Thursday, July 27, 2017

thumbnail

పౌరాణిక చిత్ర బ్రహ్మ - ఆర్టిస్ట్ లక్ష్మీ నారాయణ

పౌరాణిక చిత్ర బ్రహ్మ - ఆర్టిస్ట్ లక్ష్మీ నారాయణ 
భావరాజు పద్మిని 
పౌరాణిక పాత్రలన్నీ సజీవంగా మన కళ్ళముందు నిలిచాయా అన్నట్లు ఉంటాయి ఆర్టిస్ట్ నారాయణ గారి బొమ్మలు. సద్గురు శివానందమూర్తి గారి దివ్య ఆశీస్సులతో, విశేషంగా పౌరాణిక తైలవర్ణ చిత్రాలు రూపొందిస్తున్న వీరితో ముఖాముఖి ఈ నెల తెలుగు బొమ్మలో ప్రత్యేకం...
మీ బాల్యం, కుటుంబ నేపధ్యం గురించి క్లుప్తంగా చెప్పండి. 
నమస్కారమండి. నా పూర్తిపేరు దేవరశెట్టి లక్ష్మీనారాయణ. మాది కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలంలోని ‘షేర్ మహమ్మద్ పేట’ అనే గ్రామం. మాది సాధారణ చేనేత కుటుంబం. నలుగురు అబ్బాయిలు. నేను పెద్దవాడిని. ఆర్ధిక పరిస్థితి బాగోకపోవటంతోఎస్ఎస్సి వరకు చదివి, చదువు ఆపాల్సి వచ్చింది. తరువాత స్వర్ణకార వృత్తి నేర్చుకున్నాను. చిత్రకళపై ఆసక్తితో దానిని వదిలేసి ఇటు వచ్చాను.

మీ ఇంట్లో ఆర్టిస్ట్ లు ఎవరైనా ఉన్నారా ?
మా తాతగారు గోడలపై బొమ్మలు వేసేవారట. మానాన్నగారు కూడా పేపరుపై పెన్నుతో వేసేవారు. నేనుచిన్నతనంలో నుండి వాటిని అనుసరించేవాడిని.

చిన్నప్పటి నుంచే బొమ్మలు వేసేవారా ? చిత్రకళ పట్ల మక్కువ ఎలా కలిగింది ?
మా నాన్నగారు దేవాలయాలలో భజనలు చేసేవారు. అందువలన మా ఇంట్లో ఉండే సహజమైన ఆధ్యాత్మిక వాతావరణం పురాణాలు రామాయణ, మహాభారత,భాగవతాదులపై ఆసక్తితో నా స్నేహితులకు గీసి ఇస్తుండేవాణ్ణి. వేరే వృత్తిలో ఉన్న నాకు చిత్రకళపై ఉన్న ఆసక్తితో అవకాశాలు ఎలాదొరుకుతాయాఅని వెతుకుతూ ఉండేవాణ్ణి.

మీ గురువులు, అభిమానించే చిత్రకారులు ఎవరు ?
నేను E.శ్రీనివాస్, BFA గారి దగ్గర ఆయిల్ పెయింటింగ్ లో మెళకువలు
నేర్చుకున్నాను. అభిమానించే చిత్రకారులు రవివర్మ, బాపు, వడ్డాది పాపయ్య గారు, చందమామశంకర్ గారు.

మీ చిత్రకళా ప్రస్థానం ఎలా మొదలయ్యింది ?
ఎలాగైనా చిత్రకళలో ప్రావీణ్యం సంపాదించాలన్న కసితో హైదరాబాదు వచ్చాను.మాగురువుగారు E. శ్రీనివాస్ గారి ద్వారా 2D యానిమేషన్ రంగంలో చిన్న ఉద్యోగంలో చేరి (పద్మాలయాటెలిఫిలింస్ లో)మిగిలిన సమయంలో పెయింటింగ్ లోని మెళకువలు నేర్చుకున్నాను.
ప్రస్తుతం యానిమేషన్ రంగం వదిలేసి ఫ్రీలాన్స్ ఆర్టిస్ట్ గా పని చేస్తున్నాను. 2006 లో నా మ్యారేజ్ అయినది. ఇద్దరు అబ్బాయిలు. 2007 లో‘గౌతమ బుద్ధ’ అనే సినిమాకి పనిచేశాను. 2012లో ‘అనంతకాలచక్రం’ అనే టివి సీరియల్ కు కళాదర్శకత్వం చేశాను. ‘పరంపర’ అనే మూవీకి కళాదర్శకునిగా పని చేశాను. ప్రస్తుతంఫ్రీలాన్స్ ఆర్టిస్టుగానే కొనసాగుతున్నాను.
  
ఈ రంగాన్ని ఎంచుకున్నాకా మీరు ఎటువంటి ఒడిదుడుకులను ఎదుర్కున్నారు ?
ఇల్లు వదలి వచ్చేటప్పుడే ఎన్ని సమస్యలు ఎదురైనా నా ఇష్టాన్ని చిత్రకళపై ఉన్న ఆసక్తిని అభిరుచిని చంపుకోకూడదని నిర్ణయించుకోవటం వలన సమస్యలపై ధ్యాస ఉండేదికాదు.

మీరు వేసిన వాటిలో బాగా పాపులర్ అయిన బొమ్మ గురించి చెప్పండి.
మోడరన్ ఆర్ట్ మీద ఆసక్తి లేదు.రియలిస్టిక్పైనే బాగా ఇష్టం. పౌరాణిక ఘట్టాలంటే, చారిత్రక ఘట్టాలంటే చాలా ఇష్టం. నేను వేసిన వాటిలో రామాయణ ఘట్టాలు మరియు శివకళ్యాణం నాకు బాగా పేరు తెచ్చినవి.

మీరు పొందిన అవార్డులు, మర్చిపోలేని ప్రశంసల గురించి చెప్పండి.
అవార్డులు ప్రత్యేకముగా ఏవి లేవు. మరచిపోలేని సంఘటనలు అంటే సద్గురువులు ‘శ్రీశివానందమూర్తి’ గారి సాన్నిధ్యం మరియు వారి ప్రశంసలు.

మీ అభిరుచులకు మీ కుటుంబసభ్యుల ప్రోత్సాహం ఎలా ఉంటుంది ?
అభిరుచులు హిందూస్తాని, కర్ణాటక సంగీతం వినడం, పల్లెటూళ్ళలో
పొలం గట్లపై తిరగటం, నా అభిరుచులను గౌరవించే కుటుంబ సభ్యులు ఉండటం అదృష్టం.

భావి చిత్రకారులకు మీరిచ్చే సందేశం ఏమిటి ?
సందేశాలు ఇచ్చేస్థాయి నాకు లేదు. ‘ఇష్టమైన పని చేయగలిగిన వాడే భాగ్యశాలి’ అని పెద్దలమాట. ఇష్టమైన పనిలోనే కష్టాలని మర్చిపోగలం అని నా ఉద్దేశం. ఎందఱో మహానుభావులు చిత్ర, శిల్పకళలలో నిష్ణాతులైనవారు ఉన్నారు. వారందరిని ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవటమే!

శ్రీ నారాయణ గారు మరిన్ని విజయాలను సాధించి, ఎంతో పేరు తెచ్చుకుని, సుసంపన్నమైన జీవితం గడపాలని మనసారా ఆశిస్తోంది –ఆచ్చంగా తెలుగు. మరికొన్ని చిత్రాలు దిగువ చూడండి...
Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

No Comments


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information