Thursday, June 22, 2017

thumbnail

శ్రీరామకర్ణామృతం -20

శ్రీ రామకర్ణామృతం - 20
 డా.బల్లూరి ఉమాదేవి
 కామవరం

91.శ్లో :కరే దివ్యచక్రం పరే చారు శంఖం
        గళే తారహారం లలాటే లలామం
        భుజంగే నిషణ్ణం పరానందరూపం
       సదా భూమిజాయుక్త మీళే హృదంతే.
తెలుగు అనువాద పద్యము:
చ:కరముల శంఖ చక్రములు కంధరమందున దారహారమున్
      బరగ లలాట భాగమున భవ్యలలామము తేజరిల్లు వి
.      స్ఫురిత చిదాత్మ రూపకుని భూరిభుజంగమ తల్పకస్థితున్
ధరణి తనూభవా సహితు దాశరథిన్ శరణంబు వేడెదన్.
భావము:ఒక చేతి యందు చక్రమును వేరు చేతియందు శంఖమును కంఠమునందు  పరిశుద్ధమగు ముత్యాలహారమును నుదుటి యందు బొట్టును ధరించినట్టి శేషుని యందున్నట్టి పరమానందరూపుడైనట్టి సీతతో కూడినట్టి రాముని హృదయమధ్యమందు స్తోత్రము చేయుచున్నాను.
92.శ్లో:చతుర్వేదకూటోల్ల సత్కారణాఖ్యం
      స్ఫురద్దివ్య వైమానికే భోగితల్పే
       పరంధామ మూర్తిం నిషణ్ణంనిషేవ
          నిషేవన్య దైవం నసేవే నసేవే.
చ:సతతము వేదకూట విలసద్ఘన కారణ నామధేయుడై
     యతులిత దివ్య పుష్పకమునందహితల్ప శయానుడై
జగ
ద్ధిత పరధామ మూర్తి యగు దీప్తి వహించిన రాము నెంతుగా
కితరములన దైవములు నేను భజింప భజింప నెమ్మదిన్.
భావము:నాల్గు వేదములయొక్క శిఖరముల యందు ప్రకాశించుచున్న కారణనామము కల్గినట్టి ప్రకాశించుచున్న దివ్య విమానములచే సంచరించువారుగల శేషశయ్యయందు కూర్చొన్నట్టి ఉత్కృష్ట తేజో రూపము కలిగిన రాముని సేవించుచున్నాను.ఇతర దైవమును సేవించను,సేవించను.


93శ్లో:లసద్దివ్యశేషాచలే యోగపీఠే
        సదానందవైమానికే మాసహాయమ్
        మునీనాం హృదానంద మోంకారగమ్యం
       సదా భూమిజాయుక్త మీళే హృదంతే.
తెలుగు అనువాద పద్యము:
మ:వరశేషాద్రిలసద్విమానమున  భాస్వోద్యోగ పీఠంబునం
    దు రమా యుక్తముగా వసించి ముని సంతోషాకృతిన్
   గల్గి వి
 స్ఫురదోంకారమునన్  భజింపదగు రామున్ మేఘసుశ్యాము సుం
దర కామున్ రవిధాము నిచ్చలు పరంధామున్ భజింతున్ మదిన్.
భావము:ఎల్లప్పుడును ఆనందముగల విమాన చారులుగల ప్రకాశించుచున్న పర్వతము వంటి శేషుని యందు యోగపీఠమందున్నట్టియు లక్ష్మీ సహాయుడైనట్టియు,మునుల హృదయమున కానందకరుడైనట్టియు,ప్రణవమున పొందదగినట్టియు,సీతతో కూడిన రాముని హృదయమందెల్లప్పుడు స్తుతి చేయుచున్నాను.
94శ్లో:మనస్స్థం మనోంతస్థ మాద్యంతరూపం
        మహాచింత్య వర్జం చమధ్యస్థ మీశం
         మనోబుద్ధ్యహంకార చిత్తాది సాక్షిం
          పరస్వప్రకాశం భజే రామచంద్రం.
తెలుగు అనువాద పద్యము:
మ:అతిచింతారహితున్ బరేశు బరునాద్యంతున్ మనోంతస్థితున్
 శతపత్రేక్షణు నంతరింద్రియు లసత్సాక్షిన్ మనోవాసి న
 చ్యుతు సర్వాత్ము నచింత్యు నవ్యయు బరంజ్యోతిన్ హరిన్ స్వప్రకా
 శితు మందస్మితు రామచంద్రు మది నేసేవింతు నశ్రాంతమున్.
భావము:మనస్సునందున్నట్టియు మనస్సులోపల నున్నట్టియు,జగత్తుల యొక్క ఆదియందు నంతమందున్నట్టి గొప్పదియై చింతించదగిన రూపు లేనట్టి మధ్యస్థుడనగా దటస్థుడైనట్టి యీశ్వరుడైనట్టి మనోబుద్ధి చిత్తాహంకారములకు సాక్షియైనట్టి సమస్తమును ప్రకాశింప చేయునట్టి రామమూర్తిని సేవించుచున్నాను.
95శ్లో:పరానందవస్తు స్వరూపాది సాక్షిం
 పరబ్రహ్మగమ్యం పరం జ్యోతి మూర్తిం
 పరాశక్తిమిత్రా ప్రియారాధితాంఘ్రిం
 పరంధామరూపం భజే రామచంద్రం.
తెలుగు అనువాద పద్యము:
మ:పరమానంద సమస్త సాక్షియు బరబ్రహ్మంబగమ్యంబు భా
 సుర వేదాంతునకున్ సనాతను బరంజ్యోతిన్ బరాశక్తి మి
 త్ర రిపు వ్రాత సమర్చితాంఘ్రి కమలున్ రామున్ బరంధాము సుం
 దరకామున్ గుణధాము రాఘవుని సీతాకాంతు నెతున్ మదిన్.
భావము:పరమానంద వస్తువుకు మొదటిసాక్షియైనట్టి గొప్పవాడైన బ్రహ్మకు పొందదగినట్టి ఉత్కృష్ట తేజస్స్వరూపుడైనట్టి శక్తిరూపురాలైన పార్వతికి నిష్ట స్నేహితుడైన యీశ్వరునిచే పూజిఐపబడు పాదములు కలిగినట్టి గొప్ప తేజోరూపుడైన రామచంద్రుని సేవించుచున్నాను.
96.శ్లో:పరం పవిత్రం పర వాసుదేవం
   పరాత్పరం తం పరమేశ్వరాఖ్యం
 గుణత్రయారాధిత మూలకంద
 మాదితఅయవర్ణం తమసః పరస్తాత్.
తెలుగు అనువాద పద్యము:
చ:హరి పరవాసుదేవు ద్రిగుణార్చితు భాస్కరవర్ణు రాఘవున్
బరమ బవిత్రు సద్భువన పాలనశీలు బరాత్పరున్ బరే
శ్వరు బరు మూలకారణు బ్రశస్తు శ్రుతిస్మృతి కీర్తితాంఘ్రి పం
కరుహ తమః పరస్తు జనకప్రభుజాన్వితు రాము గొల్చెదన్.
భావము:మిక్కిలి పవిత్రుడైనట్టి ఉత్కృష్టవాసుదేవ స్వరూపుడైనట్టి పూర్వునికంటె పూర్వుడైనట్టి సర్వేశ్వర నామము కలిగినట్టి సత్తవాదిగుణములచే నారాధించబడిన సర్వకారణభూతుడైనట్టి సూర్యతేజసఅసు కలిగినట్టి తమోగుణాతీతుడైన రాముని సేవించుచున్నాను .
97.శ్లో:సాకేత గరుగంధధూపనిబిడే మాణిక్య దీపాన్వితే
        కస్తూరీ ఘనసార కుంకుమ రస ప్రాచుర్య సర్వోజ్జ్వలే
        నానాపుష్ప వితాన పంక్తి రుచిరే సౌవర్ణ సింహాసనే
          వాసం మన్మథమన్మథం మణినిభం రామం భజే తారకమ్.
తెలుగు అనువాద పద్యము:
మ:తన యూరన్ సుమదామ పంక్తుల సుగంధ ద్రవ్య మాణిక్య లే
పనికాయంబుల గంధ ధూప నిబిడ ప్రఖ్యాతమైనట్టి కాం
చన సింహాసన భాసమానుడు మణిశ్యాముండు రాముండు శో
భనసన్మన్మథమన్మథుండెదుట దాబ్రత్యక్షమై బ్రోవుతన్.
భావము:
అయోధ్యపురమందు అగరు పరిమళముగల ధూపముచే దట్టమైనట్టి మణిదీపముతో గూడినట్టి కస్తూరి యొక్క కర్పూరము యొక్క కుంకుమము యొక్క ఆధిక్యముచే నన్నిటిలో నధికమైనట్టి  సమస్త పుష్పసమూహముల వరుసలచే మనోహరమైన బంగారు పీఠమందు నివాసము కలిగినట్టి మన్మథునకు మన్మథుడైనట్టి యింద్రనీలములతో తుల్యమైనట్టి తారక రాముని సేవించుచున్నాను.
98.శ్లో:భంగోత్తుంగమయామృతాబ్ధి లహలీమధ్యే విరాడ్విగ్రహే
  ద్వీపే నిర్జర పాదపైః పరివృతే కర్పూర దీపోజ్జ్వలే
 ఓంకారాంతర మందిరే మణిమయే శేషాంతరాశాయినం
  లక్ష్మీయుక్త మపారచిత్సుఖ పరం రామం భజే తారకమ్.
తెలుగు అనువాద పద్యము:
మ:అమితోత్తుంగ తరంగ దుగ్దనిధి విఖ్యాతున్ విరాడ్దేహుడై
యమలంబైన సితాంతరీపమున దివ్యక్ష్మాజ సందోహ మ
ధ్యమునందున్ బ్రణవోజ్జ్వలన్మణి గృహ స్థానాహి పర్యంకుడై
కమలం గూడి సుఖించు రాము గొలుతున్ గర్పూర దీపోజ్జ్వలున్.
భావము:
ఉన్నతరంగమయమైన అమృతసముద్ర ప్రవాహ మధ్యమందు విరాట్స్వరూపుడైన కల్పవృక్షములచే చుట్టబడిన శ్వేతద్వీపమందు కర్పూరదీపములచే ప్రకాశించుచున్నట్టు మాణిక్య మయమైన ప్రణవ మధ్య గృహమందు శేషుని మధ్యమున శయనించినట్టి లక్ష్మితో కూడినట్టి మిక్కిలి సారమైన జ్ఞానసుఖమునకు స్థానమైనట్టి తారకరాముని సేవించుచున్నాను.
99.శ్లో:వైకుంఠే నగరే సురద్రుమతలే ఆనందవప్రాంతరే
నానారత్న వినిర్మిత స్ఫుట పటు ప్రాకార సంవేష్టితే
సౌధేందూపల శేషతల్ప లలితే నీలోత్పలచ్ఛాదితే
పర్యంకే శయినంరరమాది సహితం రామం భజే తారకమ్.
తెలుగు అనువాద పద్యము:
మ:ఘనవైకుంఠమునందు రత్నమయ ప్రాకారాత్తమైనట్టి చం
దనవృక్షాంతిక మందు భవ్యమగు నానందాఖ్య వప్రాంతరం
బున హర్మ్యాంతర రత్నవేదికపయిన్ బూబాన్పునన్ శేష శ
య్యను లక్ష్మీయుతుడైన తారకుని రామాధీశు సేవించెదన్.
భావము:
వైకుంఠపురమందు కల్పవృక్షస్థలమందు ఆనందకరమగు ప్రాకారమధ్యమున బహురత్నములచే నిర్మించబడిన గొప్ప రెండవ ప్రాకారముచే చుట్టబడిన మేడయందలి చంద్రకాంత మణుల యందలి శేషశయ్యచే సుందరమైన నీలమణులచే చుట్టబడినట్టి మంచముపై శయనించినట్టి లక్ష్మి మొదలగువారితో కూడిన తారక రాముని సేవించుచున్నాను.
100.శ్లో:వైకుంఠే పుటభేదనే మణిమయప్రాంతేందు సింహాసనే
అక్షాంతాంత  సరోరుహే శశిగళత్పీయూష వార్యంతరే
చంద్రార్కానల భానుమండలయుతే శేషాహి తల్పాంతరే
వాసం వాసవ నీల కోమలనిభం రామం భజే తారకమ్.
తెలుగు అనువాద పద్యము:
మ:అల వైకుంఠ కరిద్విడాసనమునం దక్షాంత వర్ణంబు జో
జ్జ్వల తారాధిప మండలస్రవ సుధా వార్యంతరార్కాగ్ని చం
ద్ర లసన్మండల యుక్త భవ్యఫణిరాట్ తల్పస్థు నీలాంబుదో
త్పల సుత్రామ మణినిభాంగుని బరంధామున్ హరిం గొల్చెదన్.
భావము:వైకుంఠ పురమునందు మాణిక్య వికారమైన ప్రాతములు గల చంద్రుని వంటి పీఠమందు అకారము మొదలు క్షకారము వరకు గల అక్షర రూపమైన పద్మమందు చంద్రుని వలన జారుచున్న అమృతోదక ప్రవాహమధ్యమందు సూర్యచంద్రాగ్ని మండలములతో కూడిన శేషశయ్యయొక్క మధ్యమున నివసించినట్టి ఇంద్ర నీలముల శోభతో సమానుడైన తారకరాముని సేవించుచున్నాను.
Ph:9493846984

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

No Comments


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information