అమ్మ సణుగుడు - అచ్చంగా తెలుగు

అమ్మ సణుగుడు

Share This

  అమ్మ సణుగుడు

లక్ష్మీ రాఘవ 


“అక్కా, నీవు ఒక్క సారి అమ్మతో మాట్లాడు. నన్ను సతాయించ వద్దు అని చెప్పు...” తమ్ముడు రఘు దగ్గరినుండీ ఫోను.
“ఏమైంది?”
“నాన్న తద్దినం ఇంకా నెలరోజులు వుంది...ఇప్పటినుండీ మొదలు పెడుతూంది” అప్పుడు  అర్థం అయ్యింది గిరిజకు కార్తీక మాసం రాబోతూందని...
పండగ లోచ్చినా తద్దినాలు వచ్చినా అమ్మ చేసే హడావిడి తెలియంది కాదు.
ఎనభై ఏళ్ళ మనిషి అమ్మ. ఆమె లో ఈ తాపత్రయమే విసుగు కలిగిస్తుంది. ఏమీ చెయ్యలేము ఎందుకంటే ఏ పనినైన అమ్మ నిర్వర్తించినట్లుగా మేము చెయ్యలేము ఎప్పటికీ.
చిన్నప్పటి  రోజులు గుర్తుకు వచ్చాయి గిరిజకు.
ఉగాది వస్తుందంటే పదిరోజుల ముందే అందరినీ పురమాయిస్తుంది... వేపపూత. మామిడాకులు, మామిడి కాయలూ, కొత్త బెల్లం అని. ముందు రోజున ఇళ్లు కడిగించుకోవడాలు ముగ్గులు పెట్టడాలు, మామిడి తోరణాలు కట్టడం..అన్నీ రెడీ అయిపోవాల్సిందే!
సంక్రాంతికి  గుమ్మడికాయ, గొబ్బిల్లకు గుమ్మడి పూలు ముగ్గుల్లో కి పసుపూ కుంకుమా రంగులూ...అప్పట్లో ఇప్పుడు దొరికినన్ని రంగులు దొరికేవి కాదు. పిల్లలకు కూడా ఎంతటి సరదానో గొబ్బెమ్మలు పెట్టడం, సాయంకాలాలు వాటిని పిడకలుగా తట్టడం!! అన్నిటి వెనుకా అమ్మ హస్తమే!
అలాగే వినాయక చవితి కి టెంకాయలు సంచిలో వేసి తలవాకిట పక్కన పెట్టి అందరికీ ఇవ్వటం..శ్రీరామనవమికి పానకం వడపప్పు పంచడం...ఇలా ఎన్నైనా చెప్పచ్చు.
 ఈ జ్ఞాపకాలతో బాటు సంవత్సరం లో వచ్చే మూడు తద్దినాలు..తాతదీ, ఆయన ఇద్దరు భార్యలదీ. తాత కు మొదటిభార్యతో పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నాడట. ఆవిడకు పుట్టినవాడే నాన్న. వీరి తద్దినాలు పద్దతిగా జరిగేవి ఇంట్లో... తద్దినం పెట్టడం ఒక పవిత్ర కార్యమని విశ్వసించేది అమ్మ.  తద్దినపు మంత్రాలు ఇంట్లో వారికి ఆశీర్వాదాలు అనేది...
ఇప్పటికీ గుర్తు అమ్మ చేసే హడావిడి!
ఉగాది అవగానే ఏ తిథి నక్షత్రాలలో తద్దినాలు వస్తాయో తెలుసుకునేది.
వారం ముందుగా బ్రాహ్మణులకు కబురుపెట్టేది..
అవిసాకులు, చామగడ్డ, కందగడ్డ బెండకాయలు తేవాలని ముందుగానే హెచ్చరికలు!
అరిటాకులు, వాటి దోప్పలు చేసుకోవడానికి పుల్లలు, బ్రాహ్మణుడు ధర్బలు తెస్తాడు అనుకోకుండా ఒక కట్ట రెడీ..పనిమనిషి నాగమ్మ ను ఒక పిడచ ఆవుపేడ తెమ్మని చెప్పేది.
‘పెరట్లో వున్న తులసి మొక్కలో తులసి రెమ్మలు తేవే గిరిజా’ అంటూ చెబితే  తీసి పెట్టడం. అంతే  కాదు వెనుక వసారా అంతా మడి తో తుడవటం, పీటలు వేసి ఒక ప్లేటులో నల్లనువ్వులు, అర్ఘ్యపాత్ర, పంచపాత్ర ఉద్దరిణి వక్కలూ, ఒక బిందెడు మడి నీళ్ళు...నెయ్యి దీపమూ....అబ్బ ఎన్నిజ్ఞాపకాలో...
“ఏయ్ గిరిజా దూరంగా నడు, మడి లో వున్నాను కదా” అమ్మ అన్నట్టే విని పించి ఉలిక్కి పడ్డట్టయింది!
నమస్కారాలు అయినాక ప్రసాదాలు గా వచ్చే రవ ఉండలూ, వడలూ ఎంత రుచిగా వుండేవి?
ఆరోజు చేసే కూరలూ, కాకరకాయ గోజ్జు, పెసరపప్పూ బెండకాయ పులుసూ ఎంతబాగా వుండేవి ! నోట్లోకి రుచి వచ్చినట్టయింది
ఇంట్లో వాళ్ళే కాక ఆరోజు బయట పని వాళ్లకి అందరికీ భోజనాలు...అమ్మ వంటింట్లో నుండి బయట పడటానికి ఐదుగంటలయ్యేది...
ఇలా ఎంతో ఓపికగా...పద్దతిగా చేసే అమ్మనాలుగేళ్ళ క్రితం నాన్నగారు పోయాక తమ్ముడి దగ్గర వుండటానికి వచ్చిన అమ్మ, ఆయన తద్దినం పద్దతిగా జరగాలని ఆశ పడేది  కానీ సిటీ లలో వీలవుతుందా? అని ఆలోచించదు.
తమ్ముడు విసుక్కోడూ మరి!
అమ్మకు ఫోను చేసింది గిరిజ
“అమ్మా నీవు గాబరాపడి ఇంట్లో వారిని హడావిడి పెట్టకూడదే” అని చెబితే
“ఏమిటో అన్నీ  సవ్యంగా జరగాలి కదా...ఈ కార్యం పండగ కంటే ముఖ్యము...ఆత్మలు శాంతిస్తాయి..వారి ఆశీర్వాడాలూ వుంటాయి..”
“నిజమే! వాళ్ళు చేస్తారు కదా...ప్రతి పండగకీ, తద్దినానికీ నీవు రోజుకు నాలుగు సార్లు చెబుతూ వుంటే విసుగు వస్తుంది కదా?”
“మరచి పోకూడదనే కదా నా తాపత్రయం”
“ఎందుకు మరచి పోతారు అమ్మా నీది మరీ చాదస్తం..ప్రతి సారీ నాకు కూడా ముందుగా చెబుతాడు నేను రావటం లేదా చెప్పు?” గిరిజ మాటలు సమాదానం కాలేదు ఆమెకు
ఒక సారి తద్దినానికి సరిగ్గా రఘు కొడుకు రాహుల్ కి బాగాలేక ఆస్పత్రి లో వుండటం తో రాఘవేంద్ర స్వామి గుడి లో పెట్టాడు.
సిటీ లో చాలా మంది పెట్టేది ఇలా గే నని అమ్మకు చెప్పబోయింది గిరిజ. ముందు రోజు హడావిడి లేదు..వంట గురించి గానీ, బ్రాహ్మల గురించి గానీ బాధలేదు సరిగ్గా పదకొండు గంటలకు వెళ్లటం, ఒంటి గంటకు వాళ్ళు పెట్టె భోజనం కానిచ్చి, వాళ్ళిచ్చే కొద్ది ప్రసాదం తీసుకుని ఇంటికి రావటమే...ఇంట్లో చేసే విధంగా లేదని చిన్న అసంతృప్తి తప్పితే అంతా సులభమే కదా అన్నమాటలకు అమ్మ జవాబు చెప్పలేదు. అమ్మకు అసంతృప్తి అయినా ‘పెట్టాడు కదా’ అని ఆనంద పడింది.
తరువాత రెండేళ్లలో చాలా మార్పులు జరిగాయి.
ఆరోగ్యంగా వున్నఅమ్మ హటాత్తుగా హార్ట్ ఫెయిల్ అయి చనిపోయింది.
రఘు కి గుజరాత్ లో మంచి ఉద్యోగం వచ్చిందని వెళ్లి పోయాడు ఫామిలీ తో.
గిరిజ తో ఫోను లో మాటలే గానీ కలవటం తక్కువయింది.
అమ్మ చాలా గుర్తుకు వచ్చేది గిరిజకు...అమ్మ హడావిడి చేస్తుంది అనైనా పండగలూ పబ్బాలూ ఏంతో ముందుగా తెలిసేవి...
మూడేళ్లలో కాలం తో బాటు పరుగెడుతూ అందరూ బిజీ గా వుండి పోయారు.
ఆరోజు ఈ నాడు పేపరు చదువుతూ, జూన్ ఇరవై అని డేట్ చూసి ఉలిక్కి పడింది గిరిజ అమ్మ చని పోయిన తేదీ దాటిపోయిందే, తిథి ప్రకారం కొంచం ముందుగానే వస్తుంది కదా తద్దినం??
తద్దినం సంగతి ముందుగానే రఘు చెప్పేవాడు ఈ సారి చెప్పనే లేదే...అనుకుంటూ తమ్ముడి కి ఫోను చేసింది.
“ఢిల్లీ లో వున్నానక్కా నెలరోజులు ట్రైనింగు...” అన్నాడు
“ఈ సారి అమ్మ తద్దినం సంగతి చెప్పనే లేదు..” కొంచ౦  నిష్టూరం గొంతులో..
“అయ్యో... తద్దినమే మరచిపోయానక్కా...ట్రైనింగు తరువాత ప్రమోషను అని సంతోషంగా ఢిల్లీ వచ్చేసా” రఘు గొంతు లో తప్పు చేసిన ఫీలింగు...
అయినా తనకు కూడా గుర్తు లేక పోవడం గిల్టీ గా అనిపించింది.
ఒక్క సారిగా బాధతో మూల్గింది గిరిజ మనసు...కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
ప్రతిసారీ హడావిడి చేసే అమ్మ నిశ్శబ్దంగా చిరునవ్వుతో కనిపించింది ఫోటోలో ...
పండగైనా, తద్దినం అయినా తన స్వరం వినిపించే  అమ్మ సణుగుడు సద్దుమణిగింది.
జీవితం సాగుతూనే వుంది!! సణుగుడు జ్ఞాపకాలు ఇంకా కొన్ని రోజులలో కొట్టుకుని పోతాయి!
లైఫ్ గోస్ ఆన్!  Life goes on…on…
****

No comments:

Post a Comment

Pages