సుబ్బుమామయ్య కబుర్లు! - అచ్చంగా తెలుగు
 సుబ్బుమామయ్య కబుర్లు!


సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినుర వేమ! అంటూ పిల్లల కోసమే చెప్పాడర్రా మన వేమన!
అంటే ఏంటి? మనం సాధన చెయ్యగా, చెయ్యగా మనకు ఆ చేసే దానిలో పరిణతి వస్తుందర్రా. అంటే మనం దాంట్లో మాస్టర్ అయిపోతామన్నమాట!
మనం ప్రతిరోజూ ఎన్నో పనులు చేస్తాం. కొన్ని అవసరం కోసం. మరికొన్ని ఆసక్తితో! 
ఒక్కోసారి మనం కేరంబోర్డ్, చెస్సూ, క్రికెట్, వాలీబాల్ లాంటి ఆటలాడతాం. మరోసారి పేయింటింగ్ చేస్తాం. ఫ్లూట్, వయోలీన్ వాయిస్తాం. ఇవన్నీ అలా అలా చేసి వదిలేస్తాం. దానివల్ల ఏమీ లాభం ఉండదు. మన సమయం వృధా అవడం తప్ప.
అన్ని అంశాలూ కాకుండా, మీకు బాగా ఆసక్తి ఉన్న అంశం తీసుకుని అందులోనే బాగా సాధన చేయండి. ఉదహరణకు:
పేయింటింగ్ మీకు ఇష్టమనుకోండి!
1. చదువుకే ముందు ప్రాధాణ్యత ఇవ్వాలి. మిగిలిన సమయాన్ని మాత్రమే పేయింటింగ్ కి కేటాయించాలి. ఇది చాలా ముఖ్యం.
2. పేయింటింగ్ కు సంబంధించిన వివరాలు సేకరించాలి.
3. పేపర్లు, రంగులు, బ్రష్షుల గురించిన విషయాలు క్షుణ్నంగా తెలుసుకోవాలి. కనబడిన ప్రతి బొమ్మనీ బాగా పరిశీలించాలి.
4. చేయితిరిగే (అంటే ఏంటో అమ్మనడగండి) దాకా బొమ్మలు గీయండి. రంగులేయండి.
5. ఊహించిన బొమ్మల్ని కాగితం మీద గీయడం అభ్యసించండి.
6. స్థానిక సంస్థలు, స్కూళ్లు, పేపర్లు పెట్టే చిత్రలేఖన పోటీల్లో విరివిగా పాల్గొనండి.
7. బహుమతులు రాకపోయినా బాధపడొద్దు. అమ్మానాన్నలతో ఆర్ట్ ఎగ్జిబిషన్లకు వెళ్లండి. అక్కడ ప్రదర్శించిన పెయింటింగ్ లను శ్రద్ధగా పరిశీలించి మీ పునాది గట్టి పరచుకోండి. 
8. ఇలా మీరు సాధన చెయ్యగా, చెయ్యగా చిత్రకారులుగా నిష్ణాతులై (అంటే ఏంటో అమ్మనడగండి) పోతారు. 
9. రవివర్మ, బాపూ, ఎమ్ ఎఫ్ హుస్సేన్ లాంటి వాళ్లు గొప్ప చిత్రకారులయింది సాధన తోటే!
మీరు కూడా ఏదో ఒక అంశంలో తగిన సాధన చేసి మంచి పేరు తెచ్చుకుంటారని నా కోరికర్రా! ఉంటాను మరి.

మీ మామయ్య
ప్రతాప వెంకట సుబ్బారాయుడు

No comments:

Post a Comment

Pages