Monday, January 22, 2018

thumbnail

చెంపపెట్టు

                                                  చెంపపెట్టు 
 ఎం.వి.ఎస్.ఎస్.ప్రసాద్
                                                        

పండగ సీజను.ఊరంతా ఉత్సాహంగా, కోలాహలంగా ఉంది. చుట్టూ పక్కల ఇరవై వరకు గ్రామాలకు అదే పెద్ద ఊరు.
నెల మొదటి వారం కావడంతో ఉద్యోగులందరూ జీతాలు తీసుకుంటే,దగ్గరలోనే ఉన్న ఫ్యాక్టరీ లో పని చేసే కార్మికులు జీతాలతో పాటు బోనస్ కూడా తీసుకున్నారు.అందరి దగ్గర చేతిలో డబ్బులు ఆడుతుండడంతో మార్కెట్లు జనంతో కళకళలాడుతున్నాయి.బంగారు వస్తువులు అమ్మే షాపుల దగ్గరి నుంచీ బఠానీలు అమ్మే జంగిడిల వరకూ జనంతో కిటకిటలాడుతున్నాయి.
రఘు లాంటి వ్యాపారస్తులకి నిజంగా పండగలాగే అనిపిస్తోంది.అతని షాపులో  మొబైల్ ఫోన్లు మొదలుకుని  మోనాలిస డూప్లికేట్ పెయింటింగ్ ల వరుకు దొరుకుతాయి.కనుక ఏ రోజు కూడా వందల సంఖ్యలో ఖాతాదారులు అతని షాపులో అడుగు పెట్టడం,ఏదో ఒక వస్తువు కొనే బయటకు వెళ్ళడం జరుగుతోంది.అందులోనూ రఘు రకరకాల స్కీములు పెట్టాడు. మొబైల్ కొంటే సిం కార్డు,కవర్ ,టాక్ టైం ఫ్రీ, ఫ్రిజ్ కొంటే కుక్కర్ ఫ్రీ. అలాగే ఆ షాపులో ఏది కొన్నా రకరకాల గిఫ్టులు ఫ్రీ అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఊరూరా మైకులు ద్వారా జనంని ఆకట్టుకోడానికి ప్రయత్నం జరిగింది. భారీ   ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించాడు రఘు. ఆ ప్రచారంలో భాగంగానే అందమైన అమ్మాయిలు ఉన్న బోర్డులు, ఫ్లెక్సీలు షాపు చట్టు పక్కల ఏర్పాటు చేసాడు.”ఆలసించిన ఆశాభంగం.త్వరపడండి!!” లాంటి స్లోగన్లు  జనం లోకి గుప్పించాడు అతను. రఘు  షాపులో జనం పట్టక  రోడ్డు మీద వేచి ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఆ రోజు ఉదయం నుంచి షాపంతా కలయ తిరిగిన రఘుకి కాళ్ళు నెప్పులు పుట్టాయి.కాసేపు సేద దీరుదామని తన ఏసీ రూములో కూచున్నాడు .
అంతలో ఒక సేల్స్ మాన్ వచ్చి రఘు తో ’ఎవరో ఒకతను వచ్చిఏదో అడుగుతున్నాడని, అతని బాష యాసగా ఉండి అర్థం కావడం లేదని,రఘుకి ఏమైనా అర్థం అవుతుందేమోనని చెప్పడానికి వచ్చానని’ అన్నాడు.రఘు వడివడిగా కౌంటర్ లోకి వెళ్ళాడు.అక్కడ ఒకతను కూచుని ఉన్నాడు.పెద్దగా చదువుకున్నట్టు లేదు. నూనె సంస్కారం లేని జుట్టుతో, ఎప్పుడు ఉతికారో తెలియని బట్టలతో, బాగా మాసిన గెడ్డంతో , నాగరికతకు దూరంగా బతుకుతున్న మనిషిలా ఉన్నాడు.ఏదో మారుమూల గ్రామం నుంచి వచ్చినట్టున్నాడు.లోకం తెలియని అమాయకుడిలా ఉన్నాడు.
రఘు అతని దగ్గరకు వెళ్ళగానే ముక్కు మూసుకోబోయి,ఆ పని సభ్యత కాదనీ,వ్యాపార ధర్మం అంతకన్నా కాదనీ,అతి కష్టం మీద విరమించుకున్నాడు.రఘు ఆ ప్రాంతలో పుట్టి, పెరిగిన వాడు అవడం వలన అతని యాస,బాష బాగా అర్థం చేసుకున్నాడు. అతని మాటలు విన్న రఘుకి తల గిర్రున తిరిగినట్టు అయ్యింది.
‘రఘు షాపులో అన్ని సామానులు చౌకగా దొరుకుతాయని ఎవరో చెప్పారట.అతని భార్య చనిపోయి సంవత్సరం అయ్యిందట. అతను  మళ్ళీ పెళ్ళి చేసుకుందామంటే తమ అమ్మాయిని ఇస్తే అరిష్టం చుట్టుకుంటుందని ఎవ్వరూ  అమ్మాయని ఇవ్వడానికి ముందుకు రావడం లేదట.చిన్న పిల్లలు ఉన్నారట.వాళ్ళని చూసుకోడానికి ఎవరన్నా కావాలిట.బయట బోర్డులలో ఎన్నో రకాల వస్తువలతో బాటు అందమైన అమ్మాయిల ఫోటోలు కూడా ఉన్నాయి కదా!! అందులో ఒకామెను తన భార్యగా కొనుక్కోవాలని అనుకుంటున్నాడట !!??ఆ అమ్మాయిల వివరాలు కావాలిట!!??’
ప్రతి వ్యాపార ప్రకటనకి స్త్రీలని, అదికూడా అవసరం ఉన్నా లేకపోయినా, వీలు అయినంత అసభ్యంగా ఉపయోగించుకుంటున్న రఘుకి, అలాంటి  వ్యాపారస్తులకి,   వచ్చిన అతని మాటలు గూబ గుయ్యి మనిపించేలా ఉన్నాయనిపించింది .రఘు అప్రయత్నంగా చెంప తడుముకుంటూ అయోమయంగా ఆ వచ్చిన వ్యక్తి వేపు చూడసాగాడు .
***
Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

No Comments


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information