Thursday, June 22, 2017

thumbnail

గాయకశిరోమణి --- శ్రీ పట్నం సుబ్రహ్మణ్యం అయ్యర్

గాయకశిరోమణి  ---  శ్రీ పట్నం సుబ్రహ్మణ్యం అయ్యర్
మధురిమ 


సాంప్రదాయ శాస్త్రీయ సంగీత కచేరీలను బాగా వినేవారికి రఘువంశ సుధాంబుధి చంద్రశ్రీరామ అనే వీనులవిందుగా ఉండే అద్భుతమైన కీర్తన గురించి తెలియకుండా ఉండదు. కీర్తన యొక్క సృష్టికర్త త్యాగరాజస్వామేనేమో అని చాలామంది భావిస్తారు.కాని అద్భుతమైన   కీర్తనని రచించి స్వరపరిచింది
శ్రీ పట్నం సుబ్రమణ్య అయ్యర్ గారు. శ్రీ సుబ్రహ్మణ్య అయ్యర్ 1845-1902 కాలమునకు చెందినవారు.త్యాగరాజస్వామి వలె భక్తిభావ ప్రదాయకంగా రచనలను చేసినవారు కనుకనే ఈయనను చిన్నత్యాగరాజు అని సంగీత ప్రపంచం అంతా సంభోదిస్తుందికూడా.
గురువుల సంపూర్ణ అనుగ్రహం వలన సాంప్రదాయ శాస్త్రీయ సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న గొప్ప విద్వాంసులు శ్రీ పట్నం సుబ్రమణ్య అయ్యర్ గారు
ఆయన పుట్టింది కళాపోషణకు నెలవైన తంజావూర్ జిల్లాలోని తిరువైయ్యారు గ్రామంలో ప్రసిద్ధ సంగీత కుటుంబంలో.వారి పుట్టిన ఊరు,వారి కుటుంబానికి రెండిటికీ ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. తిరువైయ్యారు అంటే తమిళభాషలో ఐదు నదులు చుట్టూకలిగిన చోటు అని, తిరు అంటే మన తెలుగు భాషలో శ్రీ అని అర్ధం వచ్చేది,పవిత్రమైనది అని అర్థం. అనగా ఐదు అని ఆరు అంటే నది అని అర్థం.
ఇక వీరి కుటుంబం విషయానికొస్తే తండ్రి గారు పంచానందశాస్త్రి గారు,తాత భరతం వైద్యనాథ శాస్త్రి గారు.తాత గారు తంజావూరు ను పాలించిన సరభోజీ మహారాజుగారి ఆస్థాన విద్వాంసులు.తండ్రి గారు తమిళ,తెలుగు,సంస్కృతభాషలలో పండితులు,సంగీతము నందు కూడా చక్కటి ప్రావీణ్యము కలవారు.ఇలాంటికుటుంబమునందు జన్మించిన మన సుబ్రహ్మణ్య అయ్యర్ గారికి కూడా బాల్యం నుండీ భాషా జ్ఞానం,సంగీతమునందు భక్తిభావం అలవడినందువలనే అంత గొప్పవిద్వాంసులవ్వగలిగినారన్నది సత్యం.  
మొట్టమొదట సంగీత శిక్షణను తన మేనమామగారైన  మేలట్టూర్ గణపతి శాస్త్రిగారి వద్ద ప్రారంభించారు.
ఆతరువాత శిక్షణ ని శ్రీ మానాంబుచావడి వెంకటసుబ్బయ్యార్ గారి వద్ద ప్రారంభించారు.వీరి శిక్షణలోనే సుబ్రహ్మణ్య అయ్యర్ గారు పరిపూర్ణ సంగీతజ్ఞాన సంపన్నులయ్యారు.వెంకటసుబ్బయ్యారు గారు తెలుగు,సంస్కృత భాషలలో  మహాపండితులు నేరుగా శ్రీ త్యాగరాజ స్వామి వారి శిష్యులు కూడా.తంజావూరు జిల్లాలోని మానాంబుచావడి అనే ఊరిలో పుట్టినందున వారికాపేరు వచ్చింది.తన జీవితం అంతా త్యాగరాజ స్వామి సహచర్యంలోనే గడిపిన ధన్యులు.త్యాగరాజ స్వామి భక్తిపారవశ్యంతో పాడుతూ ఉంటే వాటిని రచిస్తూ ఉండేవారట.అంటే ఒకవిధంగా త్యాగరాజ స్వామివారి రచనానిధిని  ఇలా భావితరాలకు తరగని పెన్నిధిగా అందించిన పుణ్యపురుషులు.వేంకటేశ అను ముద్రతో రచనలు కూడా చేసిన ప్రజ్ఞావంతులు.వీరికి పంచరత్నాలవంటి ఐదుగురు శిష్యులు ఉండేవారు. వారు మహావైధ్యనాథ అయ్యర్,పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్,త్యాగరజు(త్యాగరాజస్వామి వారి మనుమడు (అమ్మాయి కుమారుడు)),ఫిడేలు వెంకోబా రావు.వీరికే కాక ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వాయులీన విద్వాంసులు,నర్తనశాల వంటి చలనచిత్రాలకు సంగీత దర్శకులు అయిన సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రిగారికి కూడా వీరే గురువు. మరి ఇలాంటి గురువు శిక్షణలో ఉన్న శిష్యులకి సాధన కూడా తోడైతే వారు ఉద్దండ పండితులవ్వకుండా ఉంటారా!!
వీరి గాత్రము మొదట అత్యంత కఠినంగా ఉండేదట.కాని గురువుగారి శిక్షణలో అత్యంత కఠోరమైన సాధనతో అతి మాధుర్యమైన గాత్రముగా చేసుకోగలిగిన సంకల్పసిద్ధులు. నీటిలో కంఠముదిగేవరకూ మునిగి సూర్యోదయము వరకూ సాధన చేసేవారట.
ఈవిధంగా కొనసాగిస్తూ ఉండగా 32 ఏట వీరికి వివాహం అయ్యిందట. తరువాత చెన్నపట్టణం(నేటి చెన్నై) దగ్గర ఉన్న తిరువొత్తియ్యూర్ లోను ఆపైన చెన్నపట్టణం లోను విద్వాంసులుగా స్థిరపడ్డారు.ఎక్కువకాలం చెన్నపట్టణంలో ఉండడంవలన ఈయనకు పట్నం సుబ్రహ్మణ్య అయ్యార్ అన్నపేరు స్థిరపడిపోయింది.
వీరు చెన్నపట్నంలో ఉన్నప్పుడే ఎందరో జమీందారులు,సంస్థానాధీశులు వీరిని తమ ఆస్థానాలకు పిలిచి కచేరీలు చేయించుకునేవారు.వీరు సంగీత రచనలు చేయుటలో విశేష ప్రజ్ఞ ఉన్నవారు.వీరి రచనలకు,గానానికీ కూడా రాగభావమే ప్రధానము.వీరు తెలుగు,తమిళ,సంస్కృత భాషలలో రచనలు గావించినానూ తెలుగు భాష పైన మక్కువ ఎక్కువ.వీరి కృతులలో సంగీతము చాలా ఆకర్షణీయము గా ఉంటుంది.చిట్టస్వరములు రచించుటలో నిపుణులు కూడా.
ఆరోజుల్లో త్యాగరాజస్వామి వారి రచనలు వీరంత భావయుక్తముగా పాడెడివారు లేరని విద్వాంసులు కూడా చెప్పుకొనేవారట.ముఖ్యంగా బేగడ రాగములోని దారిని తెలుసుకొంటి,మోహనరాగములోని భవనుత అను కృతులు వీరి గళమున అత్యంత రమణీయంగా పలికేవట.అందుకే వీరు కచేరీలు చేసేటప్పుడు సాధారణంగా త్యాగరాజస్వామి వారి రచనలనే ఎక్కువగా పాడేవారట.ఎవరైనా అర్ధించినప్పుడు మాత్రమే తన స్వీయరచనలుపాడేవారట అదికూడా సభాంతమున మాత్రమే.
స్వయంగా త్యాగరాజస్వామి వారి ముఖ్యశిష్యులే వీరికి గురువులు, సునాద బోధ చెయ్యడం వలన,తన సాధనా తపస్సు వలనే మరి త్యాగరాజస్వామి వారి రచనలు అద్భుతంగా పాడగలిగారు మరి.
అలాగే బేగడ రాగము ఆలపించుటలో ప్రత్యేకమైన నైపుణ్యత కనపరచడం వలన ఇతనిని  బేగడ సుబ్రహ్మణ్య అయ్యర్ అని కూడా పిలిచేవారు.వీరు ఒకానొక సభలో బేగడ రాగమును 3రోజులు ఆలపించినారట.మొదటి రోజు రాగాలాపన,రెండవరోజున తానమును,మూడవరోజున పల్లవిని,కల్పనా స్వరమును ఆలపించి అంతే కాక ఆవర్తనముకు 128 అక్షరాలు కలిగిన అతి పెద్ద తాళమైన సింహనందనతాళంలో ఒక పల్లవిని రచించి పాడి సభాసదులందరినీ అబ్బురపరిచిన ఏకైక సంగీత  విద్వాంసులు  శ్రీ పట్నంసుబ్రహ్మణ్య అయ్యర్.
వీరి గాత్రమున అనితర సాధ్యమైన ఒక సహజ గాంభీర్యము ఉండేదట.ఒక సారి వీరు చెన్నపట్టణంలో ఉండగా  ఉదయమునే నాభీ తానము సాధనచేయ ఉపక్రమించి ఇంటిలోని స్థంబమునకు ఆనుకుని కూర్చునిపాడుతూఉండగా వారి గాత్రముయొక్క ధ్వనిప్రకంపనలకు (ఫ్రీక్వెన్సీ) స్థంబము,నేల యొక్క ప్రకంపనలతో సమమై అంతయూ కదలనారంభించినదట.వీటినే భౌతిక శాస్త్రమున(సింపేథెటిక్ వైబ్రేషన్స్) అంటారు.వారి గాత్రము నకు అంతటి అపారమైన శక్తి కలదు అనదానికి ఇదే ఒక నిదర్శనము.
త్యాగరాజ రచనాశైలిని అనుసరించి సుబ్రహ్మణ్య అయ్యర్ గారు ఎన్నోకృతులను,వర్ణాలు,జావళీలను,పదవర్ణాలను,తిల్లానాలు రచించినారు.సుమారు వందకు పైగా రచనలు చేసి ఉండవచ్చని సంగీతజ్ఞుల అంచనా.వీరి రచనలు అన్నిటిలోను ఎవ్వరి బోధన అన్న అభోగి రాగములోని వర్ణము,రఘువంశ సుధాంబుధిచంద్ర శ్రీ రామ అను కదనకుతూహల రాగములోని కృతులు అత్యంత మాధుర్యమైనవి,బహుళప్రాచుర్యం గలిగినవి.వీరి రఘువంశ కృతి వల్లనే కదనకుతూహల రాగానికి అంత ప్రాచుర్యం కలిగిందని కూడా చెప్పవచ్చు. శ్రీ వరద వేంకటేశ్వర,వేంకటేశ వంటి ముద్రలతో వారు రచనలు గావించారు.
వెంకటసుబ్బయ్యార్ వద్ద సహాధ్యాయులైన మహావైద్యనాథయ్యర్,సుబ్రహ్మణ్య అయ్యర్ మంచి మితృలు.వీరిద్దరు తిరువయ్యారులోని గుడికి తూర్పుగోపురము వైపుకు ఒకరు, పశ్చిమ గోపురము వైపుకు ఒకరు నివశించేవారు.వీరిద్దరు ఎన్నో సభలలో కలిపి పాడేడివారట.మహావైద్యనాథ అయ్యరు సుబ్రహ్మణ్య అయ్యర్ కన్న ఒక సంవత్సరము చిన్నవారగుటవలన ప్రతీ శ్రావణపౌర్ణమికి సుబ్రహ్మణ్య అయ్యర్ గారి ఆశీర్వాదము తీసుకొనెడి వారట.వీరు వారానికి ఒక్కసారైనా కలిపి కచేరీ చేసేవారట.కాని సభకి ప్రవేశ రుసుము పెడితే ఒప్పుకునేవారు కాదట.రాజుగారు కాని,జమీందారులు కాని ఏమి ఇచ్చినా సంతోషముగా పుచ్చుకొనెడి వారు కాని సాధారణ ప్రజలనుండి ధనము తీసుకోకుండా వారికి శ్రవణానందకరమైన,మోక్షప్రదాయమైన సంగీతాన్ని అందించేవారుట. వీరు ఎన్నోసార్లు మైసూరు సంస్థానంలో కచేరీలు చేసి మహరాజా వారి అభిమానగాయకులుగా ఎన్నో సన్మానాలు, సత్కారాలు పొందారు.ఒకసారి వీరు కన్నడగౌళ రాగం లో పాడిన తిల్లానాకు ముగ్ధులై మహారాజావారు బంగారు కంకణ్ణాన్ని కూడా బహుకరించారు.
త్యాగరాజస్వామి వారి కీర్తనలన యొక్క అంతరంగిక భక్తిభావాన్ని ఎంతో లోతుగా అర్థం చేసుకున్నవారు శ్రీ సుబ్రహ్మణ్య అయ్యర్ గారు.వారి జీవితం అంతా త్యాగరాజకృతులను విశ్లేషిస్తూ, అదేవిధంగా రాగప్రాధాన్యతతో భక్తిరస ప్రధానమైన కీర్తనలను రచించారు
పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ ఎంత ఆదర్శవంతులైన శిష్యులో అంతే ఆదర్శవంతులైన గురువులు కూడా.తన శిష్యులను ఎంతో ప్రేమతో, పితృవాత్సల్యంతో చూచుకొనుచూ పాఠమును నేర్పెడివారట.ఎవరైనా శిష్యులు ఒక సంచారమును సరిగ్గా పాడలేని యెడల విసుగు చెందక అతినేర్పుతో వచ్చేవరకూ నేర్పుచుండెడివారట.
వారి శిష్య,ప్రశిష్యులందరూ గొప్ప విద్వాంసులే వారిలో శ్రీ రామ్నాడ్ శ్రీనివాస అయ్యంగర్, శ్రీ మైసూరు వాసుదేవాచార్యులు,శ్రీ టైగర్ వరదాచారి,కాకినాడ శ్రీ సి.ఎస్.కృష్ణ స్వామి, ఏనాది లక్ష్మి,ఏనాది నారాయణి(ఏనాది సోదరీమణులు),ఎం.ఎస్ రామస్వామి అయ్యర్ మొదలగు వారు ముఖ్యులు.

శ్రావ్యమైన సంగీతాన్ని ఆస్వాదించే రసజ్ఞులైన శ్రోతలు ఉన్నంతకాలం ఆయన కృతులు సంగీతజ్ఞులచే గానంచేయబడడమేకాక భావితరాలకు కూడా అందించబడతాయి.

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

No Comments


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information