Tuesday, August 22, 2017

thumbnail

కృష్ణ శతకము -నృసింహకవి

కృష్ణ శతకము -నృసింహకవి
పరిచయం :దేవరకొండ సుబ్రహ్మణ్యం 

కవి పరిచయం:
కృష్ణ శతక కర్త నృసింహ కవి దాదాపు క్రీ.శ. 1760 ప్రాంతములవాడు. ఇతని వివరాలు అంతగా ఈశతకము నుండి తెలియకపోయ్నా ఇతను శతకములో  వాడిన కొన్ని పదాలను బట్టి ఈకవి చిత్తూరు మండలము వాడు కానీ పడమటి సీమ ప్రాంతము వాడుగా కానీ ఊహించవచ్చును. శతకాంతమున ఈకవి తన్ను గురించి ఈ విధంగా చెప్పుకొన్నాడు.

భారద్వాజసగోత్రుఁడ
గౌరవమున గంగమాంబ కరుణాసుతుఁడన్
పేరు నృసింహాహ్వయుఁడన్ 
శ్రీరమయుత నన్నుఁ గావు సృష్టిని కృష్ణా

"తిరిమణి పెట్టిన మనుజు@డు పరమపవిత్రుండు" అను పద్యాన్ని బట్టి ఈతను వైష్ణవ మతావిలంబి కావచ్చును. బహుశా ఆరువేల నియోగియోలేక గోలకొండ వ్యాపారియో కావచ్చునని శతకశాస్త్ర చరిత్రకారుల నిర్ణయము. 

ఈ కవి ఇతర రచనలు కానీ, మరే విశేషాలు లభించటం లేదు.

శతక పరిచయం:

సుమతి, వేమన శాతకముల తరువాత అత్యంత ప్రచారములో ఉండి, మిక్కిలి ప్రజాదరణ పొందిన శతకాలలో ఈ శతకం ఒకటి. భక్తిరస ప్రధానమైన ఈశతకంలో 102 కందపద్యాలలో కృష్ణలీలలు, దశావతారములను మనోహరంగా సరళమైన భాషలో వర్ణించాడు. సరళమైన భాషలో ముద్దులొలికే తెలుగులో చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యే విధంగా వ్రాయటం వలన ఈశతకాన్ని పాఠశాలలో బాలబాలికలకు పాఠ్యాంశంగా చేర్చటం జరిగింది.

ఈశతకంలోని కవిత్వం అంత పౌఢమైనది నిర్దుష్టమైనది కాదు. ఈశతకములోని పద్యములు సరళము, సులభగ్రాహ్యమైన శబ్ధములతో ఒడుదుడుకులు లేని ధారాళధారతో ఉన్నవి. కానీ అర్థసారస్వములేని పునరుక్తులు, ఊకదంపుళ్ళ వంటి ప్రాసలు, అనేక వ్యాకరణ దోషములు ఈశతకంలో కనిపిస్తాయి. 

కొన్ని దోషములను చూద్దాం.

1). అర్థవిశేషములేని ఏకప్రాస పద్యములు:- 1. నీవే తల్లివి దండ్రివి, 2. హరి యను రెండక్షరములు, 3. దిక్కెవ్వరు ప్రహ్లాదుకు, 4. ఎటువలె కరి మొఱ వింటివి, 5. దండమయా విశ్వంభర, 6. నారాయణ లక్షిపతి, 7. తిరుమణి దురితవిదూరము, 8. అప్పా ఇత్తువు దయతో, 9. నీనామము భవహరణము, 10. బలమెవ్వఁడు

2). పద్యములలో ఏకాభిప్రాయపాదములు పునరుక్తిగా వచ్చుట. 
3). ఒకేశబ్ధమును అనేకపద్యములలో ప్రయోగించుట ఉదా: మందరగిరిధర, లక్ష్మీ
పతి, నందసుతుఁడు, నారాయణ
4). చందో దోషములు
1. గణభంగము: పరగితివౌ నీవు బాలప్రాయము కృష్ణా
2. ప్రాసభంగము: 1. నీయాజ్ఞఁ దలఁగ నేరను కుయ్యలింపుము మహాత్మ, గుఱుతుగఁ ...2. ఏఘడియని నీనామము లఘుమతితోఁ దలఁచఁగలనె లక్ష్మీరమణా,..... 3. శ్రీషర మాధవ యచ్యుత భూధర పురుగూతవినుత పురుషోత్తమ నీ, పాసయుగళంబు నెప్పుడు మోదముతో నమ్మినాఁడ ముద్దుల కృష్ణా
4). వ్యాకరణ దోషములు : 1 కు షష్టికి ముందు నగాగమము లేమి ఉదా జగన్నాథుకు, ప్రహ్లాదుకు, సుగ్రీవుకు 2. సాంస్కృతిక సమాసములలో మహత్యర్థకములకు దీర్ఘము లేమి రతినాథజనక, దేవకిపుత్రా, సత్రాజిత్తనయనాథ, గంగమాంబకరుణాసుతుఁడన్, శ్రీరమయుత 3. తప్పుసంధులు; సారథిఉతి, కంటుండ (కనుచుండ) వింటివి యెటువలె, పిలువన్ ఏరీతి మొదలైనవి, 4. శబ్ధదోషములు: చాలా, కొంచపు, ఘడియ, వరుసతో, గరిమతొ, ఇస్తివి, నీవల్ల, గోపాలదొంగ
ఇలా చెప్పుకుంటే చాలాదోషములే కనపడుతాయి. కానీ అనేక మెరికలవంటి పద్యాలు కూడా ఈశతకంలో చూడవచ్చును. 

కం. దివిజేంద్రసుతునిఁ జంపియు రవిసుతు రక్షించినావు రఘురాముఁడవై
దివిజేంద్రసుతునిఁ గాచియు రవిసితుఁ బరిమార్చితౌరా రణమునఁ గృష్ణా (విరోధాభాసాలంకారం)

కం. పదునాలుగు భువనంబులు కుదురుగ నీకుక్షి నిల్పుకొని నేర్పరివై
విదితంబుగ నా దేవకి యుదరములో నెట్టు లొదిగియుంటివి కృష్ణా

కం. దుర్భరబాణము రాఁగా గర్భములోనుండి యభవ కావుమటన్నన్
నిర్భరకృప రక్షించితి నర్భకు నభిమన్యుసుతుని నచ్యుత కృష్ణా

భగవత్ గీత, పోతనామాత్య, వేమన, వంటి కవుల పద్యానుకరణలు మనకు ఈశతకంలో అనేకము గోచరిస్తాయి.

భగవత్ గీతలోని అభిప్రాయాలను 

గిరులందును మేరువౌదువు (మేరు శ్శిఖరిణా మహం), సురలందున నింద్రుఁడౌదు (దేవానా మస్మి వాసవః), చుక్కలలోనన్ చంద్రుఁడౌదువు (నక్షత్రాణామహంశశి), నరులందున నృపతివౌదు నయముగఁగృష్ణా (నరాణాంచ నరాధిపం)

వేమనకు అనుకరణ : పరుసము సోకిన యినుమును పరుసతొ బంగారమైన వడువున (కృష్ణా) పరుస మినుము సోక బంగారమైనట్లు (వేమన)
"విశ్వాత్మక విశ్వేశ్వర" అనే భాగవత పద్యానికి "విశ్వోత్పత్తికి బ్రహ్మవు" అని, దిక్కెవ్వరు దీనులకును దిక్కెవరు నీకునాకు" అనే ప్రహ్లాద చరిత్రలోని పద్యమునకు " దిక్కెవ్వరు ప్రహ్లాదుకు, దిక్కెవ్వరు పాండవులకు" అని, 

దండిని బ్రహ్మాండంబులు, చెండులక్రియఁ బట్టి యెగురఁజిమ్మెడు హరికిన్
గొండఁ బెకిలించి యెత్తుట, కొండొకపనిగాక యొక్క కొండా తలఁపన్ (భాగవతం) అనే పద్యానికి ధీటుగా

అండజవాహన విను బ్ర
హ్మాండంబుల బంతులాట యాడెడు నీవుం
కొండల నెత్తితివందురు
కొండికపనిగాక దొడ్డకొండా కృష్ణా

అనే పద్యంలో అనుకరించాడు. 

"అంసాలంబితకుండల" అనే పద్యం "అంసాలంబిత కచభర" అనే శ్రీనాథుని పద్యానికి చాయ. మొల్లను కూడా ఈకవి అనుకరింపక పొలేదు. "వనజాక్ష భక్తవత్సల, ఘనులగు త్రైమూర్తులందు" అనేపద్యం " జలజాక్ష భక్తవత్సల, జలజాసనవినుత" అనే పద్యానికి అనుసరణ. 

ఎన్నిదోషములున్న శతకమైనా "చెఱకునకు వంకబోతేమి చెడునె తీపు" అని నృసింహ శతకకారుదు చెప్పినట్లు ఈశతకా మాధుర్యం ఏమాత్రం ఏమాత్రం చెడలేదు. బాలబాలికలే కాక అను నిత్యం పెద్దలు కూడా ఈశతకాన్ని మననం చేసుకుంటూనే ఉన్నారు. మీరందరూ కూడా మీ చిన్నతనంలో ఈశతకం చదివే ఉంటారు. మరొక్కసారి చదివండి. చదవని వారిచేత చదివించండి.
***

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

No Comments


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information