మనసున మనసై 

పెమ్మరాజు అశ్విని 

 
మనిషి యవ్వనంలోకి వస్తున్న తరుణంలో మనసు బుద్ధిని స్వాధీన పరుచుకుంటుంది ,దానికి కంటికి అందంగా కనిపించింది, నచ్చింది ప్రతీది కావాలన్న తాపత్రయం పెరిగిపోతుంది . ఆ తాపత్రయం కేవలం ఆకర్షణ. అంటే, మనమొక అందమైన పువ్వుని చూసి, దాని అందానికి ఆకర్షింపబడితే వెంటనే మొక్క నుండి తుంపి సొంతం చేసుకుంటాం కదా , అటువంటిదే. అదే మనం దానిని ప్రేమిస్తే ఆ మొక్కకి నీరు పోసి పెంచుతాం .
      ప్రేమ అనేది చాలా సున్నితమైన అంశం మనకి ఎదుటి వాళ్ళ పట్ల వున్నది ఇష్టమా ,ఆకర్షణో ,ప్రేమా అని తెలుసుకోవడంలో ఇప్పటి యువతరం కొంత తప్పటడుగులు వేస్తోందన్న సందేహం కలగకమానదేమో .
        ఫాస్ట్ ఫుడ్ ధోరణి కి అలవాటు పడ్డ యువత, ప్రేమకూ అదే పంధా అనుసరిస్తున్నారంటే అతిశయోక్తి కాదేమో ! ఎందుకంటె ఎంత సులువుగా ప్రేమలో పడుతున్నారో అంత సులువుగా విడిపోతున్నారు . ప్రేమకి ఆకర్షణకి మధ్య గల సన్నటి గీతని గమనించుకోకపోవడం వల్ల జరుగుతున్న పొరపాట్లేమో ఇవి.
       ప్రేమ అనేది 'నమ్మకం, గౌరవం' అనే పునాదుల మీద నిర్మించుకునే అందమైన పొదరిల్లు,ఒకరిపట్ల మరొకరికి పరస్పరం ఈ భావన రావడానికి కొంత సమయం ఖచ్చితంగా పడుతుంది. మొదటి చూపులోనే ప్రేమ ఎలా ఉంటుందంటే, ఒక అమ్మాయిని చూడగానే గుండెల్లో కోటి వీణలు మోగడం, పూలు కురవడం, మెరుపులు మెరవడం లాంటివి సినిమాలో తప్ప నిజ జీవితంలో జరగవన్న సంగతి గుర్తించిన నాడు ప్రేమ పేరుతో జరుగుతున్న మోసాలకు,ఉన్మాదాలకి తావుండదు.
        అమ్మాయి గాని అబ్బాయి గాని ప్రేమలో పడటం ఎంత సహజమో కొన్ని సార్లు ప్రేమించామనే అపోహలో మోసపోవడం ఇవాళ అంత సహజమైపోయింది అనిపిస్తోంది .
ఎవరి మీదైనా మనకి ఒక స్థాయికి మించి ఇష్టం పెరుగుతోంది అంటే, మనం ప్రేమ వైపు అడుగులు వేస్తున్నట్టే ,అయితే అది వారి మనస్తత్వాన్ని చూసి కలిగింది. అయినా కొన్ని జాగ్రత్తలు అందులోను మనం ప్రేమించిన వ్యక్తి గురించి కనీస సంగతులు, వారి అలవాట్లు, జీవన శైలి ,కుటుంబ నేపథ్యం కచ్చితంగా తెలుసుకోవాలి.
              ప్రేమ అనేది లెక్కలు పత్రాలు చూసుకొని కలిగేది కాదు, అదో భావన అనేది ఒక వాదన అయితే ప్రస్తుత సామజిక పరిస్థితులలో ఈ వాదన వితండ వాదంగా అనిపించడం అతిశయోక్తి లేదు. ఎందుకంటె పెళ్లి అనేది అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసి చేసేవారట ఇదివరలో ,ఏడు తరాల మాట ఎలా వున్నా కనీసం మనం ప్రేమిస్తున్న వ్యక్తి కుటుంబ నేపధ్యం తెల్సుకోవాల్సిన  అవసరం స్పష్టంగా కనిపిస్తోంది .
           ప్రేమ కి పరస్పర గౌరవం,అభిమానం ,నమ్మకం ఎంత అవసరమో ఆ ప్రేమ ని తెలపడం కూడా అంతే అవసరం. ప్రేమను తెలియజెప్పడం ఒక కళే ,చాల మంది ప్రేమను వ్యక్తపరచటం చేత గాక నానా అగచాట్లు పడుతుంటారు. గుండెల్లో గూడు కట్టుకున్న ప్రేమని  నిజాయితీగా వ్యక్తపరిస్తే మనసైన మనిషి మనకి సొంతమవుతారు. ప్రేమను తెలియపరచే క్రమంలో చాలా మంది చాలా పద్ధతులు వాడతారు పువ్వులు ఇవ్వడం, హృదయపు ఆకారం, లేదా ఇతర బొమ్మలు బహుమతులు ఇవ్వడం, ఇతరులు ఎవరో రాసిన భావాలూ  అచ్చువేసిన గ్రీటింగ్ కార్డు ఇవ్వడం లాంటివి జరుగుతుంది .
            కానీ వీటి వల్ల అందులో మన ఉనికి, మన మనసు ఎంతవరకు స్పష్టమవుతుందో  ప్రశ్నర్థకమే ! అందువల్ల నిజమైన ప్రేమను వ్యక్తపరచడానికి ఇలా  పువ్వులు బహుమతులు ఇచ్చే బదులు. నిజాయితీగా నోరుతెరిచి చక్కటి మాటలతో ,చిన్న చిరునవ్వుతో,కంటి చూపుతో ప్రేమను వ్యక్త పరిస్తే,మన మనసైన వారి గుండెల్లో చోటు సంపాదించ వచ్చు . "ఆమ్మో, ప్రేమించిన వారు ఎదుట పడితే మాటే రాదే ఎలా  " అన్న భయం ఉంటే ప్రేమ వున్నట్టే.  "ప్రేమను తెలిపాక ఎదుటివారికి నచ్చక శాశ్వతంగా దూరమైతేనో అనే భయం " నోరు పెగల నివ్వదు .ఈ భయాన్ని జయించడానికి పాతదైనా ఆణిముత్యం లాంటి సులువు ఒక ప్రేమలేఖ రాసేయడమే .
          అయితే ప్రేమలేఖ ని కూడా అంతర్జాలంలోంచి తస్కరించి ప్రయత్నించే చేస్తే వేరెవరో భావాలనో మీరు తెలియపరచినట్లే ,అందువల్ల మన సినీ కవులను ఆదర్శంగా తీసుకోకుండా మన మనసైన వ్యక్తి మీద వున్న ఇష్టాన్ని, నిజాయితీగా తమ  భావాలతో కాస్త కలం కదిలిస్తే ఖచ్చితంగా " మనసున మనసై బ్రతుకున బ్రతుకై" వుండే జీవితపు తోడు తప్పక దొరుకుతుంది .నావకు తెరచాప లాగ ప్రేమ మనకు మార్గదర్శకం కాక మానదు.
*****

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top