మార్నింగ్ వాక్‌లో పదనిసలు

అక్కిరాజు ప్రసాద్ 


ఐదు ముప్పావు కల్లా సూరీడు ఉదయించేసి లే లే అని బాల్కనీ అద్దాల ద్వారా మేల్కొలిపాడు. బద్ధకంగా బయటకి వెళ్లి మా ఐదో అంతస్థు బాల్కనీ నుండి క్రిందకు చూద్దును కదా! అప్పటికే మార్నింగ్ వాకర్స్ చక చక నడుస్తున్నారు. పెద్ద, చిన్న, ఆడ, మగ అందరూ ఉత్సాహంగా కబుర్లు చెప్పుకుంటూ ముందుకెళుతున్నారు. మా కమ్యూనిటీని ఒక చుట్టు చుడితే దాదాపు .6 కిలో మీటరు. సరే అని నేను కిందకి వెళ్లి వాకింగ్ మొదలు పెట్టాను. ఒక్కొక్క వ్యక్తితో పరిచయం, ఆ పరిచయం సాన్నిహిత్యంగా మారటం, ఆపై ఒకరి విషయాలు ఒకరి చర్చించుకోవటం...ఇలా మొదలైనది ఆ మార్నింగ్ వాక్ యాత్ర. కొన్ని నెలల పరిచయాల సంకలనం ఇది.
నా మొట్టమొదటి స్ఫూర్తి 80 ఏళ్లు పై బడిన ఒక తమిళ వృద్ధ జంట. పార్వతీ పరమేశ్వరుల్లా ఉంటారు జంట. "గుడ్ మార్నింగ్ ప్రసాద్ హౌ ఆర్ యూ?" ..రోజూ నన్ను స్పృశించే పలకరింపు. "ఫైన్ అంకుల్..."...ఆ దంపతులు జీవితంలో అన్నీ చూశారు. భోగ భాగ్యాలు అనుభవించినా చాలా సాదా సీదాగా జీవితం గడిపే జంట. సాంప్రదాయాలను, సనాతన ధర్మాన్ని చక్కగా పాటిస్తారు. ఆ వయసులో కూడా అన్ని పనులూ తామే చేసుకుంటారు. ముసలాయన వ్యక్తిత్వాన్ని గమనిస్తుంటే ఎన్నో పాఠాలు. భార్య అంటే వల్లమాలిన ప్రేమ, ఆమె కోసం ఏదైనా చేస్తాడు. ఛ! ఆయన చేసే దాంట్లో వందో వంతైనా నేను చేస్తాన అనిపించి, చేయాలి అన్న సంకల్పాన్ని చిగురింప జేసింది. కొడుకు ఊళ్లోనే ఉన్నా స్వంతంగా ఉండాలనుకునే జంట అది. ఆవిడకు కూడా ఆయన అంటే అమితమైన ప్రేమ. వివాహంలో షష్టిపూర్తి చేసుకున్నారు. గత యాభై ఏళ్లుగా ఆ జంట ప్రతి పౌర్ణమికి సత్యనారాయణ వ్రతాన్ని స్వయంగా ఆచరించే అలవాటు. వాళ్లతో పరిచయం అయిన తరువాత నాకు ప్రతినెలా వారింటికి వెళ్లటం, ప్రసాదం తీసుకొని వాళ్లతో పిచ్చాపాటీ మాట్లాడి వాళ్ల ఆశీర్వాదం తీసుకోవటం నా జీవితంలో అంతర్భాగమై పోయింది. ఏమిటో పరమేశ్వరుడి లీల అనిపిస్తుంది....
ఇలా తెల్లవారు ఝామున సమయంలో ఎంతో పట్టుదలతో వృద్ధాప్యంలో ఉన్న జంటలు వాకింగ్ చేస్తూ ఉంటారు. ఒక 75 ఏళ్ల పెద్దావిడ, పండు ముత్తైదువ. ఇటీవలే కాలు విరిగి నిదానంగా అడుగులు వేస్తూ ఉంటుంది. భర్త జాగ్రత్తగా పక్కనే నడుస్తూ ఆమెవంక చూస్తూ ఉంటాడు. ఒకరికి ఒకరు మౌనంగా ఆలంబన. ఇంతలోనే "కైసే హో ప్రసాద్" అని ఢిల్లీ నుండి రెండు తరాల క్రితం హైదరాబాదుకు వచ్చి సెటిలైన ఒక వృద్ధుడి పలకరింపు. "అంకుల్ ఆప్ ఆజ్ కల్ దిఖ్ రహే నహీ" అని అడిగితే "అభీ కుచ్ హఫ్తే పెహ్లే బీవీ గుజర్ గయీ ప్రసాద్"...ఒక్క క్షణం ఆలోచనలు ఆగిపోయేంత నిశ్శబ్దం...జీవిత భాగస్వామిని కోల్పోతే మగవాడి జీవితం నరకమే అని ఆయనతో మాట్లాడిన తరువాత అర్థమైంది. అటుపక్క పార్కులో బెంచీలో మరో వృద్ధ స్త్రీ. భర్త ఇటీవలే చనిపోయాడు. ఒక్కతే ఒంటరిగా ఉంటుంది. ఆవిడకు ఉదయం సాయంత్రం ఆ వయసు స్త్రీ పురుషుల పలకరింపులు, ఆసరాలు. వీళ్లందరూ పనులు కలిసి చేసుకుంటారు, విహార యాత్రలకు కలసి వెళతారు. పిల్లలు దగ్గర లేకపోతేనేమి? వాళ్ల జీవితాలు ముందుకు వెళుతూనే ఉన్నాయి. వాళ్లను చూస్తుంటే నా వృద్ధాప్యం ఎలా ఉంటుందో అనిపిస్తుంది.
ఇక ఏడు గంటల సమయంలో వాకింగ్‌కి వెళితే ఇంకో వయో సమూహం...దాదాపు 55-60 ఏళ్ల మధ్య వాళ్లు...పిల్లల పెళ్లిళ్లు అయ్యి అప్పుడే రిటైర్ అవ్వబోతున్నవారు లేక అయినవాళ్లు. "ప్రసాద్ గారు ఏమిటి ఈ మధ్య వాకింగ్‌లో కనిపించటం లేదూ...మా చిన్న వాడు ఇంకా ఉద్యోగంలో సెటిల్ కాలేదు" అని వాపోయే తండ్రి ఒకరైతే, "మేము అబ్బాయి దగ్గరకు అమెరికా వెళ్లాలండీ" అని ఆ ప్రయాణపు కబుర్లు చెప్పే జెంటిల్‌మ్యాన్ ఇంకో ఆయన. "అభీ హుం లోగ్ యూరోప్ ట్రిప్ సే వాపస్ ఆయే ప్రసాద్ జీ. ఆప్ భీ జావో" అని ప్రోత్సహించే ఒక వృద్ధయువకుడు. భలే ఉంటుంది వీళ్లతో మాట్లాడుతుంటే. ఆ వయసులో ఒక పరిణతి ఉంటుంది చూడండి. అదంటే నాకు మహా ఇష్టం. చక చక అడుగులేస్తూ నాలాంటి మందపాటి వాళ్లకు సిగ్గు కలిగేలా ఉత్సాహంగా వాకింగ్ చేసే గ్రూపు ఇది. వీళ్లలో చాలా సామాజిక చైతన్యం ఉంటుందండోయ్. "ప్రసాద్ గారూ! మీరు ఈ అసోసియేషన్ మెంబర్ కదా! కాస్త మన కమ్యూనిటీలో ఇంకుడు గుంతల పని చేయించకూడదూ" అని ప్రోత్సహించే వాళ్లు వీరు.
ఒక్క అరగంట తరువాత వాకింగుకు వెళితే పిల్లలని అప్పుడే స్కూలు బస్సులెక్కించి హమ్మయ్య అనుకుంటూ నడిచే మహిళామణులు..."హలో అండీ బాగున్నారా" అన్న పలకరింపుతో సాగిపోతుంది వాళ్ల వాకింగ్. వాళ్ల ప్రపంచమంతా పిల్లలు, చదువులు, వాళ్ల డ్యాన్సులు, సంగీతాలు, ట్యూషన్లు..వగైరా వగైరా...పిల్లలకు ఎటువంటి అసౌకర్యం కలిగినా వెంటనే అసోసియేషన్ కమిటీకి ఫిర్యాదు చేసే తల్లులు కొందరైతే మరికొందరు వివిధ రకాల పోటీలు, సంబరాలు, ఉత్సవాలు, పండుగలు సునాయాసంగా వేడుకగా జరిపించే అసమాన ప్రతిభామూర్తులు...ఎంతటి పనినైనా అలుపు లేకుండా చిరునవ్వుతో చేసే మహిళామణులు...వీళ్లను గమనిస్తే భారత దేశంలో ఎంతటి ప్రతిభ గుర్తింపు లేకుండా పోతోంది అని అనిపిస్తుంది. అదే అమెరికాలో అయితే ఇంత పని చేస్తే అంత గుర్తింపు ఇస్తారు...భారత నారి హ్యాట్సాఫ్ అనిపిస్తుంది. అవగాహనతో వాకింగ్ చేసే వాళ్లు కొందరైతే పొద్దున్నే ఉందే హడావిడి నుండి బ్రేక్‌లా ఇతరులతో మాట్లాడ వచ్చు అన్న ఆలోచనతో కొందరు.
ఇక ఎనిమిది గంటల సమయంలో నా లాగా నలభైల్లో ఉండే మగాళ్లు. కొంతమంది దేహదారుఢ్యం కోసం పరిగెట్టేవాళ్లు, కొంతమంది ఒళ్లు తగ్గించుకోవటానికి అవస్థపడుతూ నడిచే వాళ్లు, కొంత మంది బీపీ కంట్రోల్ కోసమని డాక్టర్ చెబితే నడుస్తున్న వాళ్లు, కొంతమంది కాల్స్ తీసుకుంటూ నడిచే వాళ్లు, కొంతమంది కాలక్షేపానికి నడిచే వాళ్లు...సమస్యలు ఒత్తిళ్లు ఆఫీసులో బాసులతో గోల, అర్థరాత్రి వరకు మీటింగులు, నరేంద్ర మోడీ, సోనియా గాంధీ, చంద్రబాబు, కేసీఆర్ వీళ్ల చర్చాంశాలు. మన సమస్యలు పక్క వాళ్లకు కూడా ఉన్నాయి తెలుసుకుని కాస్త రెలీఫ్ పొందే మనస్తత్వాలు. మిడ్ లైఫ్ క్రైసిస్ వీళ్ల లక్షణాలు. "ఎన్ని రౌండ్లు వేస్తారు ప్రసాద్ గారు?" "ఓహ్ బరువు తగ్గాలంటే అవి చాలవండీ. కనీసం ఎనిమిది రౌండ్లైనా నడవాలి.." అనే శ్రేయోభిలాషులు. "వాకింగ్ వల్ల ఉపయోగం లేదని ఇటీవలే చదివాను. నిజమే అంటారా?" అనే వాళ్లు...జీవితంలో అప్పుడే సమతుల్యం వస్తూ, మరో పక్క అప్పుడప్పుడు అహంకారం నేనున్నానని తొంగి చూసే వయసా ఇది అనిపిస్తుంది.
ఓ అరగంట ఆలస్యంగా వెళితే యువతరం. ముప్ఫైల్లో ప్రపంచాన్ని జయించగలమన్న ధైర్యం..ఏదో చేయాలన్న తపన..రంగు రంగుల దుస్తులు, బూట్లు వేసుకొని హెడ్ ఫోన్స్ పెట్టుకొని చుట్టూ ప్రపంచం ఏదీ పట్టనట్లు నడిచేవాళ్లు. సెల్‌ఫోనే ప్రపంచం, సెల్‌ఫొనే జీవితం. వాళ్లలో కాస్త సీనియర్స్ పలకరింపు వరకు ఓకే. జీవితంలో ఉద్యోగం, డబ్బు ప్రాధాన్యతలుగా ఉండే వయసు కాబట్టి వాళ్ల మాటలన్నీ వీటి చుట్టే. విచిత్రమేమిటంటే మనిషికి ఎప్పుడూ ఏ వయసులో ఏది ప్రాధాన్యత ఉంచుకోవాలో ఆ వయసులో అస్సలు తెలీదేమో అనిపిస్తుంది ఆ తరం వాళ్లను చూస్తే. నిజమే, నేను కూడా ఆ వయసులో అలాగే ఉన్నా. యువతరాన్ని గమనిస్తే వారిలో ఒకరకమైన అభద్రతా భావం, తొందరగా విజయాలు సాదించాలన్న అత్యాశ, జీవనశైలి వలన, కంప్యూటర్ వృత్తుల వలన చిన్న వయసులోనే వెన్నెముక, నడుము సమస్యలు...ఎక్కువగా కనిపిస్తున్నాయి..
"నేను అటవీశాఖలో పనిచేస్తున్నానండీ. భోపాల్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్‌మెంట్‌లో చదివాను.." అని ఒక యువకుడు అటవీశాఖలో జరిగే అవినీతి తెలుపుతుంటే మనం ప్రకృతిని ఎలా నాశనం చేస్తున్నామో అర్థమైంది. చెట్ల లెక్కలు, పులుల లెక్కలు...అన్నీ తప్పుడే. అన్నీ విన్న తరువాత పర్యావరణంపై పరిశోధన గురించి అతను వివరాలు చెప్పాడు. ఈ చర్చ మా అమ్మాయి ఏమి చదవాలనుకుంటున్నది అన్న దాని వైపు మళ్లింది. పర్యావరణం చాలా మంచి సబ్జెక్టు అని అతను చెప్పాడు. ఈ వివరాలన్నీ విని ఈ ప్రపంచంలో సాఫ్ట్వేర్ కాకుండా బోలెడు ఉపాధులు ఉన్నాయి అని తెలిసి ఊపిరి పీల్చుకున్నాను.
మధ్య మధ్యలో ఆసక్తికరమైన ప్రేరణ కలిగించే భేటీలు కూడా. 14 ఏళ్ల కుర్రాడు అద్భుతమైన వేగంతో సైకిలు తొక్కుతూ నన్ను దాటి వెళుతూ హలో అంకుల్ అని చెబుతాడు. తరువాత గమనించా, వాళ్ల నాన్న గారు తన పిల్లలిద్దరినీ ఎంత బాగా శరీర దారుఢ్యం కోసం ప్రోత్సహిస్తారో. రోజూ పిల్లలను లేపి పరిగెత్తించటం, సైకిలు తొక్కించటం, టెన్నిస్ ఆడటం వంటి వ్యాయామాలు స్వయంగా దగ్గరుండి పర్యవేక్షిస్తుంటారు. నా లాంటి బద్ధకస్తులైన తండ్రులకు ఆయన స్ఫూర్తి. దేహదారుఢ్యం గల పిల్లల ఆలోచనా పరిధి కూడా చాలా విస్తృతంగా ఉంటుంది అని ఆ పిల్లలను చూస్తే అర్థమైంది.
వారాంతాలు వస్తే చాలు వాకింగ్ చేసే వాళ్ల సంఖ్య బాగా పెరిగిపోతుంది. పిల్లలు, పెద్దలు, తల్లులు, వృద్ధులు అందరూ నడుస్తారు. అప్పుడప్పుడు కనిపించే వాళ్లనుండి రోజూ కనిపించే వాళ్లు...భిన్నత్వంలో ఏకత్వం మా వాకింగ్ ప్రయాణం. తేలికైన మనసులతో కుందేళ్లలా పరుగులెత్తే బాల బాలికలు, బరువు బాధ్యతలు, ఆలోచనా శైలిని బట్టి పలకరింపులు, కబుర్లు...బావిలో కప్పలా ఉండే అపార్టుమెంటులో నుండి ఈ వాకింగ్ ప్రపంచంలోకి వెళితే ఎంతో కొంత అజ్ఞానం తొలుగుతోంది, విజ్ఞానం పెరుగుతోంది. భారతదేశానికి ఉన్న గొప్పతనం సామాజిక ఆలంబన. మన సమస్యలు మనకొక్కరికే కాదు ఇతరులకూ ఉంటాయి, ఇతరులను గమనిస్తే మనకు కావలసిన పరిష్కారాలు దొరుకుతాయి అనిపిస్తుంది.
సూర్యోదయం ముందు నుండి దాదాపు 9 వరకు, మళ్లీ సాయంత్రం 6 నుండి దాదాపు అర్ధరాత్రి వరకు సాగే ఈ వాకింగ్ యానంలో సామాజికాంశాలతో పాటు మన శరీరానికి కావాలసిన ఆరోగ్యం ప్రకృతి ద్వారా లభిస్తుంది. ముఖ్యంగా తెల్లవారు ఝామున కాస్త పచ్చదనం పక్కన కూర్చొని ఆలోచిస్తే మనసులో సకారాత్మక ధోరణి పెరుగుతుంది, వ్యక్తిత్వం సమస్యలను పరిష్కరించుకునేలా వృద్ధి చెందుతుంది. నలుగురితో కలిసి అడుగులు వేస్తుంటే సామాజిక స్పృహ పెరిగి మనం మరింత బాధ్యత గల పౌరులుగా ఎదుగుతాం. ఎన్నో పాఠాలు, ఇంకా ఇంకా నేర్చుకోవాలి జీవితంలో...మార్నింగ్ వాక్‌లో పదనిసలు ఎంతో విలువైనవి.
***

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top