బంగినపల్లి మాధుర్యం - మంగళంపల్లివారి గాత్రం - అచ్చంగా తెలుగు

బంగినపల్లి మాధుర్యం - మంగళంపల్లివారి గాత్రం

Share This

బంగినపల్లి మాధుర్యం - మంగళంపల్లివారి గాత్రం

పూర్ణిమ సుధ 


మంగళంపల్లి బాలమురళీకృష్ణ. పరిచయం అఖ్ఖర్లేని గాన గంధర్వులు. జూలై 6 న, తూర్పుగోదావరి జిల్లాలోని, శంకరగుప్తం అనే ఒక చిన్న ఊళ్ళో జన్మించారు. పుట్టిన 15 రోజులకే మాతృమూర్తి పరమపదించారు. తన మేనత్త సుబ్బమ్మగారు, నాన్నగారు - ఇద్దరి పెంపకంలో సంగీత కళానిధిగా ఎదిగారు. ఫ్లూట్, వాయులీనం, వీణ వాయించడంలో ఈయన తండ్రిగారు ప్రావీణ్యులు. ఈయనకి కూడా సంగీతం మీద ఉన్న మక్కువని గమనించి, బాలమేధావి అయిన బాలమురళిని, విజయవాడలోని పారుపల్లి రామకృష్ణయ్య పంతులుగారి వద్ద శిష్యునిగా చేర్చారు. పారుపల్లివారంటే, స్వయానా త్యాగరాజ శిష్యపరంపరలోని వారే... బాలమురళి గారు, 1939 నుండీ కచేరీలు చేస్తూనే ఉన్నారు. కేవలం గాత్రం మాత్రమే కాదు, వయోలిన్, మృదంగం, కంజీరా వంటి పలు వాయిద్యాలు కూడా బాగా వాయించగలరు.
8 ఏళ్ళ లేత ప్రాయంలోనే త్యాగరాజ ఆరాధనలో కచేరి చేసి, అందరి మన్ననలు అందుకున్నారు బాలమురళి. నిజానికి ఆయన పేరు కేవలం మురళీకృష్ణ. కానీ ఈయన మొదటి కచేరీ అనంతరం, ప్రముఖ హరికథ విద్వాంసులు శ్రీ ముసునూరి సత్యనారాయణగారు, బాల అని పేరు ముందు చేర్చడం వల్ల బాలమురళీకృష్ణగా మారారు. తన చిన్నప్పుడు గురువు పారుపల్లి రామక్రిష్ణయ్య వెంట తమిళనాడు అంతా తిరిగారు. అప్పట్లో ప్రతి ఊళ్ళోనూ రసికమణి అని పేరుమోసిన ఒక ధనవంతుడైన సంగీత ప్రియుడుండేవాడు. అతని మెప్పు పొంది, వాళ్ళింట్లో కచేరీ చేస్తేనే యువ కళాకారులకి గౌరవం దక్కేది. చిన్నవయసులో గురువు వెంట వెళ్ళిన బాలమురళి వారందరి ముందరా గాత్రం వినిపించి బహుమతులూ, ప్రశంసలూ పొందడంతో ఆయనకి అనేక స్థానిక అవకాశాలు లభిస్తూ ఉండేవి.
బాలమురళీకృష్ణ అమెరికా, కెనడా, బ్రిటన్, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, శ్రీలంక, మలేషియా, సింగపూర్ ఇంకా ఎన్నో ఇతర దేశాల్లో కచేరీలు చేశారు. తెలుగులోనే కాక సంస్కృతం, కన్నడం, తమిళం, హిందీ, బెంగాలీ, పంజాబీ భాషలలో కూడా పాటలు పాడగలరు. భక్త ప్రహ్లాద చిత్రంలో నారదునిగా నటించటమే కాక తన పాటలు తానే పాడుకున్నారు. సంగీతం అనే ఒక మహాసముద్రంలో ప్రవాహంలో కొట్టుకుపోకుండా, కొత్తదనంతో, యువకులని కూడా ఆకట్టుకునే విధంగా, ఎన్నెన్నో కొత్త ప్రయోగాలు చేసారు, బాలమురళి. మహతి, సుముఖం, సర్వశ్రీ, ప్రతి మధ్యమావతి, గణపతి, సిద్ధి, లవంగి అనే కొన్ని కొత్త రాగాలను కూడా ఆవిష్కరించారు. ఈ కొత్త రాగాలు కనిపెట్టడం వల్ల ఆయన కొన్ని విమర్శలకు కూడా గురయ్యారు. అసలు ఆయన కచేరీ చేస్తుంటే, పెద్దవారే కాదు, చిన్నపిల్లలు కూడా ఎంతో తన్మయత్వంతో వింటారు. ఎందుకంటే, ఆయన గాత్రంలోని గమకాలు, పాడేప్పుడు ఆయన హావభావాలు, ఎంతో ఉత్సాహంగా అనిపిస్తాయి. నా చిన్నప్పటి నుండీ, నేను ఎంతో మంది కర్ణాటక సంగీత విద్వాంసుల కీర్తనలని విన్నాను. కానీ బాలమురళిగారి తిల్లానాలు, వర్ణాలు, తత్వాలు, కీర్తనలు - ఏ జోనర్ అయినా, ఎంతో శ్రవణపేయంగా అనిపించి, ఆధ్యాత్మిక లోకంలోకి తీసుకెళ్తాయి. తిల్లానాలు పిల్లలకి వినిపిస్తే, ఎంతో ఆటవిడుపుగా, సరదాగా అనిపిస్తాయనేది, నా వ్యక్తిగత అభిప్రాయమే అయినా, చాలా మంది నాతో ఏకీభవించారు. ఆయన గాత్రంలో ఏదో మధురమైన మాయ ఉంది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 25000 కచేరీలు చేశారు. సంగీతంలోని అన్ని విభాగాల్లోను విస్తారమైన పాండిత్యము, మంత్రముగ్దులను చేసే గాత్రం, కంపోసింగ్ లో ప్రత్యేక శైలి ఆయన్ని సంగీత సామ్రాజ్యంలో అత్యున్నత శిఖరాలకు చేర్చింది. హిందుస్తానీ సంగీతంలోని ప్రముఖ సంగీతకారులతో కలిసి జుగల్ బందీ తరహా కచేరీల రూపకల్పనకి ఆద్యులు ఈయనే. ఈ తరహా కచేరీ మొట్టమొదట పండిట్ భీమ్ సేన్ జోషి తో కలిసి ముంబయి లో నిర్వహించారు. పండిట్ హరిప్రసాద్ చౌరాసియా, కిషోరీ అమోన్కర్ లాంటివారితో కూడా జుగల్ బందీ కచేరీలు చేసారు. ఈ కచేరీలు ఆయనికి దేశం మొత్తంలో ప్రజాదరణ తీసుకురావడమే కాక, సంగీతం ద్వారా దేశ సమైక్యతను పెంపొందించడానికి దోహదపడ్డాయి. బాలమురళీకృష్ణ వయోలిన్, వయోలా, వీణ, మృదంగం మెదలగు సంగీతవాయిద్యాలు వాయించడంలో ప్రావీణ్యం సంపాదించారు.
బాలమురళీకృష్ణకి ఎన్నో బిరుదులు మరియు పురస్కారాలు లభించాయి. వాటిలో కొన్ని : - గాన కౌస్తుభ, గాన కళాభూషణ, గాన గంధర్వ, గాయక శిఖామణి, జ్ఞాన శిఖామణి, జ్ఞాన చక్రవర్తి, గాన పద్మం, సంగీత కళానిధి, నాద జ్యోతి, సంగీత కళా సరస్వతి, నాద మహర్షి, గంధర్వ గాన సామ్రాట్, జ్ఞాన సాగర, మొదలైనవి.
దేశ సమైక్యతకు కృషి చేసినందుకు గాను మహారాష్ట్ర గవర్నరు బాలమురళీకృష్ణగారిని సన్మానించాడు. కర్నాటక సంగీతకారులలో 3 జాతీయ పురస్కారాలు పొందిన ఏకైక వ్యక్తి బాలమురళీకృష్ణ. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ లాంటి జాతీయ పురస్కారాలతో పాటు ఎన్నో విశ్వవిద్యాలయాల నంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు. ప్రపంచ స్థాయిలో బెనిలియర్ అనే అత్యుత్తమ పురస్కారాన్ని కూడా ఆయన అందుకున్నారు. ఈయన తిరుపతి తిరుమల దేవస్థానము, శృంగేరీ పీఠాలకు ఆస్థాన విద్వాంసులు.
ఇంక ఆయన గురించి చాలా మందికి తెలుసు. అందుకే, ఆయన్ని అడిగిన కొన్ని ప్రశ్నలకి ఆయన చెప్పిన సమాధానాలని కూడా ఓ సారి చూద్దాం :
Q. ఇంకా ఏవైనా కొత్త రాగాలని స్వరపరుస్తున్నారా ? 
A. అది కాకతాళీయంగా రావాల్సిందే తప్ప, కూర్చుని యుధ్ధప్రాతిపదికన, ఏదో చెయ్యాలంటే రాదు... నేను  ఓ రాగం కంపోజ్ చెయ్యాలని కూర్చోను. వచ్చిన ఆలోచనని గుర్తించి, నోట్ చేస్తాను, అది రాగంగా రూపొందుతుంది.
Q. నేటి తరంలో మీకు నచ్చిన సంగీతకారులెవరు ?
A. ఎందరో యువకులు మంచి సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రతి ఒక్కరిదీ ప్రత్యేకమైన శైలే... నేను అన్నీ ఆస్వాదిస్తాను. ప్రత్యేకంగా ఒక్కరని ఏం లేదు. నా చిన్నతనంలో మా గురువుగారు పారుపల్లివారు, నాకు ఆరాధ్యులు. మా అమ్మ కూడా వెర్సటైల్ వీణ వాద్యులు. మా నాన్నగారు పట్టాభిరామయ్యగారిది, అద్భుతమైన గాయకులే కాక, వీణ, వేణు, వయోలిన్ విద్వాంసులు. కంపోజర్స్ విషయానికొస్తే, నాకు త్యాగరాజు అద్భుతమైన కంపోజర్ అనిపిస్తుంది.
Q. ఒక సంగీత కళాకారుడిగా పుట్టడం పూర్వ జన్మ సుకృతం అనేది మీరు నమ్ముతారా ? 
A. నిజమే, కొన్నిసార్లు, బాలమేధావులు అంటూంటారు కదా ? వారికి ఆ పూర్వజన్మలోని నైపుణ్యతే అబ్బిందేమో అనిపిస్తుంది. నిజానికి, నేనూ 5 ఏళ్ళ చిరుప్రాయంలోనే కచేరీ చేసాను. 1940, అంటే నా 8 ఏళ్ళప్పుడు, చెన్నైలోని All India Radio లో పాడాను. ఎలా అంటే నా తల్లిదండ్రులనుండీ నాకు అబ్బింది. పూర్వజన్మ సుకృతం ఉంటేనే అలాంటి తల్లిదండ్రులకి జన్మిస్తాను... అని నా నమ్మకం.
Q. పండిట్ జస్రాజ్, పండిట్ జోషీ గార్లతో మీరు చేసిన జుగల్ బందీలు ఎంతో బావున్నాయి. పండిట్ జస్రాజ్ గళం మీకు సరైన కాంబినేషన్ అని నా వ్యక్తిగత అభిప్రాయం. మీకు ఇంకెవరితో అయినా జుగల్ బందీ చెయ్యాలని ఉందా ? 
A. నాకూ జుగల్ బందీలు చెయ్యడం ఇష్టమే. మీరు ఇంకెవరితో అయినా చెయ్యాలని ఉంటే చెప్పండి, చేసేద్దాం.
Q. సంగీత ప్రపంచంలో మీరు మకుటంలేని మహారాజుగా ఎదిగారు. మీ శిష్యుల గురించి కొంచెం చెప్తారా ?
A. నాకు ఎంతో మంది శిష్యులు ఉన్నారు. కొందరు ఏకలవ్యుల్లా, శృతపాండిత్యంతో నేర్చుకునేవాళ్ళు, కొందరు ప్రత్యక్ష్యంగా నేర్చుకున్నవాళ్ళు... ఎంతోమంది, ఇక్కడా, విదేశాల్లో కచేరీలు చేస్తున్నారు. పేదవిద్యార్థులకి ఉచితంగా కూడా సంగీతం నేర్పిస్తున్నాను. అందరూ మంచి వృధ్ధిలోకి రావాలని నా కాంక్ష. నాకు ముఖ్యంగా అందరూ ప్రియులే. నాకు వ్యక్తిగతంగా ఇష్టం అంటూ అలా ఏమీ లేదు. మోహనకృష్ణ బాగా పాడుతున్నాడు.
Q. మీ కెరీర్ లో గల ఒడిదొడుకుల గురించి చెప్తారా ? 
A. NTR గారితో మీకు చెడిందని... అని అంటూండగానే మధ్యలోనే ఆపి, చెడలేదండీ. చిన్న అభిప్రాయబేధం. అది కూడా తరువాత పోయింది. ఆయనా నన్ను సత్కరించారు.
Q. రెహమాన్ సంగీతం మీద అభిప్రాయం ? 
A. చాలా మంచి భవిష్యత్తున మంచి సంగీత దర్శకుడు.
Q. fusion music మీద మీ అభిప్రాయం ఏంటి ? అది, స్వచ్చమైన శాస్త్రీయ కర్ణాటక సంగీతాన్ని ప్రభావితం చేస్తుందని మీకు అనిపిస్తుందా ? 
A. ప్రతీ సంగీతమూ స్వచ్ఛమైనదే. fusion music ని కరెక్ట్ గా చేస్తే, పలు రకాల సంగీతాల గురించి తెలుసుకునే అవకాశం కలుగుతుంది. అలాగే, ఎంతోమందిని కలిసే అవకాశం, అభిప్రాయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. మొత్తమ్మీద, సంగీతంలో నాణ్యత, పరిపక్వత పెరుగుతుంది.
Q . మీ career లో మర్చిపోలేని సంఘటన ?
A. నా ప్రతీ కచేరీ (పెర్ఫార్మెన్స్) నాకు నచ్చేవే... వ్యక్తిగతంగా, నాకు మొట్టమొదటిసారి డాక్టరేట్ వచ్చినప్పుడు, రాష్ట్రపతి చేతుల మీదుగా, second highest civilian award అయిన పద్మవిభూషణ్ తీసుకున్నప్పుడు చాలా ఆనందం కలిగింది.
***

No comments:

Post a Comment

Pages