బాల గేయాలు - 1 - అచ్చంగా తెలుగు

బాల గేయాలు - 1 

- టేకుమళ్ళ వెంకటప్పయ్య.



ఒక దేశ సంస్కృతి, నాగరికతలను ప్రతిబింబించేది దేశపు సాహిత్యమేముఖ్యంగా బాలసాహిత్యం బాగా నిరదరణకు గురయింది. తెలుగుదనం మన ముంగిళ్ళలో తెరమరుగవుతోంది.  "జోఅచ్యుతానంద జోజో ముకుందా" పాడే తెలుగు తల్లీ లేదు. వినే తెలుగు శిశువూ లేడు. బాల్యం అంతా ప్లే స్కూళ్ళలో మగ్గిపోతోంది. సాంకేతిక విజ్ఞానం బహుళవ్యాప్తి చెందడంతో పుస్తకాలు చదవడం మానేసి టీ.వీలలో వచ్చే కార్టూన్ ఛానల్స్ వేపు పిల్లలు బాగా ఆకర్షితులవుతున్నారుపూర్వం ఇళ్ళలో బామ్మలు, తాతయ్యలు పిల్లలను ఆడిస్తూ  "ఏనుగమ్మా ఏనుగు",  "గుడి గుడి గుంజం", "కాళ్ళా గజ్జా కంకాణమ్మా" లాంటి ఆటలు ఆడించే వారు. నేడు వారు టీ.వీలలో సీరియల్స్ చూడడంలో నిమగ్నమవడంతో బాల సాహిత్యం, పిల్లల ఆటలు, పాటలు అటకెక్కాయినిద్రలేవగానే.. "కరాగ్రే వసతే లక్ష్మి" తో ప్రారంభమయ్యే దినచర్య నిద్రించే ముందు "రామస్కంధం హనూమంతం...దుస్స్వప్నం తస్యనస్యతేతో ముగిసేది. పిల్లలను ఐదో ఏడు వచ్చేదాకా స్కూల్లో వేసే వారు కాదు. ఈలోపు వారికి సుమతి శతకం, వేమన శతకం, శబ్దమంజరి లాంటివి నోటికి వచ్చేవి. నేడు సీను మారిపోయింది. మూడో ఏటే మూటెడు బరువుతో పిల్లలు కన్నీళ్ళతో స్కూళ్ళకు వెళ్ళడం బాధాకరం.
 పిల్లలు "వానా వానా వల్లప్ప" అని స్వాగతం పలుకుతూ ఆడాలి గానీ "రెయిన్ రెయిన్ గో-అవే" అని వర్షానికి వీడ్కోలు పలకరాదు. పరిస్థితులు ఎలాంటివైనా భావి తరం తెలుగు మరచిపోయే దుస్థితి రాకూడదు. దానికై మనం ముందే మేలుకోవాలి. శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రిగారు బాల సాహిత్యం బండలైపోతూ ఉందన్న విషయం నాలుగు దశాబ్దాలకు ముందే గ్రహించారు. బాల భాష పేరుతో చక్కని బాలగేయాలు సేకరించి ప్రచురింపజేశారు. వాటిలో కొన్ని గేయాలను మనం పునశ్చరణ చేసుకుని మన పిల్లలకు నేర్పి ముందు తరాలు తెలుగును మరచిపోకుండా కాపాడుకోవలసిన బాధ్యత మనమీద ఎంతైనా ఉంది.
  గేయాన్ని గమనించండి.
పుట్టేటి భానుడా, పుష్యరాగపుచాయ -
        శ్రీసూర్యనారాయణా!
పుష్యరాగము మీద పొంగుబంగరుచాయ
        శ్రీసూర్యనారాయణా!
జామెక్కి భానుడా, జాజిపువ్వులచాయ
        శ్రీసూర్యనారాయణా!
జాజిపూవులమీద సంపెంగపువుచాయ
        శ్రీసూర్యనారాయణా!
మధ్యాహ్న భానుడా, మల్లెపూవులచాయ
        శ్రీసూర్యనారాయణా!
మల్లెపూవులమీద మంచి వజ్రపుచాయ
        శ్రీసూర్యనారాయణా!
మూడ్జాముల భానుడా, మునగపూవులచాయ
        శ్రీసూర్యనారాయణా!
మునగపువ్వులమీద ముత్యాలపొడిచాయ
        శ్రీసూర్యనారాయణా!
క్రుంకేటి భానుడా, గుమ్మడీపువుచాయ
        శ్రీసూర్యనారాయణా!
గుమ్మడీపువుమీద కుంకుం పువుచాయ
        శ్రీసూర్యనారాయణా!
ఆయురారోగ్యములు ఐశ్వర్యములనిమ్ము
        శ్రీసూర్యనారాయణా!
  శీర్షిక పిల్లలకోసమే అయినా పెద్దలు చదివి ఇవన్నీ పిల్లలకు చెప్పవలసిన బాధ్యత ఎంతైనా ఉందియతిప్రాస తాళ లయాన్వితములైన గేయాలు పిల్లలకు పలికేటప్పుడు హృద్యంగమంగా ఉంటాయి గేయాలను పిల్లలకు చిన్నతనముననే నేర్పించవలసిన అవసరం ఎంతో ఉంది. లేనట్లైతే ప్రస్తుతం ఉన్న విద్యావిధానంలో పిల్లలు తెలుగు లో పట్టు సాధించలేరు. చిన్నతనం లో మంచి సంస్కారం లేకపోవడం వలననే కాలం పిల్లలు మంచి "పలుకుబళ్ళను", "పద్యాలను" చదవలేక పోతున్నారు. ఇదే విషయం శాస్త్రి గారు నొక్కి చెప్పారు.   పన్నెండవ శతాబ్దికి చెందిన ప్రసిద్ధ కవి పాల్కురికి సోమనాధుడు తొలిసారిగా జోల పాటలను మన కందించాడు. ‘జోసరచుచు సన్నుతిబాడుఅంటూ జోలపాటను పేర్కొన్నాడు.   అలాగే దాగుడుమూతలాట, గోరంటలాట, సరిగుంజులాట, కుందెన గుడి, గుడి గుంజంబులాట, సిట్లపొట్లాట, సేరబొంతలాట, అప్పల విందులయాట, చప్పట్లాట, రాగుంజు గుంజులాట, దిగు దిగు దిక్కొనునాట మొదలైనవి ఆరోజులలో ఉండేవని తెలియజేశాడు.  రెండు మూడు దశాబ్దాల క్రితం నాటి  పిల్లల ఆటలే కనుమరుగయ్యాయి, ఇక ఎనిమిది శతాబ్దాల క్రితం ఉన్న ఆటలను మనం వూహించనుకూడా వీలులేని దుస్థితి
-0o0-

No comments:

Post a Comment

Pages