పుష్యమిత్ర - ఏడవ భాగం.

 టేకుమళ్ళ వెంకటప్పయ్య 


జరిగిన కధ: "ఇండియన్ గ్లోబల్ " అనే అతిశక్తివంతమైన రాడార్ ను నిర్మించడానికి అనువైన ప్రదేశం కోసం హిమాలయాలపైన  ఇస్రో వారు హెలికాప్టర్ల ద్వారా అన్వేషణ జరుపుతూ టవర్ నిర్మాణం లో ఎదురైన మంచును తొలగించే దశలో బయటపడ్డ కాలనాళికను తెరచి చూడగా అందులో నుండి వచ్చిన వ్యక్తి తను పుష్యమిత్రుడినని చెప్పి గతంలోకి వెళ్తాడు. పుష్యమిత్రుడు బృహద్ధ్రదుని వద్దకు సైన్యాధికారి పదవి కోసం వెళ్ళిన సమయంలో సింహకేతనుడు తారసపడతాడు. సింహకేతనుడు, పుష్యమిత్రుని జయించేందుకు అఘోరా సాయం పొందాలని వెళ్ళగా, బలవంతులతో విరోధం మానుకోమని సలహా ఇచ్చి పంపుతాడు అఘోరా. అయినా మాయోపాయంతో అయినా పుష్యమిత్రుని జయించాలన్న ఆలోచనతో అంత:పురం చేరుతాడు సింహకేతనుడు. మూడు దశల్లో జరిగే మహాసైన్యాధిపతి ఎంపికలో పాల్గొన్న పుష్యమిత్రుడిని జయించడానికి సింహకేతనుడు మొండిగుర్రాన్నిచ్చినా లొంగదీసుకుంటాడు. తొలిదశలో విజయం పొంది మలిదశ పోరాటానికి సిద్ధమౌతాడు. (ఇక చదవండి)
తొలిదశలో విజయం సాధించిన పుష్యమిత్రునికి ప్రజలు “పుష్యమిత్ర మహాసేనానికీ జై”  అని జయజయ ధ్వానాలు చేస్తుండగా మహారాజు చెయ్యెత్తే సరికి అందరూ నిశ్శబ్దమయ్యారు.  మహారాజు  “అష్ట సేనానులతో పోరు” అనగానే...అష్ట సేనానులూ రంగ మండపం వైపు గుర్రాలతో వచ్చి నిలిచారు.  సింహకేతనుడు "ఇప్పుడు  విలువిద్యా ప్రదర్శన" అని ప్రకటించగానే 9 విల్లంబులను బాణాల తూణీరాలనూ తెచ్చి అక్కడ ఉంచారు.  "చూడండి దక్షిణంగా ఐదు వందల గజాల దూరంలో ఉన్న రొండు జంట తాడి చెట్లను... (మొదలు ఒకటిగా ఉండి పైన రొండు చెట్లుగా అభివృద్ధి చెందినది) ఆ మానులకు నేలకు ఇరవై అడుగులకు పైన వివిధ ఆకారాలలో ముప్ఫై ఇనుప లోహంతో చేసిన ముఖకవచాలు తగిలించ బడ్డాయి. ఇక్కడనుండి బాణ ప్రయోగంతో వాటిలో ఎవరు ఎక్కువ కవచాలను బద్దలు చేస్తే వారు ఈ పోటీలో గెలుపొందినట్టు లెక్క" అని సింహకేతనుడు అనగానే.. అందరూ ప్రయత్నించిన తరువాత నేను చివరగా ప్రయత్నిస్తానని పుష్యమిత్రుడు చెప్పిన మీదట అష్ట సేనానులందరూ ప్రయత్నించి తమకిచ్చిన 30 బాణాలతో..ఒక పది మాత్రం బద్దలు కొట్ట గలిగారు. ఇక 20 మిగిలాయి అప్పుడు రంగ ప్రవేశం చేసిన పుష్యమిత్రుడు ఐదు బాణాలను ఒకేసారి సంధించి 3 దఫాలుగా 15 కవచాలను బద్దలు కొట్టగానే ప్రజలూ సైనికులూ పెద్ద పెట్టున హర్ష ధ్వానాలు చేసారు. ఇంకో మూడు అస్త్రాలతో ఒకేసారి 3 కవచాలను బేధించేసరికి ఇక రొండు మిగిలాయి. అపుడు  ఒక చిన్న లోహపు పంగాలు కర్ర లాంటిది (బూం ర్యాంగ్) కత్తి ఒర పైనుండి తీసి విసరగా అది వెళ్ళి ఆ కవచాన్ని భేదించడమే కాక ఆ లోహపు ముక్క మరలా తిరిగి వచ్చి పుష్యమిత్రుడి చేతిలోకి వచ్చింది. ప్రజలందరూ ఆశ్చర్యచకితులై... ఐదు నిముషాలు చప్పట్లు చరుస్తుండగా పుష్యమిత్రుడు ఆ మిగిలిన కవచాన్ని  కూడా  చంద్రవంక బాణం తో ఆకాశం లోకి ఎగురగొట్టి ఉత్తర క్షణంలో పంగాలు కర్ర లాంటి పరికరం కట్టి ఉన్న ఇంకో బాణంవేసి  ఆ బాణాన్నీ కవచాన్ని తన చేతిలోకి తెచ్చుకుని మహారాజు వద్దకు వెళ్ళి ఆయన పాదాల వద్ద ఉంచగానే.. ప్రజలందరూ అమితోత్సాహంతో లేచి నిలబడి పెద్ద పెట్టున హర్షధ్వానాలు చేస్తూ.. "పుష్యమిత్ర మహాసేనానికీ జై" అంటూ కేకలు వేస్తున్నారు...చూస్తున్న సింహకేతనునికి మతిపోతోంది.  క్రోధంతో చూస్తున్నాడు. ఏం చెయ్యాలో పుష్యమిత్రుడిని ఎలా నిలువరించాలో తెలీడంలేదు. చమటలు పడుతున్నాయి. గుండె దడ హెచ్చింది.
ఆ తరువాత కత్తి యుద్ధం మొదలైంది. దేవాపి మహాయోగి ఇచ్చిన ఖడ్గాన్ని ఒరలోంచి తీసి కళ్ళకద్దుకుని బరిలోకి దిగాడు. మొదటగా వచ్చిన సేనాని ఖడ్గాన్ని మూడు నిముషాల్లో తుత్తినియలు చేసి, తర్వాత రంగంలోకి దిగిన ఇద్దరి ఖడ్గాలను పైకెగురగొట్టి కింద పడే లోపు తన ఖడ్గం అడ్డుపెట్టి దూరంగా విసిరేసరికి వారు వెనుదిరిగారు. తర్వాత వచ్చిన నలుగురు సేనానులకూ ఛాతీపైనా, చేతులపైన చిన్న చిన్న గాయలవడంతో పక్కకు తప్పుకున్నారు. మిగిలిన ఎనిమిదవ సేనాని ఏడుగురికీ నాయకుడు. అతనితో తలపడగానే..ఓ మూడు నిముషాలు యుద్ధం జరిగినా.. అతని కత్తిని చేతితో వంచి అతని మెడలో హారం గా వేసేసరికి జనం హర్షధ్వానాలు మిన్ను ముట్టాయి. పుష్యమిత్రుడు మహారాజు వైపు తిరిగి కత్తిని ఓ సారి మొఖానికి ఆనించుకుని దేవాపిని ఓ క్షణం ధ్యానించి మహారాజు వైపు తిరిగి పైకెత్తిన కత్తితో.. అభివందనం చేసాడు. రాజు చెయ్యెత్తి "విజయోస్తు" అన్నట్టు దీవించాడు. ఇదంతా సింహకేతనునికి కంటకప్రాయంగా ఉంది. "చివరగా అష్టసేనానులు డాలు బల్లెములతో పుష్యమిత్రుడిని ఎదుర్కోవలసి ఉంటుంది" అని ప్రకటించగానే గాయపడ్డ అష్టసేనానులు భయం భయంగానే ముందుకు వచ్చారు. వారి డాలును విరుగ గొట్టడానికీ..బల్లేలను ఎగుర గొట్టడానికీ ఓ పది నిముషాలు మాత్రమే పట్టింది.
అప్పటికి భోజన సమయం అవటంతో విశ్రాంతిని ప్రకటించారు మహారాజు. సాయంత్రం కీలకమైన పోరాటం. పుష్యమిత్రుడు లేదా సింహకేతనుడు ఒకరే మహా సేనాని అని అని ప్రకటించగానే అశేష జనవాహినీ, సైనికులూ.. పోటీకి వచ్చిన వారితో సహా.. "బృహద్ధరధ మహారాజుకీ జై...పుష్యమిత్ర మహాసేనానికీ జై" అని జయజయధ్వానాలు చేయడమే కాకుండా..  "జయము జయము పుష్యమిత్రా.. భరతఖండపు జగజ్జేతా".. అని వందిమాగదులతో సహా కీర్తించే సరికి ఆగ్రహోదగ్దుడైన సింహకేతనుడు లేచి.. "ఇంకా పోటీ పూర్తి అవలేదు. సాయంత్రం నాతో పోరాడి గెలువ వలసి ఉంటుంది" అని తొడ చరిచే సరికి మళ్ళీ జనం "జై...పుష్యమిత్ర మహా సేనానికీ జై" అని నినాదాలు చేసారు.
సింహకేతనుడు. పుష్యమిత్రుని వద్దకు వచ్చి.. “ఓ బ్రాహ్మణుడా!  నీ శక్తి సామర్ధ్యాలు అమోఘం కానీ అప్పుడే మీరు విజేతగా వూహించుకోవద్దు. మీరు గాయపడ్డా లేక ప్రమాదవశాత్తూ..  మరణించినా మీ తల్లిదండ్రులకు గర్భశోకం కనుక అలోచించుకుని నాతో తలపడండి. ఒక్క చేత్తో సింహాన్ని మట్టుబెట్టిన వాడిని. మీకు ఉపముఖ్యమంత్రి పదవిని నేను మహారాజుచే ఇప్పించగలను. " అని మీసం మెలివేసే సరికి”  అనే సరికి          "ఓ క్షత్రియుడా! నేను ఎన్నడూ జయాపజయాలకు వెనుదీయను దైవేచ్చ ప్రకారమే ప్రతిదీ జరుగుతుంది అని నమ్మే వాడిని. జంధ్యం వేసిన బ్రాహ్మణుడు కత్తి పట్టాడంటేనే తమకు అర్ధమయి ఉండాలి. ఈ గడ్డపై ధర్మ సంస్తాపనే ధ్యేయంగా అస్త్రధారినయ్యాను. అలాగే మీరెవరూ నాకు శతృవులు కాదు. కేవలం పోటీలో ప్రత్యర్ధులు మాత్రమే. నీ పోరాట పటిమ కళ్ళారా చూడాలని ఉత్సాహపడుతున్నాను” అనగానే సింహకేతనునికి అఘోరా చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి..."అతను భగవత్ సాక్షాత్కారంతో ఈ గడ్డపై వెలసిన సామవేదీయ బ్రాహ్మణుడు. నీవు తలపడబోయేది..  భావి భారత సామ్రాట్టుతో.. వాడు ఈ భరత ఖండాన్నే ఏల గల సమర్ధుడు. పోటీలో అతనితో తలపడ్డా, గెలిచే శక్తియుక్తులు నీకు ఉన్నట్టు నేను భావించడం లేదు. అతనితో తలపడి భంగపడవద్దని హెచ్చరిస్తున్నాను సింహకేతనా!... అతనితో నీవు తలపడినట్లయితే... ప్రస్తుతానికి ప్రాణోపాయం లేకపోయినా... ఖచ్చితంగా నీ అంతం మాత్రం అతని చేతిలోనే ఉంటుంది. " అన్న మాటలు గుర్తొచ్చి నీరసం ఆవహించింది ఒక్కసారి.  పుష్యమిత్రుని మాటలతో భయపెట్టాలనుకున్న తన ప్రయత్నం వ్యర్ధమయిందన్న బాధతో నిష్క్రమించాడు.
*  *  *
"నాయనా సింహకేతనా! మేము నీ బాగు కోరేవారమే తప్ప వినాశనం కోరే వారం కాదు. పుష్యమిత్రుడు మామూలు బ్రాహ్మణుడు కాదు. నాకు పరశురాముని అవతారంగా గోచరిస్తున్నాడు. అతని అస్త్ర ప్రయోగ       ఉపసంహారాలలో మంత్రోచ్చాటన ఉంది గమినించావా? నా మాట విని అతనితో పోరు విరమించుకో. నీవే అతనిని మహా సైన్యాధిపతిగా ప్రకటించు. నీకు ఓడిపోయానన్న బాధ ఉండదు. గౌరవమూ..మర్యాదా రెండూ దక్కుతాయి" భోజన విరామంలో మహారాజు అన్న మాటలకు పుండుపై కారం చల్లినట్లైంది సింహకేతనునికి.  ప్రతిఒక్కరూ తనను ఓడిపోతావు సుమా అని హెచ్చరించే వారే అన్న కోపం తారాస్థాయి కెక్కింది. "మహారాజా ఈ దేశ ప్రజలందరి ముందూ.. పిరికి పందలా నా ఓటమిని ప్రకటించమంటారా? మనం క్షత్రియులం మహారాజా! విజయమో వీరస్వర్గమో! అంతే!" అనగానే. "నాయనా గెలుపోటములు దైవాధీనాలు. నీమేల్గోరి చెప్పగలిగింది చెప్పాను తర్వాత నీ ఇష్టం. నా తర్వాత ఈ సింహాసనం మౌర్యచక్రవరులదా లేక వేరే ఎవరిదైనానా అన్న విషయం కాలమే నిర్ణయిస్తుంది" అని మహారాణి వైపు చూసే సరికి ఆమె అప్పటికే కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.
*  *  *
సాయంత్రం నాలుగు గంటలు కావస్తోంది. ప్రజలూ.. తదితర సైనిక బృందము..అందరూ మైదాన సభాస్థలికి చేరారు. బృహద్ధరధమహారాజు ప్రజలను ఉద్దేశించి.. ప్రజలారా.. ఈ పుష్యమిత్రుడు సద్బ్రాహ్మణ వంశంలో జన్మించినప్పటికీ క్షత్రియ వంశకుల సంజాతునివలె యుద్ధ విద్యలను ప్రదర్శిస్తున్నాడు. ఐదు సంవత్సరాలుగా మేపుతున్నా ఎవరినీ దగ్గరకు రానీయని గుర్రం పుష్యమిత్రునికి మైనం ముద్దలా లొంగిపోయింది. ఇతడిని ప్రశంసించకుండా వుండలేకపోతున్నాను". సింహకేతనునికి ఈ మాటలు రుచించడం లేదు. "ఇప్పుడు సింహకేతనుని తో తలపడి అతని శక్తి సామర్ధ్యాలు నిరూపించుకోవలసి ఉంది". అని ముగిస్తూ ఉండగానే అక్కడ చెరిన జన సమూహాలూ.. సైనిక బృందమూ ఒక్క పెట్టున హర్షధ్వానాలు చేస్తూ.. "పుష్యమిత్ర మహా సేనానికీ జై" అంటూ కేకలు వేస్తున్నారు...చూస్తున్న సింహకేతనునికి పౌరుషం రగిలిపోతోంది. కూర్చున్న ఆసనానికి కుడి చేతి వైపు ఉన్న పిడిపై ఒక్కసారి కోపంతో గుద్దగానే ఆ వైపు ఉన్న భాగం పిండి పిండి అయిపోయింది. ఆ శబ్దానికి అందరూ అటువేపు చూసారు మహారాజు తో సహా.  సింహకేతనునికి బాగా పరిచితమైన విద్య " డాలు-బల్లెం పోరాటం. "   ఆ విద్యతోనే  నేలమీద పోరాడి శత్రువులను మట్టుపెట్టడం అతనికి వెన్నతో పెట్టిన విద్య.  ప్రస్తుతం అదే విద్యను ప్రదర్శించమని పుష్యమిత్రునికి చెప్పవలసిందిగా రాజుగారికి రహస్య సందేశం పంపాడు తన అనుచరుని ద్వారా. మహారాజావారు సందేశం విని చిరునవ్వు నవ్వి  పుష్యమిత్రుని తో "డాలు బల్లెం తో గ్రీకు వీరులవలె పోరాడి మీ సత్తా నిరూపించుకోండి". అనగానే పుష్యమిత్రుడు మహారాజుకు రొండు చేతులూ ఎత్తి నమస్కరించి తన స్థానానికి వచ్చి నిలబడగానే ఇద్దరు సైనికులు అతని బల్లేన్ని మోసుకుని వచ్చి ఇవ్వగా అందుకుని.. శిరస్త్రాణం కవచం ధరించి పక్కనే ఉన్న ఒక పెద్ద డాలుని అందుకుని.. మనసులో...”దేవాపి మహర్షీ ఆశీర్వదించు” అనుకుని రంగం లోకి దిగాడు.  సింహకేతనుడు పైనున్న అంగీ (చొక్కా లాంటిది) విప్పేసాడు. అతని శరీరాకృతి భయం గొలిపే విధంగా ఉంది. ఓ ఐదు నిముషాలు శరీర వ్యాయామం చేసే సరికి ఛాతీ ఉప్పొంగి భయంకరంగా గోచరిస్తున్నాడు. అసలే క్రోధాగ్ని మొహం కళ్ళూ చింత నిప్పుల్లా ప్రకాశిస్తున్నాయి. ప్రళయ కాల రుద్రునిలా ఉన్నాడు. మూడు బల్లేలనూ తీసుకుని కిందికి దిగుతూ మహారాజు వంకా.. తన తోడి బంధువైన శ్వేతాశ్వుని వేపూ ఓ సారి దృష్టి సారించి చిరునవ్వుతో రంగ మండపం లోకి అడుగు పెట్టాడు.  శిరస్త్రాణం కవచం ధరింపజేసారు అతని అనుచరులు.  ప్రజలు వూపిరి బిగపట్టి..రెప్పపాటు మర్చిపోయి తిలకిస్తున్నారు ఈ పోరాటం. అంతా నిశ్శబ్దం ఎక్కడా అలికిడి లేదు. దూరంగా ఉన్న పుష్యమిత్రునికి తగిలేట్టుగా బల్లెం విసిరి ఒక విషపు నవ్వు నవ్వాడు. సింహకేతనుడు.  ఆ అపాయం ముందే వూహించిన పుష్యమిత్రుడు పక్కకు తప్పుకుని చిరునవ్వుతో నిలుచున్నాడు. సింహకేతనుడు దగ్గరగా వస్తూ మరో బల్లెం విసరగా దాన్ని డాలుతో అడ్డుపెట్టి తప్పించుకున్నాడు. మిగిలిన బల్లెంతో ముందుకు దూకి అతని పాదాలను గాయపరచాలని బల్లెం నేలమీద పాదాలపై గుచ్చడానికి అనేక సార్లు ప్రయత్నించగా పుష్యమిత్రుడు అవకాశం ఇవ్వక అతనిపై సింహంలా దూకి మెడపై బల్లేన్ని గుచ్చ యత్నించాడు. తప్పించుకోలేక అవస్తలు పడుతున్నాడు సింహకేతనుడు. ఒకసారి ఇద్దరూ దగ్గర దగ్గరగా వచ్చి  వారి  బల్లెం  డాలూ కలుసుకున్న సమయం లో సింహకేతనుడు రాజ ధర్మం మరచి,   బల్లెం కింద విసరి, అతని మెడపై గట్టి పిడి గుద్దు గుద్దాడు. నవనాడులూ స్థంభించి పోగా ఒక్కసారి నేలపై పడిపోయాడు పుష్యమిత్రుడు.  సింహకేతనుడు మీసం మెలి వేసాడు. సింహకేతనుని అనుచరులు "సింహకేతనునికీ జై" అంటుండగా... జరిగిన తప్పిదం గ్రహించిన మహారాజు "ఆపండి" అంటూ సింహకేతనుని వేపు ఆగ్రహం తో చూసాడు. జనం ఆగ్రహంగా సింహకేతనుని చూస్తున్నారు.   మరో మూడు నిముషాల్లో  పుష్యమిత్రుడు లేచాడు. రక్తం మొత్తం అతని మొహం లోకి వచ్చింది.  ఒక్క సారి దుర్గామాతను తన భ్రూకుటిలో దర్శించాడు. లేస్తూనే జై దుర్గామాతా అంటూ...ఒక కాలితో డాలునూ మరో కాలితో బల్లేన్నీ పైకి లేపడం చూస్తుండగా.. ప్రళయకాల రుద్రునిలా భయంకరంగా అగుపించాడు సింహకేతనునికి. కింద పడిన బల్లెం అందుకునే లోపు,  లంఘించి పైకి గజం ఎత్తు  ఎగిరి అతని శిరస్త్రాణం ముక్కలు చేసాడు బల్లెంతో. ఆశ్చర్యం నుండి తేరుకునే లోపు అతని కవచం  బద్దలయింది. అంత బరువున్న బల్లెం మధ్యలో పట్టుకుని రెండు వేళ్ళతో గిరగిరా విష్ణు చక్రం వలె తిప్పడం చూసిన సింహకేతనునికి మతి పోయింది. అలా తిప్పుతూ.. తిప్పుతూ.. ఒక్కసారి మోకాళ్ళ కింద తగిలించాడు సింహకేతనునికి అంతే... "అమ్మా!" అని అరుస్తూ కుప్పగూలి పోయాడు. మళ్ళీ లేవడానికి అవకాశం ఇవ్వకుండా బల్లెం అతని నడుం పక్కగా సగం పైగా దింపి,  మిగతా సగాన్ని వంచి అతని శరీరం నడుం భాగం మీదుగా రొండొ వైపు భాగం నేలలోకి గుచ్చే సరికి జనం విస్తుబోయారు. “పోటీలో అతనితో తలపడ్డా గెలిచే శక్తియుక్తులు నీకు ఉన్నట్టు నేను భావించడం లేదు... అతనితో తలపడి భంగపడ వద్దని నా సలహా... ఖచ్చితంగా నీ అంతం అతని చేతిలోనే... నీ అంతం అతని చేతిలోనే ..” అన్న అఘోరా మాటలు మళ్ళీ మళ్ళీ  చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి.  "పుష్యమిత్రుడే విజేత"  మహారాజు గారు చప్పట్లు చరిచి ప్రకటించారు ప్రజలు హర్ష ధ్వానాలతో పుష్యమిత్రుని వైపు దూసుకొస్తుండగా మహారాజు చెయ్యెత్తి ఆపి.. ఇంకో ముఖ్యమైన ప్రకటన అంటూ ఉండగా... మెల్లిగా శక్తి కూడ గట్టుకుని లేవడానికి ప్రయత్నిస్తున్న సింహకేతనునికి, బల్లెం పీకివేసి.. స్నేహ హస్తం అందించి పైకి లేపాడు.  "ఈ పోటీలో గెలిచిన పుష్యమిత్రునికి సహాయకునిగా ఉండవలసింది గా సింహకేతనుని అదేశిస్తున్నాను”  మహారాజు అనగానే...సింహకేతనునికి జరిగిన అవమానానికి కారం మీద పుండు జల్లినట్ట్లైంది.  అభినందనలు మిత్రమా  అని పుష్యమిత్రుడు  అనగానే.. సింహకేతనుడు కింద పడిన బల్లెం పుచ్చుకుని మహారాజు వైపు వేగంగా వెళ్ళడం చూసిన పుష్యమిత్రుడు ఏదో కీడు శంకించి తనూ బల్లెం తీసుకుని సింహకేతనుని వెంట పడ్డాడు.  ప్రజలకు ఏమి జరుగుతోందో తెలియక విస్తుబోయి హా..హాకారాలు చేస్తూ నిల్చుండిపోయారు. "మహారాజా! సింహబలుడైన ఈ సింహకేతనుడు ఈ బ్రాహ్మణుని వద్ద సహాయకుడిగా పనిచెయ్యడమా? తక్షణం ఈ రాజ్యాన్ని వదలిపెట్టి వెళ్తున్నాను. ఏదో ఒకనాడు పుష్యమిత్రుడిని జయించి "సర్వ సైన్యాద్యక్షుడు" అయేంతవరకూ ఈ సామ్రాజ్యం లో అడుగుపెట్టను అని గుర్రం ఎక్కి వేగంగా వెళ్ళిపోయాడు. ప్రజలు వూపిరి పీల్చుకున్నారు. మహారాజు పుష్యమిత్రుని అభినందిస్తూ.. ఇలాంటి యువకులు దేశానికి కావాలి అంటూ ప్రశంసించాడు. సైనికుల, ప్రజల సంతోషానికి అవధుల్లేవు. "పుష్యమిత్రా మీరు రెండు రోజులు మా ఆతిధ్యం స్వీకరించి మీకు శస్త్రాస్త్ర నైపుణ్య విశేషాలు,  మీ వేద వేదాంగ విద్యలూ నేర్పిన గురువులనూ మీ గత చరిత్రా తెలుసుకోవాలని కోరుతున్నాను" అనగానే "అవశ్యం మహారాజా అని పుష్యమిత్రుడు నమస్కరించాడు.  సింహకేతనుడు రాజ్యం వదలి వెళుతూ గుర్రం ఎక్కబోయే ముందు శ్వేతాశ్వుని  వైపు చూసి చేతులతో ఏదో సైగ చేసాడు. ఆ సైగల అర్ధం.. దానివల్ల రాబోయే అనర్ధం.. ఏమిటో వారిద్దరికీ తప్ప  ఎవరికీ తెలియదు. (సశేషం)
-0o0-


0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top