Wednesday, November 23, 2016

thumbnail

శ్రీ దత్తాత్రేయ వైభవం - 9

శ్రీ దత్తాత్రేయ వైభవం - 9
శ్రీరామభట్ల ఆదిత్య

19. పంతొమ్మిదవ గురువు - పసిపిల్లవాడు.
పసిపిల్లలు ఎటువంటి కల్మషం లేనివారై శుద్ధమైన, పవిత్రమైన మనస్సు కలిగి ఉంటారు. కల్లాకపటం లేని స్వచ్ఛమైన మనసు కలిగి ఉంటారు వారు కాబట్టి భగవంతునితో సమానులు. వారు సాధుస్వభావులు. ఎవ్వరి మీద కోపం కానీ ద్వేషం కానీ చూపరు. కానీ నేటి మానవుడు అరిషడ్వర్గాలతో పరిపూర్ణుడు.
మనిషి కూడా ఒక పసిపిల్లవాడిలోని మంచి గుణాలును తెలుసుకుని వాటిని ఆచరించే ప్రయత్నం చేయాలి. మన మనస్సు గ్లాసు వంటిది. ఒకవేళ దానిలో మట్టి చేరిన తరువాత దానిలో పాలు పోసినా, నీరు పోసినా లేదా అమృతం పోసినా వ్యర్థమే. అలాగే మన మనస్సు కూడా కల్మషం లేకుండా ఉండాలి. లేకుంటే దానిలో ఎంత ఙ్ఞాన ప్రవాహం జరిగినా వృథాయే. అలా మనస్సుని సాధ్యమైనంత వరకు ఎలాంటి కల్మషముల చేత పాడు కాకుండా చూసుకోవాలి.
ఐహిక విషయాలపై మక్కువ పెంచుకున్నవాడికి ఎంత చెప్పినా వాడికి ఙ్ఞానం అంటదు. ఎందుకంటే వాడికి శ్రద్ధ లేదు కదా. ' శ్రద్ధావాన్ లభతే ఙ్ఞానం ' అంటుంది భగవద్గీత. ఒకవేళ అలా కల్మషమయమైనా దానిని సద్గురువైన భగవంతుడినే ఆశ్రయించి బాగుచేయాలంటాడు దత్తాత్రేయుడు. అందుకే మనిషికి భక్తి అనేది చాలా ముఖ్యం.
20. ఇరవైయవ గురువు - కన్య:
దీనికి సంబంధించి కూడా ఒక కథ ఉంది. ఒక ఊరిలో పేద దంపతులు ఉండేవారు. వారికి ఒక కుమార్తె ఉండేది. ఒకసారి కొంతమంది వారి ఇంటికి ఆతిథులు రావలసి వచ్చింది. కానీ ఆ సమయంలో ఆమె తల్లిదండ్రులు వ్యవసాయ పనులకై వెళ్ళారు. అతిథుల కోసం అన్నం వండుదామని బియ్యాన్ని చెరగడం మొదలుపెట్టింది. కానీ అలా చేసేటప్పుడు తన గాజులు బాగా చప్పుడు చేయటం మొదలుపెట్టాయి. కానీ అతిథులకు ఆ శబ్దం వలన ఇబ్బందిగా ఉంటుందేమో అని ఒక్కొక్కటిగా తన గాజులు తీసివేయటం మొదలుపెట్టింది. చివరికి ఒక్కో చేతికి కేవలం ఒకే గాజు మిగిలాయి. అలా మళ్ళీ చెరగడం మొదలు పెట్టాక శబ్దం రావటం ఆగిపోయాయి.
ఆ కథ నుండి మనం ఏం నేర్చుకోవాలంటే, సాధన అనేది ఏకాంతంగా సాగాలి. అప్పుడే మనం చాలా ముందుకు వెళ్ళగలుగుతాం. అనేక తత్త్వాలు లేదా వాదనలు ఓకే చోట ఉండలేవు. చాలా రకాల తత్త్వాలు భోధించే మహాపురుషులు ఒకేచోట ఉండలేరు. వారి భావనలను తప్పని మనం అనలేం. ఎందుకంటే భగవంతుని చేరుటకై అనేకానక మార్గాలున్నాయి. అందుకే మహాత్ములు కేవలం ఏకాంతానికే ప్రాముఖ్యం ఇస్తారు.
మనం ఈ భవబంధాలను కూడా బాగా వంట బట్టిచ్చుకొని వాటి కోసమే పరితపించకూడదు అంటాడు దత్తాత్రేయుడు. వాటికే అత్తుక్కొని ఉండకూడదు. వాటిని పుస్తకాలకు వేసే అట్టలలాగా మాత్రమే ఉంచి తరువాత సమయం వచ్చినప్పుడు వదిలేయాలి. కానీ అలా కాకుండా మనం మాత్రమే వాటినే శాశ్వతం అనుకొని వాటికై పరితపిస్తాము.
21. ఇరవైఒకటవ గురువు - పాము:
పాము ఎప్పుడూ ఏకాంతంగా ఇతర జంతువుల సహవాసం కోరదు. తన జీవితంలో ఎక్కువ భాగం ఏకాంతంగానే గడుపుతుంది. అలాగే మహాత్ములకు, ముముక్షువులకు ఏకాంతం అవసరం. ఈ విషయాన్ని మనం ఇంతకు ముందు ఉదాహరణలో కూడా చూశాం.
పాము ప్రతిసారీ తన కుబుసమును అంటే పాత చర్మాన్ని వదిలి కొత్త చర్మాన్ని ధరిస్తుంది. అలాగే ఆత్మ కూడా తన జననమరణ చక్రంలో ఎన్నో శరీరాలను ధరించి వదిలేస్తు ఉంటుంది. శరీరానికే మరణం కానీ ఆత్మకు కాదు. కానీ మనం మాత్రం ఈ విషయాన్ని అర్థం చేసుకోక ఈ శరీరాన్ని ఎంతగానో ప్రేమిస్తాం.
చివరికి మరణ సమయంలో కూడా మనం ఈ శరీరాన్ని వదలడానికి ప్రయత్నం చేయము. యమభటుల ప్రయాస వలన కానీ మన ఆత్మ శరీరం నుండి వడివడదు. ఈ విషయం మనకు భగవద్గీతలో కూడా కనిపిస్తుంది. అందుకే ఙ్ఞాని ఎప్పుడు మరణం గురించి భయపడడు. ఈ జననమరణ చక్రం నుండి ఎలా బయటపడాలో ఆలోచిస్తూంటాడు.
(ఇంకా ఉంది...)

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

No Comments


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information