సామ్రాజ్ఞి (రెండవ భాగం ) - అచ్చంగా తెలుగు

సామ్రాజ్ఞి (రెండవ భాగం )

Share This

సామ్రాజ్ఞి (రెండవ భాగం )

భావరాజు పద్మిని


(జరిగిన కధ : ప్రస్తుత కేరళ ప్రాంతంలోని సువిశాల సీమంతినీ నగరాన్ని పరిపాలిస్తూ ఉంటుంది స్త్రీ సామ్రాజ్ఞి ప్రమీల. ఆమె రాజ్యంలో అంతా స్త్రీలే ! అందంలో,కళల్లో, యుద్ధ విద్యల్లో ఆమె ముందు నిలువగల ధీరుడు లేడని ప్రతీతి. ఆమె  ఉత్సాహభరితమైన మాటలతో తన సైన్యాన్ని ఉత్తేజపరుస్తూ ఉంటుంది. గిరిజనులకు బందిపోట్ల బాధను తొలగించేందుకు వెళ్ళిన ఆమె చేతికి గాయమవుతుంది. ఈ సంగతిని ఆమె తన గుర్విణి శక్తిసేనకు చెబుతూ, తనేదో ముఖ్యమైన పనిమీద గుర్విణిని కలిసేందుకు ఆమె ఆశ్రమానికి వచ్చానని విన్నవిస్తుంది. గుర్విణి అనుమతితో ఇలా చెప్పసాగింది ప్రమీల...)
“ గుర్విణీ ! కుంతల రాజు విజయవర్మ నుంచి మనకు నిన్నొక వర్తమానం అందింది. విహారానికి మన దేశ సరిహద్దుల్లోకి వచ్చిన శూరవర్మ, దప్పికతో గాలిస్తూ తెలియక “పరిణామ సరోవరం” లోని నీటిని త్రాగి, స్త్రీ రూపాన్ని పొందాడట ! తరుణోపాయం తెలియక, సిగ్గుతో కుంచించుకుపోయి, ఎలాగో తన అన్నను చేరి జరిగింది చెప్పాడట ! విజయవర్మ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నాడు. ‘అంతకంతకూ, మీ స్త్రీ సామ్రాజ్య ఆగడాలు ఎక్కువ అవుతున్నాయని, ప్రమాదకరమైన సరస్సు ఉందని, ఎటువంటి శాసనం అక్కడ వేయించకపోవడం వల్లనే ఈ  విపరీతం జరిగిందని,’ మండిపడుతున్నాడు. వచ్చే పున్నమి లోగా తనకు సామంతురాలిగా ఉంటానని ఒప్పుకున్న లేఖ పంపి , తాను కోరిన కప్పం కడుతూ, తనను వివాహం చేసుకుని, తన కాళ్ళ దగ్గర పడుంటానని ప్రమాణం చెయ్యలట ! అంతేకాదు, ‘ఎప్పటికీ స్త్రీ పురుషుడికి విలాస వస్తువుగా, చరణదాసిగా ఉండాల్సిందే ! అందుకు భిన్నంగా కాళ్ళకు వేసుకునే చెప్పుల్ని నెత్తిన పెట్టుకు తిరిగినట్టు, ఆడవాళ్ళు పాలన మొదలుపెడితే ఆడమలయాళం – బోడి మలయాళం అన్న తీరుగా పరిస్థితులు ఇలాగే దాపురిస్తాయి ’ అంటూ అభ్యంతరకరంగా, చులకనగా మాట్లాడాడు. తను కోరిన విధంగా  నేను లొంగకపోతే తన గజ, తురగ, సైనిక బలంతో సహా, సీమంతినీ నగరంపై దండెత్తి స్త్రీ సామ్రాజ్యాన్ని చిన్నాభిన్నం చేస్తానని అతని లేఖలోని సారాంశం !” దిగులు కమ్మిన వదనంతో గుర్విణి నే చూస్తూ అంది ప్రమీల.
“మరి ఏమి చెయ్యదల్చుకున్నావు ? ఈ విషయంలో నీ నిర్ణయం ఏమిటి సామ్రాజ్ఞి ?” సూటిగా అడిగింది శక్తిసేన. గురువుల గొప్పదనం అదే, పూర్వపరాలను, అడిగినవారి భావాన్ని పూర్తిగా చదవకుండా ఏ మాటా మాట్లాడరు.
“గుర్విణీ ! ఇదివరలో ఎన్నోమార్లు అడిగినా మీరు ‘పరిణామ సరోవరం’ గురించి,  దాని ప్రక్కనే ఉన్న ‘వ్యాఘ్ర సరోవరం’ గురించిన కధను నాకు చెప్పలేదు. నా నిర్ణయం చెప్పేముందు, ఈ  అనుకోని ఉత్పాతానికి కారణమైన వాటి కధను తెలియజేయమని విన్నవించుకుంటున్నాను.” శిరస్సు వంచి నమస్కరిస్తూ అడిగింది ప్రమీల.
“ తప్పకుండా ప్రమీల ! ముందుగా మన పరిణామ సరోవరం గురించిన కధను చెబుతాను. విను. ఒకప్పుడు దాక్షాయణి భూలోకంలో తపస్సు చేసుకునేందుకు అనువైన స్థలాన్ని అన్వేషిస్తూ ఉంది. ఒక ఉషోదయాన అమృతతుల్యమైన జలాలతో, అప్పుడే ముడుచుకుంటున్న తెల్ల,నల్ల కలువలతో, సూర్యకాంతికి నిండుగా విచ్చిన ఎర్ర, తెల్ల తామరలతో, సూర్యకిరణాలు అనే బంగారు చీరను కప్పుకుని, మనోజ్ఞంగా కనిపిస్తున్న ఈ జంట సరోవరాల శోభ ఆమెను అమితంగా ఆకర్షించింది. తక్షణమే అక్కడ ఒక అనువైన ప్రాంతాన్ని ఎంచుకుని, శివుడిని ఉద్దేశించి తపస్సు చెయ్యసాగింది.
ఒకనాడు ఆమె తీవ్ర తపోనిష్టలో ఉండగా, వేట కోసం అటుగా వచ్చి, నీరు త్రాగబోయిన ఒక దుర్మదాంధుడైన రాక్షసుడొకడు ఆమెను చూసాడు. జగదేకమోహిని అయిన అమ్మవారి సౌందర్యాన్ని చూసి, మోహించి, ఆమెను తాకి బలాత్కరించబోయాడు. తనను ప్రేమించి పెళ్ళాడమని ఆమెను వేధించసాగాడు. అగ్రహోదగ్రురాలైన అమ్మవారు తన మూడోకంటిని తెరిచింది. ఆ దెబ్బకు కాలి బూడిదగా మారాడు ఆ రాక్షసుడు. అయినా ఆమె కోపం చల్లారలేదు. ‘ఇకనుంచి ఈ సరోవరంలో ప్రవేశించిన మగ జీవులు ఏవైనా సరే, ఆడ జీవులుగా  మారుగాక !’ అని శపించింది. అప్పటినుంచి పశువులు, పక్షులు, మనుషులు, రాక్షసులు అన్న భేదం లేకుండా, ఏ జీవులు అందులో నీటిని త్రాగినా ఆడవిగా మారిపోసాగాయి. ఆ శాప పరిణామమే – ఈ పరిణామ సరోవరం. “ ఆశ్చర్యంగా వింటున్న ప్రమీల వంక చిరునవ్వుతో చూస్తూ, ఇంకా ఇలా కొనసాగించింది ఆమె.
“ఇక ఆ సరోవరం ప్రక్కన ఉన్న జంట సరోవరం, ‘వ్యాఘ్ర సరోవరం’ గురించిన కధను చెబుతాను విను. కృత యుగంలో ‘అకృతవర్ణుడు’ అనే ముని ఉండేవారు. ఆయన ధర్మబద్ధంగా సాధుజీవనం గడుపుతున్న పుణ్యాత్ముడు. ఆయన నిరంతర దైవనామజప నిరతుడై, అనేక తీర్ధయాత్రలు చేస్తూ, అనేక ప్రాంతాలను సందర్శిస్తూ నదీ నదాలలో, చెరువులలో స్నానం ఆచరిస్తూ సంచరించేవాడు. ఆయన ఒకనాడు ఇక్కడి సరోవరానికి వచ్చి ‘అఘమర్షణ ‘ స్నానం చెయ్యసాగాడు.”
“ఆటంకపరుస్తున్నందుకు మన్నించాలి గుర్విణీ ! అఘమర్షణ స్నానం అంటే ఏమిటో దయుంచి వివరించగలరు.” అర్ధించింది ప్రమీల.
“ప్రమీలా ! నీళ్ళు పోసుకోవడం వేరు, స్నానం చేయడం వేరు. స్నానం చేయడం అంటే పాపహరణ మంత్రములతో స్నానం చేయాలి. అఘమును – పాపాన్ని – తొలగించేది అఘమర్షణ స్నానం. అంటే పాప పంకిలాలను తొలగించే మంత్రాలు చదువుకుంటూ చేసే స్నానం అఘమర్షణ స్నానం అన్నమాట. జీవనదికి లేక సరస్సుకు వెళ్లి గంగకును, శ్రీ మన్నారాయణునకును, భైరవునకును నమస్కరించి భైరవాజ్ఞను తలదాల్చి మొలలోతు నీటిలో నిలువబడి మొదట సంకల్పము జెప్పికొని సూక్తములను జదివి, మార్జన మంత్రముతో, అఘమర్షణ మంత్రముతో, గంగోదకమును శిరస్సున జల్లుకొని స్నానం చెయ్యడాన్నిఅఘమర్షణ స్నానం అంటారు. నిజానికి మనం స్నానం చేసేటప్పుడు, ఇదంతా చేసే విజ్ఞానం తెలియనప్పుడు గంగా స్మరణ, గోవింద నామ స్మరణ, ఇష్టదేవతా స్మరణ చేస్తూ స్నానం చేయాలి. ఇలా చేసినదాన్నే స్నానం అంటారు. లేకపోతే  ఉత్త నీళ్ళు పోసుకోవడం అవుతుంది.
అలా అకృతవర్ణముని స్నానానికి ఆ చెరువులో దిగగానే, ఒక మొసలి ఆయన కాలు పట్టుకుంది. ఆయన్ను మొసలి చంపబోగా, ఆయన తన తపః శక్తితో విడిపించుకుని, “ఈ నాటి నుంచి ఈ చెరువులోనికి ప్రవేశించిన ఏ జీవులైనా పెద్ద పులులు అయిపోవు గాక !” అని శపించారు. అందుకే, ‘వాఘ్ర సరోవరంలో’ ప్రవేశించిన వారు ఎవరైనా పులులుగా మారిపోతారు. ఇదీ ఈ జంట సరోవరాల చరిత్ర.
ఒక ప్రాంతానికి విహారానికి వెళ్ళే ముందర, కూలంకషంగా ఆ స్థలం గురించి, అక్కడున్న విప్పత్తులు, చరిత్రల గురించిన అవగాహన లేకుండా దూకుడుగా దూసుకువెళ్ళడం శూరవర్మ తప్పు ! ఇక నీవు విన్నవించిన సమస్యకు నా పరిష్కారాన్ని సూచించే ముందు నీ నిర్ణయాన్ని నేను వినగోరుతున్నాను.” సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ అన్నది శక్తిసేన.
“గుర్విణీ ! తెలిసోతెలియకో జరిగిపోయిన ఈ సంఘటనకు ప్రతిగా అనేక ప్రాణాలను బలిచ్చే అనవసర యుద్ధ రక్తపాతం నాకు ఇష్టం ఉండదు. అలాగని, ముందూవెనుకలు ఆలోచించకుండా మన రాజ్య సరిహద్దులు దాటి వచ్చి, తన తమ్ముడు నీటిని త్రాగినందుకు, స్త్రీ సామ్రాజ్యం మొత్తం తన పాదాక్రాంతం కావాలని విజయవర్మ కోరుకోవడం అతని మత్సరాన్ని తెలియజేస్తోంది. దాన్ని ఉపేక్షించి, అతనికి గుణపాఠం చెప్పకుండా, చేతకానిదానిలా ఊరుకోవడం కూడా నాకు ఇష్టంలేదు. ఉభయతారకంగా మీరే ఏదైనా ఉపాయం చెబుతారని వచ్చాను. “ తన మనసులోని భావాన్ని బయటపెట్టింది ప్రమీల.
“ప్రమీల ! నువ్వు బాధ పడ్డా, గాయపడ్డా, నీ ప్రజల్ని కాపాడాలని ఆలోచిస్తున్నావు. కన్నతల్లి దయకు ప్రతిరూపం అంటారు, ఆ తల్లి రూపాన్ని నీలో చూస్తున్నాను. ఇప్పుడు విను, దమ్ముంటే అతడిని నీతో మల్లయుద్ధానికి రమ్మని ఆహ్వానించు. యుద్ధంలో విజయులు అయినవారిదే రాజ్యం , అధికారం ! నీ గుర్విణిగా ఆజ్ఞాపిస్తున్నాను. స్త్రీలను గౌరవించాల్సిన ఈ లోకంలో, వారిని ఇంత చులకనగా మాట్లాడే అతడిని ఎలాగైనా గెలిచి, ఈ రాజ్యానికి తెచ్చి, విలాసపురుషుడిగా పడెయ్యి! “ కఠినమైన స్వరంతో అంది గుర్విణి.
‘భళా గుర్విణీ ! మల్ల యుద్ధం అద్భుతమైన యోచన  ! విజయవర్మ ... విలాస పురుషుడు...’ ఆ దూర్తుడికి అదే తగిన శిక్ష అనుకుంటూ బిగ్గరగా నవ్వింది ప్రమీల !
అంతా స్త్రీలే ఉన్న ఆ రాజ్యంలో సంతతి పురుషులు లేకుండా ఎలా వర్ధిల్లుతుంది ? అందుకు ఏర్పరచిన మార్గమే ఈ ‘విలాస పురుషులు... !’. స్త్రీని భోగవస్తువుగా పరిగణించే లోకంలో, పురుషాధిక్య ప్రపంచానికి వ్యతిరేకులైన స్త్రీ సామ్రాజ్యంలో రూపొందించిన కొత్త విధానమే ఈ విలాస పురుషులు. స్త్రీ సామ్రాజ్య స్త్రీలు సరిహద్దు ప్రాంతాల నుంచి పురుషులను వలపు వల పన్ని తీసుకుని వస్తారు. అలా తెలియక వారి మాయలో పడ్డ పురుషుడు విలాస పురుషుడిగా మార్చబడతాడు. అటువంటి పురుషుడు ఎవడైనా, స్త్రీ సామ్రాజ్య స్త్రీల సంభోగ తేజస్సు తట్టుకోలేక, ఒక్క నెలకు మించి బ్రతికిన దాఖలాలు స్త్రీ సామ్రాజ్య చరిత్రలోనే లేవు. ఆ విధంగా ఒక విలాసపురుషుడితో ఉన్న స్త్రీలు అందరిలో ఒకామె మాత్రమే గర్భవతి అవుతుంది. ఆమె తప్పనిసరిగా ఆడబిడ్డనే కంటుంది. అందుకే ఆ రాజ్యంలో స్త్రీలు తప్ప పురుషులు ఉండరు.
గుర్విణి పాదాలకు నమస్కరించి, ఆమె ఆశీర్వాదం తీసుకుని లేచి, దూత ద్వారా ‘మల్ల యుద్ధాన్ని’ గురించిన సందేశాన్ని విజయవర్మకు పంపేందుకు కదిలింది ప్రమీల.
(గమనిక : ఈ సీరియల్ లో ప్రస్తావించిన అంశాలన్నీ జైమిని భారతంలో ఉన్నవే. అనుమానం ఉన్నవారు జైమిని భారతం చదివి, నివృత్తి చేసుకోవచ్చు.)
(సశేషం...)

No comments:

Post a Comment

Pages