ప్రేమతో నీ ఋషి -34 - అచ్చంగా తెలుగు
ప్రేమతో నీ ఋషి – 34
యనమండ్ర శ్రీనివాస్ 

( జరిగిన కధ : కొన్ని శతాబ్దాల క్రితం... ఇంద్రుడి ఆజ్ఞమేరకు ,మేనక తన రూపలావణ్యాలతో విశ్వామిత్రుడిని సమ్మోహనపరచి, అతని తపస్సును భగ్నం చేస్తుంది. కొన్ని దశాబ్దాల క్రితం... మైసూరు మహారాజు సంస్థానంలో గొప్ప భారతీయ చిత్రకారుడిగా పేరుపొందిన ప్రద్యుమ్న ‘ప్రపంచ కొలంబియన్ ప్రదర్శన’ కోసం, రాకుమారి సుచిత్రాదేవినే తన చిత్రానికి నమూనాగా వాడుతూ, మేనక విశ్వామిత్రుడికి తపోభంగం చేసే సన్నివేశాన్ని అత్యద్భుతంగా చిత్రిస్తూ, ఈ క్రమంలో రాకుమారితో ప్రేమలో పడి గుప్తంగా రాజ్యం వదిలి పారిపోతాడు. రాజు పారెయ్యమన్న ఆ చిత్రం అనేకమంది చేతులు మారి, చివరగా  దాన్ని బ్రిటన్ తీసుకువెళ్ళాలన్న కోరికతో కొన్న ఒక విదేశీయుడి  వద్దకు చేరుతుంది. ఆ తర్వాత అది ఏమైందో ఎవరికీ తెలీదు.  
ప్రస్తుతం... ముంబై స్టాక్ ఎక్స్చేంజి లో పనిచేస్తున్న త్రివేది గారు, ఉదయాన్నే ఫాక్ష్ లో వచ్చిన సందేశం చూసి, అవాక్కవుతారు... కారణం తెలియాలంటే, కొంత గతం తెల్సుకోవాలి....  కొన్ని నెలల ముందు మాంచెస్టర్ లో  గొప్ప వ్యాపార దిగ్గజమైన మహేంద్ర, చేపట్టిన ‘ప్రద్యుమ్న ఆర్ట్ గేలరీ’ ప్రాజెక్ట్ కోసం చిత్రాలు సేకరించేందుకు అతని మాంచెస్టర్ ఆఫీస్ లో పనిచేస్తుంటారు స్నిగ్ధ, అప్సర. ఈ క్రమంలో స్నిగ్ధకు స్విస్ బ్యాంకు మాంచెస్టర్ ఆఫీస్ లో సీనియర్ క్లైంట్ బ్యాంకర్ గా పనిచేస్తున్న ఋషి తో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారుతుంది.  ముంబైలో ఉగ్రవాద దాడులు జరిగిన గార్డెన్ హోటల్ లో అసలు విశ్వామిత్ర పెయింటింగ్ చూసిన  స్నిగ్ధ షాక్ కు గురయ్యి, ఋషితో కలిసి మహేంద్రతో తాము కొన్న పెయింటింగ్ నకిలీదని  చెప్తుంది. మూడో కంటికి తెలియకుండా ఈ విషయంలో దోషులు ఎవరో కనుక్కోమంటాడు మహేంద్ర. మృణాల్ నకిలీ గిల్సీ పెయింటింగ్ ను కొన్నాడని తెలుసుకుని, అది నిర్ధారించేందుకు ఆఫీస్ కు వెళ్లిన స్నిగ్ధకు అక్కడ  మృణాల్ శవం కనిపిస్తుంది  స్నిగ్ధ ఆఫీస్ భూగర్భ గదిలో పెయింటింగ్స్ నకళ్ళు తయారుచేసే కర్మాగారం ఉందని తెలుసుకున్న ఋషి, మరిన్ని వివరాల కోసం అప్సరను ఇంటికి వెళ్లి, అక్కడ మృణాల్, అప్సరను ఎవరో కాల్చి చంపడం చూస్తాడు ఋషి. తమ చుట్టూ ఎవరో ఉచ్చు బిగిస్తున్నారని తెలుసుకున్న ఋషి, స్నిగ్ధ  జరిగినవన్నీ శర్మ గారికి చెప్తారు. కాని, ఆయన మాటలు వేరే అర్ధాన్ని ధ్వనింపచేస్తాయి. ఇక చదవండి...)
ఆర్ట్ మ్యుజియం వెనుక ఉన్న అసలు కధ ఏమిటో ఇప్పుడు ఋషికి స్పష్టం కాసాగింది. చివరికి అతను ఉన్న ఆధారాలు అన్నింటినీ కలపగలిగాడు. ఆర్ట్ మ్యుజియం అనేది, ప్రభుత్వం లోని వివిధ మంత్రిత్వ శాఖలకు లంచాలను అందించి, వాటిని విదేశాలలోని స్విస్ అకౌంట్లకు డబ్బును తరలించేందుకు నిర్వాణ ప్లస్, ప్రభుత్వం కలిసి రూపొందించిన ఒక కపటం మాత్రమే !
ప్రద్యుమ్న ఆర్ట్ మ్యుజియం పేరుతో, రాష్ట్ర ఆర్ధిక మంత్రి , పర్యాటక మంత్రితో కలిసి, ఫైల్స్ కదిపి 500 కోట్ల ధనాన్ని గేలరీ కోసం పెయింటింగ్స్ కొనుగోలు చేసేందుకు కేటాయించారు. ఆ ప్రాజెక్ట్ కు ఇన్చార్జిగా మహేంద్ర అధికారికంగా అన్ని అంతర్జాతీయ కొనుగోళ్ళలో, కళాఖండాల వేలంపాటలో పాల్గొంటారు. ప్రభుత్వం ద్వారా మంజూరు చెయ్యబడ్డ డబ్బు, నేరుగా ఆక్షన్ హౌస్ వారికి కట్టబడుతుంది, తద్వారా నిధులు ప్రభుత్వం నుంచి అమ్మేవారికి సవ్యంగా డబ్బు వెళ్తునట్టు అనిపిస్తుంది. మృణాల్, అప్సర, స్నిగ్ధల ద్వారా మ్యుజియం కు సంబంధించిన అధికారిక రికార్డులలో ఆయా కళాఖండాలకు సంబంధించిన ప్రమాణ పత్రాలు తయారుచెయ్యబడతాయి.
కాని, దొడ్డి దారిలో, మృణాల్, అప్సర అసలు చిత్రాల తాలూకు డిజిటల్ కాపీలను సృష్టించి, వాటినే అసలైనవిగా హైదరాబాద్ పంపుతారు. వాళ్ళు కొనుగోలు చేసిన అసలు పెయింటింగ్ ను అంతర్జాతీయ కొనుగోలుదారులకు అమ్మి, మృణాల్, అప్సర ఆ డబ్బును వెనక్కు రాబట్టుకుంటారు. వాళ్ళు అమ్మేది అసలు పెయింటింగ్ కనుక, ఆ కొనుక్కున్న వారినుంచి వీరికి ఎటువంటి సమస్యలూ రావు.
హైదరాబాద్ లో, మొత్తం ప్రాజెక్ట్ మహేంద్ర చెప్పుచేతల్లో, నిర్వహణలో ఉంది, కాబట్టి ఎవ్వరికీ వారు చూస్తున్నది డిజిటల్ చిత్రమనీ, అసలైన కళాఖండం కాదనీ తెలిసే అవకాశమే లేదు. ఆ విధంగా, హైదరాబాద్ లోని ప్రజలకోసం ఒక నకిలీ మ్యుజియం ను సృష్టించి, నడిపిస్తారు.
ఈ ప్రాజెక్ట్ కోసం సేకరించిన నిధులను, వారి వాటా కమిషన్లుగా ఆయా మంత్రుల స్విస్ బ్యాంకు అకౌంట్లకు బదిలీ చెయ్యడం జరుగుతుంది. కాబట్టి, ప్రభుత్వం వైపునుంచి కూడా మహేంద్రకు ఎటువంటి ప్రశ్నలూ రావు. అంతేకాక, మినిస్టర్లు ఆదాయపు పన్ను శాఖలో అతనికి సంబంధించిన కేసులు, ఇతర కేసులు ఎప్పుడు వచ్చినా కూడా, అవి వీగిపోయేలా, తీర్పులు అతనికి అనుకూలంగా వచ్చేలా జాగ్రత్త తీసుకుంటారు. 
“కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే భారత ప్రజలకు, ముఖ్యంగా రాజకీయవేత్తలకు స్విస్ బ్యాంకులలో ఉన్న ఖాతాల విషయంలో నియమాలను కఠినం చేస్తామని తాజా ప్రకటనలు చేసే వరకూ ఈ ప్లాన్ బాగానే పని చేసింది. ఆ ప్రకటనల తర్వాత, మంత్రులు కూడా తమ అంతర్జాతీయ లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండదల్చుకున్నారు. అందుకే మహేంద్ర నన్ను, అప్సరను నీకు దగ్గర కమ్మని, తద్వారా, మీ బాంక్ ప్రైమ్ సూయిస్ లో ఉన్న మా వివిధ ఖాతాల్లోని డబ్బును సరైన విధంగా ఎలా వాడాలో కనుక్కోవాలని, కోరారు.  “
గత కొద్ది రోజులుగా మిష్టర్ శర్మ తో తన అనుబంధమే ఈ మొత్తం సంఘటనల వలయానికి కారణమని ఋషి ఇంకా నమ్మలేకపోతున్నాడు. మిష్టర్ శర్మతో పరిచయం వలన తాను లాభపడ్డానని ఇంతవరకు అతను అనుకున్నాడు. కాని, నిజానికి మిష్టర్ శర్మ తనను నాశనం చేసేందుకు చూస్తున్నాడు.
“అప్సర అందంతో నీపై వల వేసి, మీ బ్యాంకు ఇటువంటి కేంద్ర ప్రభుత్వ అభ్యర్ధనలను ఎలా నిర్వహిస్తుందో తెలుసుకోవాలని మేము అనుకున్నాము. ఒకవేళ మీ బ్యాంకు ఈ కేంద్రప్రభుత్వ అభ్యర్ధనను మన్నించి, ఖాతాల వివరాలను వారికి అందజేసేటట్లయితే ,ఏదైనా జరిగే ముందే నీ ద్వారా ఆ వివరాలను మేము తెలుసుకోవాలని అనుకున్నాము.” చెప్తూ పోయారు శర్మ.
అప్సర తనకు దగ్గరవ్వాలని, సమ్మోహన పరచాలని ఎందుకు ప్రయత్నించిందో ఋషికి ఇప్పుడు నెమ్మదిగా అర్ధమయ్యింది. ఋషి ద్వారా బాంక్ ప్రైమ్ సూయిస్ లోని అంతర్గత విషయాలను తెలుసుకుని,  మహేంద్రకు, శర్మకు అవి చేరవేసేందుకు, ఋషిని వాడుకోవాలని ఆమె ఉద్దేశం. దాని ప్రకారం, వారు మినిస్టర్లకు అందులో ఉన్న నిధులను సంరక్షించి, అవి ప్రజల దృష్టికి రాకుండా మళ్ళిస్తారు. 
“కాని, మృణాల్ అప్సర మా పధకాన్ని పాడు చేసారు. వాళ్లకిచ్చిన ఆజ్ఞలను మీరి, మమ్మల్ని మోసగించాలని చూసారు. విశ్వామిత్ర, మేనక పెయింటింగ్ కు నకలును తయారుచేసి, దాన్ని మాకే అమ్మాలని అనుకున్నారు. వాళ్ళు ఇలా ఎందుకు చేసారో నాకు తెలీదు. వారికి డబ్బే కావాలంటే, మహేంద్రను అడగాల్సింది. అనవసరంగా తమకు తామే ఉచ్చు బిగించుకున్నారు. ఏది ఏమైనా, ఆ పెయింటింగ్ తాలూకు అసలు చిత్రం గార్డెన్ హోటల్ లో ఉంది కనుక, అది వివాదాలకు కారణమయ్యేది, అపవాదులను కొనితెచ్చేది.” ఇది చెప్తూ ఉండగా మిష్టర్ శర్మ అసౌకర్యానికి గురయ్యారు.
“ఈ పనికి వారు విశ్వామిత్ర పెయింటింగ్ నే వాడడం దురదృష్టకరం,” శర్మ ఇంకా చెప్పసాగారు,” అంతర్జాతీయ గౌరవం ఉన్న చిత్రంగా, మూడేళ్ళ క్రితం మహేంద్ర మ్యూజియం కోసం సృష్టింపచేసిన మొట్టమొదటి నకిలీ పెయింటింగ్ అది. ఆ సమయంలో, డిజిటల్ కాపీల గురించి మాకు అవగాహన లేదు. నకిలీ పెయింటింగ్ కోసం మాకున్న ఒకేఒక దారి, ప్రస్తుతం ఉన్న ఆర్టిస్ట్ లతో ఆ పెయింటింగ్స్ ను తక్కువ ధరకు తిరిగి వేయించి, వాటిని అసలు పెయింటింగ్స్ గా చూపడమే! “ మాంచెస్టర్ నేల మాళిగ గదిలో తాళం వేసి ఉన్న విశ్వామిత్ర పెయింటింగ్ గురించే గుర్తుచేసుకుంటూ చెప్పారు శర్మ.
“ఆ పెయింటింగ్ కు కలర్ ఫోటో కాపీ తయారు చెయ్యాలని మేము ఎంతగానో ప్రయత్నించాము. కాని అది వృధా ప్రయాస అయ్యింది. అందుకే హైదరాబాద్ లో ఉన్న లోకల్ ఆర్టిస్ట్ చేత ఆ పెయింటింగ్ ను తిరిగి వేయించాము. కాని, ఆ ఆర్టిస్ట్ వెధవ ఎంత ఉద్వేగభరితమైన మూర్ఖుడంటే, దాన్ని ప్రద్యుమ్న వేసిన చిత్రంగా ప్రపంచానికి చూపినట్లయితే, ఆ విషయాన్ని తాను బట్టబయలు చేస్తానని మమ్మల్ని బెదిరించసాగాడు. అతనికి ఎంత కావాలంటే, అంత డబ్బిస్తామని మేము నమ్మబలికాము. కాని, అతను వినలేదు.”
విశ్వామిత్ర పెయింటింగ్ కు రెండవ నకలును సృష్టించిన ఆర్టిస్ట్ పై తనకున్న కోపాన్నంతా మిష్టర్ శర్మ వెళ్లగక్కుతున్నాడు. ఈ మొత్తం వ్యూహంలో మిష్టర్ శర్మ కూడా మహేంద్రతో భాగస్వామిగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.
“ఈ ఆర్టిస్ట్ లు ఎమోషనల్ ఫూల్స్. వాళ్ళ మూర్ఖపు నమ్మకాల విషయంలో  రాజీ పడడం కంటే చనిపోవడమే నయమని భావిస్తారు.”ఆయన కొనసాగించాడు.
“చివరికి అదే జరిగింది. అతను పోలీస్ కంప్లైంట్ ఇచ్చేందుకు వెళ్ళడంతో నేనతన్ని చంపేందుకు మనుషుల్ని పంపాల్సి వచ్చింది. మరింత అలజడి సృష్టింపబడకుండా ఉండేందుకు, మేము గుట్టు చప్పుడు కాకుండా ఆ చిత్రాన్ని మాంచెస్టర్ కు తరలించాము. అప్సరకు, మృణాల్ కు ఈ సంగతి తెలీదు”, చెప్పడం ముగించారు శర్మ.
మిష్టర్ శర్మ మాట్లాడిన ప్రతి పదాన్ని, మాటను, ఋషి తనలో నిక్షిప్తం చేసుకుంటున్నాడు.
(సశేషం)

No comments:

Post a Comment

Pages