Saturday, April 22, 2017

thumbnail

దీపారాధన

బాల గేయాలు 
-టేకుమళ్ళ వెంకటప్పయ్య
దీపారాధన

పిల్లలకు నేడు దీపారాధన అంటే కేవలం దేవాలయాలలోనో, వ్రతాలు, నోముల సందర్భాలలో తప్ప చూసి ఎరుగరు. దీపారాధన ప్రతినిత్యం దేవుని ముందు చేయడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. సాధారణంగా, ముందు వత్తులు వేసి నూనె పోస్తూ ఉంటారు. కానీ, ముందు నూనె పోసిన తర్వాతే వత్తులు వేయాలి అని శాస్త్రం చెప్తోంది. దీపారాధన చేయగానే ముందు మూడు చోట్ల కుంకుమ పెట్టాలి. రెండు వత్తులు వేయాలి. ఏక వత్తి అశుభాలకు మాత్రమే వాడతారు. దీప పీఠభాగం బ్రహ్మ, స్థంభం విష్ణువు, వత్తి ఈశ్వరునితో సమానం.  వెలుగు శక్తికి స్వరూపం.
నువ్వులనూనె దీపాల వలననే పూర్వం ఎవ్వరూ కళ్ళజోళ్ళు ధరించేవారు కాదు. నువ్వులనూనె దీపారాధన దగ్గర వరుసగా ఒక ఆరు నెలలు కూర్చొని గమనిoచండి. కంటివ్యాధులు మటుమాయం అని పెద్దలు చెప్తారు. ఇవన్నీ మరచిపోయాం. విద్యుద్దీపాల కాంతిలో మెరిసిపోతున్నాం మురిసి పోతున్నాం. నేత్రరోగాల బారిన పడుతున్నాం.
పూర్వం రకరకాల నూనెలతో దీపాలు వెలిగించే వారు. ఆవు నేతితో దీపం వెలిగించటవల్ల శుభప్రదంగా ఉంటుంది. ఆముదపు నూనె ఉపయోగిస్తే దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో సాగుతుంది. విప్పనూనె, వేప నూనెలతో,  చేస్తే ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆవునెయ్యి, విప్పనూనె, వేప నూనె, ఆముదపు నూనె, కొబ్బరి నూనెల మిశ్రమంతో 48 రోజులపాటు క్రమం తప్పకుండా దీపారాధన చేస్తే అమ్మవారి అనుగ్రహం లభించి, సకల సంపదలు, అష్టైశ్వర్యాలు సిద్దిస్తాయి.  తెల్లవారి కాలకృత్యాల తర్వాత దీపారాధన చేసి భగవంతుడి నిశ్చలబుద్దితో ధ్యానించడం వల్ల మానసిక ప్రశాంతి కలుగుతుంది. ఆరోజంతా మంచి పనులే చేయాలన్న తలంపులు కలిగి భగవంతుని ప్రీతికరమైకార్యాలు చేస్తామని పెద్దలంటారు. అలానే సాయంసంధ్యవేళ చేసే ఆరాధన ఆ రోజు చేయలేకపోయిన మంచికార్యాలు ఏవైనా మిగిలుంటే వాటిని రేపటిరోజున చేసే శక్తిని పుంజుకోవడానికి పనికివస్తుంది. మనసు ప్రశాంతంగా దైవధ్యానానికి ఉపకరిస్తుంది. అందుకే రెండుపూటలా దీపారాధన చేసి భగవంతుడిని ప్రార్థిస్తే ఎవరికి వారికే కాక చుట్టూ ఉన్న పరిసరాలు కూడా ప్రశాంత వాతవరణానికి దగ్గరవుతాయి.  దీపం పరబ్రహ్మ స్వరూపం. దీపారాధన జరిగే ప్రదేశంలో మహాక్ష్మి స్థిర నివాసం చేస్తుందని, దీపం లేని ఇళ్ళు కళావిహీనమై, అలక్ష్మీస్థానం అవుతాయని చెప్పారు. దీపారాధన లేకుండా దేవతారాధన చేయరు. దీపం సకల దేవతా స్వరూపం. ఇవన్నీ మనం పిల్లలకు తెలియజెప్పాలి.
ఈ మాసం పిల్లకు దీపారాధన సమయంలో చదువ వలసిన శ్లోకాలు కొన్ని చూద్దం. ఇవి మనం రోజూ చదువుతూ పిల్లలతో చదివిస్తూ ఉండాలి. మన సంస్కృతి, హైందవ జీవన ధర్మాలు పిల్లకు బోధపరచాలి.
రక్ష రక్ష!
సంధ్య రక్ష!
సర్వ రక్ష!
దీప రక్ష!
దివ్య రక్ష!
చిన్ని నా అబ్బాయికి శ్రీ రామ రక్ష!
(దీపం పెట్టగానే దీపానికి అరచేయి చూపించి అబ్బాయి/అమ్మాయి కళ్ళకు అద్దుతూ ఈ పాట పాడాలి)
అలాగే సాయంత్రం సంధ్యా దీపం పెట్టగానే..
దీపం జ్యోతి పరబ్రహ్మం
దీపస్సర్వ తమోపహ
దీపేనా సాధ్యతే సర్వం
సంధ్యా దీపం నమోస్తుతే
అంటూ ప్రార్ధించాలి. చీకటిని, దారిద్ర్యాన్ని, అజ్ఞానాన్నీ పారద్రోలి వెలుగును,  సంపదనూ, జ్ఞానాన్నీ ఇస్తుందని తెలియజెప్పాలి.
-0o0-


Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

No Comments


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information