తూ.
“బోరు అమ్మమ్మ!ఏమి చూస్తాము...ఆ విలేజ్లో” అంది మానసఅమ్మమ్మ దగ్గర ముద్దులు గుడుస్తూ..
“అదేమిటే అలా అంటావు? మన ఊరు సంబరాలలో అవకాశము వచ్చినప్పుడు పాల్గొనద్దేమిటే? మళ్ళీ  పెద్దయ్యాక, ఏ అయ్యో ఎక్కడికి నిన్నెగరేసుకొని పోతాడో. అప్పుడు నీ సంసార బాధ్యతలు వదులుకుని రాగలవా అమ్మడు?”అంది  అమ్మమ్మ  మనసులో ఎక్కడో ఏ కోనలోనో తన మనుమరాలు మానస గురించి తెలియని బెంగ వచ్చి. ఆ ఆలోచన  దేవేసింది నాగరత్నాన్ని. మళ్ళీ  తన భాధ్యత గుర్తుకొచ్చి, తననితను తమాయించుకొని, మానసముందర కాళ్ళకి బంధం వేస్తూ..“నువ్వు రావాలంతే అమ్మడు.ఆ వేడుక అనుభవించి ,అప్పుడు రాద్దువుగాని” అందిఅమ్మమ్మ!
“చూడాలనుకో!ఏమోచూద్దాం! ఏమి  తోచటం లేదు పరీక్షలు ఈరోజే అయ్యాయి కదా! తలనొప్పిగా ఉంది. ఏదో ఒకటి ఫోన్ పెట్టకు నువ్వే మాట్లాడు అమ్మమ్మా.  చిన్నప్పుడు కథలు చెప్పినట్లు. వింటాను. నీ కథ నచ్చితేవస్తానేమో”అంది కొంటెగామానస నచ్చేటట్లు చేయటం నీ పూచి మాత్రమే అన్నట్లుగాఅమ్మమ్మని ఉడికిస్తూ.
“అదేమిటే అమ్మడు అలాంటావు? సరే విను చెప్తాను”అంది అమ్మమ్మ నాగరత్నం ఎలా తన చిట్టితల్లిని ఒప్పించాలా అని దీర్ఘాలోచనలో పడుతూ. 
ఎక్కడ అమ్మమ్మ ఎక్కడ ఎక్కడన్నించి మొదలు పెడుతుందోయని, “అమ్మమ్మా రామాయణం అంతా చెప్పకు. రామనవమికి ఏం చేస్తారో చెప్పు చాలు”అంది  మానస  అమ్మమ్మతో. 
“సర్లేవే! ఒక్కక్షణం”అంటూ, అమ్మమ్మతను మట్లాడే ఫోన్ దగ్గరగా కుర్చీ లాక్కుని కూర్చొని చెప్పండం మొదలు పెట్టింది.
“చైత్ర శుద్ధనవమినాడు శ్రీరామనవమి మనమంతా జరుపుకుంటాము. అందరి ఇళ్ళల్లో వొడుగూ, పెళ్ళీ హడావిడే!ఏదో ఉడుతభక్తితో అందరం ఈవేడుకలు జరుపుకుంటాము మన ఇళ్ళల్లో.అమ్మకూడా అక్కడ ఢిల్లీలో చేస్తుంది కదా! అమ్మడూ”అంది  అమ్మమ్మ మానస మనసుని ఎక్కడికో తీసుకువెళ్ళే ప్రయత్నంలో.
“అవును.వడపప్పు, పానకం తీర్థ ప్రసాదాలిస్తుందిగదా!”అంది మానస  అమ్మమ్మతో.మళ్ళీ అందుకుంటూ “అమ్మమ్మా! ఇప్పుడు ఏదో కొద్దిగా గుర్తొస్తోంది. నీతో ఎక్కడో ఒక మండపంలో  పట్టు పరికిణి కట్టుకుని కూర్చుని, అమ్మవారికి నువ్వుమల్లె పూలజడ కుట్తుంటే, నేను నీకు గంపలో మల్లెపూలందిస్తునట్లు!”అన్నమానస మాటలకి అమ్మమ్మకి చాలా సంతోషమొచ్చింది.“అవును బంగారు తల్లీ. అదేరా శ్రీ సీతారాముల కళ్యాణం”
“నాకు చాలా యిష్టం అమ్మమ్మ ఆ వేడుకలు. ఇప్పుడు గుర్తొచ్చింది. ఇంకా చెప్పు!”అంది మానస తన జ్ఞాపకాలని నెమరేసుకుంటూ.
“సరే విను మానసా!మాములుగా ఇక్కడ ఇళ్ళల్లో పూజలు అయ్యాక, రామలయంలో శ్రీసీతారాములను దర్శించుకొని అందరూ ఒకచోట గుమిగూడి సీతారాముల కళ్యాణం మరియు పట్టాభిషేకం వేడుకలు జరుపుకుంటారు. దానిలో ప్రధానముగా శ్రీసీతారాముల కళ్యాణం ఎక్కువ జరుపుకుంటారు” అంది  అమ్మమ్మ మానసతో.
“అక్కడకే రావాలా, ఎందుకూ, టివిలో వస్తుందికదా అమ్మమ్మా?”అంది మానస అమ్మమ్మతో.
“అవునురా. కాని మన వాళ్ళ మధ్య, మన ఊళ్ళో,  మనఆత్మీయతలలో జరుపుకోవటం వేరే చిట్టి తల్లీ.వచ్చి చూసి, అప్పుడు చెప్పు అమ్మడూ! మరి మన పక్క పల్లెసీమలలో శ్రీరామనవమి వేడుకలే వేరు. ఎక్కడచూసినా వీధివీధికి తాటాకుపందిళ్ళు, కొబ్బరిమట్టలతో అమర్చిన మండపాలు. ఆమండపాలకి పచ్చనిమామిడాకు తోరణాలు. ఆమండపాల్ని కళ్ళాపుజల్లి చక్కటిచుక్కల ముగ్గులతో పడతులు అలంకరిస్తారు. చైత్రమాసంలో అప్పుడప్పుడే మల్లెపూలు పూస్తూ ఉంటాయి. మరి సీతమ్మవారికి అందరి ఇళ్ళనుండి పెరటిలో పూలతోపాటు మల్లెపూలు తప్పకవస్తాయి;పళ్ళూ, పూజసామాను ,పసుపుకుంకుమలతో పాటు. ఇక తెల్లారగట్లనుండి వీధివీధిలో సీతారాముల పాటలు, ముఖ్యంగా ‘సీతారాముల కళ్యాణము చూతము రారండి, శ్రీసీతారాముల కళ్యాణము చూతము రారండి...’ లాంటివి మారుమ్రోగుతూ మనని మేలు కొలుపుతాయి.ఆ పాటలు విటూంటేనే ఏదో పెళ్ళి హడావిడి, ఒక రకమైన ఆనందోత్సాహం. ఈవేడుక జరుపుకునేందుకు వీధివారంతా అన్ని ఏర్పాట్లు కలిసి సామరస్యముతో చేసుకుంటారు. ధనరూపములో కానీ, వస్తురూపములో కానీ, శ్రమరూపములో కానీ, ఏదియేమైనా అందరూ ఏదో ఒకరూపంలో దోహదపడతారు. ఆవేడుకలు పొద్దున్ననుంచే కనుల పండుగగా ప్రారంభమవుతాయి. వింటున్నావటే అమ్మడూ”అంది  అమ్మమ్మ.
“చెప్పు అమ్మమ్మా వింటున్నాను.బావుందమ్మమ్మ. ఇంకా వినాలని అనిపిస్తోంది...!సీతారాములు మనందరిని పిల్లలలా చూసుకుంటారని చాలాసార్లు చెప్పావు కదా.. మనందిరిని చూసుకోవడం చాలా కష్టం కదా. అంతమందిని చూసుకోవడం ఎలా సాధ్యం?”అంది  మానస  అమ్మమ్మతో.
“కాయలు చెట్టుకు ఎలా భారం కాదో, అలాగే సీతమ్మకూ, రామయ్యకు మనము భారముకాదని, వాళ్ళు మొత్తం వసుధైవ కుటుంబక భారముమోస్తున్నారని మనకనిపిస్తుంది అమ్మడూ.. మీ అమ్మకి చిన్నప్పడు ఈ పండుగంటే ఎంత ఇష్టమో.మీరు చిన్నప్పుడు అటూఇటూ హడావుడిచేస్తూ ఆడుకునేవారు. మేమంతా హడావుడిగా వేడుకల ఏర్పాటు పనులను చక్కగా కలిసిమెలసి చేస్తున్న తీరు చాలా ఆనందంగా వుండేది. మామూలుగా పెళ్ళి ఒకకుటుంబవేడుక. సీతారామకళ్యాణం వసుధైవ కుటుంబకానికే వేడుక”అంది  అమ్మమ్మ నాగరత్నం .
“అమ్మమ్మా! మరి ఇప్పుడు అక్కడ ఎండలు ఎక్కువగా లేవూ?”అంది  మానస
“ఏదో కాస్త చుర్ మంటోందంతే, అందుకే వచ్చినవారికితాటాకులతోచేసిన విసినికఱ్ఱలువిసురుకునేటందుకుఇస్తారు.సీతమ్మ తల్లిని కన్యగా భావించి కన్యాదాతలుగా పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తారు. 
మన వూళ్ళో సీతారామ కళ్యాణం వస్తే, ఎంతోసరదాగా నవ్వుకుంటూ కళ్యాణఘట్టాలు తీర్చిదిద్దుతారందరు. దానిలో ప్రధానముగా ఎదురు కోలువేడుక. ఆవాడవారంతా చక్కగా రామయ్య ఉన్న చోటికి సీతమ్మవారి తరఫున మేళ తాళాలతో వెళ్ళి, రామయ్యని పెళ్ళికి ఆహ్వనించటం. ఆ వేడుక చూడముచ్చటగా ఉంటుంది.అలాగే తలంబ్రాల వేడుక మాములుగా ప్రాంత ప్రాంతానికీ ఆచారవ్యవహారాల బట్టి వేరౌతుంది. మరి సీతారాములకళ్యాణంలో ముత్యాలతలంబ్రాలతో పాటు బియ్యపుతలంబ్రాలు కాస్త లేతఎరుపురంగులో ఉంటాయండి. తానీషావారు భద్రాచలంలో సీతారాముల కళ్యాణం తలంబ్రాల బియ్యంలో గులాబి రంగు   కలపమన్నారట, మిగతా పూజా ద్రవ్యాలతోపాటు. అందుకని సీతారాములకళ్యాణం తలంబ్రాల అక్షింతలు ఎఱ్ఱగా ఉంటాయట. అలాఅన్ని ఘట్టాలు ఎన్నిఏళ్ళు, ఎన్నిసార్లు చూసినా మనకు తనవితీరవు సుమీ. ఏదోఒక కొత్తదనము, కొత్తకళ ఆ ప్రతిష్టించిన సీతారాముల విగ్రహాలలో కనబడుతుంది మనకు.
ఆ రోజు వేడుకలయ్యాక ఎంతో ఆనందంతో సీతారాములు మనకేసితిరిగి మనందరికీ ఆశీస్సులు అందచేసే వడపప్పు పానకం తీర్థప్రసాదాలు తీసుకున్నప్పుడూ, అక్షింతలు వేయించుకున్నప్పుడూ మనఆనందాలకి హద్దులుండవు. అందరం కలిసి చేసే విందుభోజనము ఎంత బావుంటుందో. ఆ రోజునుండి వసంతనవరాత్రులు ఆరంభమౌతాయి. ఆ జగత్మాతా పితృలకు త్రికాలము దైవతార్చన జరుపుతారు. సాయంకాలాలు హరికధలు, సంగీతకఛేరీలు కూడా జరగుతాయి. ఇదంతా అయ్యాక రాత్రివేళ సీతారాములను తొమ్మిదిరోజులూ తొమ్మిదివాహనాలలో ఊరేగిస్తారు ఊరంతా. అందరూ దేవుడొచ్చాడు, దేవుడొచ్చాడు అంటూ పెద్దలూపిన్నలూ వాళ్ళు చేస్తున్నపనులను పక్కనపెట్టి యిళ్ళబయటకు వచ్చిసీతారాములను చూసి సంబరపడిపోయి, ఒక్క నమస్కారముపెట్టి “తండ్రీ మమ్మల్ని  చూడటానికి  యింటికి వచ్చావా” అనుకొని మమకారంతో కొబ్బరికాయలు, పూజాద్రవ్యాలు సమర్పించుకుంటారు, ఆ సీతారాములకు భక్తిశ్రద్ధలతో. అదిరా మానస మనసీతారాముల కళ్యాణ విశేషాలు.మరి ఈ అమ్మమ్మకోసం వస్తావుకదరా అమ్మడూ”అంది  అమ్మమ్మమానసతో.
“తప్పకుండా వస్తాను అమ్మమ్మా.కనులారా చూడాలనుంది.నేనూ తమ్ముడూ అమ్మతో బయలుదేరి వస్తున్నాము అమ్మమ్మా”అంది మానస  అమ్మమ్మతో. మానస మాటలు అమ్మమ్మకి ఆనందభాష్పాలను తెప్పించాయి.
“సరే అయితే..తాతయ్యకి కాఫీ ఇవ్వాలి మానస. ఇంక ఉంటాను ఏదో ఒకటి తిను సరేనా”అంటూ  అమ్మమ్మ మనుమరాలు మానసతో అంటూ, వంటిట్లోకి వెళ్ళి కాఫీ పెట్టి, కాఫీ కప్పులోపోసి, పెరటిలో  మామిడి చెట్టు కింద నీడలో వాలుకుర్చీలో కూర్చుని కునుకుపాట్లు తీస్తున్నభర్త సుబ్బారావుకు అందిచింది. సుబ్బారావుకాఫీ ఆస్వాదిస్తూ “ఎవరు ఫోను చేసారు?”అని నాగరత్నం కేసి చూసి అన్నపుడు సమాధానంగా “పిల్లలు వచ్చేస్తునారు పదిరోజుల్లో అంది నాగరత్నం.
“మానసని రమ్మని బలవంతపెట్టాను. ఎలాగైతే ఒప్పించాను. మానస ఎదో ఒక పల్లెలలో జరిగే వేడుక గురించి రాయాలట. మన శ్రీరామనవమి వేడుకల గురించి రాయమంటుంన్నాను. ఏమంటారు!” అందికాఫీ అందిస్తూ.
“ఆగవే బాబూ! ఇంతకీ మానసని ఎలా ఒప్పించావు బావుంది. చాలా సంతోషంగా ఉంది నాగరత్నం”అన్నాడు సుబ్బారవు. 
“నాదేమి లేదండి! మనని నడిపించే తల్లి ఆ సీతమ్మేకదా..అయినానండీ, పిల్లలికి అర్థం కాకపోతే బోర్ అనంటారు. ఇప్పుడు మన మానసనే తీసుకోండీ, సీతారామస్వామి కళ్యాణం చవి చూపించే బాధ్యత మనదికాదూ. అమ్మమ్మగా మనుమరాలు మానసకి చెప్పాలనిచిన్న ప్రయత్నం  చేసానంతే.. మనతో అంతరించకూడదండి మన సంస్కృతీ సాంప్రదాయం. మన మనుమలకు, మనం మమకారంలోవాళ్ళతో మమేకమై చెప్తే ఎందుకు వినరూ? అది పెద్దరికంతో మనం చేయ్యాలి. మనం ఒడ్డున చేరుకుని కూర్చుని చూస్తున్నాం. వాళ్ళంతా నడిసముద్రంలో కొట్టుమిట్టాడుతన్నారు. మనకేసి వారు చూసినప్పుడు మనం ఒడ్డున కూర్చుని, మీరు చేయ్యగలరంటు, నాలుగు మంచి మాటలు పలకటమే, పెద్దరికంతో. అంతేకాని వాళ్ళ దగ్గరకు దూకి మీకేమి తెలీయదు. నేనైతే ఎంత బాగా సుడిగుడాలను దాటానో. అంటూ వాళ్ళ చేత ఈదించటంకాదుకదండి.  ఏమంటారండి!!!”
“మనసులోని మాట చెప్పావమ్మ. మానస కార్తీక్ మన వేడుకలు పధ్ధతులు అనుభవిస్తే; వాళ్ళెక్కడున్నా ఎప్పుడైనా, మా పల్లెసీమలందాలివి అని అక్కడకూడా పల్లెసీమలాంటి వాతావరణంఊహించుకుని, దాట్లోఆ వేడుకలు చేసుకోవచ్చు కదా!” అన్నాడు సుబ్బారావు పిల్లల భవిష్యత్తు వూహించుకుంటూ
“అవునండి. గోవిందుడుని పిలిపించి నవారుమంచాలు బిగించాలి. మడతమంచాలు దులిపించాలండి.” 
“బాగా చెప్పావు నాగరత్నంఏ వయస్సులో చేయవలసింది,ఆ వయసులో చేసి మన పెద్దరికం నిలుపుకోవాలి మనం. మనలోనున్న వొంటరితనం, ఈ పల్లెసీమల అమాయకపు పలకరింపులలోపోతోంది. అది మన జీవితంలో రుచి చూసాం కూడా, కొన్నాళ్ళు పట్నవాసం కూడా వెలగపెట్టాం గాబట్టి. ఆ వ్యత్యాసం కొట్టచ్చినట్లుకనబడుతుంది! అదే కరువౌతోంది ఈ రోజులలోనమ్మా వాళ్ళకి అక్కడ. మర్చిపోయాను మన ప్రక్కింటి వాళ్ళ మనుమరాలు బారసాల రేపు. వెళ్ళాలి మనం. మన ఇంట్లో వున్న తివాచీలు కూడ అడిగారు వాళ్ళు పాపం. ఇక్కడ మన ఊళ్ళల్లో ఏవీ అద్దెకి దొరకవు కదా!”అన్నాడుసుబ్బారావు మల్లెపూలు కోసుకోవడానికి బయలుదేరుతూ నాగరత్నంతో.
***


Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

3 Comments

avatar

మీ ప్రయత్నం శ్లాఘనీయం. అమ్మమ్మ పెద్దరికం కధ చాలా బాగుంది.ధన్యవాదాలు లలితగారు.

Reply Delete
avatar

Very good real life story. Congratulations in bringing this one to realise the present grand parents to have a good direction.

Reply Delete
avatar

It's a good story to realise the roll of present day grand parents

Reply Delete


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information