Sunday, April 23, 2017

thumbnail

కాలేజి రోజులు...

కాలేజి రోజులు...
మా బాపట్ల కధలు – 14
భావరాజు పద్మిని

“బి.యి.సి పూర్వ విద్యార్ధుల సమావేశం” – అన్న సబ్జెక్టుతో వచ్చిన ఈమెయిలు చూడగానే మనసంతా కొత్త ఉత్సాహంతో నిండిపోయింది వసంత్ కి. ఒక్కసారి ఆలోచనలన్నీ తన కాలేజి రోజుల మధురమైన అనుభూతులు సంతరించుకుని, గుబాళించసాగాయి.
అసలు 18 ఏళ్ళ క్రితం తాను బాపట్లలో ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని బయటపడ్డాకా తన ఫ్రెండ్స్ అందరితో సంబంధాలు తెగిపోయాయి. కాని, తనుండే ఢిల్లీ మహానగరంలో విహరించేందుకు వచ్చి,  అనుకోకుండా ఏడాది క్రితం ఇండియా గేటు వద్ద కలిసాడు, తన స్నేహితుడు ఆంజనేయులు ! సోషల్ మీడియాలో వివిధ గ్రూప్ లు అప్పటికే సృష్టించబడి ఉండడంతో, అతను నిర్వహించే అవర్ బి.యి.సిఅనే వాట్స్ ఆప్ గ్రూప్ లో తనను కలిపాడు.  తన పాత మిత్రులతో తనకు మళ్ళీ అనుబంధం కలిగించాడు. అలా మళ్ళీ పెరిగిన పరిచయమే ఈ ఈమెయిలు వచ్చేలా చేసింది. తనకు తెలుసు తనకే కాదు, కోమల్ కి కూడా ఈమెయిలు వచ్చే ఉంటుంది, తన మనసూ ఈ సమావేశానికి వెళ్లేందుకు ఉరకలేస్తూ ఉంటుంది. తను కాలేజిలో అడుగుపెట్టిన తొలి రోజు గుర్తుకు వచ్చింది అతనికి... తన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తుకురాసాగాయి.
****
వసంత్ పుట్టింది ఢిల్లీ మహానగరంలో. కాని, అతని తల్లి, తండ్రి ఉద్యోగస్తులు అవడంతో చిన్నప్పుడు వేసవి సెలవలు వచ్చినప్పుడల్లా అతన్ని అమ్మమ్మ దగ్గర వదిలిపెట్టేవారు. అప్పట్లో వసంత్ మేనమామ కొన్నాళ్ళు బాపట్ల బ్యాంకులో పనిచేసేవారు. మేనమామకు వసంత్ అంటే ఎంతో ముద్దు. సాయంత్రం అయితే చాలు, లూనా ముందు అతన్ని కూర్చోబెట్టుకుని, గడియారపు స్థంభం సెంటర్లో బాదంపాలు తాగించి, బావయ్య బజ్జీలు తినిపించి, షికారు తిప్పేవాడు.   అప్పుడప్పుడు వసంత్ సముద్రానికి తీసుకు వెళ్ళమని మారాం చేస్తే, విసుక్కోకుండా తీసుకుని వెళ్ళేవాడు. వైశాఖ మాసంలో అయితే భావన్నారాయణ స్వామి తిరునాళ్ళు వచ్చిందంటే, అదో గొప్ప పండుగే. బొమ్మలు, లక్కపిడతలు, గిలకలు అన్నీ కొనిపించుకుని, మేనమామ కొడుకులతో ఆడేవాడు. కొన్నాళ్ళకు మావయ్య కి ట్రాన్స్ఫర్ అవడంతో వారు విజయవాడ వెళ్ళిపోయారు. కాని బాపట్ల వసంత్ మనసులో ఒక తియ్యటి జ్ఞాపకంగా అలాగే ఉండిపోయింది.
మళ్ళీ ఇన్నాళ్ళకు బాపట్ల వచ్చే అవకాశం దొరికింది...
“బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీ”
విద్యార్దులనే భావి భారత అద్భుత శిల్పాలను రూపుదిద్దే నిపుణుడైన శిల్పిలా, దర్పంగా, ఠీవిగా ఉన్న ఆ విశాలమైన కాలేజీ భవంతిని ఆరాధనగా చూస్తూ ఒక్క క్షణం అలాగే నిలబడిపోయాడు వసంత్. చిన్నప్పుడు అమ్మమ్మ చీరాల అవధూత స్వామి వద్దకు బస్సులో తీసుకు వెళ్ళేటప్పుడు ఆ భవంతి వంక ఆశ్చర్యంగా చూసేవాడు, కాని తను ఇందులో చదవుతానని కల్లో కూడా ఊహించలేదు అతను. 1962 నుంచి ,అనేక రంగాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తూ, నవీన భారతాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్న మేటి ఇంజనీర్లను తీర్చిదిద్దిన ఘనత ఈ కాలేజిది. ఈ ఊరితో ఉన్న అనుబంధం దృష్ట్యా ఇక్కడే ఇంజనీరింగ్ చదువుతానని పంతం పట్టి, నాన్ లోకల్ కోటాలో సీట్ సంపాదించి వచ్చాడు అతను.
ఒకింత ఆనందంతో కూడిన ఉద్వేగంతో తన క్లాసు లోకి అడుగుపెట్టాడు వసంత్. ఆ సరికే క్లాసులో కొంతమంది సీనియర్స్ కలిసి పాలబొమ్మలా ఉన్న ఒక అమ్మాయిని రాగింగ్ చేసేందుకు నానా తిప్పలూ పడుతున్నారు. మాటిమాటికీ “వాట్, కం అగైన్” అంటోంది ఆమె... ఆమె యాసలో విదేశీ పోకడలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఆమెకు తెలుగు రాదు, వీళ్ళకు తెలుగు తప్ప వేరే భాష రాదు. తెలుగు వారి మేధస్సు చాకులా ఉంటుంది. కాని, అప్పట్లో స్కూల్ లో, కాలేజి లలో కేవలం తెలుగులోనే మాట్లాడుతూ, భాష తెలియని వారిని కూడా తెలుగులోకి లాక్కొచ్చే ప్రతిభ మనవాళ్ళకు ఉండడం వల్ల, వీళ్ళ పప్పులు ఆ అమ్మాయి దగ్గర ఉడకట్లేదు.
“టెల్ వాట్ యువర్ నేమ్” అన్నాడొక నల్లనివాడు. “నేమ్... యు వాంట్ టు నో మై నేమ్... ఖోమల్...” అందామె విదేశీ యాసలో. “వేర్ యు కం ఫ్రొం “ కష్టపడి పదాలు పట్టి పట్టి అడిగాడు ఓ కళ్ళజోడు... నవ్వాపుకుంటూ, “ఢిల్లీ” అందామె. “తెరేకో జాంతీ హిందీ కైకూ నై ” అన్నాడు వెంటనే ఒకడు హైదరాబాదీ హిందీ గుర్తు చేసుకుంటూ... “హిందీ, కైకూ?...” అందామె వాళ్ళందరినీ అదోలా చూస్తూ. “కైకూ” అన్న పదం కేవలం హైదరాబాదీలే వాడతారు. నార్త్ లో వాడరు మరి !
“ఏంటోరా, ఢిల్లీ అంటది, హిందీ రాదంటది. భాష చూస్తే విదేశాల యాస. మనం రాగింగ్ చేస్తున్నామా, చెయ్యబడుతున్నమా? తెలీట్లేదు రో...” అన్నాడొకడు దిగులుగా.
“ఒరేయ్... మనతో మాట్టాడేతప్పుడు ‘సర్’ అని జవాబుకు ముందు వెనుకా తగిలించమని, కనబడ్డప్పుడు విధిగా గుడ్ మార్నింగ్ సర్ , గుడ్ ఈవెనింగ్ సర్ అని చెప్పాలని ఈవిడికి చెప్పేది ఎలారా?’ బుర్ర బాదుకున్నాడు మరొకడు.
 ఈ సందట్లో మిగతా విద్యార్ధులంతా ఆ రోజుకి తాము రక్షింపబడినందుకు ముక్కోటి దేవతలకు మొక్కుకున్నారు. ఈ లోపల లెక్చరర్ రావడంతో సీనియర్ గ్యాంగ్ జంప్ అయ్యారు.
“నా పేరు శ్రీనివాస్. మీకు ఇంజనీరింగ్ కెమిస్ట్రీ చెప్పే లెక్చరర్ ని. కష్టపడి సీట్లు సంపాదించిన మీ అందరికీ స్వాగతం. అనేక ప్రాంతాల నుంచి వచ్చిన మీరంతా తమ తమ పరిచయాలు చేసుకోండి “ అన్నారు.
ఒక్కక్కరే పరిచయాలు చేసుకోసాగారు. నేను చక్కటి ఇంగ్లీష్ మాట్లాడడం, ఢిల్లీ నుంచి వచ్చానని చెప్పడంతో కోమల్ నావంక కాసేపు తదేకంగా చూసింది.
“నా పేరు కోమల్. మా అమ్మ పంజాబీ. నాన్న అమెరికన్. వాళ్ళది ప్రేమ వివాహం కావడంతో నేను అమెరికాలోనే పెరిగాను. నాలుగేళ్ళ క్రితం నాన్న ఒక ప్రమాదంలో చనిపోవడంతో నేను, అమ్మ మళ్ళీ అమ్మమ్మ ఇంటికి  ఢిల్లీ వచ్చేసాము. నా ప్లస్ టు చదువు అయ్యాకా, హాస్టల్, కాలేజి బాగుంటాయని, మా అంకుల్ ఇక్కడ నన్ను రికమాండ్ చేసి చేర్పించారు. నాకిక్కడ అంతా బాగా నచ్చింది, కాని, భాష తెలీక ఇబ్బందిగా ఉంది.” ఇదీ ఆమె చేసుకున్న పరిచయం.
వెంటనే లెక్చరర్ శ్రీనివాస్ గారు, “వసంత్, నువ్వు కూడా ఢిల్లీ నుంచే వచ్చావు కదా. ఈమెకు సాయంగా ఉండు. వీలయితే మన భాష నేర్పించు, అప్పుడు తను తేలిగ్గా అలవాటుపడుతుంది.” అన్నారు లెక్చరర్, నేను “తప్పకుండా సర్” అన్నాను. కాలేజి ముగిసాకా వెళ్తున్న నన్ను ఆగమని, నా సాయం కోరింది కోమల్. ముఖ్యంగా పాఠాలు కూడా ఎక్కువ శాతం తెలుగులోనే చెబుతుండడం తనకు కాస్త ఇబ్బందిని కలిగిస్తోందని, తగిన ట్యూషన్లు ఉంటే కనుక్కోమని అడిగింది.
పటేల్ నగర్ లో మేడమీద అద్దెకు చిన్న గది తీసుకుని, అన్నీ ఏర్పాటు చేసుకున్నాను నేను. అమ్మా, నాన్న తనతో వచ్చి, తనకు సాయం చేసి, జాగ్రత్తలు చెప్పి, దింపి వెళ్ళారు. అప్పటికే వారం గడిచిపోయింది. ఆ రోజు ఉదయాన్నే లేచి, నా వద్ద ఉన్న చిన్న స్టవ్ మీద కాఫీ పెట్టుకుని, చేతిలో ఉన్న పుస్తకం చదువుకుంటూ, పచార్లు చేస్తూ ఉన్నాను.
వెనుక డాబా నుంచి “హాయ్ వషంత్ , వావ్, యు స్టే హియర్ర్ ...” అన్న పలకరింపు విని, వెనక్కు తిరిగి, ఉలిక్కి పడ్డాను. డాబా మీద కోమల్ ! ఇంతలో ఒక పెద్దాయన అక్కడ కనిపించారు. నా వివరాలు కనుక్కుని,
“బాబూ, ఈ అమ్మాయి తల్లి మా దూరపు బంధువులకి బాగా తెలుసు.  తనకు భాష తెలీదు కనుక, తను పెరిగిన వాతావరణం వేరు కనుక, హాస్టల్ లో ఇమడలేదని,  వేరే గది అద్దెకు చూడమని, ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసింది. ఎక్కడో ఎందుకు, మా డాబా మీదనే ఉండచ్చని, ఇక్కడైతే భద్రత ఉంటుందని, ఇక్కడికి తెచ్చాను. నువ్వూ, తనూ ఒకే క్లాసు కనుక, కొన్నాళ్ళు అండగా కనిపెట్టుకు ఉండాలి.” అన్నారు.
“తప్పకుండా అంకుల్” అన్నాను నేను. నెమ్మదిగా తనకు క్లాసు పాఠాలు చిన్న చిన్న తెలుగు అక్షరాలు, పదాలు నేర్పసాగాను. కాలేజిలో, గది దగ్గర మొదటి నుంచి మేము కలిసి తిరగుతున్న కారణం అందరికీ తెలిసిందే కనుక, ఎవరూ పెద్దగా పట్టించుకునేవారు కాదు.
కాలేజీలో రాగింగ్ ను నిషేధించారు. అయినా సీనియర్స్ బయట కనబడ్డప్పుడు, రూమ్ కి పిలిపించుకుని కొన్ని కొంటె పద్ధతుల్లో రాగింగ్ చేసేవారు. ఫ్రెషర్స్ పార్టీ తర్వాత వాళ్ళే ఎంతో ఆత్మీయంగా ఉంటూ, అన్ని విధాలా గైడ్ చెయ్యసాగారు. కాలేజిలో అన్ని డిపార్ట్మెంట్ల హెచ్.ఓ.డి లు, లెక్చరర్లు  అత్యంత ప్రతిభావంతులు. చదువుతో పాటు భవిష్యత్తు గురించి కూడా ఎన్నో అమూల్యమైన విషయాలను చెప్పేవారు. లైబ్రరీ చాలా బాగుండేది. ల్యాబ్ లో సౌకర్యాలు, వర్క్ షాప్ లు, ప్రాజెక్ట్స్,  అప్పుడప్పుడే ఏర్పాటవుతున్న కాంటీన్, కంప్యూటర్ ల్యాబ్ వసతులు చాలా బాగుండేవి. మధ్య మధ్యలో రకరకాల ‘ఇంటర్ కాలేజీ పోటీలు’ , ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి. విద్యార్ధులకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా సిబ్బంది అండగా నిలబడి, సాయపడేవారు. మొత్తానికి ఒక విద్యార్ధి అన్ని విధాలుగా ఆత్మస్థైర్యంతో ఎదిగేందుకు తగిన వాతావరణం అక్కడ ఉండేది.
మూడు నెలల్లోనే చాలా వరకు తెలుగు మాట్లాడడం పట్టుదలగా నేర్చుకుంది కోమల్. ఒకరోజు “నాకు మొక్కలు చాలా ఇష్టం, నన్ను ఏదైనా నర్సరీ కి తీసుకువెళ్లవా? “ అని అడిగింది.
“నర్సరీలు మన కాలేజి దగ్గరే ఉన్నాయి. వాతావరణం బాగుంది, చెక్క రిక్షా ఎక్కి వెళ్దామా?” అని అడిగాను, సరేనంది. కాలేజికి వెళ్ళే దారి పొడవునా అల్ల నేరేడు చెట్లు... అక్కడక్కడా చెట్ల కింద పళ్ళు రాలి ఉన్నాయి. ఒక చోట కొమ్మ కిందికి ఉంటే, రిక్షా ఆపించి కాసిన్ని పళ్ళు కోసిచ్చాను. చాలా ఇష్టంగా తింది కోమల్. నర్సరీకి వెళ్ళాకా మొక్కలు  చూస్తూ వెనకవైపుకు వెళ్ళగానే, అక్కడ కనిపించింది విరగబూసిన కనకాంబరం తోట. అందులో ఒక చిన్న పాక, ఒక ప్రక్కగా మల్లె చెట్లు, మరోప్రక్క విరాజాజి తీగలు ఉన్నాయి. దారిలో చిన్న పిల్లకాలువ కూడా ఉంది. అవన్నీ చూడగానే పసిపాపే అయిపొయింది కోమల్. తనను అక్కడికి తీసుకు వెళ్ళమని మారం చేసింది. నేను నర్సరీ అతనితో మాట్లాడి, ఆమెను తోటలోకి తీసుకుని వెళ్లాను. ఆమెకు ఆ తోట, వాతావరణం బాగా నచ్చింది. దోసిలి నిండా కోసుకున్న పూలు, కొన్న కొత్త మొక్కలతో ఇద్దరం చెక్కరిక్షా ఎక్కి వెనుదిరిగాము. “ఏం బాబూ మీ మరదలా?” అన్నాడు రిక్షావాడు. ఏం చెప్పాలో తెలీక “ అవును” అని ఊరుకున్నాను. తనకీ అర్ధమైనట్లుంది, గుంభనంగా నవ్వి ఊరుకుంది.
అప్పుడప్పుడు కాలేజి వదిలాకా తనకు నచ్చిన ఆ తోటకి తీసుకుని వెళ్ళమనేది కోమల్. ప్రకృతి ఆరాధకురాలైన తను, ఆ పూలలో కలిసిపోతే మరో పువ్వులా అనిపించేది నాకు. ఎప్పుడైనా అలా బస్టాండ్ దగ్గర బాబా గుడికో, లేక బీచ్ కో తీసుకు వెళ్ళ మనేది. నాతో ఎక్కడికి వెళ్ళినా, తను భద్రంగా ఉంటుందన్న నమ్మకం కలిగింది తనకు.

దసరా సెలవల్లో ఇద్దరం ఢిల్లీ వెళ్ళినప్పుడు తన తల్లిని తీసుకుని, మా ఇంటికి వచ్చింది కోమల్. అలా కుటుంబాల మధ్యా పరిచయాలు ఏర్పడ్డాయి. సెలవల్లో ఢిల్లీ లోనూ తరచుగా కలుసుకునేవాళ్ళం.
మా కళ్ళ ముందే కాలేజి రూపురేఖలు మారిపోసాగాయి. కొత్తగా అండర్ గ్రౌండ్ లో కంప్యూటర్ ల్యాబ్, అధునాతన భవంతులు, కాంటీన్ కం గెస్ట్ హౌస్ అన్నీ ఏర్పడ్డాయి. గెస్ట్ లెక్చర్ లు ఇచ్చేందుకు వచ్చే పెద్ద ప్రొఫెసర్లు అందులో ఉండేవారు.  చూస్తుండగానే మొదటి ఏడాది గడిచిపోయింది. మొదట్లో రాగింగ్ చేస్తున్నారని మొత్తుకున్న తన క్లాసువారే రెండో ఏడాది దబాయించి జూనియర్స్ ని ఏడిపిస్తుంటే, భలే తమాషాగా అనిపించేది తనకి. అయినా గొడవలు, కులాల కూటములు, వీటన్నిటికి దూరంగా ఉంటూ అందరితో సరదాగా ఉండేవాడు తను.
 గొడవలు, స్పర్ధలు అంటారు... అంటే ఏంటో నాకు, కోమల్ కి తెలీదు. ఇంజనీరింగ్ మొదటి ఏడాది మొదలైన మా బంధం క్రమంగా బలపడి, నాలుగేళ్ళూ కొనసాగింది. కాని తనతో ఎప్పుడూ హద్దుమీరి ప్రవర్తించలేదు. మా దృష్టంతా చదువు మీదే. ఇంజనీరింగ్ చదివాకా గేట్ రాసి, అమెరికా వెళ్ళాలన్నది నా కోరిక. ఢిల్లీలోనే తల్లి వద్ద ఉంటూ ఏదైనా ఉద్యోగం చేసుకోవాలని తన కోరిక. అలా చదువయ్యి బయటపడ్డాకా, నేను ఎం.ఎస్ చేసేందుకు అమెరికా వెళ్ళిపోయాను. కోమల్ ఏదో ఉద్యోగంలో చేరింది. ఇద్దరం ఈమెయిలు ఇచ్చుకునేవాళ్ళం. ఆ తర్వాత రెండేళ్ళకు నాకు ఢిల్లీ లోనే మంచి ఉద్యోగం రావడంతో, నేను వెనుదిరిగి రాగానే, కోమల్ మా ఇంట్లోనే నాకోసం ఎదురుచూస్తూ ఉండడం ఆశ్చర్యం కలిగించింది. పెద్దల అంగీకారంతో కులమతాలకు అతీతంగా మా పెళ్లి జరిగిపోయింది. ఇద్దరం ఉద్యోగాలు చేసుకుంటూ అక్కడే స్థిరపడిపోయాము.
****
ఆ రోజు హైదరాబాద్ లో జరిగిన బి.యి.సి పూర్వ విద్యార్ధుల సమావేశంలో మా క్లాసుమేట్స్ అందరినీ కలుసుకుని ఇద్దరం ఎంతో ఆనందించాము. మా ఇద్దరికీ పెళ్లయిందని తెలుసుకుని, అందరూ చాలా సంతోషించారు. కాలం మనుషుల్లో ఎంత మార్పు తెస్తుంది ? మాట్లాడడానికే భయపడే ఆంజనేయులు ఈరోజు ఎంతో ఆత్మస్థైర్యంతో ఇంత మందినీ పోగేసి మీటింగ్ పెట్టాడు. వచ్చిన వారిలో ఒక్కొక్కారూ కాలేజీ వదిలాకా, తమకు కలిగిన జీవితానుభవాల్ని పంచుకున్నారు. కాలేజీలో తమకిచ్చిన శిక్షణ, ఆ పరిస్థితులకు అనుగుణంగా తమనుతాము మలచుకునేందుకు ఎలా ఉపయోగపడిందో చెప్పారు. ఎన్ని పాఠాలు నేర్పుతుంది జీవితం ! ఎంత మార్పు తెస్తుంది? ఆశ్చర్యపోతూనే మిత్రులతో ఆ రోజంతా గడిపాము. మళ్ళీ మేము వెళ్ళిన ఆ తోటని, మాకెంతో ఇష్టమైన బాపట్లని చూడాలని కోమల్ అడిగితే, మరపురాని ఆ కాలేజి రోజుల్ని మళ్ళీ తల్చుకోడానికి, టాక్సీ తీసుకుని, వెళ్ళాము.
“వసంత్... మనం ఈ తోటను కొనుక్కుని, ఇక్కడే మన చివరి రోజులు గడిపేందుకు ఒక ఫార్మ్ హౌస్ కట్టుకుంటే బాగుంటుంది కదా !” అని అడిగింది కోమల్. వెంటనే మాతో చదువుకుని, బాపట్ల లోనే వ్యవసాయం చేసుకుంటున్న సుబ్రహ్మణ్యం తో విషయం చెప్పాను. కొన్నాళ్ళకి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి అయ్యాయి. కోమల్ ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఫార్మ్ హౌస్ గృహప్రవేశం చేసుకుని, వెనక్కి వస్తూ... మా విద్యకు, అనుబంధానికి, భవితకు బాటలు వేసిన ఆ కాలేజికి మనః పూర్వకంగా నమస్కరించుకుని, ఢిల్లీ బయలుదేరాము.
***

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

4 Comments

avatar

Padmini Garu...namasthe. meeru rase Bapatla kadhalu chaduvutunnanu.naku chala nachayi.madi kooda Bapatla me. aa series lo patha kadhalu ma mother chadavali anukunta natural.but adi elano teliyadam ledu.please guide me.

Reply Delete
avatar

Padmini Garu.. namasthe.nenu mee Bapatla kadhalu chaduvutunnanu.chala bavunnayi. Aa series lo patha kadhalu ma mother chadavali anukuntunnaru. Avi ela Search cheyyalo kastha guide cheyyagalara please

Reply Delete
avatar

నమస్తే రేణుక గారు. చాలా సంతోషమండి. క్రింది లింక్ లో నా రచనలు అన్నీ ఉన్నాయి. దర్శించగలరు.
http://writers.acchamgatelugu.com/2017/06/bhavaraju-padmini.html

Reply Delete
avatar

http://writers.acchamgatelugu.com/2017/06/bhavaraju-padmini.html

Reply Delete


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information