శ్రీధర మాధురి -45 - అచ్చంగా తెలుగు

శ్రీధర మాధురి -45

Share This
శ్రీధర మాధురి -45
(పాశ్చాత్య, భారతీయ సంప్రదాయాలకు మధ్యన నలుగుతూన్న ప్రస్తుత తరానికి పూజ్య గురూజీ అమృత వాక్కులు.)

మరింత మెరుగైన నివాస స్థానాల కోసం ప్రజలు వెతుకుతూ ఉన్నప్పుడు, ప్రకృతిని నాశనం చేసి, తమ భవంతులను నిర్మించుకున్నారు. కొంతకాలానికి దాన్ని నాగరిక సమాజం లేక నాగరికత అన్నారు. అప్పుడు జనించిన అనేక ఆలోచనలు, సిద్ధాంతాల వలన సంస్కృతి పుట్టింది. మనిషి తన అహాన్ని వ్యాపింపచెయ్యడం మొదలు పెట్టాడు. అతనికి నివసించేందుకు మరిన్ని వసతులు, మరింత చోటు కావాల్సి వచ్చింది. తను అత్యంత పరిణితి చెందినా జీవినని, అందరికంటే ఉన్నతుడినని అతడు చెప్పుకున్నాడు. అతడింకా ప్రకృతిని నాశనం చేసి సంస్కృతిని నెలకొల్పడం మొదలుపెట్టాడు. సంస్కృతి, నాగరికత ప్రకృతిని నాశనం చెయ్యడం అన్న ఖరీదైన మూల్యం చెల్లించే ఎదుగుతాయి. ప్రకృతి సహనంగా వేచి చూస్తూ, తనకు మాత్రమే తెలిసిన ఒక  నిర్ణీత సమయం తర్వాత ఈ చెత్తనంతా ఊడ్చి పడేస్తుంది. ఈ చక్రం మళ్ళీ మొదలవుతుంది.

 సంస్కృతీ సంప్రదాయాలు ప్రకృతిని నాశనం చెయ్యడమనే భారీ మూల్యాన్ని చెల్లించి వస్తాయి. ఈ సంస్కృతీ సంప్రదాయాలు ఒక పరిధిని దాటినప్పుడు, ప్రకృతి ప్రకోపించి, దాడి చేసి, అటువంటి అవసరాన్ని మించిన సంస్కృతిని లేక సంప్రదాయాన్ని  మొత్తం నాగరికతను తుడిచి పెట్టేస్తుంది. ప్రకృతి అత్యంత శక్తివంతమైనది. తల్లిగా ప్రకృతి మనకు నేర్పే గుణపాఠాలకు గాను మేము ప్రకృతి మాతకు వంగి ప్రణమిల్లుతున్నాము.

జంతు లక్షణాలను అధిగమించేందుకే సంస్కృతి పుట్టింది. కాని, నేటి సంస్కృతి జంతు లక్షణాలను పెంపొందించడం మనం చూస్తున్నాము. ఇది చాలా బాధాకరం.

ఈ సమాజం క్రమశిక్షణ, పధ్ధతి, నడవడిక, సంస్కృతుల పేరుతో మీకు చేసినదంతా తొలగించేందుకే నా ప్రయత్నం. నేను నా ప్రపంచంలో దైవంతో సంభాషణల్లో ఉన్నప్పుడు, ఆయన నాతో  నేను ప్రస్తుతం ఉన్న విధంగానే, తిరుగుబాటు ధోరణితో  ఉండమని చెప్పారు.

బాహ్య విషయాల్లో పారదర్శకంగా ఉండడం తప్పనిసరి, వ్యక్తిగత విషయాల్లో గోప్యత తప్పనిసరి. కాని చాలా సార్లు బహిరంగంగా వెల్లడించాల్సిన అంశాలు గోప్యంగా ఉంచడం, వ్యక్తిగత విషయాలు బాహాటంగా వెల్లడించడం జరుగుతోంది. నేడు ముఖ్యంగా మీకు సెల్ ఫోన్ ఉన్నప్పుడు, మీరు ఆఫీస్ కు వెళ్ళినా, లేక కుటుంబంతో హాలిడే కు వెళ్ళినా, జి.పి.ఎస్. మిమ్మల్ని ఖచ్చితంగా పట్టుకుంటుంది. అంతేకాక నేడు సంస్కృతే మారిపోయింది. తీరిక సమయాల్లో మనం ఏం చేసామన్నదే కాక, ఇతర అంశాలను కూడా సామాజిక మాధ్యమాల ద్వారా మనం బహిరంగంగా వెల్లడిస్తూ ఉంటాము. మన వ్యక్తిగత జీవితం గురించి మనం ఎక్కువ వెల్లడించడం అన్నది, మున్ముందు మనకే హాని చెయ్యగలదు. బహుశా, నా ఆలోచనా విధానం పాతబడి పోయిందేమో !

ఇండియాలో పిల్లలు ఇప్పటికీ స్కూల్ కు లేక కాలేజికి కుంకుమ లేక విభూతి ధరించి వెళ్తారు. అబ్బాయిలు కూడా పెట్టుకుంటారు. హిందూ మతంలో దీనికొక విశిష్టత ఉంది. కాని, ప్రస్తుతం ఇది ఇండియాలో కూడా యాంత్రికంగా తయారయ్యింది. ఇక్కడ కనీసం క్లాస్సుకు 10 మంది పిల్లలన్నా ఇప్పటికీ పెట్టుకుంటారు. ఒకవేళ మీరు యు.ఎస్.ఏ. లో ఉంటే, పిల్లలు బయటకు వెళ్ళేటప్పుడు పెట్టుకోవడాన్ని ఇబ్బందిగా భావిస్తారు. మిగతా పిల్లలు అమెరికా సంస్కృతి నుంచి కనుక, వాళ్ళు పెట్టుకోరు కనుక పిల్లలు దీన్ని అసాధారణంగా భావిస్తారు. వీరిని మిగతా పిల్లలు వెలి వేస్తారని వారు భయపడతారు. అమెరికా మట్టి మీద మీ పిల్లలు భారతీయ సంస్కృతిని పాటించాలని మీరెందుకు కోరుకుంటున్నారు? మీరు అమెరికాకు యేవో కారణాల వల్ల వెళ్ళారు. అది డబ్బు కోసం, మంచి ఉద్యోగం కోసం, దేనికోసమైనా కావచ్చు. మీరు ముందే భారత్ ను వదిలేసారు. మీ పిల్లల్లో భారతీయ రక్తమే ఉన్నా, వారు అక్కడే పుట్టారు కనుక అమెరికా పౌరులే. మన స్వలాభం కోసం అమెరికాలో కూర్చోవడం దురాశ కాదా? అక్కడే పిల్లల్ని కానీ, అమెరికా వాతావరణంలో పెంచుతూ వారిని మన సంస్కృతీ సంప్రదాయాలు పాటించమనడం, అదీ వారు స్కూల్ కు లేక కాలేజీకి వెళ్తున్నప్పుడు అలా ఉండమనడం పూర్తిగా విభిన్నమైనది. మీరిలా వారిని ఒత్తిడి చేసినప్పుడు, అది వారి ఇష్టానికి విరుద్ధంగా ఉంటుంది కనుక, పిల్లల్ని మీకు మీరే దూరం చేసుకుంటారు, ఇది కూడా ఒకరకమైన నియంత్రణే ! దీన్ని నిరోధించే ప్రయత్నం చెయ్యండి. భారతీయ రక్తం, విదేశీ మట్టి, వారు తల్లిదండ్రుల మిధ్యా సాంస్కృతిక విధానాలకి, అక్కడి వాస్తవ ప్రపంచానికి మధ్యన చిక్కుకుపోతారు. పిల్లల కళ్ళతో ప్రపంచాన్ని చూడడం పెద్దలు అలవర్చుకోవాలి. అప్పుడే మీరు వారి సమస్యల్ని అర్ధం చేసుకోగలుగుతారు. మీ దేవుళ్ళు చాలా పరిణితి కలవారు, ఇటువంటి చవకబారు అంశాల కోసం మీ పిల్లల్ని వారు శిక్షించరు. ఒకవేళ నేనే దైవాన్నైతే, ముందుగా పిల్లల పట్ల పెద్దలకున్న తప్పుడు భావనలను సరిదిద్దుతాను.

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చాలా అందమైన దేశం. విదేశాలకు వలసలు వెళ్లేవారి స్వప్నసీమ. ఇక్కడ సంస్కృతి ఘనమైనది, వైవిధ్యమైనది. అన్ని సంస్కృతుల ప్రజలు అమెరికాలో మిళితమై ఉన్నారు. ఈ దేశం క్రమబద్ధమైనది, క్రమశిక్షణ కలిగినది. ఒకసారి మీ పిల్లలు అమెరికాకు వెళ్తే, వారు వారి స్వంత వ్యక్తిత్వంతో ఉమ్మడి సమాజంలో ఎలా బ్రతకాలో నేర్చుకుంటారు. వివిధ సంస్కృతులకు లోను కావడం వలన విశాల దృక్పధాన్ని కలిగి ఉంటారు. వారిక ఎంతమాత్రం బావిలో కప్పలు కాదు. తగిన పద్ధతిలో తమ వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచుకోవడం నేర్చుకుంటారు. వారు పనిలో విలువలను పాటించడం బాగా నేర్చుకుని, ఉద్యోగాల విషయంలో వృత్తిపరంగా ఉంటారు. నచ్చినది ఎంచుకుని, దాన్ని సాధించేందుకు అంకితభావంతో పనిచేసేలా ఆ సమాజం ఉంటుంది. 
భారతీయులుగా మనం తలరాతను, విధిని నమ్ముతాము. మనకు ఏదీ ఎంచుకునే అవకాశం లేదని నమ్మి, జీవితం ఎలా ఉంటే అలాగే దాన్ని ఆమోదిస్తాము. మన సంస్కృతి కూడా విభిన్న పార్శ్వాలు కలిగినది, ప్రపంచం మొత్తంలోనూ ప్రాచీనమైనదన్న ఘనత కలిగినది. మనకు అనేక భాషలున్నా కూడా, విభిన్న సంస్కృతుల మధ్యన బలమైన అనుబంధం ఉంది, ఇదే మనందరినీ కలుపుతుంది. ఉమ్మడి కుటుంబాల పద్ధతికి మనం బాగా అలవాటుపడి ఉన్నాము. ప్రతి వ్యక్తి తన కుటుంబంతో బాగా అనుబంధాన్ని కలిగి ఉంటాడు. ఒక్కొక్కరి వ్యక్తిత్వానికి విడిగా ప్రాధాన్యతను ఇవ్వడం జరుగదు. కుటుంబ సభ్యుల్లో ఎవరికి ఏం జరిగినా మిగతావారికి తెలుస్తుంది.

కాబట్టి ఒక్కసారి మీ పిల్లలు భారత తీరం దాటి అమెరికాకు చదువుకు లేక పనికి వెళ్తే, అక్కడి సమాజానికి వారు అలవాటు పడేందుకు  కాస్త సమయం పడుతుందని మీరు అర్ధం చేసుకోవాలి.  అక్కడి పధ్ధతి పిల్లలకు అర్ధమయ్యాకా, వారు తమ జీవిక, ఎదుగుదలకు అనుగుణంగా తమను తాము మలచుకుంటారు. నెమ్మదిగా, పిల్లలు వ్యక్తిగత నిర్ణయాలు తీసుకుంటూ, ‘దేనికైనా ఇతరులపై ఆధారపడడం ‘అనే వారి మూలాల నుంచి నేర్చుకున్న ఆలోచనా విధానాన్ని మర్చిపోతారు. పిల్లలు తమకేమీ చెప్పటం లేదని, తల్లిదండ్రులు పాత పాటనే పాడుతూ ఉండే వీలు లేదు. పిల్లలు మీతో అన్నీ చెప్పకపోయినా, వారు మిమ్మల్ని మరింత గాఢంగా ప్రేమిస్తారన్నది సత్యం. తల్లిదండ్రులు ఈ మార్పును అంగీకరించి, విదేశాలలోని స్థితిగతులకు అనుగుణంగా  తమ పిల్లలు ధృడమైన వ్యక్తిగత జీవనం గడిపే దిశగా వారిని ప్రోత్సహించాలి. భారత్ లో కూడా, తల్లిదండ్రులు తమ పిల్లల ఆలోచనలకూ కొంత చోటిచ్చి, వారు బాధ్యత కల మంచి పౌరులుగా ఎదిగేందుకు తోడ్పడాలి. ఇప్పుడు ఇక్కడ పిల్లలు కూడా చాలా స్వతంత్రంగా తయారౌతున్నారు. ఈ మార్పును తల్లిదండ్రులు హుందాగా స్వాగతించి, వాస్తవాన్ని అంగీకరించి, పిల్లలు మెరుగ్గా ఎదిగేందుకు తోడ్పడాలి.

ఒక అనుబంధాన్ని నిలబెట్టుకోవడం కోసం పాటుపడుతూ, పట్టుకు వేళ్ళాడుతూ ఉండకండి. అది సరిగ్గా లేకపోతే, దాన్ని వదిలేసే ధైర్యం చెయ్యండి. వారిని వదిలేసి మీ మార్గంలో సాగిపొండి.
‘నచ్చని వారినల్లా వదిలేస్తూ పొతే ముందు తరాలకు ఏమి సంస్కృతిని అందిస్తాము?’ అని రాజీ పడుతూ కూర్చోకండి. ఇదే సంస్కృతీ సంప్రదాయాల పేరుతో జరుగుతున్నా ఛాందస వాదానికి, విపరీతమైన సిద్ధాంతాలకు మూలం. ముందుగా మీరు మన సంస్కృతీ సంప్రదాయాల గురించి తెలుసుకోవాలి. ఎవరో చేసినట్లు మనమూ చేస్తూ పోవడాన్నే సంస్కృతి అనరు. ఇది విభిన్నమైనది. నిజం చెప్ప్పలంటే సంస్కృతి కాలంతో పాటు మారుతూ ఉంటుంది, స్థిరంగా ఉండదు. ‘శాస్త్రాయచ సుఖాయచ’ అని వేదాల్లో చెప్పబడింది. అంటే శాస్త్రాలు, సంస్కృతీ మానవాళి సుఖం కోసం ఏర్పాటు చెయ్యబడ్డాయి. పరిస్థితులకు అనుగుణంగా పరిణితి చెందుతూ ఉంటాయి. పరిస్థితులను బట్టే పాండవులు ఐదుగురూ ద్రౌపదిని పెళ్లి చేసుకున్నారు. పరిస్థితులకు అనుగుణంగానే వేదవ్యాసుడు విధవలైన అంబిక, అంబాలికలకు ధృతరాష్ట్రుడు, పాండు రాజు అనే కుమారులను ప్రసాదించారు. హిడింబితో భీముడి పెళ్లి కూడా పరిస్థితులను బట్టే జరిగింది. పరిస్థితుల వల్లనే ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు వంటి బ్రాహ్మణులు క్షత్రియ ధర్మాన్ని పాటిస్తూ మహాభారత యుద్ధం చేసారు. ఇలా సాధారణ పరిస్థితులను బట్టి శాస్త్రాలను మార్చాల్సిన కొన్ని కోట్ల సందర్భాలున్నాయి.
మిధ్యా సంబంధాలలో జీవించేకంటే, ఒకరి భావనల పట్ల వాస్తవికంగా ఉంటూ, వాటిని గౌరవించి బయటపడడం మంచిది. ఇది ప్రస్తుత కాలంలో ఉన్న కలియుగ ధర్మాన్ని బట్టి న్యాయమైనదే. 


***



No comments:

Post a Comment

Pages