పుష్యమిత్ర - 5 - అచ్చంగా తెలుగు

పుష్యమిత్ర - 5

టేకుమళ్ళ వెంకటప్పయ్య 


జరిగిన కధ: "ఇండియన్ గ్లోబల్ " అనే అతిశక్తివంతమైన రాడార్ ను నిర్మించడానికి అనువైన ప్రదేశం కోసం హిమాలయాలపైన  ఇస్రో వారు హెలికాప్టర్ల ద్వారా అన్వేషణ జరుపుతూ ఉండగా గమనించిన పాకిస్థాన్ ప్రభుత్వం, బార్డర్లో జరుగుతున్న హడావిడి ఏమిటొ తెలుసుకోమని, కరిముల్లా అనే ఏజెంటును నియమిస్తారు. కరిముల్లా కూపీ లాగడానికి బయల్దేరిన జిలానీని సుమంత్ అనే అధికారి అడ్డగించి ఆర్మీకి అప్పజెబ్తాడు. టవర్ నిర్మాణం లో ఎదురైన అడ్డంకులను అధిగమించేందుకు కోసం ఇంజినీర్ల సహాయం తీసుకుని కనిష్కవర్ధన్ మంచును తొలగించే దశలో బయటపడ్డ కాలనాళికను తెరచి చూడగా అందులో భారీ కాయం బయటపడడం, తర్వాత కళ్ళు తెరిచి చూడడం జరుగుతుంది  (ఇక చదవండి)
ఉరుకు పరుగులతో ఐ.సీ.యు చేరుకున్న డాక్టర్ల బృందం అలాగే కళ్ళు తెరుచుకుని పై కప్పుకేసి నిశితంగా చూస్తున్న ఆకారం కేసి చూడ సాగారు. కొంత మంది డాక్టర్లు పీ.ఎం సెక్రటరీకి ఫోన్ చేసి ఈ విషయం తెలిపారు. ఏడడుగుల పొడవు  150 కే.జీల బరువు ఉన్న ఆ వ్యక్తి రాజుల కాలం నాటి వస్త్రధారణ, కేశాలతో ఉన్నాడు. మెడలో  జ్యంధ్యం ఉన్నా క్షత్రియుడా? లేక బ్రాహ్మణుడా అన్న విషయం నిర్ధారణకు రాలేక పోతున్నారు.  ఐదు నిముషాల అనంతరం నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఆ ఆకారం  "నేనెక్కడ ఉన్నాను? ఇది స్వర్గ లోకమా? మీరు దేవతలా?" అని సంస్కృతంలో అడిగాడు. అర్ధం కాక అందరూ ఢిల్లీ విశ్వవిద్యాలయ సంస్కృత విభాగం ప్రధాన ఆచార్యుని కుమారుడైన  డా.ప్రశాంత్ చతుర్వేది వైపు చూసారు.  చతుర్వేది మందస్మిత వదనంతో "లేదు ఇది భూలోకమే! మీరు ఆర్మీ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ లో ఉన్నారు"  అన్నాడు. అర్ధం కాని ఆ ఆకారం "సరిగ్గా చెప్పండి.. మీ మాటలు నాకు అవగతం అవడం లేదు" అని అనగానే మళ్ళీ సంస్కృతం లో టైం క్యాప్స్యూల్ దొరికిన దగ్గర నుండి ఇప్పటి వరకూ క్లుప్తంగా వివరించాడు డా.చతుర్వేది.  అందరికీ ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని కుతూహలం గా ఉంది.  డా.చతుర్వేది ఓ రెండు నిముషాలు ఆగి... "మీ నామ ధేయం ఏమిటి?"  అని అడిగాడు ఆ ఆకారాన్ని.  దానికి జవాబుగా ఆవ్యక్తి "పుష్యమిత్రుడు" అన్నాడు. చతుర్వేదితో బాటూ అందరూ ఆగదిలో ఒక్కసారి డైనమేట్ పేలినట్టుగా ఉలిక్కిపడ్డారు.  ఎవరికీ నోట మాటలేదు. నిశ్చేష్టులై నిలబడిపోయారు.. ఏ పుష్యమిత్రుడు? క్రీస్తు పూర్వం 180 - 149 సంవత్సరాలకు చెందినవాడా? అని సంభ్రమాశ్చర్యాలతో అలోచిస్తూ ఉండగా...ఆ ఆకారం మళ్ళీ   " అవును! నేను పుష్యమిత్రుడనే!" ఈ దేశాన్ని పరిపాలించిన పుష్యమిత్రుడినే! మౌర్య చక్రవర్తులచే పాలింపబడి అణగారిపోయిన హిందూ మతాన్ని పునరుద్ధరించిన పుష్యమిత్రుడను!  మౌర్య వంశంలో కడపటి రాజైన బృహద్ధ్రధ మహారాజు తర్వాత పరిపాలించిన శుంగవంశానికి చెందిన  చక్రవర్తిని. అనగానే, అక్కడ ఉన్న ఓ ఐ.యే.ఎస్ అఫీసర్ ఉండబట్టలేక.. "బృహద్ధ్రధుడిని సంహరించి సింహాసనం అధిష్టించిన పుష్యమిత్రుడు మీరేనా?" అన్నాడు సంస్కృతంలో తన భాషా పరిజ్ఞానం ఉపయోగిస్తూ "ష్ష్!!"..అలా మాట్లాడకు అన్నాట్టు సైగ చేసాడు డా.చతుర్వేది.  “అవును నేనే” అంటూ ఇరవై రెండు శతాబ్దాల వెనకటి అలోచనల్లోకి జారిపోతూ...  నా పేరు పుష్య మిత్రుడు!" అన్నాడు.  మళ్ళీ గంభీరంగా.... నా పేరు పుష్య.......
*  *  *
".......మిత్రుడు!.  బృహద్ధ్రధ మహారాజా!  అనగానే బృహద్ధ్రదుడు చిరునవ్వు నవ్వి "చూడడానికి వేద వేదాంగాలు చదివిన సద్బ్రాహ్మణుని వలె ఉన్నారు! బ్రహ్మ తేజస్సు మీ మొహం లో సుస్ఫష్టం గా కనిపిస్తోంది.  మీరు మా సామ్రాజ్యం లో మహా సేనాని పదవిలో చేరడానికి రావడం ఆశ్చర్యకరంగా ఉంది. సేనాని పదవికి చతురంగ బలాలను నడిపే నేర్పు, యుద్ధ విద్యలలో పరిపూర్ణత కావాలి. మంత్రాంగం వేరు,  సైన్యాధిపతి పదవి వేరు కదా పుష్యమిత్రా! ఆలోచించండి! " "అవును మహారాజా! ఒప్పుకుంటున్నాను. నేను వేద వేదాంగాలతో బాటూ యుద్ధ విద్యలూ..వ్యూహాలూ..రక రకాల ఆయుధ ప్రయోగాలు నేర్చుకున్నాను. ఒరలో  కత్తి ఉన్నంత మాత్రాన క్షత్రియుడు  కాజాలడు. అలాగే.. మెడలో జంధ్యం ఉన్నంత మాత్రాన సద్బ్రాహ్మణుడూ కాడు.  నాకు మీ సామ్రాజ్యం లో మహాసేనాధిపతి పదవి నివ్వండి. సామ్రాజ్యాన్ని నిష్కంటకం చేస్తాను" అనగానే.. దానికి పోటీ ఏర్పాటు చేసాము పుష్యమిత్రా! మీరూ అందులో పాల్గొని విజయం సాధించవలసి ఉంటుంది. నేడు త్రయోదశి..రేపు చతుర్దశి. ఆ తర్వాత పౌర్ణమి రోజున ఈ పోటీ ఉంటుంది.  ద్రాక్షా పానీయం సేవించి ఓ నిముషం  తర్వాత మళ్ళీ చెప్ప సాగాడు.
"మా సేనాధిపతి ఆరు మాసాల క్రితం అకస్మాత్తుగా విషప్రయోగం వల్ల మరణించారు. కారణం తెలియ రాలేదు. అందువల్ల మహా సేనానిని నియమించదలచి దేశ దేశాలకూ వర్తమానాలు పంపాము. పుష్యమిత్రా! ముఖ్య విషయం! మీరు అష్ట దిగ్గజాల వంటి మా ఎనిమిది మంది సేనానులతోనూ,  పోటీకి వచ్చిన వారితోనూ,  ముఖ్యంగా  అడుగో! అరివీర భయంకరుడు, ప్రస్తుతం సామ్రాజ్యానికి తాత్కాలిక సేనాధిపతిగా ఉన్న మా పినతల్లి కుమారుడు మౌర్య వంశకేసరి సింహకేతనుని తో పోరి గెలవాల్సి ఉంటుంది.  అనగానే సింహకేతనుడు మీసంపై చెయ్యి వేసి మెలిత్రిప్పాడు.  అది అంత సులభం అనుకోకు!  సింహకేతనుడు   అతిబలశాలి.  పేరుకు తగ్గట్టుగా సింహ బలుడు. ఏ ఆయుధం లేకుండా సింహాలతో పులులతో పోరాడి గెలిచిన సమర్ధుడు" అనగానే.    " కావచ్చు మహరాజా... సేనాధిపతి మహా బలవంతుడైనంత మాత్రాన సరిపోదు. సర్వ యుద్ధ విద్యలలో ప్రవీణుడవాలి. సైనికులకు అస్త్ర విద్యలలో తర్ఫీదునిస్తూ నిరంతర సాధన నివ్వగలగాలి. వ్యూహరచనలో దిట్టగా ఉండాలి. పంచతంత్రాలు తెలిసి ఉండాలి. యుద్ధ సమయాలలో  వారిని నిరంతరం ఉత్సాహపరుస్తూ ఆకాశమే హద్దు అన్న రీతిలో ముందుకు సాగాలి. వ్యవసాయం చేసే రైతులకు, వ్యాపారస్థులకు, వివిధ వృత్తులు చేసుకునే యువతకూ ఆయుధ శిక్షణ నివ్వాలి. దీనివలన వారు శత్రువుల నుండి తమను తాము రక్షించుకోవడమే కాకుండా దేశ రక్షణ సమయంలో సైనికులుగా మారి దేశానికి ఉపయోగపడతారు. మీదు మిక్కిలి నాయకత్వ లక్షణాలు మెండుగా ఉండాలి. అయినా మహరాజా... తమకు తెలియనిదేమున్నది.....జయాపజయాలు దైవాధీనాలు! మనం నిర్ణయించగలిగేవి కావు! "  అని చిరునవ్వు నవ్వాడు పుష్యమిత్రుడు. మహా మంత్రి కలుగజేసుకుంటూ.. "పుష్యమిత్రుడు చెప్పినది అక్షరాలా నిజం మహారాజా! కేవలం దేహ ధారుఢ్యం మాత్రమే సైన్యాధికారి పదవికి సరిపోదు అనగానే సభలోని వారు సంతోష సూచకంగా చప్పట్లు చరిచారు. ఇదంతా సింహకేతనుని కి నచ్చడం లేదు.  బృహద్ధ్రదుడు ఒకసారి సింహకేతనుని వైపు చూడగానే... సింహకేతనుడు తన ఆసనం మీద నుండి లేచి.. " ఓయీ! బ్రాహ్మణోత్తమా! ఈ పోరాటాలూ..యుద్ధాలూ.. వ్యూహాలూ..మీకేల? వేద వేదాంగ పఠనం తో జీవితం గడుపుకుంటూ సమ్మానాలనూ అగ్రహారాలనూ అందుకోవచ్చుకదా!" అనగానే.. "ఎవరు ఏ పని చేయవలసినదీ ఆ పరాత్పరుడు ముందు గానే నిర్ణయించి ఉంటాడు.  అయినా.. సింహకేతనా ! పౌర్ణమి నాడు మన విద్యా ప్రదర్శన లో అన్ని విషయాలు తేలగలవు" అని అనగానే.  సింహకేతనుడు తొడకొట్టి ఆశీనుడయ్యాడు. సభికులు ఉత్సాహంగా కరతాళ ధ్వనులు  చేసారు... సామ్రాజ్యంలోనూ అంత:పురంలోనూ గత కొద్ది కాలంగా వీరవిహారం చేస్తూ  అకారణంగా ప్రజలను, సైనికులను హింసిస్తున్న సింహకేతనునికీ, బృహద్ధ్రధ మహారాజు యొక్క   మేనత్త కుమారుడు శ్వేతాశ్వునికీ గట్టి పోటీ తగిలిందని గుసగుసలాడుకుంటూ సంతోషం వ్యక్తం  చేసారు.    ఆ కరతాళ ధ్వనులకు సింహకేతనుని కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి.  కాసేపటికి, సభ సద్దు మణిగాక  మహారాజు  "పుష్యమిత్రా! ఈ పోటీకి వచ్చిన వారికి నగరులో విడిది ఏర్పాటు చేసాము.  కానీ మీరు సద్బ్రాహ్మణులు కనుక మా అంత:పురంలోనే ప్రత్యేక మందిరంలో విడిది చేయవచ్చు” అనగానే అంగీకార సూచకంగా చిరునవ్వుతో తల వూపి నమస్కరించిన పుష్యమిత్రునికి,  ఈర్ష్యాసూయలతో  సింహకేతనుడు తనవేపు  గుర్రుగా చూడడం గమనిచకపోలేదు.
*  *  *
మరుసటి రొజు తెల్లవారు ఝాము సమయం నాలుగు గంటలు. పుష్యమిత్రుడు ఆ సమయానికే కాలకృత్యాలు తీర్చుకొని,  ఒక సైనికుడిని తోడుతీసుకుని తన గుఱ్ఱమైన మేఘపుష్పాన్ని ఎక్కి విద్యా ప్రదర్శనా స్థలికి చేరుకున్నారు.   అది ప్రతి పౌర్ణమికీ సైనికులందరూ తమ విన్యాసాలతో ప్రజలను అలరించే మైదానం.  నది ఒడ్డున సంధ్యాదికాలు ముగించుకుని, ఒకగంట శారీరక వ్యాయామం అయ్యాక పుష్యమిత్రుని కండలు తిరిగిన దేహం చూసి నివ్వెరపోయాడు సైనికుడు.  ఈతడు బ్రాహ్మణుడా లేక క్షత్రియుడా అన్న సందేహం కూడా వచ్చింది. గుఱ్ఱాన్ని కాసేపు రెండు కాళ్ళతో నిలబడేట్టు చేయడం,    అలా నిలబడ్డ గుఱ్ఱము ముందు కాలి గిట్టలతో నేలపై ఆరేడు సార్లు కొట్టడం, సైనికుని గుఱ్ఱం తీసుకుని జోడు గుర్రాల మీద నిలబడి స్వారి చెయ్యడం, గుఱ్ఱం పై నిలబడి బల్లెం విసరడం వంటి విన్యాసాలు అయ్యాక, కత్తి సాము, విల్లుతో బాణప్రయోగం, గదను తిప్పడం, బల్లెంతో చిత్ర విచిత్ర విన్యాసాల వంటివి చేసేసరికి తెలతెలవారుతోంది.  అప్పటికే సైనికులూ ప్రజలూ ఆమైదానం చుట్టూ చేరి తనను ఆసక్తిగా గమనిస్తున్నారన్న విషయం గ్రహించిన పుష్యమిత్రుడు, మెల్లిగా తన కార్యక్రమాలను ముగించుకుని విడిదికి  చేరాడు.  పుష్యమిత్రుని విద్యా ప్రదర్శన ఆనోటా ఈనోటా సింహకేతనుని కి చేరడంతో,  తనూ సాధన చెయ్యవలసిన అవసరం గుర్తెరిగి.. తన మేలుజాతి అశ్వానికి కళ్ళెం బిగించగా, ఎందుకో ఆ అశ్వం కళ్ళ వెంట అకారణంగా కన్నీరు  కారుతోంది.  గుఱ్ఱంపై కూర్చోగానే ఎడమకన్నూ..ఎడమ భుజం అదిరాయి.  మైదానం చేరుకునేలోగా సుడిగాలి దుమ్మూ ధూళితో వీచింది.  ఆకాశంలో కాకుల  గుంపులు గోలగోలగా అరుస్తున్నాయి. దారి పొడవునా మోరలు పైకెత్తి నిర్విరామంగా ఏడ్చే కుక్కలు. అమంగళాలు ఎక్కడ చూసినా తాండవిస్తున్నాయి. ఈ అమంగళాలూ దుశ్శకునాలూ చూసాక ఎందుకో మొదటి సారి భయం వేసింది సింహకేతనునికి.  గుండెల్లో గుబులు లాంటిది మొదలయింది.  ఎలాగైనా పుష్యమిత్రుడిని ఈ పోటీ నుండి తప్పించడమో...వీలు కాకపోతే హతమార్చడమో  చెయ్యాలన్న ఆలోచన మొదలయింది.  వెంటనే గుఱ్ఱాన్ని వెనక్కు తిప్పి అరణ్యం వేపు సాగాడు.
అరణ్యంలో ఓ నిర్జన ప్రదేశం దాటాక గుర్రాన్ని దిగి ఓ కొండగుహలోకి ప్రవేశించాడు సింహకేతనుడు.  లోపలికి వెళ్తూనే భయంకరమైన వాసన నర-జంతు బలులు సాగే ప్రదేశం అది. ఆ చుట్టుపక్కల సామ్రాజ్యాలలో ఎక్కడ చేతబడులు జరిగినా..పరకాయ ప్రవేశాలు జరిగినా..భూత ప్రేత పిశాచాలు ఎవరినైనా ఆవహించినా.. చిల్లంగిలాంటివి జరిగినా మొదటగా గుర్తొచ్చేదీ...  తలుచుకునేది “కాలకంఠ అఘోరా” నే!  అతనే అన్నిటినీ శాశించ గల నియంత్రించగల సమర్ధుడు!
కాలకంఠ అఘోరా ఏభై సంవత్సరాలు హిమాలయాలలోని అఘోరాలతో కలిసి తాంత్రిక శక్తులు సాధించిన అనంతరం ఇక్కడకు చేరుకుని ఈ గుహలో నివాసం ఏర్పరుచుకున్నాడు.   మరలా ఓ ఐదు సంవత్సరాలు దక్షిణ భారత దేశం లోని  తమిళనాడు, సింహళదేశం, మలబారు తీర ప్రాంతాలు, ఒరిస్సా, ఆంధ్ర దేశాలు తిరిగాడు.  ఆసమయంలో క్షుద్ర, దుష్ట శక్తుల ఆవాహన కూడా చేసాడు అంటారు ఇక్కడ అడవిలోని కోయవారు. దుష్ట శక్తులను తరిమికొట్టడంలో అతన్ని మించిన వారు లేరని ఇక్కడి జనులు అంటారు.  అయితే అఘోరా ఆవిషయాన్ని ఎప్పటికీ ఒప్పుకోడు.  పరమేశ్వరుని అనుజ్ఞతోనే  తను అన్నీ చేయగలుగుతున్నాను అంటాడు.
అఘోరా తాంత్రిక పద్ధతిలో ఉపాసనా మార్గాన్ని ఎంచుకునే వారు ప్రపంచంలో కనీవినీ ఎరుగని కఠినమైన పరీక్షలను ఎదుర్కోవలసి ఉంటుంది. స్మశానంలోనే జీవించాలి. కపాలాన్ని పాత్రగా మలచుకుని అందులోనే ఆహారాన్ని స్వీకరించాలి. ఎవరి దగ్గరా ఏదీ అడిగి తీసుకోరాదు. భిక్షాటన నిషేధం. అయాచితంగా ఏదైనా లభిస్తే దాన్నే ఆహారంగా స్వీకరించాలి. ఈ పరీక్షలన్నీ ఎదుర్కొన్న తరువాత కానీ, గురువు నుంచి అఘోర దీక్ష లభించదు. ఇలా అన్ని పరీక్షలు ఎదుర్కొన్న తరువాత కూడా వీరు సాధారణ సాధువుల్లా మనుగడ సాగించరు. వీరికి ఎదుటి మనిషితో పని లేదు. కఠినమైన తాంత్రిక ఉపాసన చేయటమే నిత్యవిధి. అయితే వీళ్ళు చేస్తున్నది క్షుద్ర పూజ ఎంతమాత్రం కాదు.. ఇది ముమ్మాటికీ రుద్రపూజ. అఘోరా ఒక ప్రత్యేక తాంత్రిక విద్య. కఠినమైన పద్ధతులతో ఉపాసన చేసి సాధించుకున్న సిద్ధులతో ఈ ప్రపంచంలో ఏదైనా సాధించుకోవచ్చనీ చెప్తారు వారు.
అడుగో అతడే.. ఆ అగ్నిముందు కూర్చుని, వెన్నెముకను కర్రలా నిలబెట్టి, ఉపాసనా దీక్షలో ఉన్నవాడే కాలకంఠ అఘోరా!  శిష్య బృందం చుట్టూ కూర్చుని గురువును పరిశీలిస్తున్నారు.  ఒంటిమీద నూలుపోగైనా లేదు...చితి మంటల మీది భస్మాన్ని ఒంటినిండా పూసుకున్నాడు. జుట్టు జడలు కట్టి చెట్టు ఊడల్లా కిందకు వేలాడుతున్నాయి. జడలు ముఖంపై పడుతున్నా పట్టించుకునే స్థితిలో లేడు. చూడగానే జుగుప్స కలిగించే వేషం. లోకం తనను చూసి అసహ్యించుకుంటోందన్న జ్ఞానమూ అతనికి లేదు. అన్నింటికీ మించి వారు తినే తిండిని చూస్తే.. ఒళ్లంతా వేయి జెర్రులు పాకినంత గగుర్పాటు కలుగుతుంది.  వారు తినేది శవమాంసం... మన కలలో కూడా కనీవినీ ఎరుగనిది. అయితే ఓ పాతికేళ్ళ క్రితం ఇక్కడకు వచ్చి గుహలో స్తిరపడిన కాలకంఠ అఘోరా ఎందుకో మళ్ళీ హిమాలయాల వేపు వెళ్ళకుండా ఓ నలుగురు శిష్యులతో స్థిరపడి పోయాడు ఈ గుహలో.  సింహకేతనునికి తరచూ విపత్తులు ఎదురైనప్పుడు సలహాలకోసం అఘోరాను సందర్శించడం అలవాటే!  అఘోరా కళ్ళు తెరిచే వరకూ ఓ బండపై నిశ్శబ్దంగా కూర్చున్నాడు.
కొంతసేపటికి... నమో విరూపేభ్యో విశ్వరూపేభ్యశ్చవోనమః , నమో మహద్భ్యః క్షుల్లకేభ్యశ్చవోనమః  అంటూ కళ్ళు తెరిచిన అఘోరా... ఓ మూడు నిముషాలు మౌనం  వహించి... “ నీవు ఎందు నిమిత్తం ఇక్కడకు వచ్చావో ముందుగానే తెలుసుకున్నాను. చూడు సింహకేతనా! మృత్యు ముఖం లోకి వెళ్తున్నావు! వద్దు!" అన్నాడు ఉపోద్ఘాతం ఏమీ లేకుండానే. సింహకేతనుడు ఉలిక్కిపడి "ఏమంటున్నారు?”  అనగానే.. అఘోరా గంభీరంగా చెప్పసాగాడు. “ నీవు తలపడబోయేది సామాన్య సైన్యాధికారి ఉద్యోగానికి వచ్చిన వ్యక్తితో అనుకోవద్దు. భావి భారత సామ్రాట్టుతో.. వాడు ఈ భరత ఖండాన్నే ఏలగల సమర్ధుడు. అతనికి రాని విద్య లేదు. వేద వేదాంగ విద్యలతో బాటూ..అస్త్రశస్త్రాల విద్యలలో అతనితో సాటిరాగల వారు  ప్రస్తుతం ఇంకా భరత ఖండంపై పుట్టలేదు. నేనూ అతని వ్యవహారంలో వేలు పెట్టనంతవరకే మనగలను. అతను భగవత్ సాక్షాత్కారంతో ఈ గడ్డపై వెలసిన సామవేదీయ బ్రాహ్మణుడు. సర్వ భారతదేశమును తన అదుపులోనికి తెచ్చుకుని మరలా వైదికమతాన్ని ప్రతిష్టాపన చెయ్యగల ధీశాలి.”  అతనితో వైరం వద్దు. వైరం ఉన్నంతవరకూ నీవు దినదిన గండం గా బ్రతకాల్సి వస్తుంది. పోటీలో అతనితో తలపడ్డా గెలిచే శక్తియుక్తులు నీకు ఉన్నట్టు నేను భావించడం లేదు. నీకు ఈ విషయం లో నేను చెయ్యగల సహాయం ఏమీ లేదు. అతనితో తలపడి భంగపడ వద్దని హెచ్చరిస్తున్నాను సింహకేతనా!... అతనితో నీవు తలపడినట్లయితే ఖచ్చితంగా నీ అంతం అతని చేతిలోనే ఉంటుందని నా ఆరో శక్తి ఈశ్వరునిచే చెప్పిస్తోంది.  నీవు ఇక వెళ్ళవచ్చు  శెలవ్! ”  అని మళ్ళీ ధ్యాన ముద్రలోకి వెళ్ళిపోయాడు.
అఘోరా చెప్పిన మాటలు వినగానే ఆశ్చర్య పోయాడు. ఓ నిముషం సేపు మతిస్థిమితం తప్పి,  భూమ్యాకాశాలు తన చుట్టూ గిర్రున తిరుగుతున్నట్లనిపించింది. నిశ్చేష్టుడయ్యాడు. అఘోరా అబద్ధం చెప్పడు. భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసిన వ్యక్తి.  అతని వాక్కు అబద్ధం కాదు. కానీ.... కానీ.... ఏదో చేయాలి అతన్ని గెలవాలి. ఎలా? ఎలా? ఏదో ఒక యత్నం పన్ని అతన్ని ఓడించాలి , లేదా సంహరించగలగాలి. అదే ఎలా? అన్న అలోచనలతో వెనుదిరిగాడు సింహకేతనుడు.
*  *  *

No comments:

Post a Comment

Pages