జలతరంగ విధుషీమణి - శ్రీమతి సీతాలక్ష్మీ దొరైస్వామి - అచ్చంగా తెలుగు

జలతరంగ విధుషీమణి - శ్రీమతి సీతాలక్ష్మీ దొరైస్వామి

Share This

జలతరంగ విధుషీమణి - శ్రీమతి సీతాలక్ష్మీ దొరైస్వామి

-మధురిమ 
తొమ్మిది గజాల చీర కట్టుతో,నుదుట ఇనబింబమంత బొట్టుతో సహస్ర చంద్ర దర్శనం(అంటే ఒక జీవిత కాలం లో 1000 పౌర్ణమిలు చూసి 81వ సంవత్సరంలో ఉన్నవారిని అలా పిలవడం భారతీయ సాంప్రదాయం) చేసుకున్న ఓ భారత నారి తన ముందు ఓ పదహారు నుండీ ఇరవై పింగాణీ  గిన్నెల్లో నీటిని నింపి పెట్టుకుని,ఓ రెండు చిన్న చిన్న వెదురు కర్రలతో వాటిని లయ బద్ధంగా వాయిస్తూ ఉంటే అందులోంచి అమృతతుల్యమైన,లయబద్ధమైన సంగీతం వినిపిస్తూ ఉంటే అమెరికాలోని క్లీవ్ ల్యాండ్ లోని  ఆడిటోరియం లో శ్రోతలు ఎన్ని గంటలైనా మైమరచిపోయి మరీ అలా ఆస్వాదిస్తూనే ఉన్నారు.
పింగాణీ గిన్నెలపై సంగీతం ఎంటా అనుకుంటే…. ఆ వాయిద్యం "జలతరంగ్" లేదా "జలతరంగం" అని పిలబడే శ్రావ్యమైన సంగీతాన్ని వినిపించే ఓ లయ వాయిద్యం.
ఇక ఆ వాయిద్యం పై విన్యాసాలను చేస్తున్న ఆ  విదుషీమణి ఎవరంటే,"మదిసార్ మామి" అని తమిళులు అందరూ అభిమానంగా పిలుచుకునే భారతదేశ ఏకైక మహిళా జలతరంగ విదుషీమణి"కలైమామణి", కంచి కామకోటి పీఠ ఆస్థాన విద్వాంసురాలు శ్రీమతి సీతా లక్ష్మి దొరైస్వామి గారు.మదిసార్ అంటే తమిళంలో తొమ్మిది గజాల పట్టు చీర.మామి అంటే అత్త అని అర్థం.తమిళులందరికీ తొమ్మిది గజాల పట్టు చీర కట్టుకునే అత్త అన్నమాట శ్రీమతి సీతా లక్ష్మి గారు.
ఆడవారికి చదువుకోవడం నిషిద్ధం అనే రోజుల్లో, అసలు ఆడవారికి ఇంటి బయట కాలుపెట్టడం అంటే కూడా తెలియని రోజుల్లో మద్రాస్ సంగీత అకాడమీ వారి బంగారు పతకాన్ని పొందే విధంగా ,అంత శ్రద్ధగా  సంగీత అభ్యాసం, సాధన చేసిన ఆమె భావితరాలకు ఒక ఆదర్శవంతమైన విధ్యార్ధి,భర్తని, పదకొండు మంది పిల్లలిని భాద్యతతో పెంచి,పెద్దచేసి,వారి బాగోగులను సక్రమంగా  నిర్వర్తించిన ఉత్తమ గృహిణి, సార్ధక నామధేయురాలు మన సీతా లక్ష్మి.
సీతమ్మ అని కుటుంబసభ్యులచే ఆప్యాయం గా పిలువబడే మన సీతాలక్ష్మి గారు జనవరి27వ ఏదీ 1926వ సంవత్సరంలో ని తమిళనాడులోని తిరున్వేలి గ్రామంలో ని  అడచాని అనే గ్రామంలో పుంపు గణపతి అయ్యర్ ,మీనాక్షి అయ్యర్ దంపతులకు జన్మించారు.బాల్యంలో తల్లితండ్రుల ప్రోత్సాహంతో కర్ణాటక శాస్త్రీయ సంగీత విద్యాభ్యాసాన్ని కొడగనల్లూర్ సుబ్బయ్య భాగవతార్ గారిదగ్గర ప్రారంబించారు. ఆ తరువాత ప్రఖ్యాత గోటు వాయిద్య విద్వాంసులైన సీతారామ భాగవతార్ గారి దగ్గర కూడా వారి సంగీతాభ్యాసం నిరంతరంగా సాగింది.
ప్రఖ్యాత సంగీత విద్వాంసులు,సంగీతోపాధ్యాయులు,గ్రంధకర్త అయిన  ఆచర్య శ్రీ పి.సాంబమూర్తి గారు ఆ రోజుల్లో వేసంగి సెలవల్లో మద్రాసు నగరంలో  సంగీత అకాడమీలో సంగీత శిక్షణా తరగతులు నిర్వహించేవారు. సీతాలక్ష్మి గారికి 10ఏళ్ళ వయస్సు ఉన్నప్పుడు ఆవిడ ఓసారి ఆ తరగతుల్లో శిక్షణ పొందడం జరిగింది.ఇలా ఆవిడ 1937లో సంగీతానికి నెలవు ,కొలువు అయిన మద్రాసు పట్టనానికి  చేరుకుని డి.కె.పట్టమ్మాళ్ వంటి సహాధ్యాయులతో సంగీతప్రస్థానం కొనసాగిస్తూ ఉండేవారు...
మద్రాసు సంగీత అకాడమీ వారి పద్ధతి ఆ  రోజుల్లో ఎలా ఉండేదంటే కర్ణాటక శాస్త్రీయ సంగీత సిద్ధాంతంలో బాగా పట్టు ఉన్నవారికి గోటువాయిద్యం కాని జలతరంగం కాని నేర్చుకోవడానికి ఎన్నుకునే సౌకర్యం కలిపించబడేది.మన సీతాలక్ష్మి గారికి సంగీత సిద్ధాంతాల పైన కూడా మంచి అవగాహన ఉండేది కనుక ఆవిడని ఏదో ఒకటి ఎంచుకోమనగానే ఆవిడ జలతరంగాన్ని ఎన్నుకున్నారట.
కేవలం పదిసంవత్సరాల వయస్సులో ఉన్న మన సీతమ్మ కి జలతరంగిణి వాయిద్యంలోని ఆ పింగాణీ గిన్నెలను, అందులో నీళ్ళు  చూడగానే తాను రోజు ఇంట్లో ఆడుకునే మట్టి పిడతలు గుర్తొచ్చి సంతోషంగా జలతరంగం నేర్చుకుంటాను అని ఆ వాయిద్యాన్ని ఎంపిక చేసుకున్నారు. అయితే సంగీత ఎకాడమీలో జలతరంగిణి నేర్పించే గురువుగారు రమణయ్య చెట్టియార్ గారు.ఆయనమాత్రం అంత సులువుగా ఎవ్వరికీ నేర్పేవారు కాదట.విధ్యార్ధుల  ప్రతిభాపాఠవాలు , శృతి,లయ మొదలగు అంశాలలో వారి జ్ఞానాన్ని పరీక్షిస్తే గాని జలతరంగిణిలో శిక్షణ ఇచ్చేవారు కాదట.
అసలు అకాడమీలో ఉండే విధ్యార్ధులెవ్వరికీ జలతరంగిణీ వాయించే నైపుణ్యమే లేదు అని వారి అభిప్రాయం.ఇది ఇలా ఉండగా ఆచార్య సాంబమూర్తి గారి విన్నపముపై రమణయ్య చెట్టియార్ గారు మన సీతమ్మ ని పరీక్షించడానికైనా కనీసం ఒప్పుకోగలిగారు.
జలతరంగిణి ని ధీరశంకరాభరణం రాగం వాయించగలిగే లా శృతి చెయ్యమని రమణయ్య చెట్టియార్ గారు ముందు ఆదేశించారట.ఆమె అలా చెయ్యగానే తిరిగి మళ్ళీ మాయామాళవగౌళ రాగం వాయించగలిగేలా శృతి చెయ్యమన్నారట.ఈ రెండు పరీక్షలలో నెగ్గిన మన సీతమ్మ కి జలతరంగిణిలో శిక్షణ ఇవ్వడం మొదలు పెట్టారు.
ఆవిధంగా అకాడమీ వారిచే నడుపబడే "టీచెర్స్ కాలేజ్ ఆఫ్ మ్యూసిక్"లో ప్రవేశం పొందారు. నెలా పదిహేను రోజులు ఆమెకు నేర్పిన వెంటనే ఆమె అపార సంగీత జ్ఞానానికి ముగ్ధులై “ఈ నెల రోజుల శిక్షణా నీకు జీవితాంతం సరిపోతుందని” అని రమణయ్య చెట్టియార్ గారు దీవించారట.ఈ సంఘటన ద్వారా ఆమె అపార జ్ఞానం మనకి అవగతమౌతుంది.
ఆమె ఆర్ధిక పరిస్తితులను బాగ ఎరిగిన సాంబమూర్తి గారు ఆమెకి మొట్టమొదటి జలతరంగిణీ ని బహుమానం గా ఇచ్చారు.
ఇలా నేర్చుకోవడం ప్రారంబించిన కొన్ని నాళ్ళకే సంగీత అకాడమీ నుండి బంగారుపతకాన్ని పొందిన అతి చిన్న మహీళ.ఇప్పటికీ కూడా అతి చిన్న వయసులో అకాడమీ నుండీ ఈ గౌరవాన్ని పొందినా రికార్డ్ సీతాలక్ష్మి గారిదే.
జలతరంగిణి లో శిక్షణ పొందడం అలా పిన్నవయస్సులోనే మొదలైనప్పటికీ ఆమెకు అపారమైన ప్రతిభాపాఠవాలు ఉన్నపటికీ ఓ విద్వాంసురాలిగా ఆమె కచేరీలు చెయ్యడానికి మాత్రం ఆమెకు చాలా సమయమే పట్టింది...దానికి కారణం సీతమ్మ గారికి తన 14వ ఏట ఎన్.దొరైస్వామి గారితో  వివాహం జరిగింది.ఆతరువాత కుటుంబ జీవితంలో కొన్నాళ్ళు పూర్తిగా నిమగ్నం అయ్యి పరిపూర్ణమైన ఇల్లాలిగా ముందు ఇంట గెలిచిన తరువాతే బయటికి వచ్చారావిడ.కానీ సాధన నిరంతరం కొనసాగిస్తూ ఉండడం వల్ల అవకాశం వచ్చే సమయానికి చక్కగా దాన్ని అంది పుచ్చుకున్నారు.
ఇటు కుటుంబ నిర్వహణ అటు నిరంతర సాధన తో ఎప్పుడూ కాలాన్ని సద్వినియోగం చేసుకున్న ఉత్తమ ఇల్లాలు. ఏకాదశ రుద్రుల్లా ఆమె సంతానం 11 మంది. 11 మంది సంతానం యొక్క బాగోగులు చూడమంటే మామూలు మాటలా..అందునా ఆరోజుల్లో ఆడవాళ్ళకి అంత  స్వాతంత్రం కూడా ఉండేది కాదు. అయితే సీతమ్మ గారి భర్తగారు కూడా మంచి సంగీతాభిమాని కావడం వల్ల, సహధర్మచారిణి ని చక్కగా ప్రోత్సహించాలి అనే ఉన్నత భావాలు కలిగిన వ్యక్తి అవడమూ వలన ఆయన ప్రోత్సాహం వల్లనే తిరిగి ఆవిడ 1941వ సంవత్సరంలో తన మొదటి కచేరీ చేసి కష్టపడి సాధన చేసిన విద్య ఎక్కడికీపోదని "విద్యనిఘూడ గుప్తమగు ధనము రూపము పురుషాళికిన్"  అని భతృహరి తన సుభాషితాల్లో చెప్పిన మాటని నిజం చేసారు.
ఇక అక్కడనుంచీ విరివిగా ఆకాశవాణిలోనూ మద్రాసులోని వివిధ సంగీత సభలలోనూ,కొన్నిసార్లు విదేశాలలోకూడా తన ప్రతిభాపాఠవాలు ప్రదర్శిస్తూ ఎన్నో అవార్డులూ,ప్రత్యేక పురస్కారాలు కూడా పొందారు. వాటిలో కొన్ని
1939లో మద్రాస్ మ్యూసిక్ అకాడమీ నుండి బంగారు పతకాన్ని పొందిన తొలి అతిచిన్నవయస్సు కలిగిన అమ్మాయి గా అపూర్వ అనితరసాధ్యమైన గౌరవం
1989లో కంచికామకోటి పీఠ ఆస్థాన విద్వాంసురాలిగా నియమింపబడి ఆ అమ్మవారి అపారమైన కరుణాకటాక్షాలు పొందగలగడం
1999 వ సంవత్సరంలో రామకృష్ణా మఠం వారిచే "జలతరంగ విదూషి " అనే బిరుదు
2001వ సంవత్సరంలో దేశం లోనే నాల్గవ గౌరవ పౌరసన్మానం అయిన "కలైమామణి" సన్మానం
2007వ సంవత్సరంలో మద్రాస్ మ్యూసిక్ అకాడమీ ఆమెపై ఉన్న గౌరవంతో ఆవిడ పేరు మీదుగా ఓ పురస్కారాన్ని కూడా ప్రవేశ పెట్టారు.ఇది ఎంత అదృష్టం.
ఇంకా ఎన్నో ఎన్నెన్నో…….
ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి కాకపోతే సూర్యనారాయణశాస్త్రి అనే వీణ విద్వాంసుల వద్ద వీణా వాదన కూడా నేర్చుకున్నారు.
ఆమె సంతానం అందరు చక్కటి విద్యావంతులే..కాకపోతే ఎవరికీ ఆమె సంగీత వారసత్వం లభించలేదు.కాని అమెరికాలో ఉన్న ఓ  మనవరాలు మాత్రం జలతతరంగిణి ని నాన్నమ్మ గారిదగ్గర కొంతవరకూ అభ్యసించారు.
అసలు ఆడవారికి బయట ప్రపంచమే అంతగా తెలియని రోజుల్లో కుటుంబానికీ, ప్రతిభకి సమానమైన ప్రాధాన్యత ని ఇచ్చి అందరూ ఆశ్చర్యపడేలా ప్రతిభతో,భర్త ప్రోత్సాహంతో పతాకస్థాయి  కి చేరుకుని "కుటుంబ జీవితానికి ,వృత్తికి మధ్య సమతుల్యం  ఎలా పాటించాలో  " భావితరాలకు నిరూపించి చూపించిన నారీ శిరోమణి.  ప్రపంచానికి ఇంకా నాగరికత అంటే ఏమిటో తెలియకముందే అగ్గిపెట్టెలో ఆరు గజాల చీరని నేసి అమర్చిన నాగరికత గల దేశం మనది.అలాంటి మనదేశ కట్టును,బొట్టును మాత్రమే కాదు కట్టుబాటులను విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా పాటించిన శ్రీమతి సీతాలక్ష్మి దొరైస్వామి గారు  ఎప్పటికీ  ఆదర్శ మార్గదర్శకురాలే.
క్రింది వీడియో లలో ఆమె మధుర సంగీతాన్ని విని ఆనందించండి.

1 comment:

  1. Indian grandma is great. Loved the music.
    Regards
    M&K

    ReplyDelete

Pages