స్మైలీ ప్రేమతో మారాను - అచ్చంగా తెలుగు

స్మైలీ ప్రేమతో మారాను

Share This
స్మైలీ ప్రేమతో మారాను
దొండపాటి కృష్ణ 

“ఏంటండి... నెల రోజులు కూడా నిండలేదనుకుంట... ఇంత చిన్న పిల్ల ఉండగలదా.. పాపం ఉసురు తగులుతుందేమోనండి..” అమాయకంగా అంది శ్రీమతి రంజని. 
“ఏం ఫర్లేదులే.. రామారావు గారిని కనుక్కున్నాకే కొన్నాను” ఆమె ఒడిలోకి అందిస్తూ అన్నాన్నేను. 
“ఎంత ముద్దోస్తుందో... బెంగ పెట్టుకుంటుందేమో..?” అనుమానం తీరక మళ్ళీ అడిగింది. 
“కుక్కపిల్లలు నెల రోజులు నిండకుండా ఉన్నప్పుడు తెచ్చుకుంటేనే అవి మాలిమి అవుతాయంట. నెల రోజులు దాటిపోతే ఊహ తెలిసి మనతో పాటు ఉండవని, ఎవరో దాన్ని ఎత్తుకోచ్చేసారని దిగులుగా ఉంటాయని కాబట్టి చిన్నప్పుడే తెచ్చేసుకోమని ఆయనే దగ్గరుండి కొనిపించారు... వాళ్ళ కన్నా మనకు తెలుస్తుందా చెప్పండి భార్యామణి గారు” అంటూ ఆమె చక్కిళ్ళను పట్టుకున్నాను. సిగ్గుపడిపోతూ, మూతి తిప్పుకుంటూ, ఒడిలో బిడ్డను ఎత్తుకున్న తల్లిలా ఆ చిన్న కుక్క పిల్లను లోపలికి తీసుకెళ్ళింది.

రామారావు గారు చెప్పినట్లే నెలరోజులైనా నిండకపోవడం, అప్పట్నుంచే బాధ్యతగా చూసుకోవడంతో శ్రీమతికి బాగా మాలిమి అయిపొయింది. మా దాంపత్య బంధంతో పాటుగా అది కూడా మాతో చక్కగా కలిసిపోయింది. అది చూసి మురిసిపోయిన ఆమె దానికి “స్మైలీ” అని పేరు పెట్టింది. ఉదయం లేవగానే వాకింగ్ లాంటి వగైరా వగైరాలకు తీసుకెళ్ళి, తిప్పుకుంటూ వచ్చే నాకన్నా టైం ప్రకారం వండిపెట్టే మా ఆవిడంటేనే దానికెక్కువ మక్కువ. ఏం చేస్తాం ..! ఇంటి యజమాని అయినా...కాపలా కుక్కలయినా ఆ ఇంటి ఇల్లాలి చూపులకి లొంగేలా చేసాడు దేవుడు...
* * *
రెండు సంవత్సరాలు గడిచేసరికి పెరిగిన స్మైలీతోపాటు, మాకు అత్యంత సంతోషాన్నిచ్చే కూతురు రమణి కూడా తోడవ్వడంతో చాలా ఆనందంగా రోజులు గడిచాయి.. మొదట్లో పట్టించుకోలేదు కాని శ్రీమతి చెప్పగా చెప్పగా గమనిస్తే అర్ధమైంది. స్మైలీ మామీద అలిగింది. ఉద్యోగం నుండి రాగానే ఆమె పాపను దగ్గరకు తీసుకున్నట్లే బయటనుండి తిరిగొచ్చిన నేను పాపతో ఆడుకోవడం దినచర్యగా మారడం స్మైలీకి నచ్చలేదు.
పాప మా జీవితంలోకి రాకముందు, ఇంటికి రాగానే కాసేపు స్మైలీతో ఆడుకునే మేము పాపతో ఆడుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయేది... మామీద అలిగి మంచం కిందకి వెళ్ళిపోయేది.. రమ్మన్నా వచ్చేది కాదు, బ్రతిమాలినా తినేది కాదు.. పాపకు ప్రయారిటీ ఇవ్వడం మానేసి స్మైలీకి ప్రయారిటీ ఇవ్వాల్సి వచ్చేది. దాన్ని వదులుకోలేక, రాగానే కాసేపు స్మైలీతో ఆడుకున్నాకే పాప దగ్గరకు వెళ్ళడంతో స్మైలీ చక్కగా ఆడుకునేది, పాపనూ ఆడించేది..

* *  *
రోజు రోజుకు స్మైలీకి మామీద ప్రేమ పెరిగిపోయింది.. ఒక రోజు నా స్నేహితుడొకడు స్వగ్రామం నుండి నన్ను కలవడానికోచ్చినప్పుడు అతనికి మర్యాదలు చేయాలని శ్రీమతిని పిలిచాను. ఎక్కడుందో మరి వినిపించలేదనుకుంటా, తను పలకలేదు. రెండు సార్లు పిలిచినా పలకకపోవడంతో వాడిముందు గర్వాన్ని ప్రదర్శించాలని, నా భార్య నేను చెప్పినట్లే నడుచుకుంటుందని వాడికి చెప్పాలని తలచి ఈసారి గట్టిగా 
“రంజనీ.. రంజనీ.. ఎక్కడున్నావ్.? పిలుస్తుంటే వినపడ్డం లేదా..? రెండు కాఫీలు తెమ్మంటే మాట్లాడవేంటి.? వస్తున్నావా... లేదా...” అని అరిచాను. 
ఇకంతే – వాతావరణం నా ఆధీనం తప్పింది. పాప పక్కనే ఉన్న స్మైలీ ఒక్కసారిగా సీరియస్ అయ్యి నా మీదకోచ్చేసింది.

రెండు మూడు సార్లు శ్రీమతిని పిలిచినప్పుడు గమనించిన స్మైలీ, మెల్లిగా కోపాన్ని పెంచుకొని గట్టిగా అరవగానే మీదకోచ్చేసింది. గట్టిగా నా లుంగీని పట్టుకుని, మీదకు కాళ్ళు రెండూ పైకెత్తింది. 
“ఎంత ధైర్యం ఉంటె అమ్మ మీద అరుస్తావ్.. రా... భౌ..భౌ..” అంటున్న తీరులో కళ్ళను విప్పారించి కోపంగా, భయంకరంగా చూసింది. 
భార్యామణి గారు ఆర్డరివ్వడమే కరవడానికి తరువాయి. మా ఆవిడకు కాదుకాని ఆ సమయంలో స్మైలీకి బాగా భయపడ్డాను. ఆమె వచ్చి పిలవడంతో అది ఆగిపోయింది. నామీద నుంచి దిగిపోయింది. ఊపిరి పీల్చుకున్నాం. లేకపోతె హాస్పిటల్లో బెడ్ ఖాయం. స్మైలీ ప్రేమ గురించి చెప్పినప్పుడు నమ్మనివాడు ప్రత్యక్షంగా చూసి నిశ్చేష్టుడైపోయాడు. నేను తెచ్చిన సొమ్మును తింటూ నాకు కొమ్ము కాయాల్సింది పోయి టైంకు వండి పెడుతున్న ఆమె మీద ఎంత ప్రేమను కురిపిస్తుందో విడ్డూరం కాకపొతే ఏంటి మరి.! మామీద అనడం కన్నా వాళ్ళ మీదనే దానికెక్కువ ప్రేమ అనడం కరేక్టేమో..!!

* * *
పాప పెరిగి పెద్దదై స్కూల్కు కూడా వెళ్తుంది. అక్కడ పాఠాలు బాగా చెప్తున్నారనుకుంటా.. పాపకు జ్ఞానం పెరిగింది.. కొత్త కొత్త ప్రశ్నలు వేసేది.. పిల్లలేప్పుడైతే ఒకదానికి మరోదానికి సంబంధం లేకుండా తల్లీదండ్రులను ప్రశ్నిస్తూనే ఉంటారో అప్పుడే వాళ్ళు ఎదుగుతున్నారని అర్ధం చేసుకోవాలి. వాళ్ళనలా స్వేచ్చగా ఎదగనివ్వాలి. ఆచారాలు, పద్దతులంటూ కట్టడి చేస్తే మొదటికే ప్రమాదం. నేర్చుకునేదాన్నే సన్మార్గంలో నేర్పించాలి, నడిపించాలి. అదెక్కువుగా తండ్రి చేతిలోనే ఉంటుంది. భార్యగా, తల్లిగా స్త్రీ చేయాల్సింది చేస్తూనే ఉంటుంది. తండ్రిగా, భర్తగా చేయాల్సి వచ్చినప్పుడే పురుషుడు పట్టించుకోవడం మానేస్తాడు. పేగును పంచి తల్లి జన్మనిస్తే, వేలుపట్టి తండ్రి నడిపించాలి. కారణాలు చెప్పడం ఎప్పుడైతే మొదలెడతామో మనస్పర్ధలు కూడా అప్పుడే మొదలవుతాయి.
మా దాంపత్య బంధం, మనస్పర్ధల రంగు పులుముకోవడానికి నా బిజినెస్ కారణంగా నిలిచింది. చిన్న చిన్న గొడవలను పాపతోపాటు స్మైలీ కూడా గమనించేది.. పాపలోకన్నా స్మైలీలో నిట్టూర్పులేక్కువ కన్పించేవి.. సహజంగా కుక్కలు ఏడు సంవత్సరాలు బ్రతికితే ఖచ్చితంగా ఇంకో ఏడు సంవత్సరాలు బ్రతికేస్తాయంట. ఏదన్నా ప్రమాదం జరిగితే తప్ప మరణించవంట. స్మైలీకి పదేళ్ళు నిండాయి. పాపతోపాటు బాబుకూడా మా జీవితాల్లోకి వచ్చేసరికి శ్రీమతికి శ్రమ పెరిగింది. నా అసలైన తోడు ఆమెకప్పుడే అవసరం. కాని నేను అందుబాటులో ఉండేవాడిని కాదు.
బిజినెస్ అంటూ సమయం, సందర్భం లేకుండా రావడం, పోవడం జరిగేది.. శ్రీమతి బాగా ఇబ్బంది పడుతుందని అర్ధమౌతున్నా సంపాదన యావలో వాటిని పక్కన పెట్టేశాను. చాలాసార్లు పిల్లలు కూడా అడిగారు.
“నాన్నా... ఎప్పుడూ నువ్వు సరిగ్గా ఇంటి దగ్గర ఉండవెందుకు..? తాతయ్య బామ్మవాళ్ళు వచ్చినా ఉండవు. పండగలకూ ఉండవు. మాతో బయటకు రావు. అందరి డాడీలు వాళ్ళతో చక్కగా వస్తారు” అని. 
“ఇప్పుడర్ధం కాదమ్మా.! మీరు పెద్దయ్యే కొద్దీ ఖర్చులు పెరుగుతాయి. ఇల్లు కొన్న అప్పు తీర్చడమే ఇంకా మిగులుంది. మీ చదువుల ఖర్చులు, బట్టల ఖర్చులు బోల్డంత. చదువులు పూర్తయ్యాక మిమ్మల్నో దారి చెయ్యాలంటే, ఇప్పుడు రాత్రీ పగలు పట్టించుకోకుండా కష్టపడితేనే సాధ్యo. రియల్ ఎస్టేట్లో కస్టమర్లకు హాలిడేలుంటే మాకవి బిజినెస్ డేలు. పని దొరికినప్పుడు చేసుకుంటూ వెళ్ళిపోవాలమ్మా..! ఒకరితో మనకు పోలికలేందుకు చెప్పు.. మన జీవితం మన చేతుల్లోనే ఉండాలి” అని చెప్పాలనిపించేది. వాళ్ళర్ధం చేసుకోలేరు. అందుకని వాళ్ళు అడిగినప్పుడు తల నిమిరి, లోపలే బాధపడి బయటపడేవాడిని..!

పరిగెత్తుతూ పాలు త్రాగవద్దని, నిలబడే నీళ్ళు త్రాగుదామనేది భార్యామణి. వాళ్ళతో కాస్త సమయం గడపమనేది. ఎదిగే పిల్లలు ఉన్నప్పుడు పక్కదారి పట్టకుండా ప్రేమను పంచమనేది. చాలామంది పురుషులకు నాలాగానే అది వల్ల కాదు. అందుకే చీటికీ మాటికీ గొడవలు. ఆఫీసుల నుండి త్వరగా బయటకు రాకపోవడాలు జరుగుతుంటాయి. మనస్సులో ఉంటుంది కాని చేయలేరు. ఏదో వాళ్ళను వెనక్కి లాగేస్తాది.
* * *
టార్గెట్ ల ప్రకారం సేల్స్ చేసిన వాళ్లకు అవార్డులిచ్చే పెద్ద కార్యక్రమాన్ని ప్రతి మూడు నెలలకొకసారి కంపెనీ పెడుతుంది. ఉత్సాహం మరియు ఉత్ప్రేరకం కోసం సినిమా హీరోయిన్ చేతుల మీదుగా అవార్డులను ఇస్తుంటారు. అలా ఒకరోజు ఫంక్షన్ పూర్తి చేసుకుని రాత్రీ తొమ్మిది గంటల సమయం దాటాక ఇంటికోస్తున్నాను.
భావవ్యక్తీకరణ కోసం మనుషులకో భాష ఉంటుంది. మనుషులు మాట్లాడుకుంటారు. అప్పుడప్పుడు మనుషులు చెప్పేది జీవులకూ అర్ధమవుతూ ఉంటుంది. మనం చెప్పేది కుక్కలూ అర్ధం చేసుకుంటాయి. కాని కుక్కలకు కూడా ఓ భాష ఉంటుందని మొదటిసారి తెలిసింది. ఇంతకుముందు పట్టించుకోలేదు కాని అదే నేను మారడానికి కారణమైంది.
ఫంక్షన్ను ముగించుకొని వస్తుండగా మా వీధికి రెండు మూడు వీధుల ముందు కుక్కలన్నీ అరవడం ప్రారంభించాయి. భయం పట్టుకున్నా, ధైర్యంగా బండి నడిపాను. ఒకటి అరవడంతో మరొకటి అందుకోవడం, అలా వీధి మొత్తం నుండి వీధుల వరకు పాకింది. కాని అవి నన్నేమీ చేయలేదు. నాకు అంతుబట్టలేదు.
ఇంటికెళ్ళి గేటు తెరవగానే గుమ్మం దగ్గర భార్యతో పాటు స్మైలీ కూడా ఉంది. అదీ మొరుగుతుంది. కాని ఆ మొరగడంలో ఏదో తేడా ఉంది. అపరిచితులు వచ్చినప్పుడు మొరిగిన దానికి, పరిచయస్తులు వచ్చినప్పుడు మొరిగిన దానికి తేడా స్పష్టంగా తెలిసిందప్పుడే. వీధిలో కుక్కలు అపరిచితుడినని మొరగడంతో, ఇక్కడ స్మైలీ విభిన్నంగా మొరగడంతో దాని అంతరంగం అర్ధం చేసుకున్న వీధి కుక్కలు నన్నేమీ చేయలేదు. 
“వీడు మావాడే..! వాడిని వదిలేయండి..! వీడు మారడులే..! ఎప్పుడూ ఇంతే..! టైం పట్టింపులు లేకుండా తిరుగుతుంటాడు. ఈసారికిలా వదిలేయండి బాబు. డిస్టర్బ్ చేసినందుకు నన్ను క్షమించండి. నేను నచ్చజేప్పుకుంటాను. నా మొహం చూసి వదిలేయండి” అన్నంత అర్ధం ఆ అరుపులో  ఉండడంతో అవి వదిలేశాయి.

లోపలికెళ్ళి బండిని పార్కింగ్ చేసి వచ్చాను. 
“నీళ్ళు పెడుతున్నాను. స్నానం చేసి రండి” అంటూ శ్రీమతి లోపలికెళ్ళింది. 
“ఊ ... ఇక చాలు .. చాలు ..” అంటూ స్మైలీ వైపు వెళ్లాను. అదో చూపు చూసింది. మొరగడం ఆపలేదు. దగ్గరకు రాలేదు. మొహం మారింది. అంతే గమ్మత్తు జరిగింది. మా ఆవిడమీద, పిల్లమీద దానికెంత ప్రేముందో అర్ధమైంది.

“ఇప్పటికైనా మారరా బాబు. ఎన్నాళ్ళని వాళ్ళు ఒంటరిగా బ్రతుకుతారు. ఎంతని కాపలా కాయను. రాత్రి పూటైనా ఇంటిపట్టున ఉండొచ్చు కదా! మాటి మాటికి గొడవ చేసి అమ్మను ఇబ్బంది పెడతావ్.! మనిషి మాటే వినవు. ఇంకా నా మాటేం వింటావ్. నిన్ను చేసుకున్న పాపానికి కాస్తంత ప్రేమను కూడా పొందలేకపోతుంది. నన్ను తెచ్చావన్న కృతజ్ఞత ఆపేస్తుంది కాని లేకపోతేనా ..! ఇద్దరూ ఉద్యోగాలంటూ తిరుగుతుంటే పిల్లలేమైపోతారురా..! మేమే నయం. ఉన్నన్నాళ్ళూ హాయిగా కలిసి బ్రతుకుతాం.. చూసుకోరా నాయనా.. పిలుస్తుందిగా వెళ్ళు ... వెనక్కి తిరిగి చూసింది చాలుకాని లోపలి పో.. మళ్ళీ ఎవ్వరిటు రాకుండా చూసుకోవాలి. ఈ రాత్రికిక నాకు నిద్ర లేదులే. కొన్ని జీవితాలింతే.. వెళ్ళు వెళ్ళు” అన్నట్లున్నాయి స్మైలీ ముఖకవళికలు. 
వెనక్కి తిరిగి స్మైలీని చూసుకుంటూ లోపలికేళ్తున్నా, అది మొరగడం ఆపలేదు. పక్కనోళ్ళు తిడతారనే భయం అప్పుడు కలగలేదు.

* * *
నేను మారడానికి కల కారణాన్ని ఆప్తమిత్రుడొకడు అడగడంతో ఇలా గతమంతా కళ్ళముందు కదిలినట్లయింది. వాడికి చెప్తే నవ్వి ఊరుకున్నాడు. కుక్కలు మనుషులకు సాయం చేయడానికే ఉన్నాయి కాని వాటిని బట్టి మనం మారడానికి కాదని అన్నాడు. నన్ను పిచ్చివాడినన్నాడు. అవును, నేను పిచ్చివాడినే. సాయం తీసుకోవడమే తెలిసిన మనిషి, సాయం చేయడం కూడా చేస్తుంటే ఈ రోజుల్లో పిచ్చి వాళ్ళనే అంటున్నారు మరి.
మాకీ కుక్కల గోలేంటని అన్పించొచ్చు కాని ప్రపంచంలో ప్రతీదీ స్పందిమ్పజేస్తుంది. ఒక్కొక్కరు ఒక్కోదానికి బానిసవుతారు. బయటకు చెప్పరంతే. స్మైలీ నోరు తెరిచి చెప్పలేకపోయినా ఆ క్షణంలో నాకెందుకో అది చెప్పినట్లే తోచింది. మనస్సంతా ఏదోలా అయిపొయింది. మోస్ట్ డేంజరస్ భార్య చెప్పినా తాకనిది, స్మైలీ ద్వారా తాకింది. గతమంతా గడిచిన చీకట్లో కలిసిపోయింది. తెల్లారినుంచి రోజులు మరింత మధురంగా మారాయి. మా ఆవిడమీద స్మైలీ కున్న ప్రేమతో మారాను. అప్పట్నుంచి అది నన్ను మరింతగా ప్రేమిస్తుంది.
***

No comments:

Post a Comment

Pages