శ్రీధరమాధురి – 42
(గతాన్ని తల్చుకుని బాధపడడం గురించి పూజ్య గురుదేవుల అమృత వాక్కులు)


గతం ద్వారా పొందిన అనుభవాల నుంచి మనం పాఠాలు నేర్చుకుని ఉంటే, ప్రస్తుతాన్ని మరింత మెరుగ్గా గడిపేందుకు తగిన పరిణితి వస్తుంది.

గతాన్ని తలచుకుని ఏడుస్తూ ఉండేవారు ప్రస్తుతాన్ని ఆస్వాదించలేరు.


చచ్చిన గతాన్ని పూడ్చి పెట్టడం ద్వారా మీ ఆటంకాలను తొలగించుకోండి.


ప్రతి వారి జీవితంలో కొన్ని చీకటి ఛాయలు ఉంటాయి. వాటి గురించి బాధపడకండి. మీరు కర్తలు కాదు. అది దైవేచ్చ, అది అలాగే జరగాల్సి ఉంది.  చీకటి గతాన్ని మర్చిపోవడం నేర్చుకోండి. దాన్ని వదిలేసి, ముందుకు సాగండి. మిమ్మల్ని మీరు తక్కువగా భావించకండి. మీ చీకటి గతాన్ని ప్రస్తావిస్తూ, మీ ప్రస్తుతాన్ని పాడు చేసే అవకాశాన్ని ఎవరికీ ఇవ్వకండి.


మీరు ఇతరుల గతాన్ని తవ్వుతూ పొతే, చాలా అస్థిపంజరాలు బయల్పడడం సహజం. గతం మురికిగా ఉంటుందని తెలిసీ, దానిలోకి వెళ్ళడం ఎందుకు? మురికి గుంట అనేది మీకు చెందినా, ఇతరులకు చెందినా కుళ్లిపోయి దుర్వాసన వస్తూనే ఉంటుంది. చాలా మంది విషయంలో వారి గతం మురికిగుంటే. అది ఇతరులకు చెందినా, మీకు చెందినా దాన్ని తవ్వే పయత్నం చెయ్యకండి.

గతాన్ని వదిలెయ్యవచ్చు. కాని, దానికంటే ముందు గతాన్ని తప్పించుకోడానికో, మర్చిపోడానికో ప్రయత్నించకండి. దాన్ని అంగీకరించి, మిమ్మల్ని మీరు క్షమించుకోండి. అప్పుడు గతాన్ని వదిలెయ్యడం సులభమవుతుంది.

మిమ్మల్ని ఎవరైనా మోసం చేసినప్పుడు, మీరు వాళ్ళను వదిలేసినప్పుడు, ఆ చేదు గత జ్ఞాపకాలను పట్టుకుని వెళ్లాడకండి. ఆ వ్యక్తితో పాటుగా గతంలో మీ ఇద్దరి మధ్యా జరిగిన సంఘటనలన్నింటినీ కూడా వదిలెయ్యండి. ఇది మీరు ప్రశాంతంగా జీవించేందుకు ఉపయోగపడుతుంది.


జీవితం అనూహ్యమైనది, వినోదభరితమైనది. మీ గతాన్ని ప్రస్తుతంతో కలిపే ఒక ఆకృతి ఉందని మీరు భావించినప్పుడు, ప్రకృతి మాత అది తప్పని నిరూపిస్తుంది. అలాగే, మీరు ప్రస్తుతం గతంతో సంబంధం లేనిదని భావిస్తే, ప్రకృతి మాత రెండిటికీ సంబంధం ఉందని నిరూపిస్తుంది. ఏమైనా జీవితం ఎంపిక లేనిది.

 మీ చేదు గతాన్ని వదిలేసి ముందుకు వెళ్ళడం మీరు నేర్చుకోకపోతే, అది మీ ఒక్కరికే కాదు, మీ చుట్టూ ఉన్నవారికి కూడా ఇబ్బందికరంగా పరిణమిస్తుంది. గతం ద్వారా సంపాదించుకున్న అనుభవాలు మీ ప్రస్తుత చర్యల్లో ప్రతిఫలించాలి. కేవలం గతకాలపు చెడ్డ అనుభవాల గురించి కుమిలిపోవడం మీకు హాని చేస్తుంది.


మీరు చచ్చిన గతాన్ని పోగేసి, పూడ్చి పెట్టడం నేర్చుకునే దాకా, ప్రస్తుతం, భవిష్యత్తు అన్నవి మీకు, మీ చుట్టూ ఉన్న వారికి కేవలం మరణించినట్లుగా ఉంటాయి.


చనిపోయిన చీకటి గతంలోనే తిరిగి మీరు బ్రతకడం అన్న దాని నుంచి మీ దుఃఖం జనిస్తుంది.


నియమ బద్ధము కాని ఆత్మ ఏ షరతులూ విధించదు. నియంత్రణకు గురైన వ్యక్తి, ఒకవేళ తన గతం నుంచి ఏమీ నేర్చుకోకపొతే, అసహాయులను ఎల్లప్పుడూ నియంత్రిస్తూ ఉంటారు. మీకొక గతం ఉంది, మీకొక భవిష్యత్తు ఉంది. ఇదే మొదలు, ఆఖరు అన్నట్లుగా నిశ్చితమైన ఈ ప్రస్తుతంలో జీవించండి. మీరు గతం గురించి, భవిష్యత్తు గురించి బెంగ పడాల్సిన అవసరం లేదు. ఒక మనిషిగా మీ బాధ్యత, ప్రస్తుతంలో తగిన విధంగా జీవించడంతోనే ముగుస్తుంది. మహా ప్రయోగి అయిన దక్షిణామూర్తి భగవానుడికి అన్నీ తెలుసు, ఆయన మీ అందరి గురించి శ్రద్ధ వహిస్తారు. ఆయన పట్ల ప్రశ్నించనలవి కానంత విశ్వాసాన్ని కలిగి ఉండి, ముందుకు సాగండి. ఒకే చోట నిశ్చలంగా ఉండిపోకండి.


మీరు చేదు గతాన్ని గుర్తు చేసుకున్న కొద్దీ మళ్ళీ ఆ బాధలోనే జీవిస్తారు. బాధలో తిరిగి జీవించడం అన్నది మీకే కాదు, మీ చుట్టూ ఉన్న వాళ్లకు కూడా ప్రమాదకరంగా పరిణమిస్తుంది.

మనం గతకాలపు అనుభవాల నుంచి ఏమీ నేర్చుకోము. మీలోపల, మీ చుట్టూ జరిగే సంఘటనలు అన్నింటినీ మరింత సమర్ధవంతంగా నిర్వహించే పరిణితిని ఇస్తాయి. మీరు జాగృతితో, జ్ఞానంతో ఉంటే, ఇతరుల చర్యల పట్ల ఆందోళన చెందరు. ఇందుకు బదులుగా, మీరు మరింత సంతులనంతో ఉండి, ఎదురుదాడికి దిగడాన్ని మానుకుంటారు.

జనానికి గతమూ, భవిష్యత్తు రెండూ తెలుసు, కాని నవ్వుతూ ప్రస్తుతంలో జీవిస్తారు.


ప్రస్తుతం ఒక ప్రార్ధన. ప్రస్తుతం ఒక ధ్యానం. ఈ క్షణమే ప్రార్ధన. ‘ఇప్పుడే’ ప్రార్ధన. గతమూ, భవిష్యత్తు ప్రార్ధన కానేరవు. మీరు గతం గురించి ఆలోచించినప్పుడు, కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరాశకు గురి చేస్తాయి. మీరు భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు, అందులో ఉన్న అనిశ్చితి వలన మీరు విచారపడతారు. ప్రార్ధనలు మీకు నిరాశను, కలతను ఎన్నడూ కలిగించవు. అందుకే ప్రస్తుత క్షణమే ప్రార్ధన. ప్రార్ధన అన్నది స్వచ్చమైన ఆనందం, అది క్షీణించిన గతంలో లేదు, అనిశ్చితమైన భవిష్యత్తులో లేదు. ప్రార్ధన అంటే ఈ బంగారు ప్రస్తుతమే.

***

3 comments:

  1. అద్భుతం...... సన్మార్గం.... అసతోమా సద్గమయా....శ్రీ గురుభ్యో నమః

    ReplyDelete
  2. ఓం శ్రీగురుభ్యోనమః

    ReplyDelete
  3. ఓం శ్రీగురుభ్యోనమః

    ReplyDelete

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top