శ్రీధరమాధురి -37
(సేవను గురించి పూజ్య గురుదేవుల అమృత వాక్కులు )

మీరు అధికంగా సంపాదించేటప్పుడు సమాజ శ్రేయస్సుకు అధికంగా విరాళాలు ఇవ్వండి. ఒకరు తమ వ్యక్తిగత వృద్ధికి కారణమైన సమాజాన్ని అభివృద్ధి పరిచేందుకు ఆసక్తి కలిగి ఉండాలి. ప్రజలకు, సంఘానికి, సమాజానికి, దేశానికి, ప్రపంచానికి సేవ చెయ్యడం అంటే, దేవుడికి సేవ చేసినట్లే.                                                               
 **** 
‘ధర్మం చరః ‘ అంటే కేవలం డబ్బు ఇవ్వడం కాదు. ఇతరులకు లేనివన్నీ ఇవ్వడం. ఎవరి గురించైనా జాగ్రత్త తీసుకునేవారు లేకపోతే, మీరు తీసుకోండి, ఎవరికైనా ప్రేమ లేకపోతే మీరు ప్రేమను ఇవ్వండి, ఇతరులకు ఏమి లేకపోతే అది ఇవ్వండి. బదులేమీ తీసుకోకుండా, ఆశించకుండా ఇవ్వండి. మనసారా ఇవ్వండి. ప్రేమగా, ఉద్వేగభరితంగా, సున్నితంగా ఇవ్వండి. ఇస్తూనే ఉండండి. మళ్ళీ మీ దోసిలి నిండుతూనే ఉంటుంది. దీని గురించి ఎటువంటి సందేహాలూ వద్దు. దైవం పట్ల అటువంటి ప్రశ్నించనలవి కాని నమ్మకాన్ని కలిగి ఉండండి. ప్రపంచానికి సేవ చెయ్యడంలో ఆయన పరికరం కండి. ఆయన్ను ప్రశ్నించకండి, ఇచ్చెయ్యండి, అంతే.
 ****

నిస్వార్ధంగా సేవ చెయ్యాలంటే హృదయం అతి ముఖ్యమైన అంశం.
****


మీకు సేవా దృక్పధం ఉంటే, షికాయతులు చెయ్యకండి. ఎవ్వరూ మీకు సాయం చెయ్యరని చెప్పకండి. అవసరమైతే, ఒంటరిగా సేవ చేసేందుకు సిద్ధంగా ఉండండి.
****


మీరు నిజంగా దైవభక్తులైతే కనుక ఇలా ఉండాలి...
మీలో అహం, స్వార్ధం ఉండకూడదు.

మీకు కోపం, ద్వేషం వంటి భావనలు కలుగవు.
మీకు అసూయ కలగదు, మీరు ఎవరితోనూ పోటీ పడరు.
మీకు భయం ఉండదు.
మీరు జీవితంలో ఏం జరిగినా అంగీకరిస్తారు.
మీరెప్పుడూ కష్టపడి పనిచేస్తారు, చేసే పనుల ఫలితాల గురించి, పరిణామాల గురించి ఆలోచించరు.
మీరెల్లప్పుడూ దైవాన్ని ఇష్టపడతారు.
మీ జీవితం అధికంగా సేవకు అంకితమై ఉంటుంది, ఇతరుల మేలు కోసమే అంకితమై ఉంటుంది.
మీరు నిస్వార్ధంగా ఉంటారు.
సమాజంలో శాంతికి, సామరస్యానికి మీరు కృషి చేస్తారు.
మీరు నెమ్మదిగా, సమతుల్యంగా ఉంటారు.
 ****
మతం అంటే శాంతి, సౌభ్రాతృత్వం, సామరస్యం, దయ, సేవ. లక్ష్యాలను, దురహంకారాన్ని మతం ఎన్నడూ ప్రోత్సహించలేదు. మతంలో లక్ష్యాలా? అలా ఉంటే కనుక అది వ్యాపారం అవుతుంది. వ్యాపారం మతపరమైన భక్తి కాదు, మతపరమైన భక్తి వ్యాపారం కాలేదు.
****


జ్ఞానం ఒక జీవితకాలం పాటు ఉంటుంది. కాని దాన్ని ఎప్పటికప్పుడు పెంపొందించుకుంటూ ఉండాలి. విద్యార్ధులు జ్ఞానాన్ని దీర్ఘకాలికంగా ప్రయోజనం కల్పించే దృక్పధంతో చూడాలి, పరీక్షల దృష్టితో, డిగ్రీలు పొందే దృష్టితోనే కాదు. అతను తన జీవితాన్ని పరిశీలించాలి, దానిలో ఎన్నో పరీక్షలు ఉంటాయి. జ్ఞానం, దాన్ని పెంపొందించుకోవడం అనేవి జీవితంలోని అనేక దశల్లో ఉపయోగపడతాయి. మానవ జీవితంలో సామాజిక లేక వ్యక్తిగత జీవనం నుంచి విరమించుకునే అవకాశం ఉంటుందేమో కాని, జ్ఞాన సముపార్జనకు, జ్ఞాన వృద్ధికి  విరమణ ఉండదు.
 ****
నిజమైన విద్యాభ్యాసం మానవాళికి, ప్రపంచానికి నిస్వార్ధ సేవ చేసే దిశగా దారిచుపుతుంది... మానవసేవే మాధవ సేవ!
 ****

ప్రతి విద్యావ్యవస్థలోనూ సామాజిక సేవ అనే అంశం తప్పనిసరిగా ఉండాలి. ఒకవేళ దీన్ని విద్యార్ధులు స్వచ్చందంగా అంగీకరించకపొతే, బలవంతంగానైనా అలవాటు చెయ్యాలి.
*****


మానవాళికి సేవ చెయ్యడం అంటే దైవానికి సేవ చెయ్యడమే - మానవసేవే మాధవసేవ.
*****


జీవితమంటే సేవ. మీరు ఇతరులకైనా సేవ చేస్తారు, లేక మీరు ఇతరుల సేవను స్వీకరిస్తారు. ఇదంతా ముగిసేది ప్రాణం పోయిన తర్వాతే.

****

మన నుంచి సేవలు స్వీకరించిన వారికి మనం కృతఙ్ఞతలు చెప్పాలి. ఏమిచ్చినా తీసుకునేవారు లేనప్పుడు సేవ చేసేవారి పాత్ర నిరుపయోగంగా మారుతుంది.
****

అతను – గురూజీ, చెన్నై లో వరదలు...
నేను – మా ప్రార్ధనలు. నువ్వు జీవించి ఉన్నందుకు దైవానికి కృతఙ్ఞతలు తెలుపుకో. బయట ఆపదలో ఉన్న పేదవారికి, అవసరంలో ఉన్నవారికి సాయం చేసే అవకాశం కోసం చూడు. విపత్తులు జరిగినప్పుడే సేవ చేసే అవకాశం ఉదయిస్తుంది. నిస్వార్ధంగా సేవ చేసే అవకాశాన్ని కోల్పోకు.
 ****
నా మటుకు అధర్మంగా ఉండడం అంటే...
గర్వం ఉండడం
దురాశ ఉండడం 

స్వార్ధం ఉండడం
కోపం ఉండడం
అసూయ ఉండడం
తాము లోపాలే లేనివారమని చెప్పుకునేందుకు మిధ్యా జగతిలో గడపడం
 ****
నా పరంగా ధర్మ వర్తనం అంటే...
అందరినీ ప్రేమించడం
చిన్న చిన్న ఆనందాలు, కోరికలు తీర్చుకుంటూ జీవితాన్ని ఆస్వాదించడం
మానవాళికి, ప్రకృతికి సేవ చెయ్యడం
ఆనందం అనే కాంతితో వెలిగిపోతూ, శాంతిని వ్యాపింపచెయ్యడం
జీవితాన్ని మనస్పూర్తిగా అంగీకరించడం
ప్రకృతి యొక్క పరిపూర్ణతను చూసి ఆశ్చర్యపోతూ ఉండడం
అంతా దైవానుగ్రహం. 
 ****
ఆమె... గురూజీ, నాకు తపస్సు చెయ్యాలని ఉంది, మీరు నాకు మార్గం చూపుతారా ?
నేను – తప్పకుండా.
అలా చేసేముందు నువ్వు కొన్ని పనులు చేసి, వాటిని నూటికి నూరుపాళ్ళు అమలు పరిచాకా నా దగ్గరకు రావాలి.
నీవు అహాన్ని వదిలి, దైవేచ్చకు లొంగిపోవాలి.
కోపాన్ని వదిలేసి, ఎవరు ఎలా ఉన్నా వారిని బేషరతుగా ప్రేమించగలగాలి.
నిస్వార్ధంగా జీవిస్తూ, ఈ ప్రపంచానికి సేవ చేసేందుకు నిన్ను నువ్వు అర్పించుకోవాలి.

ఆ తర్వాత నేను ఆమెను ఆరేళ్ళ పాటు చూడలేదు. హఠాత్తుగా, ఒక రోజున ఆమె నా వద్దకు వచ్చింది. మేము 4 గంటల పాటు మౌనంగా ఉన్నాము. ఆ తర్వాత ఆమె నన్ను హత్తుకుంది, నేనామెకు “ దైవం ఇప్పుడు నీతో మాట్లాడుతూ ఉన్నారమ్మా, నీవు గమ్యాన్ని చేరుకున్నావు,” అని చెప్పాను.
ఆమె – అవును గురూజీ, నాకు ఆ అనుభూతి కలుగుతోంది.
ఆమె వెనక్కు వెళ్తూ ఉండగా, ఆమె వెళ్ళిన దిశగా నేను ముమ్మారు ప్రణమిల్లాను. ఒక యోగిని జన్మించింది.
 ****
 మనం ఏ బహుమతులూ, ప్రతిఫలాలు ఆశించకుండా మన పూర్తి సామర్ధ్యంతో పని చేసినప్పుడు ఈ ప్రపంచమంతా భూలోక స్వర్గంలా మారుతుంది. బదులుగా ఏమీ ఆశించకండి. కేవలం పని చెయ్యండి. నిజమైన సేవా దృక్పధంతో బదులేమీ ఆశించకుండా పని చెయ్యండి. ఉద్యోగాలని ఆశించకండి. పనిని ఆశించండి. ఏ పనైనా చెయ్యండి. పని, పని, పని... విశ్రమించకుండా పని చెయ్యండి. పనిలో చిన్నా పెద్దా తారతమ్యాలు వెతక్కండి. కేవలం పని చెయ్యండి. ‘ఈ పని నా అర్హతకు సరిపోనిది’ అని అనకండి. అలా అనడం అహం తప్ప వేరేమీ కాదు. అప్పుడు మీరు కేవలం విద్యార్హతలు కలిగినవారే అవుతారు, విద్యావంతులు కాదు. మానవాళికి సేవ చెయ్యడం అంటే, దైవానికి సేవ చెయ్యడమే. దీనిలో వంకలకి తావులేదు. పని చెయ్యండి...

*****
   0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top