ప్రేమతో నీ ఋషి – 24 - అచ్చంగా తెలుగు

 ప్రేమతో నీ ఋషి – 24

యనమండ్ర శ్రీనివాస్



( జరిగిన కధ : కొన్ని శతాబ్దాల క్రితం... ఇంద్రుడి ఆజ్ఞమేరకు ,మేనక తన రూపలావణ్యాలతో విశ్వామిత్రుడిని సమ్మోహనపరచి, అతని తపస్సును భగ్నం చేస్తుంది. కొన్ని దశాబ్దాల క్రితం... మైసూరు మహారాజు సంస్థానంలో గొప్ప భారతీయ చిత్రకారుడిగా పేరుపొందిన ప్రద్యుమ్న ‘ప్రపంచ కొలంబియన్ ప్రదర్శన’ కోసం, రాకుమారి సుచిత్రాదేవినే తన చిత్రానికి నమూనాగా వాడుతూ, మేనక విశ్వామిత్రుడికి తపోభంగం చేసే సన్నివేశాన్ని అత్యద్భుతంగా చిత్రిస్తూ, ఈ క్రమంలో రాకుమారితో ప్రేమలో పడి గుప్తంగా రాజ్యం వదిలి పారిపోతాడు. రాజు పారెయ్యమన్న ఆ చిత్రం అనేకమంది చేతులు మారి, చివరగా  దాన్ని బ్రిటన్ తీసుకువెళ్ళాలన్న కోరికతో కొన్న ఒక విదేశీయుడి  వద్దకు చేరుతుంది. ఆ తర్వాత అది ఏమైందో ఎవరికీ తెలీదు. 
ప్రస్తుతం... ముంబై స్టాక్ ఎక్స్చేంజి లో పనిచేస్తున్న త్రివేది గారు, ఉదయాన్నే ఫాక్ష్ లో వచ్చిన సందేశం చూసి, అవాక్కవుతారు... కారణం తెలియాలంటే, కొంత గతం తెల్సుకోవాలి....  కొన్ని నెలల ముందు మాంచెస్టర్ లో  గొప్ప వ్యాపార దిగ్గజమైన మహేంద్ర, చేపట్టిన ‘ప్రద్యుమ్న ఆర్ట్ గేలరీ’ ప్రాజెక్ట్ కోసం చిత్రాలు సేకరించేందుకు అతని మాంచెస్టర్ ఆఫీస్ లో పనిచేస్తుంటారు స్నిగ్ధ, అప్సర. ఈ క్రమంలో స్నిగ్ధకు స్విస్ బ్యాంకు మాంచెస్టర్ ఆఫీస్ లో సీనియర్ క్లైంట్ బ్యాంకర్ గా పనిచేస్తున్న ఋషి తో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారుతుంది. ఋషిని  అప్సర సామీప్యంలో చూసిన స్నిగ్ధ మనసు క్షోభిస్తుంది. స్నిగ్ధ కంపెనీ వారు కొన్న విశ్వామిత్ర పెయింటింగ్ నకిలీదని చెప్తాడు ఋషి. ముంబైలో ఉగ్రవాద దాడులు జరిగిన గార్డెన్ హోటల్ లో జరగనున్న ఆర్ట్ వేలానికి వారిద్దరూ వెళ్తుండగా,  దారిలో స్నిగ్ధకు ఆర్ట్ మ్యూజియం కోసం వారు కొన్న విశ్వామిత్ర పెయింటింగ్ నకిలీదని చెప్తాడు ఋషి. హోటల్ లో అసలు విశ్వామిత్ర పెయింటింగ్ చూసిన  స్నిగ్ధ షాక్ కు గురయ్యి, ఋషితో కలిసి మహేంద్రతో ఆ విషయం చెప్తుంది. మూడో కంటికి తెలియకుండా ఈ విషయంలో దోషులు ఎవరో కనుక్కోమంటాడు మహేంద్ర. స్నిగ్ధ ఋషితో ఫోనులో చెప్తున్నదంతా చాటుగా వినేస్తాడు మృణాల్.  ఇక చదవండి...)
“నెం. 3, డౌనింగ్ స్ట్రీట్, మోన్జా , “ మిలాన్ ఎయిర్పోర్ట్ బయటికి రాగానే టాక్సీ ఎక్కుతూ చెప్పాడు ఋషి. విశ్వామిత్ర పెయింటింగ్ అమ్మినతన్ని కలిసేందుకు అతను మిలాన్ వచ్చాడు. ఆ అడ్రెస్ అతనికి స్నిగ్ధ ఇచ్చింది. ఇటలీ వచ్చేముందు, పెయింటింగ్ అమ్మిన వ్యక్తితో అతను ఫోనులో మాట్లాడి, అప్పాయింట్మెంట్ తీసుకున్నాడు.
మిలాన్, లేక మిలానో, అనేది ఉత్తర ఇటలీ లోని ఒక పెద్ద అభివృద్ధి చెందిన నగరం. ఇది మిలాన్ జిల్లాకు, లోంబార్డీ ప్రాంతానికి,  రాజధానిగా ఉంది. ఈ నగరం వివిధ పారిశ్రామిక ఉపనగరాలతో ఆవరించబడి, ఇటలీ లోని ప్రముఖ ఆర్ధిక, వాణిజ్య, ఉత్పాదక కేంద్రంగా పేరొందింది. ఆకాశాన్ని తాకే అపార్ట్మెంట్స్, ఆఫీస్ భవనాలు, సబ్వే లతో కూడిన విస్తృత రైల్వే నెట్వర్క్, వీధుల్లో తిరిగే స్ట్రీట్ కార్లతో, ఒక ఆధునిక నగర హంగులు కూడా మిలాన్ లో కనిపిస్తాయి.
“మిలాన్ కు కొత్తా?” టాక్సీ డ్రైవర్ ఋషితో సంభాషణ మొదలుపెట్టాడు.
“అవును, ఈ నగరానికి చెందిన కొన్ని ప్రాంతాలను సినిమాల్లో చూసాను, నగర నిర్మాణ సౌందర్యం గురించి విన్నాను. కాని, దీని గురించి మరిన్ని విశేషాలు చెప్పండి,” బదులిచ్చాడు ఋషి.
“ఓహ్... మిలాన్ లో నగర నిర్మాణ సౌందర్యం గురించి కంటే ఇక చెప్పడానికి ఇంకేముంది ? మీరు ఇక్కడొక వారమంతా గడిపినా, ఇంకా సరిపోదని అనిపిస్తుంది.” ఒక విదేశీ సందర్శకుడితో తన నగరం గురించి గొప్పగా చెప్తున్నందుకు గర్వంగా భావిస్తూ అన్నాడు టాక్సీ డ్రైవర్.
మిలాన్ లో జనాభా 1.3 మిలియన్లు , మొత్తం నగరంలో ఆర్ధిక లావాదేవీలు ఇక్కడే ఎక్కువగా జరుగుతాయి. మిలాన్ అధునాతన ఫాషన్లకు, ఘనమైన క్రైస్తవ ప్రార్ధనాలయాలకు, విస్తృతమైన అంగళ్ళకు పేరొందినా, నగరంలోని విశిష్టతను పరిశీలిస్తే ఇంకా లోతుగా కనిపిస్తుంది. ఇక్కడి ఘనమైన చారిత్రిక కట్టడాలు, నిర్మాణ వైదుష్యం రెండవ ప్రపంచ యుద్ధాన్ని కూడా తట్టుకుని, నగరం ఆత్మను ఆవిష్కరించేలా ఇప్పటికీ  నిలబడ్డాయి. ఈ నగరంలోని ఆకర్షణీయమైన ప్రాంతాలకు, ఇక్కడి ఆర్ట్ మ్యుజియంలు మరిన్ని మెరుగులు దిద్దుతాయి.
ఋషి బయటి దృశ్యాలను టాక్సీ విండో లోంచి చూడసాగాడు. “ఇక్కడ ఒక మంచి ఆర్ట్ కలెక్టర్ ఉండడంలో ఏ మాత్రం ఆశ్చర్యం లేదు ! ఈ ప్రాంతమే నిర్మాణ నైపుణ్యానికి ప్రతిరూపంలా ఉంది, ఇది గొప్ప గొప్ప ఆర్టిస్ట్ లకు వాస్తు శిల్పులకు నిలయంలా ఉంది.” అనుకుంటూ నిట్టూర్చాడు ఋషి.
“నిర్మాణాలు మాత్రమే కాకుండా మిలాన్ లో ఇంకా ఆసక్తికరమైనవి ఏమున్నాయి?”ఋషి డ్రైవర్ ను మామూలుగా అడిగాడు.
“ఇటాలియన్ అమ్మాయిలు, సోదరా !” అన్నాడతను ఆనందంగా, “ ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో ఉన్న  పురుషులు ఇటాలియన్ స్త్రీలతో డేటింగ్ చేసేందుకు, వారితో గడిపేందుకు కలలు కంటూ ఉంటారు.” అని అతను చెబుతూ ఉండగా, ఒక అందమైన స్త్రీ రోడ్ మీద వెళ్తూ ఉండడం వారికి కనిపించింది.
“ఆమెని చూడండి...” అన్నాడు టాక్సీ డ్రైవర్, “ఈమె కేవలం నమూనా మాత్రమే, కాని ఇటువంటి స్త్రీలతో వ్యవహరించాలి అంటే మీరొక ‘ఆల్ఫా మేల్’ కావాలి.” అన్నాడు.
“ఆల్ఫా మేల్?” అంటే, అడిగాడు ఋషి.
“అవును. ఇటాలియన్ డేటింగ్ లో ఒక ముఖ్యమైన నియమం ఏమిటంటే, మీరు ఆల్ఫా మేల్ లాగా – అంటే ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో ఉన్నట్లు వారికి కనిపించడం. అప్పుడే ఇటాలియన్ స్త్రీలు మీతో నిర్భయంగా గడుపుతారు. ఆ భద్రతా భావం అనేది ఇటాలియన్ స్త్రీలతో డేట్ కు వెళ్ళటంలో మీకు ప్లస్ పాయింట్ అవుతుంది.”
టాక్సీ డ్రైవర్ ఇటాలియన్ స్త్రీలను ఆనందింపచేసేందుకు ఋషికి అనేక సూచనలు ఇవ్వసాగాడు. ఇటాలియన్ స్త్రీలతో డేట్ కు వెళ్లేందుకు ఇంత పెద్ద శాస్త్రమే ఉంటుందని ఋషి ఎన్నడూ ఊహించలేదు.
****
టాక్సీ త్వరగా ఆర్ట్ కలెక్టర్ ఇంటికి చేరుకుంది. మిలాన్ లో తాను సందర్శించదలచుకున్న ఆర్ట్ మ్యుజియం లకు వెళ్లేందుకు టాక్సీ డ్రైవర్ అతనికి వేగంగా సూచనలు ఇచ్చాడు. ఋషి అతనికి కృతఙ్ఞతలు తెలిపి, టాక్సీ దిగి, ఆ ఇంటి బెల్ కొట్టాడు.
“ఇండియా నుంచి వచ్చిన ఋషి అండి, నేను మిష్టర్ బెనెడిట్టో ను కలవచ్చా?” ఋషి తలుపు తెరిచిన వృద్ధ స్త్రీని అడిగాడు. ఆమె అతని వంక చూసి, లోపలకు రమ్మంది.
అతను లోనికి వెళ్ళగానే, ఏదో మ్యుజియం లోకి అడుగు పెట్టినట్లు అనుభూతి చెందాడు. హాల్ లో వివిధ ఆర్టిస్ట్ లకు చెందిన, రకరకాల ఆకారాల్లో, సైజుల్లో ఉన్న పెయింటింగ్స్ అందంగా అలంకరించబడి ఉన్నాయి. ఈ పెద్దాయనకు చాలా మంచి అభిరుచి ఉన్నట్లు కనిపించింది.
ఋషి ఆలోచించిన దానికి విభిన్నంగా, ఆయన కేవలం ఒక ఆర్ట్ కలెక్టర్ మాత్రమే కాదు, ఒక మంచి వ్యాపారి లాగా కూడా అనిపించారు. ఆ గదిలో వ్యాపారానికి సంబంధించిన అనేక పుస్తకాలు, సందేశాలు, కొనుగోలు ఆర్డర్లు, బట్వాడా మెమోలు ఉన్నాయి.
అతను పోర్ట్రైట్ లను చూస్తుండగా, ఒక ముసలాయన అక్కడకు ఒచ్చారు. ఆయన ఎంత పండుముదుసలి అంటే, ఆయనతో పాటు ఒక స్త్రీ ఆయన్ను పట్టుకుని, పక్కన నడవాల్సి వస్తోంది.
ఒక్క క్షణం ఒక తాత్విక చింతన ఋషి మనసులో మెదిలింది – “ఒక అందమైన యువకుడు/యువతి అకస్మాత్తుగా ఏర్పడి ఉండవచ్చు, కాని ఒక అందమైన పండు ముదుసలి ఎల్లప్పుడూ, కళ నుంచే ఉత్పన్నమవుతారు.” బెనెడిట్టో ఖచ్చితంగా దీనికి నిదర్శనంగా నిలిచారు.
ఋషి ఆయన్ను పలకరించి, “మిష్టర్ బెనెడిట్టో, నేను ఇదివరలో మీతో ఫోన్ లో మాట్లాడిన ఋషిని ,” అన్నాడు.
బెనెడిట్టో అతని వంక చూసి, “వెల్ యంగ్ మాన్, నువ్వు ఇండియా నుంచి ఇంత దూరం వచ్చావా ? నువ్వెందుకు వచ్చావో చెప్పి ఉంటే ఇంకా బాగుండేది. అది ఫోన్ లోనే అడిగుంటే నీకు ఉపయోగకరంగా ఉండేది.” అన్నారు.
ఋషి ఆయనతో ఫోన్ లో తాను ఇండియా నుండి వస్తున్నానని అబద్ధం చెప్పాడు, ఎందుకు అక్కడికి వస్తున్నానో ఆయనకు చెప్పలేదు.
“మిష్టర్ బెనెడిట్టో, ఏం పర్వాలేదు. నేనొక పెట్టుబడిదారుడైన బ్యాంకర్ ని, ఇక్కడున్న కొందరు ఉన్నతశ్రేణి క్లైంట్స్ కు సలహాదారుని. మా క్లైంట్స్ లో ఒకరు పాత పోర్ట్రైట్ లను కొనడంలో ఆసక్తి చూపుతున్నారు, నేను అనేకమంది ఆర్ట్ బ్రోకర్ల ద్వారా, మ్యుజియం ల ద్వారా ఆర్ట్ లో మీకున్న అభిరుచిని గురించి తెలుసుకున్నాను. మీ వద్ద పాత ఇండియన్ పోర్ట్రైట్లు, విశేషంగా ప్రద్యుమ్న పోర్ట్రైట్లు ఉండే ఉంటాయి కదూ !” ఋషి సూటిగా సంభాషణ ప్రారంభించాడు.
“అవును, నా వద్ద కొన్ని ఆర్ట్ వర్క్స్ ఉన్నాయి, కాని నేను నెల రోజుల పాటు సెలవలకు వెళ్తూ, వాటిని నా అటెండెంట్ కు అప్పగించినప్పుడు, అతను ఆ పెయింటింగ్స్ గురించి తగినంత శ్రద్ధ వహించలేదు. అందువల్ల పాడయ్యాయి.” మిష్టర్ బెనెడిట్టో పశ్చాత్తాప స్వరంతో చెప్పినా, అందులోనే ఆయన ఋషికి ఏ మాత్రం సాయపడలేను అన్న భావన కనిపించింది.
కాని ఋషి ఇలా కొనసాగించాడు. “మీ కలెక్షన్ లో విశ్వామిత్ర పెయింటింగ్ కూడా ఉందా? అదే 1893 వ సం. లో ప్రద్యుమ్న ప్రపంచ కొలంబియన్ ఎక్స్పోసిషన్ కోసం వేసింది?ఈ పోర్ట్రైట్ కొనేందుకు నా క్లైంట్ ఎంతైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు.”
బెనెడిట్టో ముందుకు వంగి, సూటిగా ఋషి కళ్ళలోకి చూస్తూ తగ్గు స్వరంలో ఇలా అన్నారు, “ ఓహ్ !అలాగా? సో సారీ యంగ్ మాన్. నేను గత నెల మాంచెస్టర్ నుంచి వచ్చిన ఒక ఆర్ట్ కలెక్టర్ కు అమ్మేసాను. దీని గురించి మరింత సమాచారం ఇచ్చేందుకు నేను నా రికార్డులను పరిశీలించాలి. కాని, నన్ను మళ్ళీ మీరు  క్షమించాలి, ఆ పెయింటింగ్ అమ్మేయబడింది.”
ఋషికి మృణాల్ ఆ పెయింటింగ్ కొన్నాడని తెలుసు కనుక, అది ఎవరు కొన్నారో తెలుసుకునేందుకు ఆసక్తి లేకపోయినా, చిరునవ్వు చెదరనీయకుండా,” సరే మిస్టర్ బెనెడిట్టో. చింతించకండి. కాని, మీరది ఎక్కడినుంచి కొన్నారో చెప్పగలరా ? బహుశా వారి వద్ద ఇంకా అరుదైన చిత్రాలు ఉన్నాయేమో నేను వెళ్లి చూడాలని అనుకుంటున్నాను.” అని ఉత్సుకతతో అడిగాడు.
“రాయల్ కరీబియన్ షిప్’ లోని ఒక వేలానికి నేను నాలుగు నెలల క్రితం వెళ్ళినప్పుడు దాన్ని అక్కడే కొన్నాను. అక్కడ స్పార్క్ ఈస్ట్ గేలరీ అనే ఆర్ట్ గేలరీ ఉంది. అక్కడి వేలంలో ఈ పెయింటింగ్ తాలూకు ఉన్న ఏకైక చిత్రం అదే. “బెనెడిట్టో వీలైనంతవరకు ఋషికి సాయం చెయ్యాలని చూస్తున్నారు.
“మంచిది మిష్టర్ బెనెడిట్టో. మీరందించిన సమాచారానికి కృతఙ్ఞతలు. నేనిక సెలవు తీసుకుంటాను. మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. “అంటూ లేచాడు ఋషి.
(సశేషం)

No comments:

Post a Comment

Pages