కాగితంతో కళాకృతులు - ఆర్టిస్ట్ సతీష్ కుమార్ 

భావరాజు పద్మిని


ఏ కళలో నైనా, వైవిధ్యం, తనదైన ప్రత్యేకత మేళవించి, ఒక స్థితికి చేరేదాకా అకుంఠిత దీక్షతో కృషి చేస్తే, చరిత్ర సృష్టించవచ్చు. అలా ‘కాగితంతో శిల్పాలు’ చెక్కడమన్న సరికొత్త కళలో ఐదేళ్లుగా రేయింబవళ్ళు  కృషి చేసి, ప్రపంచప్రఖ్యాతి గాంచిన కళాకారులు – మొక్కా సతీష్ కుమార్ గారు. వారితో ప్రత్యేక ముఖాముఖి ఈ నెల...
క్రింది చిత్రంలో కాగితంతో చేసిన తెల్ల గులాబీల ఆర్చ్ ను చూడవచ్చు. 
శిల్పాలు చెక్కాలంటే చిత్రకళ మీద కూడా అవగాహన ఉండాలి కదా. మీరు చిత్రకారులా ?
చిన్నప్పటి నుంచి డ్రాయింగ్స్ వేసేవాడిని. కాని, శిల్పాలు అంటే ఎక్కువ ఆసక్తి. పొలాల్లో దొరికే చొప్ప గడ్డి, తెర్మోకోల్ వంటివాటితో బొమ్మలు చేసేవాడిని. పేపర్ మాష్ మొదలైన వాటితో అమ్మ చాటలు, బుట్టలు వంటివి చేస్తుంటే ఆసక్తిగా చూసేవాడిని. ఆ తర్వాత చదువుమీదే శ్రద్ధ పెట్టి, ఆటోమొబైల్స్ లో అకౌంట్స్ మేనేజర్ గా పని చేసేవాడిని. ఐదేళ్ళ క్రితమే మళ్ళీ విభిన్నమైన రంగాన్ని ఎంచుకుని, కృషి ఆరంభించాను.
ముట్టుకుంటే చినిగిపోయే కాగితంతో శిల్పాలు చెయ్యాలన్న ఆలోచన మీకు ఎలా కలిగింది ?
పదేళ్ళ క్రితం ఫైన్ ఆర్ట్స్ విద్యార్ధులు కొల్లాజ్ వర్క్ చేస్తుంటే చూసాను. వారు ముఖానికి ఎరుపు, కళ్ళకి నలుపు వంటి రంగులు వేస్తూ, చివరికి ఒక ముఖాకృతిని తయారుచెయ్యడం చూసి, నాకూ శిల్పాలు, పోర్త్త్రైట్ ల మీద ఒక ఐడియా వచ్చింది. కాగితంతో నేనూ వైవిధ్యంగా ఏదైనా చెయ్యాలనిపించింది. అదే సమయంలో నాకు కెల్విన్ నికోలాస్ అనే
పేపర్ శిల్పి గురించి తెలిసింది. ఆయన విశ్వవిఖ్యాత కాగితపు శిల్పి. ఆయన వెబ్సైటులో ఆయన ఆర్ట్ వర్క్స్,  వాటి
ధరలు ఉన్నాయే తప్ప, వర్కింగ్ వీడియోస్ ఏమీ లేవు.
సరే, నేనూ ఎలాగైనా ప్రయత్నిద్దామని, ముందుగా కొన్ని పువ్వులు, కీటకాలు వంటివి మొదట్లో చేసి చూసాను. దైవానుగ్రహం వల్ల, బాగా చెయ్యగలిగాను. ఏదైతే కెల్విన్ తన 30 ఏళ్ళ కృషితో సాధించగలిగారో, నేనది వారంలోనే చెయ్యగలిగాను. అంతా భగవదనుగ్రహం.
ఈ ఆర్ట్ కు కావలసిన ముడిపదార్ధాలు ఏమిటి ?
ముందుగా ఈ పనికి కావలసింది ఏకాగ్రత, ప్రశాంతతతో కూడుకున్న మనసు, ఓపిక. నేను అసలు రంగులు వాడను. ప్లైన్ పేపర్ తో ఎమ్బోసింగ్ వంటి వర్క్ ఇది. ఇది అయ్యాకా హాట్ సిలికాన్ తో ఫిక్స్ చెయ్యాలి. అదీ చాలా కష్టమే. ఫిక్సింగ్ లో తప్పులు చేస్తే, మొత్తం వర్క్ పాడయినట్లే. ఫిక్స్ అయిన పేపర్ ను తీస్తే రాదు, ముక్కలైపోతుంది. ఈ కళకు చాలా సమయం పడుతుంది. రోజుకి 12 గం. చప్పున కష్టపడితే ఒక్క ఆర్ట్ వర్క్ కి సుమారు 600గంటల పని ఉంటుంది.
హమ్మో, మరి మీ వృత్తికి, ప్రవృత్తికి మధ్య బాలన్స్ చేసుకుని, ఈ రంగంలో ఎలా నిలబడగలిగారు?
 చిన్న చిన్న బొమ్మల తర్వాత పక్షులు, జంతువులు వంటి బొమ్మలు చేసాను. మనుషుల బొమ్మలు కూడా చెయ్యాలనిపించింది. కాని అది చాలా కష్టం. ఎందుకంటే, పోర్ట్రైట్స్ వెయ్యాలంటే కొన్ని ఫీచర్స్ రావాలి, పర్ఫెక్షన్ రావాలి. మామూలుగా చిత్రాలు గీసేటప్పుడు, ఏదైనా పొరపాటు వస్తే దిద్దుకోవచ్చు. శిల్పాలు చెక్కేటప్పుడు స్మడ్జి చెయ్యవచ్చు. కాని, ఇందులో ప్రతి డీటెయిల్ ముఖ్యమే. దిద్దుకునే ఆప్షన్ ఉండదు. చిన్నతప్పు చేసినా చాలా మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. చాలా క్లిష్టమైన పనిది. ప్రతి దానికి డీటెయిలింగ్ ఉండాలి. పరధ్యానంలో చిన్న తప్పు చేసినా, హైలైట్ అయిపోతుంది. అందుకే ఒక్క చిత్రానికే చాలా సమయం పడుతుంది.
ఉద్యోగ బాధ్యతలతో దీనికి తగిన సమయం కేటాయించలేక పోతున్నానని, నాకు అనిపించింది. అందుకే ఐదేళ్ళ క్రితం ఉద్యోగానికి రాజీనామా చేసాను. పూర్తి సమయం దీనికే కేటాయించి, కృషి చేస్తున్నాను.
ఇదొక రకంగా రిస్క్ కాదంటారా ? దీనివల్ల మీరు ఇబ్బందులు ఎదుర్కున్నారా ?
నా మీద, నా కళ మీద ఉన్న నమ్మకం నాతొ చేయించింది. నాకు 46 సం.వయసు. నా పిల్లలు ఇంకా చేతికి
అందిరాలేదు. పెద్దబాబు బి.టెక్ చదువుతున్నాడు. ఇటువంటి సమయంలో నెల తిరిగేసరికి జీతం వస్తూ, భద్రతనిచ్చే ఉద్యోగం వదిలి, నమ్మిన కళతోనే పయనం సాగించాలని నిర్ణయించుకోవడం, మీరు చెప్పినట్లు నిజంగా రిస్కే.
కాని, ఐదేళ్ళ నుంచి ఈ రంగంలో వర్క్ చేసాను. కొత్త కొత్త పద్ధతులు ఆవిష్కరించాను. నా కళను జనంలోకి తీసుకుని వెళ్లి, వారి అభిమానాన్ని పొంది, ఆర్డర్లు తెచ్చుకుని, నిలదొక్కుకోగలిగాను. దైవానుగ్రహం వల్ల అనుకున్న దానికంటే వంద రెట్లు ఎక్కువే సాధించాను. రికార్డు సృష్టించాను.
మీ కళను మీరు ప్రజల్లోకి ఎలా తీసుకుని వెళ్ళారు ?
గత ఏడాది మే లో ఫేస్బుక్ లో ఒక ఎకౌంటు తెరిచాను. అందులో ఒక స్త్రీ శిల్పం పెట్టాను. దానికి 40 వేల లైక్ లు, 70 లక్షల రీచ్, జరిగి ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ లభించింది. అమెరికా, లండన్ నుంచి కూడా నాకు ఆర్డర్స్ వస్తున్నాయి. ఇవి చాలా శ్రమతో కూడుకున్నవి కనుక, ఆర్డర్ బేసిస్ మీదే తప్ప, విడిగా చెయ్యను. ప్రస్తుతం కమర్షియల్ కమిట్మెంట్ లకు కట్టుబడి ఉన్నాను. ఇప్పటికీ సోషల్ మీడియా లో నా పేజి కి మంచి ఆదరణ లభిస్తోంది.
మీరు ఈ కళలో మీదైన ప్రత్యేక వైవిధ్యాన్ని ఎలా సృష్టించారు ?
నా శిల్పాలు విశ్వవ్యాప్తంగా పేరొందాయి. కాగితపు శిల్పాలలో, నా రియాలిటీ,  డీటెయిలింగ్ వంటివి చరిత్ర సృష్టించాయి. ఉదాహరణకు ఒక శిల్పం తాలూకు జుట్టుని అంటించాలి అనుకోండి. కాగితాన్ని అతి సన్నగా కత్తిరించి, అతికించాలి. ఇక్కడ గట్టిగా నొక్కితే ఫుల్ హెయిర్ ఫినిష్ రాదు. నూనె రాసి దువ్వేసిన తలలాగా అది తలో, అట్ట ముక్కో అర్ధం కాదు. కాబట్టి, అతికించడంలో కూడా నైపుణ్యం చూపాలి.
ఇక నా మరో ప్రత్యేకత ఏమిటంటే నేను రంగుల కాగితాలు వాడను. నా శిల్పాలు మొత్తం ఒకే రంగులో ఉంటాయి. ఒకే రంగున్న తెల్ల కాగితంలో ఏ రంగులూ వాడకుండా, వేర్వేరు ఆబ్జెక్ట్ లు అన్నీ కలిసిపోకుండా, స్పష్టంగా ప్రతి డీటెయిల్ కనబడేలా చెక్కడమే నా ప్రత్యేకత. క్లారిటీ లో ఒక స్పష్టత తీసుకువస్తే, వాటి ముందు రంగులు ఎందుకూ పనికిరావు. కాని, ఒక్కోసారి 3,4 రోజులైనా ‘ఇది ఎలా చెయ్యాలి’, అన్న విషయంలో స్పష్టత నాకు రాదు. ఒకసారి ఇలాగే నెమలి ఈకలు చెక్కాలనుకున్నాను. 20 రోజులైనా ఎలాగో తట్టలేదు, ఎందుకంటే నెమలి ఈకలు ఒక ఆంగిల్ లో టర్న్ అయి ఉంటాయి. వీటికి ఒక రొటేషన్ రావాలి. ఆ ట్రిక్ ఏమిటో గుర్తించేందుకు నాకు సమయం పట్టింది. ఒక్కోసారి పనిలో పడిపోతే పగలూ, రాత్రి గుర్తుండవు.
మీరు పొందిన అవార్డులు/రికార్డుల గురించి చెప్తారా ?
మొదట్లో బొమ్మలు చెయ్యడం, అమ్మడం తప్ప ఈ విషయంలో నాకు ఐడియా లేదు. ఒకసారి విజయవాడ లయోలా కాలేజీ గ్రౌండ్స్ లో ‘చిత్ర కళా సంత’ అని ఒక ఆర్ట్ ఎక్సిబిషన్ జరిగింది. దానికి సుమారు 300 మంది ఆర్టిస్ట్ లు హాజరయ్యి, వారి పెయింటింగ్స్, శిల్పాలను  ప్రదర్శించారు. అందులో నాకు బెస్ట్ ఆర్టిస్ట్ అవార్డు వచ్చింది. అప్పుడే నాకళకి ఇంత ఆదరణ ఉందని గుర్తించాను.
ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి నగరాల్లో జరిగిన ఆర్ట్ ఎక్సిబిషన్ లలో పాల్గొన్నాను. నా బొమ్మలు చేక్కేందుకు చాలా సమయం పడుతుంది కనుక, నేను 3,4 ఏళ్ళ సమయంలోనైనా కేవలం ఒక పదో, పదిహేనో బొమ్మలను మాత్రమే చెయ్యగలను. అందుకని, ప్రత్యేకించి నేనే ఒక ఎక్సిబిషన్ పెట్టేందుకు అవ్వదు.
ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా నాకు స్థానం దక్కింది. ముఖ్యంగా ఎక్కడైనా నా శిల్పాల ప్రదర్శన పెట్టినప్పుడు సీనియర్ ఆర్టిస్ట్ లు వచ్చి చూసి, మొదట్లో ‘ప్లాస్టర్ అఫ్ పారిస్’ బొమ్మలా, అని వెళ్ళిపోతూ ఉంటారు. నేను కాగితంతో చేసానని చెప్పగానే, వెనక్కు వచ్చి, పరిశీలించి చూసి, ప్రశంసిస్తారు. ఇది నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది.
మీ తర్వాత ఈ కళను ఎవరైనా ప్రయత్నించారా ?
సుమారు 300 మంది ప్రయత్నించారు. కాని, ఫెయిల్ అయ్యారు. మొదట్లో నా కళ ప్రత్యకమైనది కనుక, దీనికి పేటెంట్ హక్కులు తీసుకోవాలని అనుకున్నాను. కాని, అక్కర్లేదని అర్ధమయ్యింది. ఈ కళలో నిలదొక్కుకోవాలంటే జీవితాన్ని మర్చిపోవాలి, సమాజాన్ని మర్చిపోవాలి, ఈ ప్రపంచంలో నేనొక్కడినే ఉన్నాననుకుని, కళతో మమేకమైపోవాలి. ఆకలి, నిద్ర మర్చిపోవాలి. నిజానికి శిల్పాలు చెక్కేటప్పుడు ఆకలి, నిద్ర గుర్తుకురావు కూడా. కాని, బొమ్మలు చూసిన వారు మెచ్చుకున్నప్పుడు, ఆ ఆనందంలో ఇవన్నీ మర్చిపోతాము. అది మాటల్లో చెప్పలేని గొప్ప తృప్తి.
నేను శిక్షణ ఇస్తానంటే ఆసక్తి చూపేవారు వందల సంఖ్యలో ఉంటారు. కాని, ఉద్యోగం వదిలి, ఈ వృత్తిలోకి రావడం వల్ల, నాకిదే ఆధారమయ్యింది. అందుకే మొదట నేను బాగా నిలదొక్కుకున్నాకానే శిక్షణ వంటివి ప్రారంభించాలని అనుకున్నాను. భవిష్యత్తులో ఆసక్తి ఉన్నవారికి నేర్పే ఆలోచన కూడా ఉంది.
మీరు అందుకున్న మర్చిపోలేని ప్రశంస ఏమిటి ?
నా శిల్పాలను ప్రదర్శనకు ఉంచిన ప్రతి చోటా,చూసేందుకు వచ్చినవారు రెండు నిముషాల పాటు రెప్ప వెయ్యడం
కూడా మర్చిపోయి, మాటరాక మూగబోయినట్లు చూస్తుంటారు. ఆ చూపే నాకు ఉత్తమ ప్రశంస.
ఈ మధ్యన మోదీ గారితో 20 నిముషాల అప్పాయింట్మెంట్ దొరికింది. వారి శిల్పాన్ని వారికే బహూకరించడం జరిగింది. ఆ చిత్రం గురించే వారు నాతో 5 నిముషాల పాటు మాట్లాడుతూ, ‘ మన భారతంలో ఇంత గొప్ప కళాకారులు ఉన్నారా?’ అని ఆశ్చర్యపోయారు. ఇంతకంటే గొప్ప ప్రశంస ఏముంటుంది చెప్పండి.
విభిన్నమైన కళా క్షేత్రాన్ని ఎన్నుకుని, అలుపెరగని కృషితో ప్రపంచప్రఖ్యాతి గాంచిన సతీష్ గారు మరిన్ని అద్భుతమైన విజయాలను సాధించి, చరిత్ర పుటల్లో విలక్షణమైన స్థానం సంపాదించాలని మనసారా ఆకాంక్షిస్తోంది ‘అచ్చంగా తెలుగు.’
*****

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top