ఇం(వం)టింటి రామాయణం - అచ్చంగా తెలుగు

ఇం(వం)టింటి రామాయణం

Share This
ఇం(వం)టింటి రామాయణం
గొర్తి వేంకట సోమనాధ శాస్త్రి(సోమసుధ)
బ్రహ్మచారిగా తిండి కోసం యిల్లా, హోటలా అని అల్లాడిన నాకు వరాలు భార్యగా యింట్లో అడుగు పెట్టాక కధలు వ్రాసుకోవటానికి కావలసినంత ఖాళీ దొరుకుతోంది. ఆఫీసులో బుర్ర, ఒళ్ళు హూనం చేసుకొని యింటికి వచ్చేసరికి మంచినీళ్ళందించి, కాఫీనో, టీనో కాచి పోసి, కాసేపు తన ఊరి కబుర్లు చెప్పి, కడుపు నింపుకోవటానికి కాస్త ఉడకేసి పడేసే వ్యక్తి ఉంటే, కుర్చీలో కూలబడి సమాజసమస్యలు, రాజకీయాలు మాట్లాడటానికి మహత్తరంగా ఉండదు మరి! అయితే అయిదేళ్ళు బ్రహ్మచారిగా ఒంటరిగా బ్రతికిన వాడికి సాయంత్రం యింటికెళ్ళేప్పుడు ఏదో కొని పట్టుకెళ్ళాలన్న ఆలోచన రాదు కదా! అది కూడా మధుగాడిని చూసి తెలుసుకొన్నాను. నిజమే! వాడన్నట్లు మనకోసం యింతచేస్తున్న వాళ్ళకి సాయంత్రం యింటికెళ్ళేప్పుడు పూల పాకెట్టు పట్టుకెళ్తే చాలు, మరింకేం అడగరు.
మా పెళ్ళయిన నెల్లాళ్ళకి మంచి ముహూర్తం చూసి వరాల్ని నా రూంకి(బ్రహ్మచారి బ్రతుకులు సాధారణంగా ఒక్క గదికే పరిమితమై ఉంటాయిగా) తీసుకువచ్చి దిగవిడిచి వెళ్ళారు మావగారు. ఆమె అడుగు పెట్టినప్పుడు అస్తవ్యస్తంగా ఉండే గది సాయంత్రానికి ముచ్చటగా అలంకరించబడింది. కాకపోతే ప్రక్కనున్న వీధిలోంచి త్రాగిన భర్తలు తన్నుతూ ఉంటే గోల పెట్టే భార్యల ఏడుపులూ, పెడబొబ్బలు వినాల్సి వచ్చేది. వాటిని విని వరాలు నవ్వుకొంటూంటే "ఈ వాతావరణం నీకెలా ఉంది?" అని అడిగాను.
" మా పల్లెటూళ్ళో నిత్యం ఉండేదేగదా!" అని బదులిచ్చింది.
అయినా సరే! జీవితంపై మా సరదా చచ్చిపోకుండా ఉండటానికి, వరాలి భద్రత కోసం మూడు నెలల్లో బజారుకి కాస్త దగ్గరగా ఉండే ప్రాంతంలో ఒక మూడుగదుల యిల్లు అద్దెకు తీసుకొని అక్కడికి మారిపోయాం.
" ఇప్పుడెలాగుంది?" అడిగాను.
"సాయంత్రం అయ్యేసరికి సందడి లేదు. అయినా ఫరవాలేదు" నిర్లిప్తంగా చెప్పింది.
ఈ లోపున గృహస్తుగా భార్యని రంజింపజేయటానికి భర్తగా చేయవలసినదేమిటో అనుభవం ఉన్న మధుగాణ్ణి అడిగి తెలుసుకొన్నాను.
నా జీవితంలో మొదటిసారి మార్కెట్టులో పూలు కొని, బాగ్ లో పడేసుకొని హుషారుగా యింటికొచ్చాను. ఇంటికి రాగానే చేతిలోని బాగ్ బల్లపై పడేసి, పాతకాలపు వాలుకుర్చీలో వాలి మూల కూర్చున్న వరాలికేసి చూశాను.
"అదేంటోయి అలా కూర్చున్నావు? లోపలికెళ్ళి కాసిని నీళ్ళు తే! ఈరోజు నీకోసం మంచి కానుక తెచ్చాను" అన్నాను.
"కూజాబిందెలో నీళ్ళున్నాయి.ప్రక్కనే పాతకాలం మరచెంబు ఉంది. మీక్కావలసినన్ని నీళ్ళు త్రాగిరండి" అంది కదలకుండానే.
"పరాచికాలు తరువాత.నువ్వు త్వరగా తెమిలితే కుమారి ఏ.సి.ధియేటర్లో మొదటిఆట చూసుకొని, అలాగే అలకాపురిలో భోజనం లాగించి హాయిగా యింటికొద్దాం. లే" అన్నాను.
"నాకోసం యింత చేయాలని మీరనుకొన్నా, మీకు నేను సహకరించలేను"
"అంటే?"
"నేనింట్లోకి రాకూడదు"
"ఎవరలాగన్న పెద్దమనిషి? నా భార్యని నాయింట్లోకి రావద్దనటానికి ఆయనెవరు? ఈ యింటియజమాని అన్నాడా? మూణ్ణెల్ల అద్దె ముందుగా తీసుకొన్నాడు. నిన్ను యింట్లోకి రావద్దనటానికి ఆయనెవడు?" చిరాకు పడ్డాను.
"నగరంలో యిన్నాళ్ళు ఉండేసరికి తెలుగు నానుడులే మర్చిపోయినట్లున్నారు. మహానుభావా! నేనింట్లోకి రాకపోవటానికి కారణం యిదే!" అంటూ తనప్రక్కనే ఉన్న చాప తీసి చూపించింది. అది చూడగానే నా మట్టిబుర్రకి విషయం అర్ధమైంది.
అంటే యింతఖర్చుపెట్టి ముచ్చటగా తెచ్చిన పూలపాకెట్టును బయటపడేయాల్సిందే!
" ఇంట్లో ఉండేది యిద్దరమే కదా! నాకా పట్టింపుల్లేవు. నువ్వు యీ మూడురోజులు చాపమీద పడుకోనక్కరలేదు" అన్నాను.
"పల్లెటూరిపిల్లని. నాకా పట్టింపులున్నాయి" అంది.
"అదికాదోయి! నేను. . . ."
"చూడండి. మీరన్నట్లు నేనింట్లోకి వస్తే తరువాత మీయిష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తారు. నేను కాదనలేని పరిస్థితిని తెస్తారు. పెళ్ళాం వదిలేసిన పెద్దవెధవలెవరో, సంసారసలహాలంటూ వారపత్రికల్లో వీరలెవెల్లో ఏదేదో రాయటం, అది చదివి కుర్రకారు గంగవెర్రులెత్తిపోవటం. ఎందుకొచ్చింది చెప్పండి? ఈ సమయంలో మాకుండే సమస్యలు, యిబ్బందులు గమనించి , మన పూర్వీకులు పెట్టిన యీ పాతసంప్రదాయాన్ని నేను ఖచ్చితంగా పాటిస్తాను. ఆధునికం పేరుతో అవస్థలు కొనితెచ్చుకొని, తరువాత సమాజాన్ని పీడించే ఏ కొత్త అంటురోగాన్నో పుట్టించి, యిదంతా ఆలోచించకుండానే మన పూర్వీకులు యీ నిబంధన పెట్టారా? మదపిచ్చెక్కిన మగవాళ్ళు అదుపులో ఉండాలంటే, ఆడదానికి యిబ్బంది కలిగించే యీ మూడురోజులూ బయటే ఉండాలి"
సీరియస్ గా చెప్పే ఆమెని జూసి నీరుగారిపోయాను.
"అదికాదోయి! నీకోసం జీవితంలో మొదటిసారి పాతికరూపాయిలు పెట్టి పూలు తెచ్చాను" బల్లపై బాగ్ లోని పూలపాకెట్టు తీసి చూపించాను. అది చూసిన ఆమె కళ్ళలో అభిమానాన్ని చూశాను.
"క్షమించండి. మీ సరదాని చంపేసినట్లున్నాను. అయినా పాతికరూపాయిలు వృధా కానివ్వనులెండి. ఆ పూలు ఫ్రిజ్ లో ఉంచండి. రేపు ఉదయం నా బదులు మీరు దేవుడికి దీపం పెట్టి యీ పూలతో పూజించండి" అంది.
తరుణులకు తరుణోపాయం అంత త్వరగా ఎలా తడుతుందో? అదే వాళ్ళ గొప్పతనం.
నీరసంగా లేచి వంటింటివైపెడుతుంటే "అక్కడే ఫ్లాస్కులో కాఫీ చేసి పెట్టాను. త్రాగండి" అంది.
ఇద్దరు ఉన్నప్పుడు ఒక్కణ్ణే త్రాగితే బాగుండదని మధుగాడి పాఠం. మరొకగ్లాసులో కొంత కాఫీ తనకి పంచి యిస్తుంటే ఆమె కళ్ళల్లో ఆనందం. . .
ఆమె కళ్ళల్లోకి అలాగే చూస్తుంటే " అమ్మో! తప్పు జరిగిపోద్ది" అని మనసు హెచ్చరించింది. నా అవస్థ చూసి వరాలు నవ్వుకొంటూంటే ఆమెని కొరకొర చూశాను.
"కర్రపెట్టెలో కారేజీ ఉంది. హోటల్నుంచి భోజనం తెండి. కలిసి తిందాం" అంది.
ఇప్పటికే పాతికరూపాయిలు దండగ. మళ్ళీ యివో దండగా!
" కేరేజీ తేవటం అంత అవసరమంటావా?" అడిగాను.
"అంటే ఈ మూడురోజులూ పస్తులుందామంటారా?" అందామె.
"అదికాదోయి! వంట చేయటమేం బ్రహ్మవిద్యా? అయిదేళ్ళు బ్రహ్మచారిగా ఉన్న రోజుల్లో అప్పుడప్పుడు నాకోసం వండుకొనేవాణ్ణి గదా! ఆ మాత్రం ఉడకేసి పెట్టలేనా?" అన్నాను.
"మీరు వండిపెడతానంటే కాదంటానా? కానీండి" అంది.
ఏదో మొహమాటానికంటే నిజంగా వంట చేయమంటోంది. ఈ మూడురోజుల తరువాత మెల్లిగా నన్ను ముగ్గులోకి దింపేయదుకదా! చచ్చు అనుమానం.
"అంటే ఆ రోజు నాకోసం వండుకొన్నాను. ఒంటరి వెధవను. చేస్తున్న పనిలో తప్పులు సరిదిద్దేవారు లేరప్పుడు. మరి నా వంట నీకు నచ్చుతుందో లేదో?" నసిగాను.
"మీరు ప్రేమతో చేసిపెడితే ఆ మాత్రం సర్దుకుపోలేనా ఏంటి? అయినా ఈరోజు మీ సలహాదారిణిగా ప్రక్కనుండి చెబుతూ, మీచేత పంచభక్ష్యపరమాన్నాలూ వండించేస్తాను. సాహిత్యంలో షడ్రుచులూ చేసి పెట్టేవారు, వెధవది సాంబారు అన్నం వండలేరా ఏమిటి?" సూటిగా నాటుకొనే బాణం వేసేసింది. తప్పించుకోవటం కష్టం.
వరాలు చేయూతనిస్తానన్న భరోసా యిస్తూంటే వంటకి ఉపక్రమించాను.
"ఆ రోజుల్లో కట్టెలపొయ్యో, కుంపటో గనుక వంట చేయటం కష్టం గానీ కుక్కరు, గాస్ పొయ్యిలొచ్చాక చాలా తేలికైపోయిందిగా! పదార్ధాలన్నీ కుక్కర్లో కుక్కేసి గాస్ పొయ్యిమీద పడేస్తే చాలు. "ఇక దింపరా నాన్నా!" అని కుక్కరు మూడుసార్లు మొత్తుకోగానే పొయ్యిమీదనుంచి దించి, కుక్కరు విప్పి కూరలో కాస్తపోపు పడేస్తే సరి"
"ఎలాగెలాగా?అబ్బాయిగారికి అనుభవముందన్నమాట!" అంది వరాలు.
"మరేంటనుకొన్నావ్! పెళ్ళి కుదరగానే నువ్వు స్టవ్ మీద యిబ్బంది పడకూడదని కుక్కరు, గాస్ పొయ్యి కొని పడేశాగా!"
"మావారికి రాబోయే భార్య మీద ఎంత అభిమానం? సరే! ఆ ఫ్రిజ్ లో పెట్టిన వంకాయలు, కత్తిపీట యిలాగ పడేయండి. తరిగిస్తాను"
"నన్ను ముట్టుకొంటే తప్పన్నావ్! వాటిని ముట్టుకోవటం తప్పు కాదా?"
"మిమ్మల్ని తాకితే నన్నిబ్బంది పెడతారు. అవి అలా యిబ్బంది పెట్టవుగా! అయినా బట్టలు, దారాలు, నీళ్ళు, వండిన పదార్ధాలు తాకితే తప్పు గానీ వీటిని ముట్టుకొంటే తప్పులేదు"
"వద్దులే! ఇంత చేసినవాణ్ణి కూరలు తరగలేనా?" అని వంటింట్లోంచి కత్తిపీట తెచ్చి,ఫ్రిజ్ లోని వంకాయలు తీసి తరగటం మొదలెట్టాను.
"అబ్బా!" అని చెయ్యి విదుపుతుంటే గబుక్కున దగ్గరకొచ్చి నా కుడిచేతి ఉంగరంవేలుని తన నోట్లో పెట్టుకొంది. అప్పుడే చూశానామె కళ్ళల్లో కురిసేందుకు సిద్ధంగా ఉన్న కన్నీళ్ళు.
"నేను తరుగుతానంటే వద్దని మీరు చేసిందేమిటి? వేలు తరుక్కొన్నారు. ఉదయాన్నే లేచి మీ నెత్తురు కళ్ళ జూశాను" అంటున్న ఆమెను చూసి నవ్వాను.
"చాల్లెండి సంబడం? వెంటనే డాక్టర్ దగ్గరకెళ్ళి టెట్నస్ చేయించుకోండి" అంటూ నా దగ్గర కత్తిపీట లాక్కుని వంకాయలు తరగటం మొదలెట్టింది.
" నువ్వు నన్ను తాకావ్?" ఉడికిస్తున్నట్లు అన్నాను.
"మరేం కొంపలంటుకోవు? బాత్రూంలో ఆ బనీను, లుంగీ పడేసి బట్టలు మార్చుకోండి. వాటిని నేను తడిపి ఆరేస్తాను"
సంప్రదాయానికి కట్టుబడ్డ భార్యని యిబ్బంది పెట్టే కన్నా సర్దుకుపోవటమే మంచిదని ఆమె చెప్పినట్లే దుస్తులు మార్చాను. తరువాత ఆమె తరిగి యిచ్చిన వంకాయలు, బియ్యం కుక్కర్లో సర్ది స్టవ్ పై పడేసి వచ్చాను.
"ఈ రోజు నలభీమపాకం తింటానన్నమాట" మౌనంగా పేపరు చదువుతున్న నాకు కిర్రెక్కిస్తూ అంది.
"ఏం? వంట మీ ఆడవాళ్ళేనా చేసేది? పెద్దపెద్ద హోటళ్ళలో వంట చేసేది మగవాళ్ళే" అన్నాను.
"మన పెళ్ళికి వంటచేసింది మగాయనే!"
"అంటే యికమీదట నా చేతే వండించుకు తింటావా?"
"మీరు చేసిపెడతానంటే కాదంటానా?" యింతలో కుక్కరు కూతలు వినిపించాయి.
"మిమ్మల్నే. . . పిలుస్తోంది" వరాలు చెప్పింది.
"ఎవరూ?" అన్యమనస్కంగా అడిగాను.
"ప్రక్కింటావిడ. . .వాళ్ళ ఆయనకు నేర్పుదామన్నా వంట చేయడట! మీరేమన్నా చేసిపెడతారేమోనని. . . .లేకపోతే ఏమిటి? అయిపోయిందిరా మొర్రో అని కుక్కరు అరుస్తుంటే ఎవరని అడుగుతారేంటి? వెళ్ళి స్టవ్ కట్టేసి రండి" వరాలు చెప్పగానే స్టవ్ కట్టేసి
కుక్కర్ తీసుకొని హాలులోకి వచ్చాను.
"ఆ! ఇప్పుడు చెప్పు. ఈ వంకాయలతో కూర ఎలా చేయాలి?" అంటూ కుక్కర్ పై వెయిట్ తీశాను.
"అయ్యో! అప్పుడే. . " వరాలు చెప్పేలోపునే కుక్కర్ గాలిలోకి లేచి యింటికప్పుని తాకి దబ్ మని క్రిందపడింది. అంతెత్తునుంచి పడిందేమో మూత ఊడిపోయి అందులోని పదార్ధాలు యిల్లంతా చెల్లా చెదరుగా పడ్డాయి. కొంతపదార్ధం మా ఒంటి మీద పడి
ఒళ్ళంతా చుర్రుమంది. కన్నుమూసి తెరిచేలోపు జరిగిపోయిన యీ ఘటనకు యిద్దరం చేష్టలుడిగి కొద్దిక్షణాలు చూశాం. ఒళ్ళు కాలిన బాధ తెలియగానే వరాలు పెరట్లోకి, నేను బాత్రూంకి పరిగెత్తాం. నీళ్ళతో ఒళ్ళు కడుక్కొని యిద్దరం నేలపై బోర్లాపడిన కుక్కరు దగ్గరకొచ్చాం. అంతవరకూ వేగంగా కొట్టుకొన్న గుండె నెమ్మదించగానే ఒక్కసారిగా నవ్వేశాం.
" ఏం పని చేశారండీ! ఎవరైనా కుక్కరు దింపగానే వెయిట్ తీస్తారా?" అడిగింది వరాలు నవ్వుతూ.
"నిన్ను చూసేసరికి ఒళ్ళు తెలియలేదు" చమత్కరించాను.
"మీ మగాళ్ళంతా యింతే! తప్పులు వాళ్ళు చేసేసి దానికి మేమే కారణమంటారు. ఒళ్ళు బాగా కాలిందా? " అడిగింది.
"ఏదో కొద్దిగా! నీకు?"
"వస్తూనే నాకేదో కానుక యిస్తామన్నారుగా! మంచి కానుకే యిచ్చారు. దాని సంగతి తరువాత. . . వండిన మొత్తం నేలపాలయింది. ఇప్పుడేం చేద్దాం?"
"ఏముంది? నేలపాలైనది ఎత్తి అదే తిందాం" అన్నాను.
"బాగుంది. మనకి ప్రాణం యిచ్చే కుక్క గూడా తినే పదార్ధంలో తేడా ఉంటే వాసన చూసి వదిలేస్తుంది. కానీ మనుషులే. . . ."
"అదికాదోయి! అంత ఖర్చుపెట్టి కొన్నవి. . ." నసిగాను.
"అలాగని గోడల్ని, ఫ్రిజ్ తలుపులను గీకి, ఈ గదంతా ఊడ్చితెచ్చి తిందామంటారా? అలా తిన్నందుకు రోగం వస్తే డాక్టరుకి యింతకన్నా ఎక్కువ ఖర్చు పెట్టాలి. పోయిందేదో పోయింది. ఇవాల్టికి హోటలునుంచి కారేజి తెండి" వరాలు మాటలకు అవమానమనిపించింది.
"ఒక మిషను విఫలమైతే శాస్త్రవేత్తలు వెనక్కి తగ్గుతున్నారా? మళ్ళీ ప్రయత్నించటం లేదా?" అన్నాను.
"అంటే మళ్ళీ వండే ప్రయత్నం చేస్తారా? ముందు ఆ కుక్కరు పరిస్థితి చూడండి. మూత వంకరపోయింది. గిన్నె మీద
వండాల్సిందే!" అంది.
"వండుదాం"
"సరే మీయిష్టం! వంకాయల పని అయిపోయిందిగా! ఫ్రిజ్ లోంచి బీరకాయలు తీసియివ్వండి" అంది.
అన్నానికి పొయ్యిమీద పడేసి, వరాలికి బీరకాయలు తరగటానికి యిచ్చాను.
" అదేంటోయి? వంకాయలను తొక్కతీయకుండా తరిగావ్! బీరకాయల తొక్క తీస్తున్నావేంటి?" అడిగాను.
"తరువాత వంటల మీద నేనో పుస్తకం వ్రాసి యిస్తాను గాని నన్ను మాట్లాడించకండి. కుక్కరు పిలిచినట్లు గిన్నె పిలవదుగాని దాని మీద మూత తీసి క్రిందా మీదా అన్నం కలపండి. లేదంటే సరిగా ఉడకదు" ఆమె మాటవిని వంటింట్లోకెళ్ళబోయాను.
"గిన్నెమీద మూత చేత్తో తీయకండి. గోళ్ళమీదకి ఆవిరి కొడుతుంది, చెయ్యి కాలుతుంది. పట్టకారుతో తీయండి" ఉచిత సలహా యిచ్చింది.
మొత్తానికి అన్నం పూర్తయిందనిపించి వరాలుకి చూపించాను.
"నీళ్ళెక్కువ పోయలేదా? అన్నం బిరుసుగా ఉన్నట్లుంది"
"రెండుగ్లాసులు నీళ్ళు పోశాను. చాలదా?"
"సరే! ఏదో చేశారులెండి. మా అమ్మ గిన్నెలో బియ్యంపై చేతిని యిలా ఉంచి వేళ్ళ రెండో కణుపు ములిగేదాక పొయ్యాలని చెప్పేది. సర్లెండి అదేదో రేపు చూద్దాం. ఈ గిన్నెలో బీరకాయలు ఉడకపెట్టండి. తరువాత కొద్దిగా పోపు పెడితే కూర సిద్ధం. కానివ్వండి" వరాలు చెప్పినట్లుగానే కూర పడేసి వచ్చి ఆరోజు దినపత్రిక చదువుతూ కూర్చున్నాను. మధ్యలో లోపలికెళ్ళి కూరపరిస్థితి చూస్తున్నాను.
"పడేసి పావుగంట అయింది. ఇంకా కూర ఉడకలేదా?" వరాలు అడిగింది.
"ఉడికింది కానీ అందులో నీళ్ళు యిగిరిపోవాలిగా" అన్నాను.
"నీళ్ళు యిగిరిపోవటమేంటి? దానిలో ఎన్ని నీళ్ళుపోశారేమిటి?" వరాలిప్రశ్నకు బదులిచ్చాను.
"నువ్వే చెప్పావుగా! వాటిపై చేతిని తలక్రిందులుగా పెట్టి రెండో కణుపు ములిగేదాక నీళ్ళు పోయాలని" నా బదులు విని తలకొట్టుకొంది.
"ఖర్మ! నేను చెప్పింది అన్నం వండటానికి. బీరకాయలో స్వతహాగానే నీళ్ళుంటాయి. పేరుకి తగుమాత్రం నీళ్ళుపోసి ఉడకపెడితే చాలు. అయిందేదో అయింది. కానీ కొద్దిగా పోపు వేసి కలిపేయండి. చాలు. ఇలా గంటలకొద్దీ ఉడకపెడితే నేనింట్లోకొచ్చేలోపు
సిలెండరు ఖాళీ అయిపోతుంది. అసలే ప్రభుత్వం ఏడాదికి యిన్ని సిలెండర్లే యిస్తానని రేషను కూడా పెడుతోంది. ఎవరో అన్నట్లు బీరకాయ కూర తినొద్దు, తాగుదాం" అంది.
భోజనాల దగ్గర " రేపటినుంచి హోటలు భోజనం చేద్దాం. ఈ వంట నావల్ల కాదు" అన్నాను.
"మొదట్లో వంట చేయటమేం బ్రహ్మవిద్యా? అంత కష్టమేమీ కాదు అన్నారు" అంది.
"అప్పుడలా అనుకొన్నాను. కానీ పాకశాస్త్రం ఒక కళ అని ఎందుకన్నారో నాకిప్పుడు అర్ధమైంది" అన్నాను.
"ఎవరైనా అక్షరాభ్యాసం రోజే కావ్యాలు వ్రాసి పడేయగలరా? ఇదీ అంతే! నా దగ్గర శిక్షణ పొందండి. మీరు రిటైరయ్యాక హోటలు
నడుపుకొందాం"
"ఏయ్! ఏయ్! మొగుడన్న గౌరవం లేకుండా పోయింది. ఆయ్" చిన్నగా మొట్టబోయాను.
దూరం" అంటూ నాకు దూరంగా జరిగింది.
తరువాత జీవితంలో మరి వంట చేసే ప్రయత్నం చేయలేదు.
వెనకటికెవడో రాజకీయనాయకుడు "ఆడవాళ్ళు అలంకరించుకొని రోడ్డుమీదకి రాబట్టే మానభంగాలు జరుగుతున్నాయి. ఇంట్లో కూర్చుని వంటలు చేసుకొంటే యీ దారుణాలు జరగవు" అన్నాడు. బహుశా ఆయన కూడా నాలాగే వంట చేయటం చాలా తేలికైన పని అనుకొన్నాడేమో! తలకాయలు తరిగి పదవులకొచ్చే ఆయనకేం తెలుసు, కూరగాయలు తరిగి సంఘానికి జవసత్వాలిచ్చే వంట చేయటం ఎంత కష్టమో? ఆయన ఎప్పుడైనా ఆ ప్రయత్నం చేసి చస్తేగా! గాలికబుర్లు చెప్పి పదవులెక్కటం కన్న గరిటె తిప్పి సంఘానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించటం చాలా కష్టం. దానికి చాలా సహనం, నేర్పరితనం కావాలి. అది చూపించి సంఘాన్ని బ్రతికించే ఆడవాళ్ళను చులకన చేయకండి. సంఘాన్ని నాశనం చేసే సవాళ్ళు విసరటం కన్న, సంఘాన్ని పరిరక్షించటం మిన్న అనుకొనే సహనం గల (జ)వరాళ్ళకి మనమెప్పుడూ ఋణపడి ఉన్నామన్న సంగతి మరిచిపోవద్దు.
@ @ @

1 comment:

  1. Bhogaraju lakshmi margaretApril 16, 2017 at 6:15 PM

    కథ సూపర్బ్ గా వుంది, ఆఖరున మెసేజ్ చాలా బావుంది. మంచి థాట్...

    ReplyDelete

Pages