ఏరువాక సాగారో రన్నా చిన్నన్నా! - అచ్చంగా తెలుగు

ఏరువాక సాగారో రన్నా చిన్నన్నా!

Share This

ఏరువాక సాగారో రన్నా చిన్నన్నా!

టేకుమళ్ళ వెంకటప్పయ్య, విజయవాడ.


ఈ అనంత విశ్వగమనంలోని  క్రియలన్నిటికీ పరమాత్ముడే అధినేత అని ప్రజల విశ్వాసం . నక్షత్రాలు, గ్రహాలు రాశులతో కూడిన విశ్వాంతరాళం ఆయన కనుసన్నల్లోనే పరిభ్రమిస్తూ జీవరాశులకు అనుకూలమైన ఋతువులకు కారణమవుతోందని భావిస్తాము. చైత్రం నుంచి ఆషాఢం వరకు వేసవి, శ్రావణం నుంచి కార్తీకం వరకు వర్షకాలం, మార్గశిరం నుంచి ఫాల్గుణ మాసం వరకు శీతకాలం ఏర్పడుతూ ప్రపంచంలోని జీవులకు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు పరమాత్ముడు కల్పిస్తూనే ఉన్నాడు.  ఆ కారణం చేతనే సామాజిక స్వరూప స్వభావాన్ని నిర్ణయించేది  కూడా భగవంతుడనే ప్రగాఢ నమ్మిక మనలో ఉంది.  ఆది మానవుడు దేవతలు అంటే ప్రాకృతికశక్తి స్వరూపాలు అని భావించేవారు.  వ్యవసాయ సంస్కృతి లోనూ అదే సాగుతూ వచ్చింది. కాల క్రమానుగుణంగా ప్రాకృతిక పూజలన్నీ ఆర్యుల చేతిలో సంస్కృతీకరణం చెందుతూ అనేక మార్పులకు లోనయ్యాయి. కర్షకులు తమకు ఆహార పంటలనిచ్చే పొలాలలోను, తమతో పాటు వ్యవసాయక క్షేత్రంలో శ్రమించే పశువుల్లోను, వ్యవసాయ ఉపకరణాల్లోను దైవాన్ని దర్శించారు. తెలుగు రాష్ట్రాలలో జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమను కర్షకులు ఏరువాక పున్నమిగా జరుపుకోవడంలో ఈ దృష్టి మనకు గోచరిస్తుంది.  సేద్యం మన భారతదేశంలో ముఖ్యంగా ప్రధాన జీవనాధారం. దేశ సౌభాగ్యంలో కర్షకులు జరుపుకొనే ఈ ఉత్సవం జనజీవనస్రవంతి లో ఏరువాక పున్నమి గా ప్రాచుర్యం వహించినా, ఇది వైదికోత్సవం కాదు. కొందరు పండితులు దీన్ని కృషి పౌర్ణమిగా పేర్కొన్నారు.
వర్షరుతువు ఆరంభంకాగానే కృషీవలురు క్షేత్రపాలుని సంబోధిస్తూ మంత్రాలు చదువుతుండేవారని ఋగ్వేదంలో ఉంది. జైమిని దీనినే “ఉద్‌వృషభయజ్ఞం” గా పేర్కొనడం గమనార్హం. వరాహమిహిరుడు రచించిన 'బృహత్సంహిత'లోను, పరాశరుడు రాసిన 'కృషిపరాశరం'లోనూ ఈ ఉత్సవ ప్రసక్తి ఉంది. కర్ణాటక ప్రాంతంలో 'కారణిపబ్బం' అని ఈ ఉత్సవాన్ని పిలుస్తారు. ఉత్తర భారతంలో ఆంధ్రుల ఏరువాక పండుగలా ఉద్‌వృషభయజ్ఞం చేసే సంప్రదాయం ఉండేదని, ఆ రోజు ఎడ్లను పూజించి పరుగెత్తించేవారని శాస్త్రాలు చెప్తున్నాయి. విష్ణుపురాణంలో సీతాయజ్ఞం ప్రస్తావన ఉంది. సీత అనే మాటకు నాగేటి చాలు అని అర్థం. బ్రాహ్మణులకు మంత్రజపం యజ్ఞం, కర్షకులకు సీతాయజ్ఞం, గోపాలురకు గిరి యజ్ఞం అని భాగవత పురాణం పేర్కొంటోంది. బౌద్ధ జాతక కథల్లోని "వప్ప మంగలదివస" ఏరువాక పండగను పోలినదే. శుద్ధోదన మహారాజు కపిలవస్తు నగరంలో వర్ష రుతువు ఆరంభం కాగానే కర్షకులకు లాంఛనంగా ఒక బంగారు నాగలిని అందజేసేవాడని "లలితవిస్తరం" చెబుతోంది. హాలుని గాథాసప్తశతిలోనూ ఈ ప్రస్తావన ఉంది. ఐరోపా ఖండ వాసులు జరుపుకునే "మేపోవ్" కూడా దాదాపుగా ఇటువంటి పండుగే.
ఏరు అంటే నాగలి. ఏరువాక అంటే దున్నడం ఆరంభించే శుభదినం. పొలం దున్నడానికి మంచి నక్షత్రం 'జ్యేష్ఠ' అని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. జ్యేష్ఠ నక్షత్రంతో చంద్రుడు కూడి ఉంటే ఏర్పడేది జ్యేష్ఠ పూర్ణిమ. సకల ఓషధులకు అధిపతి చంద్రుడు. ఓషధులు సమృద్ధిగా ఎదిగితేనే వ్యవసాయానికి విశేషమైన ఫలసాయం అందుతుంది. వర్షరుతువు ఆరంభం కాగానే జ్యేష్ఠ పూర్ణిమనాడు కర్షకులు ఉదయమే ఎడ్లను కడిగి కొమ్ములకు రంగులు పూసి గజ్జెలు గంటలతో అలంకరించి, ఎడ్లను కట్టేకాడిని ధూపదీప నైవేద్యాలతో పూజించడం పరిపాటి. ఎడ్లకు పొంగలి పెడతారు. సాయంకాలం గ్రామంలోని రైతులంతా మంగళవాద్యాలతో ఊరేగింపుగా పొలాలకు వెళ్లి దుక్కి ప్రారంభిస్తారు. ఊరి వాకిట గోగునారతో చేసిన తోరణం కడతారు. దాన్ని చెర్నాకోలలతో కొట్టి ఎవరికి దొరికిన పీచును వారు తీసుకుపోతారు. ఇది పశువులకు మేలు చేస్తుందని నమ్మకం.
ఏరువాక పున్నమినాడు రైతులు చాలా నియమాలు పాటిస్తారు. ఆ రోజున వారెవ్వరికీ అప్పులివ్వరు. ఏ వస్తువులూ కొనరు. కావలసినవన్నీ ముందే కొనుగోలు చేసుకుంటారు. మాంసాహారులైన వారు కోళ్లను కోస్తారు. శాకాహారులు మాత్రం నాగలిముందు దీపారాధన చేసి కొబ్బరి కాయలు కొడతారు. ఎడ్ల చుట్టూ, నాగలి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. మంగళవాద్యాల మధ్య జానపద గీతాలతో ఆడతారు. నర్తిస్తారు. పాలేళ్లతోసహా అందరూ నాగలిని పట్టుకుంటారు. ఉత్సవం ఏ ప్రాంతంలో జరుపుకున్నా, వ్యవసాయానికి ఆలంబన అయిన పశుసంపద, భూమి, పనిముట్లకు ప్రాధాన్యమిచ్చి పూజించడం ఈ పూర్ణిమ ప్రత్యేకత. నాగలిని శుభ్రపరచి, పసుపు, కుంకుమలతో అలంకరించి పూజిస్తారు. 'గొడ్లుంటేనే ఒడ్లు', 'ఎద్దులేని సేద్యం- చద్దిలేని పయనం' మొదలైన సామెతలు నేటికీ పల్లెవాడుకలో ఉన్నాయి. ఆపైన పొంగలిని లేక పులగం వండి వర్షానికి అధిదేవత అయిన ఇంద్రుణ్ని పూజించి నివేదన చేస్తారు. ఆ తరవాత ఆ పదార్థాలను ఆవులకు, ఎడ్లకు తినిపిస్తారు. నాగలిని పూన్చి, పశువులను, బండ్లను మేళతాళాలతో వూరేగించి భూమిలో తొలి వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు. కొన్నిచోట్ల తొలిదుక్కిలో రైతులు కూడా ఎడ్లతో సమానంగా కాడికి రెండోవైపు నిలిచి భూమిని దున్నడం గమనించవచ్చు. కొంతకాలం నిలువ వుంచి ఎరువుగా మారిన పశువుల పేడను పొలాలకు తరలించే ప్రక్రియ ఈ పూర్ణిమనాడే ప్రారంభిస్తారు. ఈ జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమినాడు పద్మపురాణ గ్రంథాన్ని దానం చేయడం అశ్వమేధ ఫలతుల్యమని శాస్త్రం చెబుతోంది. అలాగే, ఈ రోజున కృష్ణాజినం కూడా దానం చేయాలట. దాని మీద కొంతసేపైనా కూర్చుని వాసుదేవుణ్ని ప్రార్థించాలట. ఈ ఏరువాక పున్నమినాడే మహిళలు 'వటసావిత్రి వ్రతం' కూడా ఆచరిస్తారు. యముడి వెంటపడి, మృతుడైన తన పతి సత్యవంతుణ్ని బతికించుకొని తిరిగి భూలోకానికి వచ్చిన సతీసావిత్రిని అర్చిస్తూ, ముత్తయిదువులు ఆచరించే పుణ్యవంతమైన వ్రతమని భావించడం కద్దు.
పూర్వం వైశంపాయనుడు మృగశిర కార్తె రోజునే తన శిష్యుడైన యాజ్ఞవల్క్యునికి తైత్తిరీయోపనిషత్తు బోధించాడని అంటారు. ఈ ఉపనిషత్తు వర్షాధిపతి అయిన వరుణదేవుని ప్రార్థనతోనే ప్రారంభం అవుతుంది. అందుకే కార్తెలన్నింటిలోనూ మృగశిరకు చాలా ప్రాముఖ్యం ఉంది. అటు పరమాత్మకూ, ఇటు ధరణిపైని లౌకిక వ్యవహారాలకు మృగశిర కార్తె అనుసంధానంగా ఉంటుందన్నది పెద్దలమాట. తొలకరి జల్లుల కారణంగా భూమిపైనుంచి వచ్చే పరిమళం జీవరాశులన్నింటికీ ఆనందం కలిగిస్తుంది. మృగశిర కార్తె, ఆరుద్ర కార్తెల మధ్య వచ్చే యోగినీ ఏకాదశి, జగన్నాథ రథయాత్ర, కుమారషష్ఠి, వైవస్వత సప్తమి అత్యంత పర్వదినాలు. ఇంటిబయట వరుణదేవుడు వర్షపు జల్లులు కురిపిస్తూ చల్లని గాలులతో వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మారిస్తే మనస్సు కూడా దైవధ్యానానికి ఆత్రుత పడుతుంది. అందుకే వర్షరుతు ప్రారంభాన్ని సూచించే మృగశిర కార్తె నగరవాసులకూ, పల్లెజనాలకూ పర్వదినమే.
-0o0-

No comments:

Post a Comment

Pages