శ్రీధరమాధురి -39
(పిల్లల పెంపకం గురించి పూజ్య గురుదేవుల అమృత వాక్కులు )

పసిబిడ్డ సృజనాత్మకమైనది, ఊహాశక్తి కలది.  తాజా ఆలోచనతో అది భూమ్మీదకి వస్తుంది. కొంతమందికి తమ బిడ్డలు ఎటువంటి ప్రయోగాలు చెయ్యటం ఇష్టం లేక భయపడతారు. వారు బయటకు ధైర్యస్తుల్లా కనిపించినా అన్నిటికీ భయపడుతూ ఉంటారు. అటువంటి వారిలో ఉన్న నటన పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది.

ఒక జంట విడిపోవాలని తీర్మానించుకున్నప్పుడు, ఇరువైపులా ఉన్న పెద్దలు వారిపై  కలిసి ఉండమని ఒత్తిడి తీసుకురాకూడదు. ఒక్కసారి ఒక జంట ఏ విధమైన అనుబంధం లేని స్థితికి చేరుకున్నాకా, పెద్దలు వారి భావనలకు అండగా నిలబడి, వారి జీవితం తదుపరి దశకు సాఫీగా చేరుకునేలా ఊతం అందించాలి.

వయసు పెరిగేకొద్దీ, స్వార్ధం నశించాలి, నిస్వార్ధ భావనలు పెంపొందించుకోవాలి. వయసు పెరిగిన వ్యక్తి  కేవలం తన కుటుంబం గురించి శ్రద్ధ వహించడం మాత్రమే కాక, సమాజాన్ని తన కుటుంబంలా చూడడం అలవర్చుకోవాలి. కొంతమంది వృద్ధులు తమ మనవల గురించి మునిమనవల గురించి దిగులు పడుతూ ఉంటారు. ఇది పూర్తిగా మూర్ఖత్వం. వారికి వయసు పెరిగిందే కాని, విశాలమైన దృక్పధం అలవడలేదు. అనుభవపూర్వకంగా ఇంత జీవితం గడిపాకా, పిన్నలు పడే ఇబ్బందులే వారిని బలోపేతం చేసి, ఉన్నత స్థితికి ఎదిగేలా చేస్తాయని వారికి తెలుసు కదా ! అటువంటి కుటుంబంలో ఉన్న పిల్లలను చూసి నేను జాలిపడతాను. అటువంటి వృద్ధుల నుంచి వారు విలువైన సలహాలు పొందడం అనేది కల్ల !

పెద్దలు పిల్లలను నియంత్రించడానికి అభద్రతా భావం అనేది ఒక కారణం. దీన్ని సమర్ధిస్తూ, కొందరు తమ పిల్లలు బాగుపడాలనే ఇలా చేస్తున్నామని అంటూ ఉంటారు. మీ ఉద్దేశం మంచిదే అయినా, నియంత్రణ ద్వారా దాన్ని అమలు పరచడం, సంభాళించడంలో మీరు విఫలం అవుతారు. నేను అటువంటి సంజాయిషీలను సమర్ధించను.ధైర్యవంతులైన తల్లిదండ్రులు తమ పిల్లలను నియంత్రించరు. అదే మీరు పిరికివారైతే, వారిని నియంత్రించి, పిల్లలు మీరు చెప్పినట్టల్లా ఆడేలా తయారుచేస్తారు. ఒకవేళ మీరు పిల్లల భవిత, జీవితం పట్ల నిజంగా ఆసక్తిని కలిగి ఉంటే, మీరు వారిని నియంత్రించరు.

మీ పిల్లలు మిమ్మల్నే పట్టుకు వేళ్ళాడుతూ ఉండడాన్ని ప్రోత్సహించకండి. అది మీకు కొంతకాలం సుఖంగా అనిపించినా, ఆ తర్వాత వారి అభివృద్ధిని, భవిష్యత్తును మీ చేతులతో మీరే పాడుచేసారని మీరు క్రుంగిపోయేలా చేస్తుంది.

కాలం మారింది... మీ కొడుకు/కూతురు పెళ్లి విషయంలో వారి అభిప్రాయాల్ని చెప్పే అవకాశం ఇవ్వండి. మీ భావాల్ని వారిపై రుద్దకండి. వారిని నిర్ణయాలు తీసుకోనిచ్చి, ఆ నిర్ణయాలకు బాధ్యత వహించనివ్వండి.

మీలోని అభద్రతా భావాలు మీ పిల్లల భవిష్యత్తును పాడు చెయ్యకూడదు.

బాధ్యత గల తల్లిదండ్రులుగా మీ బిడ్డ స్వంత నిర్ణయాలను నిజాయితీగా తీసుకునే అవకాశం ఇవ్వండి.

మొత్తం సమాజం మీ బిడ్డను కృంగిపోయేలా చేసినా కూడా, మీరు మీ బిడ్డ పక్షానే నిలిచి, వారికి అండగా నిలబడండి.

సమాజంతో కలిసి, మీరూ మీ బిడ్డను నిందిస్తే, పిల్లలు లేకుండా ఉండడమే మంచిది. అటువంటి తల్లిదండ్రులను పిల్లలు వెలివేసినా, నేను వారి భావాల్లోని వాస్తవికతను అనుభూతి చెందగలను.

బిడ్డల్ని అదుపులో పెట్టడం పేరుతో, చాలా మంది ఆ బిడ్డ సహజ స్వభావాన్ని పాడు చేస్తారు. 

ఒక బిడ్డకు మన నిరంతర సహకారం అవసరమైన సమయంలో, బాల్య చేష్టలని, మనం వారిని త్రోసిపుచ్చుతాము. ‘అహం’ అన్న పేరుతో ఒకరి దృష్టిని మీరు ఆకర్షించాలని చూసినప్పుడు, మిమ్మల్ని మీరే ఎందుకు నిరాకరించుకోరు?

బిడ్డ పుట్టగానే బొడ్డుతాడు కత్తిరించబడింది. అదింకా ఉన్నట్లుగా ప్రవర్తించకండి. జీవితపు వాస్తవాలను ఎదురుకుంటూ బిడ్డను ఎదగనివ్వండి.
మీ పిల్లలు అన్ని పనులను చెయ్యడంలో తొలి అనుభవాన్ని పొందనివ్వండి. మీ పనికిమాలిన ఆలోచనలను వారిలో నాటి, వారి మనసుల్ని కలుషితం చెయ్యకండి. ఇబ్బందులతో అయినా సరే, వారిని ఎదగనివ్వండి. అది వారిని మరింత గట్టి పడేలా చేస్తుంది. వారు తాజా ప్రస్తుత ప్రపంచానికి చెందిన వారు, మీరు మరణించిన గతానికి చెందినవారు. పిల్లలు అడిగితే తప్ప, పెద్దవారు వారి విషయాల్లో ఊరికే జోక్యం చేసుకోకూడదు.

మాతా పూర్వ రూపం...
తైత్తరీయ ఉపనిషత్తు ...

అమ్మ పూర్వ కాలానికి చెందినది. అమ్మ సృష్టి మూలాలకు చెందినది. అమ్మ పూర్వీకులకు చెందినది. ఆమె మీకు ఎన్నో ఎన్నో మార్లు తల్లిగా ఉంది. ఆమె ప్రేమను చూస్తే, ఆమెతో మీకు గతంలోనే  పరిచయమున్నట్లుగా మీరు గుర్తిస్తారు. ఈ ప్రేమ బంధం ఎన్నో తరాల గుండా పయనించింది, కొన్ని వేల సంవత్సరాలుగా... ఆ ప్రేమ ప్రపంచంలోనే గొప్పదని మీరు గుర్తిస్తారు. ఆమే స్వయంగా ఉనికి మూలాలకు సంబంధించినది కనుక, ఆమె ప్రేమతో సరిపోల్చదగినది ఏమీ లేవు. స్వార్ధపు ఛాయలు ఏ మాత్రం అంటని స్వచ్చమైన ప్రేమ అమ్మది.


ప్రతి బిడ్డా, భగవంతుడి వరప్రసాదమే. ఇందులో సక్రమమైన వారు, అక్రమమైన వారు అంటూ ఏమీ ఉండదు. మన సమాజం ప్రతి బిడ్డనూ అక్కున చేర్చుకోవాలి. ప్రతి బిడ్డకూ సహకారం, ప్రోత్సాహం అవసరం. నిజానికి ఒకరి పుట్టుక గురించి అడగడమే కుసంస్కారమైన విషయం.  నైతికత, పాతివ్రత్యం అనే పేరుతో ఈ రోజుల్లో అంతా నీతులు వల్లించడం చూస్తున్నాము. దీన్ని సమాజం కూడా అంగీకరించి, అలాగే ప్రవర్తించడం చూస్తున్నాము. ఏమైనా సరే, అటువంటి స్త్రీని, లేక బిడ్డను సమాజం చిన్న చూపు చూడకూడదు. నిజానికి, ఇతరుల కంటే సమాజం అటువంటి వారి గురించి మరింత శ్రద్ధ వహించాలి. ఉద్వేగపరమైన సహకారంతో సహా వారికి అన్ని విషయాల్లోనూ తోడ్పడాలి.

బిడ్డను గుర్తించేందుకు వేదకాలంలో తల్లి పేరును కలిపే ఆచారం ఉండేది అనేందుకు ఒక ఉదాహరణ...
సత్యకామ అనే బిడ్డ జాబాలకు కలిగాడు. అతడు వయసుకు వచ్చాకా, తన తండ్రి ఎవరని తల్లి జాబాలను అడిగాడు. అతని తండ్రి ఎవరో జాబాలకు తెలీదు కనుక, తనకు తెలియదనే చెప్పింది. హరిద్రుమత గౌతమ అనే ఒక ఋషి ఉండేవారు. సత్యకామ ఆయన గురుకులంలో శిష్యుడిగా చేరేందుకు వెళ్ళాడు. గౌతమ అతని తండ్రి ఎవరని సత్యకామను అడిగినప్పుడు, అతడు తన తల్లి జాబాలకు ఆ సంగతి తెలియదని చెప్పాడు. గౌతమ ఋషి, పిల్లవాడు నిజం చెప్పడం చూసి, ఆనందించారు. అతడు తన శిష్యుడిగా చేరేందుకు అర్హుడని ఆయన తెలియజేస్తూ, అప్పటినుండి అతడు ‘సత్యకామ జాబాల’ గా పిలవబడతాడని చెప్పారు.

తల్లిదండ్రులు లేక ఇంట్లో ఉన్న పెద్దలు బిడ్డను నియంత్రించకూడదు. బిడ్డ స్వతహాగా ప్రతిభతో, సృజనతో పుట్టింది. ఆ  సహజత్వాన్ని మీరు నిర్మూలించకూడదు. బిడ్డ అవసరాలేంటో తనే స్వయంగా క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయించుకునే అవకాశాన్ని ఇవ్వాలి. బిడ్డ అవసరాలన్నీ మీరే నిర్ణయించకూడదు. వారికి దైవం అనుగ్రహించిన ప్రతిభ ఏమిటో కనిపెట్టి, ఆ దిశగా ప్రోత్సహించాలి. మీ ఆలోచనలను, అభిప్రాయాలను బిడ్డపై రుద్దకూడదు. వారి గమ్యానికి వారినే నిర్దేశకులు కానివ్వండి.

 పరిస్థితులు ఏవైనా, మీరు మీ బిడ్డను నమ్మాలి. మీరు మీ బిడ్డను నమ్మకపోతే, మీ బిడ్డ మీతో ఏవీ పంచుకోదు. ప్రస్తుత ప్రపంచంలో, ఎవరైనా తమ బిడ్డను నమ్మి, వారిని స్నేహితులుగా భావించాలి. అప్పుడే బిడ్డ తాను స్కూల్ లో కాలేజీలో ఎదుర్కునే సమస్యలను మీతో స్వేచ్చగా చర్చిస్తుంది. జరిగేవన్నీ చెప్పాలని మీరు బిడ్డను బెదిరించినట్లయితే, వారు భయపడి, వేరొకరిని, లేక ఇతర వస్తువుల వద్ద మనఃశాంతిని పొందడం మొదలుపెడుతుంది, ఇది అత్యంత ప్రమాదకరమైనది. బిడ్డను సరిగ్గా పెంచడం అన్న పేరుతో అనవసర శ్రద్ధను చూపించి, మీ జీవితాన్ని పాడుచేసుకోకండి.

బిడ్డ స్వతహాగా ఆలోచించలేదనో లేక బలహీనమైనదనో భావించి, మీ అభిప్రాయాలను బిడ్డపై రుద్దడం ప్రారంభించగానే బిడ్డలో వ్యక్తిత్వం జాగృతమవ్వడం మీరు చూడవచ్చు, ఇది మిమ్మల్ని గాయపరుస్తుంది. మీ ఆలోచనలను బిడ్డపై రుద్దకండి, ఒకవేళ బిడ్డ విఫలమైతే అవ్వనివ్వండి, ఇబ్బందులు పదనివ్వండి, బాధ పడనివ్వండి. ఇవన్నీ బిడ్డను గట్టిపడేలా చేస్తాయి, భవిష్యత్తును ఎదుర్కునేందుకు అనుభవాన్ని ఇస్తాయి.
***

1 comments:

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top