భర్త @ భార్య  

  -చెన్నూరి సుదర్శన్.


ఆదివారం...
సమయం.. సాయంత్రం నాలుగు  గంటలు..
అది ‘విజ్ఞానపురి కాలనీ వాసుల సంక్షేమ సంఘం’ కమ్యూనిటీ హాలు..
            హాలు నిండా జనం.. జనం మది నిండా ఉత్కంఠ..
ఉదయం పది గంటలకు అరంభమైన పోలింగు సాయంత్రం మూడు గంటలకు ముగిసింది.  వోట్ల లెక్కింపు కార్యక్రమ సన్నాహం  మొదలైంది.
వేదికపై సంఘ సభ్యుల పరివారంతో అద్యక్షులు డాక్టర్ దామోదర్ అసీనుడై వున్నాడు. అతడు మానసిక వైద్య నిపుణుడు కూడా..
వారి ముందు ఒక పెద్ద మేజాబల్ల.. బల్లపై  సీల్డ్ పెట్టె.
పెట్టెలో వున్న ఓట్లను  లెక్కించడానికి.. డాక్టర్ దామోదర్ అనుమతికై వేచివున్న కౌంటింగ్ ఆఫీసర్ సంఘ కోశాధికారి అయిన కోటేశ్వర్ ఒక ప్రక్క.. పోటీ అభ్యర్థులైన  గుణవతి, గుర్నాథం  దంపతులు  మరోపక్క కూర్చొని వున్నారు.
వారిరువురు దంపతులంటే.. నేడు  లోకం చూడ దంపతులే గాని ఒకే ఇంట్లో ఎవరి నడక వారిదే.. ఎవరి పడక వారిదే. వారి నడుమ అదృశ్యపు తడక తాండవం చేస్తోంది. ముప్పది సంవత్సరాల క్రితం వారి శాస్త్రయుక్త వివాహ సందర్భంలో  పట్టిన తెర నేడు వారి మధ్య అడ్డు తడకగా మారింది.  మనకు విలువనివారైనా సరే.. ఎదురుగా కనబడితే చాలు హృదయం కాస్తా  తేలిక పడుతుంది.. ఒంటరితనం కంటే అదే మేలు.. అనే మనస్తత్వంతో మనుగడ సాగిస్తున్నారు.
ముచ్చటగా ముగ్గురు పిల్లల పెళ్ళిళ్ళు చేసారు. మనవలు, మనవరాళ్ళుతో ఆనందంగా గడపాల్సిన రోజుల్లో పంతాలు పట్టింపుల సెగలో చిర్రుబుర్రులాడుతున్నారు.  నలుగురు ముందు నగుబాటు కాగూడదనే ఆలోచన అటుంచి.. కాలనీలోని జనం వారిరువురిలో ‘ఎవరి సౌజన్యం గొప్పదో..!’ తేల్చుకోవాల్సిందేనని పోలింగ్  వరకూ వచ్చారు. వోటు అభ్యర్థిస్తూ  ఇల్లిల్లూ తిరుగారు.
 “మన కాలనీలో మొత్తం నాలుగు వందల తొంబది ఆరు వోట్లు. పోలైనవి నాలుగు వందల ఏబది ఆరు. సంఘ సంక్షేమ నిబంధన ప్రకారం  కేవలం ఇంటి యజమాని, యజమానురాలు మాత్రమే వోటుకు అర్హులు” అంటూ కోటేశ్వర్ ఆనాటి వోటింగ్ నియమాలు వివరించసాగాడు.
కాలనీ జనం  చేతి చలువ నన్నంటే నన్నే  గెలిపిస్తుందనే ధీమాతో ఎవరికీ వారే తేలిపోతున్న దంపతులు ఊహల్లో నుండి తేరుకున్నారు.
కౌంటింగ్ ఆరంభమైంది..
“మొదటి వోటు గుర్నాథం  గారికి” అని అభ్యర్తులిరువురికి చూపిస్తూ గుర్నాథం  ముందు వున్న అట్ట పెట్టెలో వేసాడు కోటేశ్వర్.
గుర్నాథం గుండెలో గునపం దిగినట్లు... విలల విలలాడాడు. మనసులో అలజడి ఆరంభ మైంది.. ‘ఆదిలో హంస పాదు’ అన్నట్లు.. తనకిది అచ్చిరాదు.. మొదటగా అపజయంపాలైతేనే చివరి ఫలితం జయప్రద మవుతుందని అతడి ప్రగాఢ విశ్వాసం..
మొదటి మ్యాచ్ గెలిచిన క్రికెట్ టీం .. ఫైనల్లో ఓడిపోవడం ఖాయమని పందెం కాసే రకం.
గుర్నాథం గణిత శాస్త్రోపన్యాసకుడిగా ఈ మధ్యనే పదవీ విరమణ చేసాడు. ప్రతీది లెక్కంటే లెక్కే.. ఈ విషయంలో ఎవరినీ లెక్క చేయడు గాక చేయడు.
ముఖ్యంగా డబ్బు విషయంలో మరీ లెక్కగా ఉంటాడు..
ఈమధ్య తన ఇంటిపై సెకండ్ ఫ్లోర్ వేసేప్పుడు కూలీలకు డబ్బు లెక్క ప్రకారం చెల్లించడం.. వారెంతో సంతోషించడం అతడికి  తెలియంది కాదు.
“సార్  మీరు మాటమీద నిలబడే మనిషి.. ఒప్పందం ప్రకారం డబ్బు అణా పైసలతో సహా ఇలా టైం ప్రకారం మీలా చెల్లించడం మేము ఇంతవరకు మా జీవితంలో ఎవరినీ చూల్లేదు..” అంటూ గుప్పించిన పొగడ్తలు ఇంకా అతడి మస్తిష్కంలో మసలుతూనే వున్నాయి.
 అందుకే అతడికి తన గెలుపు పై అంత ధీమా. తను లెక్క తప్పనప్పుడు కాలనీ జనం తన సౌజన్యం గొప్పదని తేల్చక మానరు.. అనుకునే  తరుణంలో ఇదేంటి..? మొదటి వోటు తనకు రావటం..!
“చిన్న టీ.. బ్రేక్..!” అంటూ కోటేశ్వర్ అద్యక్షుల సంకేతాలు అందుకొని ప్రకటించే సరికి తేరుకున్నాడు తెప్పరిల్లాడు గుర్నాథం.
తన పెట్టెలో, తన అర్థాంగి పెట్టెలోని   వోట్లను  ఓ మారు తొంగి చూసాడు. తన పెట్టెలోనే కాసిన్ని వోట్లు ఎక్కువగా వున్నట్లు లెక్క గట్టి తృప్తి చెందాడు.
సభ టీ బిస్కట్లు అరగిస్తూ గెలుపు ఓటముల గురించి తర్జన భర్జన చేసుకోవడంలో మునిగి పోయింది.
గుణవతికి  తన ముందున్న టీ తాగాలనిపించడం లేదు. అన్యమనస్కంగా వుంది.. ఇంత  వరకు తానూ గెలుస్తాననకునే ధీమా డీలా పడింది..
ఇది గమనించిన డాక్టర్ దామోదర్ తాను  టీ తాగడం ముగించి మైకు ముందుకొచ్చాడు. సభ ఆసక్తిగా అలకించసాగింది.
దామోదర్ గొంతు సవరించుకొని మైకు అడ్జస్టు చేసుకున్నాడు. ఒక సారి సభనంతా కలియ జూసాడు.. పోటీ అభ్యర్థులను చూసాడు..
చిరునవ్వు నవ్వుతూ  “నేను సంఘ అద్యక్షుడిగా గాకుండా ఒక మానసిక వైద్యుడిగా  మీకందరికో మాట చెప్పాలను కుంటున్నాను” అంటూ  తన ప్రసంగం మొదలు పెట్టాడు.
గుణవతి ఆసక్తిగా తలెత్తి దామోదర్ ను  చూడసాగింది..
 ‘నువ్వేంటి చెప్పేది..? నాకు తెలియదా..!’  అన్నట్లుగా గుర్రుగా వుంది గుర్నాథం  చూపు..
“మరెక్కడా జరగని ఇలాంటి  ఎన్నికల వింత ఈ రోజు మన కాలనీలో జరుగుతోంది. నేను ఎంతగానో ప్రయత్నించాను. మన గుర్నాథం గారిని, గుణవతి గారిని వేడుకున్నాను. వారు ససేమిరా.. అన్నారు. వాస్తవమే  వారి తప్పు గాదు.. వారి వయసు ప్రభావమది.
మానవులకు మూడు దశలుంటాయి.. మీకు తెలియంది కాదు. బాల్యము, కౌమార్యము, వృద్ధాప్యము. బాల్యంలో పిల్లలు ఎంత మంకు పట్టుబట్టి తమ కోర్కెలు సాధించుకుంటారో.. వృద్ధాప్యంలోనూ వారి మనస్తత్వం పిల్లల్లా మారి పట్టుదలలకు పోతారు. తమనెవ్వరూ పట్టించు కోవడం లేదని.. తమ మాట  ఎవరూ వినడం లేదని..  తాము ఇన్నాళ్ళుగా చేసిన పనులను గుర్తుకు తెచ్చుకుంటూ తమకు తామే గొప్పవారమని ఊహించుకుంటూ ఇతరులను తక్కువగా అంచనా వేస్తూ ఉంటారు.. ఇది సీనియర్ సిటిజన్ లు ఉండే ప్రతీ ఇంట జరిగే భాగోతమే..
ఏంతో అన్యోన్యమైన  మన గుర్నాథం  గుణవతి  దంపతులే దీనికి తార్కాణం...
మన కాలనీ వారి కనుసన్నల్లో వృద్ధి చెందింది. వారి పిల్లలు మన కళ్ళ ముందే పెరిగి పెద్ద వారై అభివృద్ధి చెందారు.. అమెరికాలో ఉంటున్నారు..
అసలు సమస్య అప్పుడే ఆరంభమయ్యింది. కళ, కళ లాడే ఇంట్లో నుండి ఒక్కొక్కరు పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్లి పోతుంటే ఇల్లు వెల, వెల పోవటం.. వీరి హృదయాలలో ఎదో వెలితి.. చెప్పుకోలేని మానసిక సంఘర్షణ చోటు చేసుకుంది..  పంతాలు పట్టింపులకు దారి తీసింది.
గుర్నాథం గారు రిటైర్ మెంటు గావటం.. తానెంత నిక్కచ్చి మనిషో.. సర్వీసులో ఎన్ని అవార్డులు పొందాడో.. గుర్తుకు తెచ్చుకుంటూ తనే గొప్ప వాడిననే ఫీలింగ్, అతడిని కుదురుగా ఉండనివ్వడం లేదు. ఎవరైనా తక్కువగా అంచనా వేసి మాట్లాడితే సహించడు. చివరికి తన అర్థాంగి  అయినా సరే.
వాస్తవమే.. అతడు గొప్ప వాడే..  అతడి వాదన సరియైనదే..
అదేం గొప్ప.. నేనెంతగా శ్రమించానో.. ఈ సంసారం ఇంతగా ఎదగడానికి.. పిల్లలు గొప్ప వారు కావడానికి  నేనెంత కృషి చేసానో.. అని గుణవతి గారి అభిప్రాయం..
ఆవిడా మాటా వాస్తవమే..   ఆమె వాదనా కాదనలేము..
అలా వారి వాదులాట పెరగడానికి  మన కాలనీ జనం కూడా మరో  కారణం..” అనగానే సభలో కళ కలం మొదలయ్యింది. మనమేం జేసాం.. అని ఒకరి నొకరు ప్రశ్నించుకో సాగారు..
సభను శాంత పరిచి మళ్ళీ చెప్పడం ప్రారంభించాడు దామోదర్..
“ముఖ్యంగా మన మిత్రులు కొందరు వారి వారి పనులు చక్కబెట్టు కోడానికి గుర్నాథం గారిని  మంచి వారని పొగడటం.. అలాగే గుణవతి  గారినీ పొగడటం.. అఘాతాలుగా ఊహించుకుంటున్న వారి  హృదయాలలో ఇగో ఇజం అంకురించింది.
వారి  మనసు వెన్నపూస అని మనకు తెలుసు.. అయినా వారి మంచితనాన్ని బేరీజు వేసుకోవాలని  పోలింగు వరకూ ఎందుకు వచ్చిందో మీకెవరికీ తెలియదు.. నేను వారి మాటల్లోనే వివరిస్తాను..
నేను  వారి గుమ్మంలో అడుగు  పెట్టిన రోజు..
***
“నేనెంత క్రమ శిక్షణ పాటిస్తానో..!” అన్నాడు గుర్నాథం గుణవతి వంక గుడ్లురిమిచూస్తూ.
“అబ్బో.. అదో గొప్ప విద్యనా.. నువ్వు గనుక పాటిస్తున్నావు.. లోకంలో మరెవ్వరూ పాటించడం లేనట్లు..” ఎకెసెక్కెంగా జవాబిస్తోంది.. గుణవతి చేతులు అదోలా ఆడిస్తూ..
గుర్నాథం కోపంతో ఊగిపోతున్నాడు..
“నాలా సమయపాలన చేసే వారు ఈలోకంలో వెదుకు చూద్దాం..ఒక్కడంటే ఒక్కడు దొరకడు”
“అవును  నిజమే.. మన పెళ్లి రోజు సినిమాకెళ్దామని చెప్పి అర్థ రాత్రి వచ్చిన రోజు ఇంకా గుర్తుంది నాకు.. సమయం పాటించడమంటే అదే కదూ..!”
“ఆ ఒక్క రోజు అలా జరిగింది.. దానికి ఎంత రాద్ధాంతం చేసావో నేను మాత్రం మరిచానా?”
“అవునులే.. నేను అడిగితే రాద్ధాంతం.. తమరు అలిగితే సిద్ధాంతం..”
“సిద్ధాంతమంటే గుర్తొచ్చింది.. నేను క్లాసులో పిల్లలకు సిద్ధాంతాలు బోధించే పధ్ధతి చూసే గదా నాకు బెస్ట్ టీచర్ అవార్డు ఇచ్చారు..”
“ఎందుకివ్వరూ.. వడ్డించే వాడు మనవాడుంటే అన్నీ అవార్డులే..”
“అవునులే.. అవార్డు సిఫారసు చేసింది నా బావమరది కదా..!”
“మళ్ళీ మా కుటుంబాన్ని ఎందుకు లాగుతారు మధ్యలోకి?”
“చాలా మంచి పలుకుబడి వున్న మనిషిని.. లాగాక పోతే ఎలా..?”
“ఓయబ్బో.. గొప్ప చెప్పొచ్చారు.. మీ పలుకుబడిలా కాదు..”
“నాకేం.. నా అంత మంచి మనిషిని  మరెక్కడా చూడలేదని మన  ఫ్లోర్  కన్ స్ట్రక్షన్   చేసిన వర్కర్లంతా నన్ను మెచ్చుకోవడం నీకు తెలియదా..? అనుకున్న సమయంలో అనుకున్నట్లు లెక్క ప్రకారం డబ్బులిస్తే వాళ్ళు ఎంత సంతోషించారో..”
“అది మీ మంచి తనమని మురిసి పోకండి.. అది నా మంచితనం.. మీకు తెలియకుండా వారి పనితనాన్ని, నైపుణ్యాన్ని చూసి మరింత డబ్బు పారితోషికంగా ముట్టజెప్పాను.. నన్నూ పొగిడారు వాళ్ళు.. నేను ధర్మ దేవతనని..”
“వర్కర్ల సంగతి వదిలెయ్యి.. మన కాలనీలో నాకు ఎంత మంచి పేరుందో నీకు తెలియంది కాదు”
“మరి నాకు  గయ్యాళినని పేరుందా?..మీ కంటే నాకే మంచి పేరుంది..”
“అయితే ఇదేదో తేల్చుకోవాల్సిందే.. మనలో ఎవరు సౌజన్యవంతులో.. వోటింగ్ పెట్టి మరీ తేల్చుకుందాం..”
“మరీ మంచిది.. ఓ పనైపోతుంది..”
***
“ఛాలెంజ్.. అంటే ఛాలెంజ్.. అని దెప్పులాడుకుంటున్నారు” అంటూ టేబుల్ పై వున్న బాటిల్ లోని కాసిన్ని నీళ్ళు తాగి మళ్ళీ చెప్పసాగాడు డాక్టర్ దామోదర్.
 “గుర్నాథం చిటికెలు వేయసాగాడు. ముఖంలో రంగులు మారుతున్నాయి.. మనిషి ఊగిపోతున్నాడు..
అసలే బి.పి. పేషంట్ అని నేను కంగారు పడ్డాను. నా రాక గమనించి సర్దుకోడానికి ప్రయత్నించారు.
నేను అంతా విన్నాను.. మీ ఇరువురి మంచితనం మన కాలనీలో తెలియని వారు లేరు.. ఇరువురూ సౌజన్యమూర్తులే.. దీనికి వోటింగు వరకు ఎందుకు? అని ఎంతగానో చెప్పి చూసాను..   జనం ముందు బాగుండదని నచ్చ జెప్పాను. ససేమిరా.. అన్నారు.
వోటింగ్ తప్పదు.. అని పోలింగు  వరకూ తీసుకు వచ్చారు..
 ఇదీ ఒకందుకు మంచిదే అని నా అభిప్రాయం. దీంతో  వారి మనసులు శాంతిస్తాయని అనుకుంటున్నాను..
            అయితే ఒక మనవి..
వోట్ల ఫలితం ఎలా వున్నా.. దయచేసి దీనిని సీరియస్ గా తీసుకోకుండా.. ఇక ముందు పూర్వ వైభావంలా మన విజ్ఞానపురి కాలనీ ఆదర్శ దంపతులుగా మనుగడ సాగిస్తారని గుణవతి గుర్నాథం గార్లు  వాగ్దానం చేస్తేనే మిగతా వోట్లు లేక్కిస్తాం..” అంటూ సభ అభిప్రాయాన్ని కోరాడు దామోదర్.
            సభ యావత్తు డాక్టర్ నిర్ణయానికి మద్దతు తెలుపుతూ చప్పట్ల వర్షం కురిపించింది..
            “ఇరువురూ సౌజన్యమూర్తులే..” అంటూ స్లొగన్స్ మారు మ్రోగాయి..
డాక్టరు గారి ఉపన్యాసం వాతావరణాన్ని  పూర్తిగా మార్చివేసింది.
            గుణవతి, గుర్నాథం దంపతులిరువురి కళ్ళల్లో ఆనంద భాష్పాలు దొర్లాయి. ఆత్మీయ ఆలింగనంతో సభకు వాగ్దానం చేసారు.
            “ఇక మిగిలిన వోట్ల లెక్కింపు సరదాగా తీసుకోవాలి” అని దామోదర్ సభకు విన్నవించాడు.
            తిరిగి వోట్ల లెక్కింపు కార్యక్రమం ఆరంభమయ్యింది...
            కోటేశ్వర్ వోట్ల లెక్కింపు ఫలితం ప్రకటించాడు..
            గుణవతి గారి వోట్లు రెండువందల ఇరువది ఎనిమిది.. అనగానే సభలో హర్షధ్వనులు మిన్నంటాయి.. ఇక మిగిలిన సగం గుర్నాథం వోట్లు.. ఇరువురికీ సమానమే..
సభ కరతాళధ్వనులు మధ్య దామోదర్ “మరో ప్రకటన..” అంటూ ప్రకటించే సరికి సభా యావత్తు నిశ్శబ్దమైంది.
“ఈ రోజు గుర్నాథం గారి షష్టి పూర్తి... మన సంఘ సంప్రదాయం ప్రకారం వారిని సగర్వంగా సన్మానిద్దాం”  అనగానే సభలో అభినందనల జల్లు  వెల్లివిరిసింది...
వేదిక తగిన ఏర్పాట్లు చేసుకుంటోంది.
ఎన్నికల గొడవలోపడి మరిచి పోయినందుకు గుణవతి మనసు నొచ్చుకుంది. తనను మన్నించుమన్నట్లుగా గుర్నాథాన్ని సమీపించింది..
***
ఆ మరునాడు..
డాక్టర్ దామోదర్ మరోమారు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుదామని గుర్నాథం ఇంటికి వెళ్ళాడు..
కాఫీలు తాగుతూ కబుర్లలో పడ్డారు..
ఇంటి వాతావరణంలో మార్పును గమనించి తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు. వారి మధ్య అడ్డు తడక అంతర్థానమైనట్లు గమనించాడు. ఆ తన్మయత్నంలో అసలు విషయం బయట పెట్టాడు.
“మన కాలనీ వాళ్ళం అన్నదమ్ముల్లా ఐక్యంగా వుండటం నాకేంతగానో సంతోషంగా వుంది. నా మాటకు గౌరవమిచ్చి మన సభ్యులంతా కూడబలుక్కొని మీ ఇరువురికి సమానంగా వోట్లు వచ్చేలా సహకరించారు.. ఇంటింటికీ వెళ్లి అభినందిస్తూ వస్తున్నాను..”
“అదే నాకూ అర్థం గావటం లేదు డాక్టరు గారూ..! ఇలా జరుగొచ్చని  ముందే పసి గట్టాను. ఎంతైనా లెక్కల మాష్టారుని కదా.. లెక్క తప్పకుండా మా ఆవిడ గెలవాలని  నా వోటును నా అర్థాంగికే  వేసాను. ఆమె గెలుపే నాకు కావాల్సింది..
భగవంతుడైన శ్రీకృష్ణుడు  అంతటి వాడు తన సతీమణి సత్యభామ కాళ్ళు పట్టుకున్నాడు. నేనెంతటి వాణ్ణి. అయినా భార్యా భర్తలు అన్నాక ఇలాంటి మనస్పర్ధలు సహజం.. సంతృప్తి అంతా సర్డుకోవడంలో ఉంటుంది. భర్త ఎప్పటికీ భార్య అడుగు జాడల్లో నడవాలి అనుకుంటాడే గాని ఆమె అడుగు జాడలను అర్థం చేసుకోడు. కాని అది తప్పు.. సదా భర్త @ భార్య అని నాభావన. అదీ అసలు లెక్క” అంటూ గుర్నాథం చిరునవ్వు నవ్వుతూ..
 “అవునూ.. మరి నావోటు నా గుణతికి పడినప్పుడు మా  ఇరువురికీ ఎలా సమానంగా వచ్చాయి..?” అంటూ లక్ష్మయ్య తన అనుమానాన్ని బయటపెట్టేసరికి ఖంగు తిన్నాడు దామోదర్..
అంతా వింటున్న గుణవతి కంట నీరు పెట్టుకుంది. కన్నీటిని కడకొంగుతో తుడ్చుకుంటూ..
 “భార్య ఎప్పటికీ కోరుకునేది తన భర్త గెలుపు.. మీరే గెలవాలని నా వోటు మీకే  వేసాను” అంటూ గుర్నాథం  చేతిని పట్టుకొని విజయ సంకేతంగా లేపింది.
డాక్టర్ దామోదర్  కళ్ళల్లో ఆనందభాష్పాలు దొర్లాయి.
“మీరిరువురూ గెలుపొందారు..  మీ దాంపత్యం నిండు నూరేళ్ళు ఇలాగే వర్ధిల్లాలి..” అంటూ ఇరువురి చేతులను పైకెత్తి శిరస్సు వంచి  నమస్కరించాడు.
 ***                  

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top