బాల గేయాలు – 02 - అచ్చంగా తెలుగు

బాల గేయాలు – 02

చదువు సందెలు

టేకుమళ్ళ వెంకటప్పయ్య  


తొలుత కార్యం చెయ్యాలన్నా బొజ్జ గణపయ్య అని ప్రార్ధిస్తే గానీ ఆరంభం చెయ్యం. విషయాన్ని పిల్లలకు మనం చిన్న తనం నుండే చెప్పి అలవాటుగా మార్చగలగాలి.

శ్లో. సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణకః
లంబో దరశ్చ వికటో విఘ్నరాజో వినాయకః
ధూమకే తుర్గణాధ్యక్షః ఫాల చంద్రో గజాననః
వక్ర తుండ శ్ముర్పకర్ణో హేరంబః స్కంధ పూర్వజః
షోడ శై తాని నామానియః పటేచ్చ్రణు యాదపి
విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తధా
సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే ||

విఘ్నేశ్వరుణ్ణి పదహారు నామాలతో స్తుతించాలి. పదహారు నామాలు చెప్పినా, విన్నా అనంతమైన పుణ్యం సంప్రాప్తమౌతుంది. అఖండమైన గణపతి కరుణ మనకు లభిస్తుందన్న విషయం మనం పిల్లలకు చెప్పి వారి చేత నిత్యం ఇలాంటి శ్లోకాలు పఠింప జేయాలి.
  మాసం గేయం చూద్దాం.
విఘ్నమ్ము లేకుండ విద్య నియ్యవయ్య,
విఘ్నేశ్వరుడ నీకు  వేయి దండాలు.

ఉంగరమ్ములు పెట్టి ముంగురులు దువ్వి,
ఒద్ద పెట్టుకు తల్లి ముద్దులాడింది;
పలక బలపములిచ్చి, పద్యాలు పాడి,
సరసపెట్టుకు తండ్రి చదువునేర్పాడు.

చదువుకో నాయన్న చదువుకో తండ్రి!
చదువుకుంటే నీకు సౌఖ్యమబ్బేను!
ఆడుకో నాయన్న! ఆడుకో తండ్రి!
ఆడుకుంటే నీకు హాయి కలిగేను!

పిల్లలందరు రండి బళ్ళోకి పోయి,
చల్లన్ని గాలిలో చదువుకొందాము.
విసరు విసరూ గాలి విసరవే గాలి
మల్లెపూవుల గాలి మామీద విసరు.
 ఎంత చక్కటి గేయమో చూసారా!  పిల్లలకు చిన్నతనంలోనే గణపతి పూజ ప్రాముఖ్యం తెలపడం, తల్లి పిల్లలను ముద్దు చేసినప్పటికీ తండ్రి పిల్లలను దగ్గర కూర్చోబెట్టుకుని పద్యాలు, గేయాలు పాడి వినిపించి,  పలకా బలపంతో చదువు చెప్పాలని చెప్తాడు కవి. చదువుకుంటే నీకు అన్నిరకాల సౌఖ్యాలు అష్టైశ్వర్యాలు లభిస్తాయని, అలాగే ఆటలవల్ల శారీరక వ్యాయామం కలిగి, దేహ దారుఢ్యం పెంపొందడమే కాక మంచి మేధస్సు వికసిస్తుందనీ చెప్తున్నారు. " సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ" అని పెద్దలు చెప్పినట్టు పిల్లలకు వ్యాయామం చాలా అవసరం.  ఇప్పుడున్న కార్పోరేట్ స్కూళ్ళలో స్కూల్లో అన్నా, డ్రిల్లు మాస్తార్లు ఉన్నారా? ఆడుకోడానికి మంచి మైదానం ఉందా?  అంతా ర్యాంకుల పరుగులే! పిల్లలు పాఠశాలకు వెళ్ళి చల్లని గాలిలో చదువుకోవాలనీ.. గాలి మల్లెపూవుల గాలిలా సువాసనలను విరజిమ్మాలనీ కోరుకుంటున్నాడు కవి.   కానీ రోజుల్లో కాంక్రీటు జంగిల్స్ లాంటి బిల్డింగులలో చదివే విద్యార్ధులకు, ఇవన్నీ కోరుకోవడం గొంతెమ్మ కోరికలేఅయినా పిల్లలకు మంచి చెప్పడం, మంచిపనులు చిన్నప్పటినుండి అలవాటు చేయడం మన కర్తవ్యం.
 విన్నపం: మనం గత మాసం "పుట్టేటి భానుడా పుష్యరాగపు ఛాయ" అనే బాలల గేయం తెలుసుకున్నాం. దీని రచయిత బాలాంతరపు రజనీకాంతరావు గారని ఎవరో కామెంట్ ద్వారా తెలియజేశారు. వేటూరి వారు రచయితల పేర్లుబాలభాష” (బాలగేయాలు) పుస్తకంలో ఇవ్వలేదు. నాకు బాగా సుపరిచితమైన గేయాల యొక్క గేయ రచయితల పేర్లే ఇవ్వాలని అనుకున్నాను. ఎవరికైనా గేయ రచయిత పేరు ఖచ్చితంగా తెలిసినట్లైతే నాకు తెలియజేస్తే మరుసటి మాసం ప్రకటిద్దాం ఇలాగేఅంతే గానీ రచయితలను విస్మరించడం కాదని మనవిఒక రచయిత పేరును విస్మరిస్తే కలిగే బాధ నాకు బాగా తెలుసు.
-o0o-

No comments:

Post a Comment

Pages