ఆమే ఒక సైన్యం - అచ్చంగా తెలుగు
ఆమే ఒక సైన్యం
మా బాపట్ల కధలు 12
భావరాజు పద్మిని


గడియారపు స్థంభం సెంటర్ నుంచి ఆంజనేయస్వామి గుడి వైపుకు వెళ్తుంటే, ఎడమప్రక్క నాలుగిళ్ళ అవతల పెద్ద బంగాళా దేశిరాజు అప్పాజీ గారిది. వారి శ్రీమతి కామేశ్వరి గారు మంచి సంగీత విద్వాంసురాలు. భగవంతుడు ఇచ్చిందే చాలన్న తృప్తితో ,ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా, ఉచితంగానే పిల్లలకు గాత్ర సంగీతం, వీణ నేర్పేవారు. భువికి దిగిన ఆదిదంపతుల్లా కనిపిస్తూ, అన్యోన్యంగా ఉండేవారు ఆ దంపతులు. బంగాళా ముందు వారికున్న రకరకాల షాప్ లు అద్దెకు ఇచ్చారు. అవి దాటుకుని, మధ్యలో ఉన్న చిన్న గేటు తీసుకుని లోపలకు వెళ్తే, పెద్ద వసారా, హాల్, లోని గదులు ఉండేవి. ఇంటి మధ్యలోంచి డాబా మీదకు మెట్లు ఉండేవి. ఇక పెరట్లోనే ఉందా అన్నట్టుగా ఉండే వంటిల్లు, అందులో పెద్ద భోజనాల బల్ల, ప్రత్యేక ఆకర్షణలు. ఉన్న కాస్త పెరట్లోనే చేమదుంప మొక్కలూ, బొప్పాయి మొక్కలూ వంటివి వేసేవారు కామేశ్వరి గారు.మొక్కలంటే ఆవిడకు అమితమైన ఇష్టం. అదేవిటో గాని, ఆవిడ చేత్తో, అలా నాలుగు గింజలు విసిరేసినా మొక్కలు మొలిచేసేవి.

ఎం.ఎస్.సి కెమిస్ట్రీ చదువుతున్న తొలి ఏడాది నాకు ఆవిడ గురించి తెలిసింది. ఇక ఆ రెండేళ్ళు వారిని వదలలేదు నేను. రోజూ సాయంత్రం వెళ్లి, గాత్రం, వీణ క్లాస్సులు చెప్పించుకునే దాన్ని. వయోభారం వలన కామేశ్వరి గారు ఆ పెద్ద ఇంటి పనులు, వంట పనులు చెయ్యలేక అవస్థ పడుతుంటే, ఆయన పసిపాపను చూసుకున్నట్టు ఆవిడని అపురూపంగా చూసుకోవడం గమనించి, నేనూ వారి వెనుక సాయంగా ఉండేదాన్ని. పొరపొచ్చాలు లేని ఆ దంపతులూ నన్ను కన్నబిడ్డలా ఆదరిస్తూ, ఇల్లంతా స్వేచ్చగా, చనువుగా తిప్పేవారు.

అప్పాజీగారిది సరదాగా ఉండే మనస్తత్వం. ఆయనో విజ్ఞాన ఖని. డాబా మీద ఆయనకో చిన్న లైబ్రరీ ఉండేది. ఎప్పుడైనా నాకు పుస్తకాలు కావాలని అడిగితే, మేడ మీదకు తీసుకువెళ్ళి, అక్కడున్న పుస్తకాలు, వాటి విశేషాలు నాకు చెప్పేవారు. ఆ రోజు నాకు బాగా గుర్తు... కాలక్షేపం కోసం ఏదో పుస్తకం తియ్యగానే కనబడ్డాయి ఆ వాక్యాలు...

“ఒక స్త్రీ ప్రాణం తీసిన నేరం కంటే, ఆమె సుఖాన్ని, సంతోషాన్ని, ఉత్సాహ ఉల్లాసాల్ని నాశనం చేసి, జీవన్మ్రుతురాలిగా చేసిన నేరము బలవత్తరమైనది.”

ఎంత గొప్ప మాట ? వెంటనే రచయిత్రి ఎవరా అని చూసాను. “కనపర్తి వరలక్ష్మమ్మ” అని ఉంది. ఈ లోపల అటుగా వచ్చిన అప్పాజీ గారు ,”ఏవిటీ, ఆ పుస్తకం చూస్తూ అలా నిలబడిపోయావు?కొంపతీసి అందులో నా ఫోటో కాని ఉందేవిటి?” అని అడిగారు నా చేతిలోని పుస్తకం తీసుకుంటూ.

“ఓ కనపర్తి వరలక్ష్మమ్మా, ఈవిడది కూడా మనూరేలే !” అని నవ్వేసారు తేలిగ్గా.

“అది కాదండీ, మా తరమే, విద్య, వికాసం, కళలు ఇలా అన్ని రంగాల్లోనూ రాణిస్తోంది అని అనుకునేదాన్ని. ఆవిడ మాటలు చదివితే రోజుల్లోని స్త్రీలలో కూడా ఇంత పరిణితి ఉందా అనిపిస్తోంది. వీరి గురించి నాకు వివరంగా చెప్తారా, తెలుసుకోవాలని ఉంది.” అన్నాను అభ్యర్ధనగా.

‘ఓ, ఇలా తీరుబడిగా కూర్చో, మామూలుగా కాదు, సినిమా చుపించినట్టే చెప్తా’ అంటూ ఆవల ఉన్న చెక్క కుర్చీ చూపించి, ఇలా చెప్పసాగారు...
****

సీ.
పూల మాలలనిచ్చి పూజింపరెవ్వరు
కాని మాటలు పడి కలగవలయు
తోడుతోడుగ వచ్చి తోడ్పడరెవ్వరు
నొంటిపాటుకు నోర్చి యుండవలయు
బహుళ ధనమున సంభావింపరెవ్వరు
కడు పేదతనమున నడలవలయు
ఒకచోట నుండంగ నొప్పుకోరెవ్వరు
నూరూరు తిరుగుచూ నుండవలయు
తే.గీ.
సేవయననిట్లు సుఖమయ త్రోవ గాక
భీకరోదగ్ర కంటకావృతము గాన
నైహిక సుఖసంపదలపై నాశ వదలి
చేయవలయును నిజ సంఘ సేవ నెపుడు

“నువ్వు సేవ చేస్తున్నావని, ఎవరూ పూల దండలు వేసి, నీకు పూజ చెయ్యరు. కాని, అనరాని మాటలు అంటారు, పడాలి. నీ వెంట వచ్చి ఎవరూ సాయం చెయ్యరు, అయినా ఒంటరిగా ప్రయాణం చేసేందుకు నువ్వు సిద్ధంగా ఉండాలి. బోలెడంత ధనాన్ని ఎవరూ అందించరు, ఉన్నదంతా ఇచ్చేసి, పేదరికంలో మగ్గాలి. ఒక్క చోటే ఉంటే ఒప్పుకోలేరు ఎవరూ, ఊరూరూ తిరుగుతూ ఉండాలి. నువ్వు సేవ చెయ్యాలి అనకుంటే, అది పూలబాట కాదు, కఠినమైన ముళ్ళు పరచిన దారని మర్చిపోకు. ఈ లౌకిక సంపదలపై ఆశని, స్వార్ధాన్ని వదిలితేనే నిజమైన సంఘ సేవ చెయ్యగలవు.”

తాను రాసుకున్న పద్యాన్ని మరొకసారి చదివి చూసుకుంది ఆమె...
ఒక్కోసారి మనిషి విచిత్రమైన స్థితిలో చిక్కుకుంటాడు. ఆ స్థితిలో తనకు తాను ధైర్యం చెప్పుకోవాల్సిందే తప్ప, తనకు దన్నుగా నిలిచి ఓదార్చేవారు ఎవరూ ఉండరు. అటువంటి స్థితిలోనే ఉంది వరలక్ష్మమ్మ ప్రస్తుతం. తాను బాపట్లలో స్థాపించిన ‘స్త్రీ హితైషిణి మండలి’ సొంత భవంతి కట్టేందుకు ఎన్నో ప్రయాసలకు ఓర్చి, కాస్త స్థలం సంపాదించింది. కాని, రెండేళ్లలో అక్కడ భవనం కట్టకపోతే, ఆ కష్టమంతా వృధా అవుతుంది. అందుకే ఆ భవంతి కోసం విరాళం సేకరించేందుకు మద్రాసు వెళ్లి, ట్రైన్ లో వెనక్కి వస్తూ, తన మనోభావాల్ని ఇలా పద్యంగా రాసుకుంది. ఇంతా మద్రాసు దాకా వెళ్లి వస్తే దక్కింది కేవలం వంద రూపాయిల విరాళం. ఇంకా చాలా సొమ్మును సమకూర్చవలసి ఉంది. అయినా ఎవరి జీవితమూ వడ్డించిన విస్తరి కాదు కదా ! తన చిన్నప్పటి నుంచి తను ఎంతమంది స్త్రీల వెతల్ని చూడలేదు? తన గతాన్ని నెమరువేసుకోసాగింది ఆమె...

బాపట్ల మాయాబజార్ లో పాలపర్తి శేషయ్య, హనుమాయమ్మ గారి ‘వరాల’ పట్టిగా  ఐదుగురు అన్నదమ్ములు, ఇద్దరు అక్కచెల్లెళ్ళ మధ్య పుట్టింది తను. చిన్నతనంలో జరిగిన ఒక సంఘటన తన మనసుపై బలమైన ముద్ర వేసింది. అప్పుడు తనకు 14 ఏళ్ళు ఉంటాయేమో ! గుడ్ల నీరు కక్కుకుంటూ హనుమాయమ్మ గారి వద్దకు వచ్చింది ఒకావిడ.    తన కష్టాలన్నీ కన్నీళ్ళతో కలిపి చెప్పింది. అవన్నీ తన చిట్టి మనసు వికలమైపోయింది.
“అమ్మా ! స్త్రీల జీవితాలు ఎందుకింత దుర్భరంగా ఉంటాయి? పలుపుతాడు కట్టి సావిట్లో పడేసే పశువుకీ, ఇష్టానికి పసుపుతాడు కట్టి, ఇంట్లో పడేసే బాల వధువుకీ తేడా ఏమైనా ఉందా? రేపు నా పెళ్ళైతే నాకూ ఇలాంటి కష్టాలే ఉంటాయా ?” ఆవేదనగా అమ్మను అడిగింది వరాలు. మౌనమే సమాధానంగా చూస్తూ, కూతురి తలను ఆప్యాయంగా నిమిరింది ఆ మహాఇల్లాలు.

స్త్రీలు చెప్పులేసుకుని, వీధిలోకి అడుగుపెట్టడమే అపరాధంగా భావించే ఆ రోజుల్లో, వరాలు 4 వ తరగతి దాకా చదివింది. తను మంచి చదువరి. వివిధ పత్రికలు, చిలకమర్తి, వీరేశలింగం గారి నవలలు ఆసక్తిగా చదివేది. చదవడం పట్ల ఆమెకున్న మక్కువని చూసిన  అన్న నరసింహంగారు ఆమెకు వీరేశలింగం గారి వ్యాస సంపుటిని బహుమతిగా ఇచ్చి, చదివిన ప్రతి వ్యాసం మీదా సొంత అభిప్రాయాన్ని రాయమన్నారు.  అలా రాసిస్తే, వాటిలో తప్పులు దిద్ది ఇచ్చేవారు. వీరేశలింగం గారి వ్యాసాల ప్రభావం తనని బాగా ఆలోచింపచేసింది. మరో అన్న రామ్మూర్తి గారు, గుంటూరులో ‘వనితా గ్రంధ మండలి’ అనే గ్రంధాలయం స్థాపించి, పుస్తకాల లెక్కలు ఆమెతో రాయించేవారు. అక్కడే తను కొత్త పుస్తకాలన్నీ చదివేది.

బాపట్లలో కొటికల సీతమ్మ గారు ‘స్త్రీ విద్యావశ్యకత’ అనే అంశంపై ప్రసంగించారు. ఆ ప్రసంగం తనను ఎంతో ప్రభావితం చేసింది. విద్య, లోకజ్ఞానం లేని వయసులో వివాహం జరగడమే సమాజంలో స్త్రీల దుస్థితికి కారణమని తను పిన్న వయసులోనే గ్రహించింది. ఈ స్థితిగతుల్ని కొంతవరకైనా చక్కబరిచేందుకు తగిన చైతన్యం తననుంచే మొదలవ్వాలని మనసులో బలంగా సంకల్పించింది. 1909 లో తన వివాహం సంస్కారి, స్త్రీ విద్యాభిలాషి, సహృదయులైన కనపర్తి హనుమంతరావు గారితో జరిగింది. ఆ తర్వాత బాపట్ల లోనే చోరగుడి సీతమ్మ గారు స్త్రీల కోసం తనింటిలోనే స్థాపించిన ‘యువతీ విద్యాలయా’ నికి వెళ్లి, తాను తెలుగు, సంస్కృతం బాగా నేర్చుకుంది.
తన జీవితంలో ఎన్ని గొప్ప మైలురాళ్ళని ! ఒకసారి తన అన్న ఆంజనేయులు, ఒక ఆంగ్ల కధను తెచ్చి ఇచ్చి, దాన్ని తెలుగులోకి తర్జుమా చేసి ఇమ్మన్నారు. అలా ఇచ్చాకా, ఆ కధను ‘సౌదామిని’ అన్న కలం పేరుతో అనసూయ అనే పత్రికకు పంపితే అచ్చు వేసారు. ఆ తర్వాత భారతి, గృహలక్ష్మి, వంటి పత్రికల్లో తన రచనలు వెల్లువెత్తాయి. భర్త హనుమంతరావు గారు తనను అన్ని విధాలా ప్రోత్సహించి, తన రచనలను పత్రికలకు పంపేవారు. ఇక ‘శారద లేఖలు’ అయితే... ఆ పేరు జ్ఞాపకం రాగానే ఆమె మోముపై చిరునవ్వు మెరిసింది. తను చిన్నతనంలో మొట్ట మొదట ఉత్తరాలు రాసి పెట్టిన ఆరుగురు అవ్వలు గుర్తుకు వచ్చారు.

చిన్నప్పుడు తన ఇంటివద్ద ఆరుగురు వైష్ణవ అవ్వలు ఉండేవారు. వారికి చదువు రాదు. దూరదూరాల నుంచి వచ్చే బంధువుల లేఖలు చదివి పెట్టేందుకు తనని పిలిచేవారు. అవి చదివాకా, ఒక కార్డు ముక్క ఇచ్చి, ‘మీ పక్కింటి వనజకు పిల్లలు పుట్టారా? మీ ఎదురింటి పాడావు ఈనిందా? మీ ఊరి జాతర్లో ఈసారి జీళ్ళ అంగడి పెట్టారా ?’ వంటి ప్రశ్నల శరాలతో చిట్టి కడవంత కార్డులో కడలంత విశేషాలు రాయమని గోల పెట్టేవారు. ఇలా తనకు ఉత్తరాలు రాయటం అలవాటు అయ్యింది. అదే స్పూర్తితో గృహలక్ష్మి పత్రికలో తాను ‘శారద’ అనే స్నేహితురాలికి రాసినట్లుగా రాసిన ‘శారద లేఖలు’ అనే శీర్షిక రాసేది. అందులో బాల వితంతువుల బాధలు, వరకట్న నిషేధం, పురుషాధిక్యత, విదేశీ వస్తు బహిష్కరణ, తీర్ధయాత్రలు, రాట్నంపై నూలు వడకడం వంటి ఇన్నాళ్ళూ తాను చదువుకున్న అనేక అంశాలపై రాసిన లేఖలు ఎంతగా ప్రాచుర్యం పొందాయంటే, చిరునామా కనుక్కుని, తనను చూసేందుకు తన అభిమానులు పత్రికల వారిపై ఒత్తిడి తెచ్చేవారట !

అలా తను 30 ఏళ్ళ పాటు సమకాలీన అంశాలపై రాసిన అనేక వ్యాసాలు, బుర్ర కధలు, నవలలు, బాలనీతి కధలు, నాటికలు విపరీతమైన ప్రాచుర్యం పొందాయి. తీరా తాను అభ్యుదయవాదిని కనుక, సినిమాల్లో హీరొయిన్ల లాగా ఆధునికంగా ఉంటానేమో అనుకుని ఇంటిదాకా తనను చూడవచ్చే వారికి, కాశి పోసి తొమ్మిది గజాల చీర, ఆభరణాలు ధరించిన ఒక సంప్రదాయ స్త్రీ కనిపించేది. ఇక ఈ అభిమానుల తాకిడి తట్టుకోలేక, తాను ‘లీలాదేవి’ అన్న కలం పేరుతో ‘మా చెట్టు నీడ ముచ్చట్లు’ అనే శీర్షికతో, ఒకే ఇంట్లో వేర్వేరు భాగాలలో అద్దెకుండే ఐదుగురు వేర్వేరు ప్రాంతాలకు చెందినా ఇల్లాళ్ళు, ప్రతి రోజూ, ఒక నారింజ చెట్టు క్రింద కూర్చుని, చెప్పుకునే కబుర్లను 5 యాసలలో రాసింది. చాన్నాళ్ళు ఆ రాసేది ఎవరో తెలీక అంతా వెర్రెక్కిపోయేవారు, చివరికి అది తనే అని తెలుసుకున్న వాళ్ళు ‘ఔరా’ అని ముక్కున వేలేసుకున్నారు.

హెల్త్ ఇన్స్పెక్టర్ గా పనిచేసే ఆయన బదిలీల రీత్యా మదనపల్లె, విజయవాడ వంటి ఊర్లు తిరిగినప్పుడే, ఉపన్యసించడం కూడా తను నేర్చుకుంది. అనేక పెద్ద సంఘాల్లో బోర్డు మెంబెర్ గా ఉండి, సమాజసేవకు తోడ్పడింది. భర్త ప్రోత్సాహంతో 1947 ఆగస్టు 16 న ఆల్ ఇండియా రేడియోలో జాషువా, పుట్టపర్తి, విశ్వనాధ వంటి దిగ్గజాలు పాల్గొన్న స్వాతంత్ర్యోత్సవ కవితా గోష్టిలో పాల్గొని, 19 పద్యాలు వినిపించి, ఆ సమయంలో రేడియోలో ప్రసంగించిన తొలి మహిళగా నిలిచింది. ఆంధ్రావతరణ సమయంలో 1956 వ సం. నవంబర్ 1 న విజయవాడలో ని రేడియో స్టేషన్ లో జరిగిన కవితా గోష్టిలో కూడా పాల్గొన్న తొలి మహిళ ఆమే ! అనేక మహిళా సభల్లో ప్రసంగించడం, సభాధ్యక్షురాలిగా వ్యవహరించడం జరిగింది.

తనకు దేవుడిచ్చిన ఒకేఒక్క లోటు, మూడు నెలల వయసులో గుంటూరు ఎండలకు తట్టుకోలేక, తన కూతురు చనిపోవడం. ఆ తర్వాత ఎందుకో తనకి పిల్లలు కలగలేదు. అయితేనేం, ఆర్తులందరినీ తన వారిగానే భావించింది. రకరకాల ప్రాంతాలు తిరగడం, అనేకమంది గొప్పవారిని కలుసుకోవడం ద్వారా ఆమె భావ వైశాల్యం, హృదయ వైశాల్యం పెరిగాయి. తన జీవితంలో మరో పెద్ద మలుపు మహాత్మాగాంధీ ని కలవడం...

అది 1921 వ సంవత్సరం. బాపూజీ స్వరాజ్య నిధి సేకరణ కోసం బందరు వచ్చి, జాతీయ కళాశాలలో బస చేసారు. అప్పుడు తన నాలుగో అన్న ఇంట అక్కడే ఉన్న తను, బాపూజీ వద్దకు వెళ్లి, తాను వడికిన నూలు, ఒక ఉంగరం ఆయనకు ఇచ్చింది. బాపు నవ్వుతూ తనవంక చూసి, ‘మీరు నూలు వడుకుతారా ?’ అని అడిగారు. అవునని చెప్పగానే ‘మరి ఖద్దరు చీరలు కట్టుకుంటారా?’ అని అడిగారు. కడతానని మాటిచ్చింది. మొదట్లో గరుగ్గా ఉండే ఆ బట్ట వల్ల తన ఒళ్ళంతా చీరుకు పోయేది. తర్వాత అలవాటైపోయింది. అప్పటినుంచీ తాను ఖద్దరు తప్ప కట్టిందే లేదు. అదీ ఇచ్చిన మాటకు కట్టుబడే తన నిబద్ధత !

తన పుట్టినిల్లు, మెట్టినిల్లు అయిన బాపట్ల అంటే తనకు వల్లమాలిన ప్రేమ. అందుకే అక్కడి మహిళల వికాసం కోసం 1931 లో ‘స్త్రీ హితైషిణి మండలి’ స్థాపించింది. దీనితో ఊళ్ళో పెద్ద కలకలమే రేగింది. తనను అణచాలని చాలామంది ప్రయత్నించారు. మొదట్లో స్త్రీలు అక్కడికి రావటానికే భయపడేవారు. పత్రికలు చదవడం, రామాయణ కాలక్షేపం, వారం వారం పిల్లల వినోద కార్యక్రమాలు, వంటి వాటితో ఆరంభించి క్రమంగా కుట్లు, అల్లికలు, గృహ పరిశ్రమలు నిర్వహించడం వంటి వాటితో స్త్రీలకు ఆలంబన కల్పించారు. స్త్రీవిద్య ఆవశ్యకత గురించి బాలికలతో అనేక నాటికలు, గేయాలు, బుర్ర కధలు  రాయించి వేయించారు. స్త్రీలకు ప్రత్యేకంగా ఒక గ్రంధాలయాన్ని స్థాపించారు. స్త్రీలకు ఓటుహక్కు రాగానే ఇల్లిల్లూ తిరిగి నమోదు చేసారు.  ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు బట్టలు , డబ్బు సేకరించి పంపారు.

మండలికి చోటు ఇచ్చేందుకు కూడా అనేకమంది జంకుతూ ఉండడంతో గత 11 ఏళ్ళుగా మండలి అనేక చోట్లకు మారింది.  ఈ మండలి తన పుత్రిక వంటిది. దీనికొక శాశ్వత భవనాన్ని ఏర్పాటు చెయ్యాలి. ఇదే తన సంకల్పం ! విద్య ద్వారా స్త్రీల వ్యక్తిత్వాన్ని వికసింప చేసేందుకు తను ఎంత కష్టానికైనా వెరువదు. ఇదే తన ఉక్కు సంకల్పం !
మరోసారి తనకు తానే ధైర్యం చెప్పుకుంది ఆమె...
***
“తర్వాత ఏమైంది? ఇంతకీ స్త్రీ హితైషిణి మండలికి శాశ్వత భవనం ఏర్పడిందా ? ఆ పవిత్రమైన స్త్రీమూర్తి సంకల్పం నెరవేరిందా ?”

“నెరవేరింది. అందుకోసం ఆమె ఎంతో కష్టపడింది. ఇఎండనకా, వాననకా ఇల్లిల్లూ తిరిగి నిధులు సేకరించింది. పలువురి ఆర్ధిక సాయం అర్ధించింది. చుట్టుప్రక్కల ఊళ్లు తిరిగి సాయం కోరింది. ఇదంతా ఆమె కోసమో, ఆమె స్వార్ధం కోసమో కాదని మనం గమనించాలి. పగలూ రాత్రి శ్రమించి మొత్తానికి 20 సెంట్ల స్థలంలో భవంతి నిర్మించి, తన ఆశయం నెరవేర్చుకుంది. ఎంతోమందికి ఆశ్రయం, జీవిక కల్పించి తన జీవితాన్ని సార్ధకం చేసుకుంది. చివరి క్షణాల్లో కళ్ళు కనిపించని దీన స్థితిలో ఉన్నా కూడా, పుట్టి మెట్టిన ఈ బాపట్ల మన్నులోనే కలిసిపోవాలని ఎక్కడికీ వెళ్ళకుండా ఇక్కడే దేహాన్ని వదిలి, ఆ పరమాత్మను చేరుకుంది. బాపట్ల ప్రజలు, బాపట్ల స్త్రీలు ఆమెని ఎన్నడూ మరువలేరు...”

అప్రయత్నంగా నా కళ్ళ వెంట నీరు కారసాగింది, “ ఉన్న ఊరిలోని స్త్రీల అభ్యుదయానికి ఉక్కు సంకల్పంతో కృషి చేసిన ఆమె కేవలం ఒక వ్యక్తి కాదు, శక్తి. తనే ఒక సైన్యంగా మారి మనల్ని ముందుకు నడిపిన ఆదిశక్తి. ఇటువంటి స్త్రీమూర్తులను కన్న ఈ బాపట్ల నేల ధన్యమైపోయింది !’ అన్నాను వంగి నేలను స్పృశించి, అంజలి ఘటిస్తూ...
(ఈ కధను రాసేందుకు కనపర్తి వరలక్ష్మమ్మ గారి జీవిత విశేషాలను నాకు అందించిన గొల్లమూడి సంధ్య గారికి కృతజ్ఞతాభివందనలు.)
****







No comments:

Post a Comment

Pages