మాతృగయ - అచ్చంగా తెలుగు

మాతృగయ 

అంబడిపూడి శ్యామసుందర రావు .

9440235340.




హిందు మతములో పితృకర్మలకు చాలా ప్రాధాన్యత ఉన్నది. సాంవత్సరీక శ్రాద్ధ కర్మలు ,మాహాలయ అమావాస్యనాడు జరిపే విధులు కాకుండా , పెద్దలకు పిండ ప్రదానాలకు మన వాళ్ళుకాశీ,ప్రయాగ ,గయ , బదరీ వంటి పుణ్యక్షేత్రాలను దర్శించి పిండ ప్రదానాలు చేస్తూ ఉంటారు ఈ పుణ్యక్షేత్రాలలో జరిపే తీర్ధవిధులలో తల్లిదండ్రులు,తాతముత్తాలు,ఇతర భందు గణానికి పిండ ప్రదానాలు చేస్తారు . కానీ తల్లికి జరిపే శ్రార్ధ కర్మలు జరిపే చోటు మాతృ గయ మాత్రమే. ఈ క్షేత్రానికి చాలా ప్రాధాన్యత , చరిత్ర ఉన్నది.

పాండవులు కూడా ఇక్కడికి వచ్చినట్లు చెపుతారు. నేను గుజరాత్ లోని పుణ్యక్షేత్రాల సందర్శనలో భాగముగా మాతృ గయ ప్రాధాన్యతను తెలుసుకొని ఈ క్షేత్రాన్నిదర్శించుకొని మాతృ మూర్తికి శ్రార్ధ కర్మలు నిర్వహించాను. ఈ వ్యాసములో మాతృ గయ ప్రాముఖ్యతను తెలుసుకొనే ప్రయత్నము చేద్దాము.
గుజరాత్ రాష్ట్రములో అహమ్మదాబాద్ కు 114కి. మీ దూరములో , పాటన్ జిల్లాలో గల సిద్దపూర్ నే మాతృ గయ అని అంటారు. ఇది చాలా విశేషవంతమైన ప్రదేశము ఇక్కడ గంగ సరస్వతి నదుల సంగమము ఉన్నది పురాణకాలము నుండి ఈ ప్రదేశము గురించి ప్రస్తావన ఉన్నది. దధీచి మహర్షి తన అస్థికలను ఇంద్రుడికి సమర్పించినప్రదేశము ఇదేనని చెబుతారు. ఋగ్వేదములో దీని ప్రస్తావన ఉన్నది.
స్థల పురాణాన్ని బట్టి బ్రహ్మ మానస పుత్రుడైన కర్దమ మహర్షికి మనువు పుత్రిక దేవహూతికి ఇక్కడే వివాహము జరిగినదని చెపుతారు వీరికి పుట్టిన తొమ్మిది మంది పుత్రికలను తొమ్మిదిమంది ఋషులకు ఇచ్చి వివాహము చేశారు.వీరి పుత్రికలలోని అనసూయకూడా ఉంది. ఈ దంపతులు తపస్సు చేసి విష్ణుమూర్తి చే భగవంతుడే తమకు పుత్రుడిగా జన్మించాలని వరము పొండుతారు ఆ పుత్రుడే కపిల మహర్షి . తండ్రి కర్దమ ప్రజాపతి సంపదలన్నింటిని వదిలి తపస్సు చేసుకోవటానికి వెళ్లగా వైరాగ్యముతో తల్లి కపిలుని వద్దకువెళ్లి తాను ఏమి చేస్తే మోక్షము పొందగలనని అడుగుతుంది. అప్పుడు కపిల మహర్షి తల్లికి వివరించిన గీతోపదేశమే "కపిల గీత".
తల్లి మరణానంతరము తల్లి శ్రార్ధకర్మలు ఇక్కడే నిర్వహించాడు కాబట్టే ఈ ప్రదేశానికి మాతృగయ అన్న పేరు వచ్చింది పరుశు రాముడు కూడా తన తల్లికి ఇక్కడే శ్రార్ధకర్మలు నిర్వహించాడు.పుట్టినప్పటినుంచి పెరిగి పెద్ద అయ్యేంతవరకు జీవితాన్ని ఇచ్చిన తల్లికి కృతజ్ఞత గా 20 చిన్న పిండాలు పెట్టిస్తారు కొంతమంది 27 పిండాలు పెట్టిస్తారు, తెలిసి తెలియక తల్లిని భాధ పెట్టినందుకు తానూ చేసిన తప్పులను క్షమించినందుకు కృతజ్ఞతలు చెపుతూ పిండాలు సమర్పిస్తారు. తల్లికి పిండ ప్రదానము చేసే చోటు ఇది ఒక్కటే కాబట్టి ఇక్కడ తల్లికి పిండప్రదానము చేస్తే తల్లికి మోక్షము కలుగుతుందని హిందువుల ప్రఘాడ నమ్మకము. సాధారణముగా కొడుకులే ఈ కార్యక్రమము నిర్వహిస్తారు కానీ ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలలోని కొంత మంది స్త్రీలు కూడా తమ తల్లికి పిండ ప్రదానము చేస్తారు.
మన దేశములోని ఐదు పవిత్రమైన సరోవరాలలో మాతృ గయ లోని బిందు సరోవరం ఒకటి భగవంతుడు ప్రత్యక్ష మైనప్పుడు దేవహూతి కనుల వెంట జారిన ఆనందాశ్రువులే బిందు సరోవరము అని,మరికొంతమంది కపిలుడు బోధించిన గీత వల్ల ఆనందముతో రాలిన అశ్రు బిందువులే బిందు సరోవరము అని కూడా అంటారు. బిందు సరోవరానికి చుట్టూ కపిల దేవహూతి,కర్దమ మహర్షి,శివ ,పార్వతి, ఆలయాలు ఉన్నాయి.ఈ ఆలయాలు కాక దగ్గరలోనే సత్యనారాయణ మందిరము,శ్రీ కృష్ణ ఆలయము,బాలాజి మందిరము ఉన్నాయి.
ఈ ఆలయాలకు ప్రక్కనే అదే ప్రాంగణములో గుప్త సరోవర్ అనే పెద్ద సరోవరం ఉంది. దీనిలోని నీరు ఆకుపచ్చగా ఉంటుంది అక్కడే వున్నా అశ్వత్థ వృక్షము దగ్గర శ్రార్ధకర్మలు చేసిన వారికి అక్కడి బ్రాహ్మణులు మంత్రోచ్ఛరణతో కొద్దిగా చెంబుతో నీళ్లు పోస్తారు.
సిద్ధపూర్ గ్రామాన్ని "ముక్తిధామ్" అని కూడా అంటారు దాదాపు ఆ చుట్టూ ప్రక్కల గల 85 గ్రామాల ప్రజలలో ఎవరు మరణించినా ఇక్కడికే తీసుకువచ్చిదహన సంస్కారాలు చేస్తారు ఇక్కడ అంతిమ సంస్కారాలు చేస్తే వారికి మోక్షము కలుగుతుందని ఇక్కడి ప్రజల నమ్మకము అందుకే ఇక్కడి స్మశానాన్ని గంధర్వ స్మశానము అనికూడా అంటారు. కాశీ,ప్రయాగ ,ఉజ్జయిని లలో కూడా ఇటువంటి ముక్తిదామ్ ఉంది.
 *****

No comments:

Post a Comment

Pages