Thursday, June 22, 2017

thumbnail

సుందర మాథవ స్వామి ఆలయం

సుందర మాధవస్వామి ఆలయం, తిరువనంతపురం :
శ్రీరామభట్ల ఆదిత్య 

కేరళ రాష్ట్ర రాజధాని అయిన తిరువనంతపురంలో సుప్రసిద్ధ ఆలయం శ్రీ పద్మనాభస్వామి ఆలయం ఉంది. త్రివేండ్రంలో ఈ ఆలయం నగరం నడిబొడ్డున ఉంది. ఈ ఆలయం లో కొలువైన దేవుడు విష్ణువు. ఆలయం ట్రావన్కోర్ మాజీ రాజ కుటుంబం అధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ఆలయం ద్రావిడ శైలిలో అందంగా రూపొందించబడింది.ఈ ఆలయంలో పద్మనాభ స్వామి విగ్రహం ప్రధాన ఆకర్షణ గా ఉంటుంది.ఈ దేవాలయం పేరుమీదే కేరళ రాజధానికి తిరువనంతపురం అనే పేరు వచ్చింది. ‘తిరు’ ‘అనంత’ ‘పురం’ అంటే ‘అనంతపద్మనాభునికి నెలవైన ప్రదేశం’ అని అర్థం. అనంత పద్మనాభుడు అనంతశయన ముద్రలో దర్శనమిస్తాడు. మందిరం లో విష్ణువు కు ఒక పక్క శ్రీదేవి మరియొక పక్క భూదేవి ఉంటారు.ఈ విగ్రహాన్ని కటుశర్కర యోగం అనే ఆయుర్వేద ఔషధాల మిశ్రమంతో తయారుచేశారు.నేపాల్‌లోని గండకీ నదీ తీరం నుంచి ఏనుగుల సహాయంతో తీసుకొచ్చిన 12000 సాలగ్రామాలతో ఈ విగ్రహం తయారయ్యింది. ఈ స్వామినే శ్రీ సుందర మాధవస్వామి అంటారు మరియు సుందర పద్మనాభుడని కూడా అంటారు. కొంత మంది మాత్రం శ్రీ సుందర మాధవ స్వామి ఆలయం పద్మనాభస్వామి ఆలయ ఆవరణలో ఉందంటారు.  ఆలయంలోని సుందర మాధవుడి విగ్రహం అత్యంత సుందరముగా మరియు రమణీయంగా ఉంటుంది. ఈ ఆలయానికి కర్తలుగా ట్రావన్కోర్ రాజవంశీయులు ఉన్నారు. ట్రావంకోర్ రాజకుటుంబం చేరవాంశానికి చెందిన వారు అలాగే కులశేఖర సన్యాసి ఆళ్వార్ సంతతి వారు. ఈ ఆలయం శ్రీమహావిష్ణు యొక్క 108 దివ్యదేశములలో ఒకటి. 108 దివ్యాదేశములు అంటే శ్రీమహావిష్ణువు యొక్క ఆలయాలు ఉన్న దివ్యక్షేత్రాలు అని అర్ధం. శ్రీమత్భాగవతంలో బలరామదేవుడు తన తీర్ధయాత్రలో భాగంగా ప్రస్తుత శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయాన్ని దర్శించినట్లు, ఇక్కడ ఉన్న పద్మతీర్థంలో స్నానం చేసినట్లు అలాగే పది వేల ఆవులను బ్రాహ్మణులకు దానం చేసినట్లు తెలుస్తుంది. తమిళ ఆళ్వారులు రచించిన దివ్యప్రబంధంలో కూడా ఈ ఆలయం ప్రస్తుతించబడింది. 
"పద్మ నాభ" అంటే పద్మం ఆకారంలో ఉన్న నాభి కల వాడని అర్థం.యోగ నిద్రా మూర్తిగా శయనించి ఉండగా,నాభి నుంచి వచ్చిన కమలంలో బ్రహ్మ ఆసీనుడై వున్న అనంత పద్మనాభ స్వామి దివ్య మంగళ రూపం, నయనానందకరంగా కనిపిస్తుంది భక్తులకు. శేషుడు మీద శయనించిన శ్రీ మహావిష్ణువు చేతి కిందశివ లింగం కూడా ఉంటుంది.ఈ విధంగా ఆలయం, త్రిమూర్తులకు నిలయంగా వెలిసిపోతుంటుంది. గర్భగుడిలో మూలవిరాట్టు వెనుక, కుడి, ఎడమ గోడల మీద అపురూపమైన దేవతామూర్తుల చిత్రాలు ఉంటాయి. శ్రీదేవీ,భూదేవీ సమేత శ్రీమహావిష్ణువు ఉత్సవ మూర్తుల విగ్రహాల్ని కూడా భక్తులు దర్శించుకునే వీలుంటుందిక్కడ. ఆలయంలో నరసింహ, అయ్యప్ప, గణపతి, శ్రీకృష్ణ, హనుమ, విష్వక్సేన, గరుడ ఆలయాలు కూడా ఉన్నాయి. శిల్పాలు, పంచ లోహాలు, చెక్కలో అందంగా మలచిన దేవతామూర్తులు ఈ ఆలయంలో దర్శనం ఇస్తాయి. గర్భగుడితో పాటు గాలి గోపురం మీద కూడా అందమైన శిల్పాలు దర్శనం ఇస్తాయి. ఆలయం ముందు పద్మ తీర్థం అనే కోనేరు ఉంటుంది. ఆలయం లోపల 80 ధ్వజస్తంభాలు ఉండడం ఇక్కడి విశేషం. ఆలయ ప్రాంగణంలో ఉన్న బలిపీఠం మండపం,ముఖమండపాల్లో కూడా దేవతామూర్తుల అపురూప శిల్పాలు కనిపిస్తాయి. ప్రధానఆలయ మండపం ఒక మహాద్భుతం. 365రాతి స్తంభాలతో ఈ మండపాన్ని నిర్మించారు. ఈ రాతి స్తంభాలతో పాటు మండపం పై కప్పుమీద కూడా దేవతామూర్తుల శిల్పాలను అందంగా చెక్కడం విశేషం. శిల్పుల కళా ప్రతిభ అంతా ఇక్కడ పోత పోసుకుందా అనిపిస్తుంది. పద్మనాభ స్వామి దేవాలయం పుట్టు పూర్వోత్తరాల గురించి కథలు కథలుగా చెప్పుకుంటారక్కడి వారు. "విల్వ మంగళతు స్వామియార్" గా ప్రసిద్ధికెక్కిన దివాకర ముని, శ్రీ కృష్ణ భగవానుడి దర్శనం కొరకు ప్రార్థన చేశాడట. ఆయనను కరుణించేందుకు,భగవంతుడు,మారు రూపంలో-ఒకఅల్లరి పిల్లవాడుగా దివాకర ముని వద్దకు వచ్చాడు.ముని పూజలో వుంచిన ఒక సాల గ్రామాన్ని తీసుకుని మింగడంతో, కోపంతో పిల్ల వాడిని తరిమికొట్టగా, ఆ రూపంలో వున్న శ్రీ కృష్ణుడు సమీపంలో వున్న ఒక చెట్టు పక్క దాక్కున్నాడు. మరు క్షణమే పడిపోయిన ఆ వృక్షం, విష్ణు మూర్తిగా మారి పోయి,శయన భంగిమలో అనంతశయనంగా యోగ నిద్రా మూర్తి తరహాలో కనిపించింది. అలా జరిగిన ఆ సందర్భంలో, ఆయన రూపం ఆకారం ఎంతో పెద్దగా వుండడంతో, దివాకర ముని, అంత పెద్ద ఆకారాన్ని పూర్తిగా తన తనివి తీరా దర్శించుకోలేక పోతున్నానని,దాంట్లో మూడో వంతుకు తగ్గమని ప్రార్థించాడు. ఆయన ప్రార్థనలను అంగీకరించిన భగవంతుడు, అలానే తగ్గిపోయి, తనను దర్శించుకోవాలంటే, మూడు ద్వారాల గుండా మాత్రమే వీలుంటుందని అంటాడు. ఇప్పుడున్న ఆ మూడు ద్వారాలు రావడానికి అదే కారణమంటారు. ఏడు పరశురామ క్షేత్రాలలో ఒకటైన పవిత్ర స్థలంలో,పద్మనాభ స్వామి దేవాలయం వుందని మరొక నమ్మకం. స్కంద,పద్మ పురాణాలలో,ఈ దేవాలయానికి సంబంధించిన విశేషాలున్నాయి.
క్రీ.శ 16వ శతాబ్దం అంతా ఈ ఆలయం అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. అపుడు ఈ ఆలయ సుందరగోపుర నిర్మాణం జరిగింది. ఈ ఆలయం ప్రసిద్ధ తిరువట్రార్ శ్రీ ఆదికేశవపెరుమాళ్ ఆలయానికి ప్రతిరూపం. ఈ ఆలయం కారణంగా కేరళా రాజధాని నగరానికి తిరువనంతపురం అనే పేరు వచ్చింది. 'తిరు అనంత పురం ' అంటే దేవుడైన శ్రీ అనంత పద్మనాభుని యొక్క పవిత్ర ఆలయం అని అర్ధం. ఈ నగరానికి అనంతపురం, శయనంతపురం అనే మరి కొన్ని పేర్లు కూడా ఉన్నాయి. ఆనందం అంటే పద్మనాభస్వరూపమే. హిందుధర్మం భగవంతుడి రూపం సచ్చిదానందం అని చెప్తుంది. అంటే సంపూర్ణ సత్యం, సంపూర్ణ జాగృతి మరియు సంపూర్ణ ఆనందం. ఆలయ గర్భగృహంలో ప్రధాన దైవమైన పద్మనాభస్వామి అనంతశయనం భంగిమలో ఉంటాడు. ట్రివాంకోర్ మహారాజా తనకు తానే పద్మనాభదాసుడని నామకరణం చేసుకున్నాడు. ముఖద్వారం వద్ద హిందూ ధర్మం మీద విశ్వాసం ఉన్న వారికి మాత్రమే ప్రవేశం అన్న ప్రకటన ఉంటుంది. భక్తులకు లోపల ప్రవేశించడానికి ప్రత్యేక మైన వస్త్రధారణ చేయాలన్న నియమం కూడా ఉంది. ఆలయంలోని నేలమాళిగలలోని సంపద కారణంగా ఈ ఆలయం ఈ మధ్య బాగా వార్తలలో నిలిచింది. ఈ ఆలయానికి పరమశివుడు క్షేత్రపాలకుడు. ఇక్కడ మనకు శివకేశవ అభేదం కనిపిస్తోంది. పిఠాపురంలో కుంతీ మాధవుడు క్షేత్రపాలకుడు కాగా ఇక్కడ పరమేశ్వరుడు క్షేత్రపాలకుడు. అందుకే అన్నారు
శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే
శివస్య హృదయం విష్ణోః విష్ణుస్య హృదయం శివః
శివుడు విష్ణువు వేరు అని మనం అనుకుంటాం కాని ఇద్దరూ ఒక్కటే. అయితే ఈ ఐదు క్షేత్రాలు కూడా ప్రసిద్ధ క్షేత్రాలను ఆనుకోని ఉండడం మరో విశేషం..

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

No Comments


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information