Monday, May 23, 2016

thumbnail

గోదావరి నుంచి సబర్మతి వరకు..(రెండవ భాగం)

గోదావరి నుంచి సబర్మతి వరకు..(రెండవ భాగం)

వెంపరాల వెంకట లక్ష్మి శ్రీనివాసమూర్తి 


అహమ్మదాబాద్‌..
అహమ్మదాబాద్‌...మహాత్ముడు నడయాడిన మహా నగరం.సబర్మతి అందాల సుందర తీరం.మనసులో మనకే తెలియని  ఓ రకమైన పులకింతలు రేపే మనోజ్న నగరం.
మహాత్ముడు సబర్మతి ఒడ్డున కూచొని చరఖాతో నూలు ఒడికి స్వదేశీ వస్త్రాలకు మద్దతు నిచ్చిన మహా ప్రదేశం అది.సత్య సంధత అవసరాన్ని,అహింస మహా ప్రభోధాన్ని మనకందించిన నేల అది. అబ్బో ఇలా చెబితే చాలా వుంది.కొన్ని విషయాలు మనకి ఖచ్చితంగా తెలియాలి,తెలుసుకోవాలి.
గాంధీజీ స్వయంగా నడయాడిన ప్రదేశంలో తిరగడం తెలియని ఓ మధురానుభూతి.అతి సాధారణమైన పడకగది ఓ వైపు,,చరఖాతో నూలు వడికిన ప్రదేశం మరో వైపు,చుట్టూ చక్కని పచ్చికతో కనువిందు చేస్తూ ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తోంది.వివిద రకాల గాంధీ చాయా చిత్రాలతో నెలకొల్పిన మ్యూజియం లాంటిది ఓవైపు వుంటుంది.ఆశ్రమానికి ఆనుకొని చల్లగా ప్రవహించే సబర్మతి నది..మళ్ళీ,మళ్ళీ చూడాలనిపించే మనోజ్న ప్రదేశమనే చెప్పాలి.విలువలు ప్రశ్నార్ధకమవుతున్న నేటిరోజుల్లో కనీసం ఇలాంటి స్థల స్పర్శ వల్ల అయినా ఏ వొక్కరిలో మార్పు వచ్చినా సంతోషమేకదా..!
గుజరాత్‌ రాష్ట్రంలో అతి పెద్ద పట్టణం అయిన అహ్మదాబాద్ నగరాన్ని సుల్తాన్ అహ్మద్ షా, సబర్మతి నది ఒడ్డున నిర్మించారు. ఫిబ్రవరి 26, 1411 తేదీన సూఫీ సన్యాసుల సమక్షంలో ఈ నాడు ఎలిస్ బ్రిడ్జ్ అని పిలవబడే ప్రదేశంలో సబర్మతి నది ఒడ్డున శంకుస్థాపన చేశాడు. ఈ శంకుస్థాపన చేసిన ప్రదేశాన్ని మానెక్ బుర్జ్ అంటారు.
నగరంలో జరగనున్న శాస్త్ర,సాంకేతిక సదస్సుకు ఆహ్వానం పలుకుతూ అనేక చోట్ల హోర్డింగులు నగరమంతా సందడి చేస్తున్నాయి.
టాగూర్‌ హాలు-దేశంలో ని అనేక మంది మేధావులతో,గణిత శాస్త్రజ్నులతో నిండి సందడిగా వుంది .ఎంతోమంది అనేక శాస్త్ర,సాంకేతిక రంగాలకు చెందిన ప్రముఖులు,ఇతర ఆసక్తిగల అనేకమంది నిపుణులు అక్కడ కొలువుతీరి వున్నారు.
గణితం ఒక మహా అధ్యయన శాస్త్రం..అర్ధమయినవాడికి అత్యధ్బుత శాస్త్రం.అర్ధమవని వాడికి అదో గందరగోళ శాస్త్రం.
జాతీయ గణిత సదస్సు..మహామహులైన గణిత మేధావులందరు అక్కడ వున్నారు.అనేక మంది తమ పరిశోధనా పత్రాలు సమర్పిస్తున్నారు.
కృష్ణ మోహన్‌ భారతదేశంలోని ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్తల్లో ఒకడు.ప్రతిభ ఆధారంగా అనతికాలంలోనే మంచి పేరు,ప్రఖ్యాతలు గడించాడని చెప్పొచ్చు.అనేక విదేశాలు సందర్శించి,అక్కడ మేధమెటికల్‌ సొసైటీలలో తన గణిత సిద్ధాంతాల్ని సాపేక్షకత గా నిరూపించాడు.అలాంటివాడు ఈరోజు అహమ్మదాబాద్‌ లో తన పత్రాన్ని సమర్పిస్తున్నాడంటే సహజంగానే  గణితంపట్ల ఆసక్తి వున్నవారందరిలో తెలియని ఒక ఉత్సాహం నెలకొనివుంది .
కృష్ణమోహన్‌ తన ప్రసంగాన్ని మొదలెట్టాడు.హాలు అంతా నిశ్శబ్ధంగా వుంది. ఒక్కసారి హాలులో వున్నవారందరినీ చూసాడు.చిన్నపిల్లల దగ్గర్నుంచి,వయోవృద్ధుల వరకు అంతా తననే కళ్ళప్పగించి చూస్తున్నట్టు గమనించాడు.చిన్నప్పుడు తను తరగతి గదిలో వెనక బెంచిలో కూర్చిని అల్లరి చేసిన రోజులు గుర్తొచ్చాయి. నెమ్మదిగా చెప్పడం మొదలెట్టాడు.
గణితం మహాసాగరంలాంటిది.లోతుల్లోకెళ్ళి వెతికిన కొద్దీ ముత్యాలు ఎలా దొరుకుతాయో..గణితంలో కూడా అలాగే లోతుగా అధ్యయనం చేస్తున్నకొద్దీ మనకి తెలియని ఎన్నో విషయాలు మనకి అవగతమవుతాయి.ఇప్పుడు నేను చెప్పే ఈ ఆసక్తికరమైన విషయాలు వింటే గణితమంటే కొరకరాని కొయ్య అనే అభిప్రాయాన్ని మీరు మార్చుకుంటారు.అంతేకాదు పట్టుదల వుంటే ఎలాంటి వ్యక్తి అయినా సాధన ద్వారా గణితం లో మంచి పట్టు సాధించగలరనే నమ్మకం కలుగుతుంది.అలాంటి వుదాహరణలే నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నది. మళ్ళీ హాలంతా తదేకంగా ఒక్కసారి పరికించి చూసాడు.తన కళ్ళు తనకి తెలియకుండానే ఎవరికోసమో వెతకటం మొదలెట్టాయి.
నెమ్మదిగా చెప్పడం ఆరంభించాడు.
2013వ సంవత్సరం లో, గణిత ప్రపంచంలో అసాధారణమైన ఒక సంఘటన జరిగింది. క్రీడారంగంలో ప్రతిభ యువతరానికి ఎలా పరిమితమో అదే విధంగా గణిత రంగంలో ప్రతిభ బాల్యానికీ, యువతకీ పరిమితం. గణితంలో పేరు ప్రతిష్టలు తెచ్చుకున్న వాళ్లంతా చిన్నతనంలోనే వికసించి పరిమళించేరు. ఒక గౌస్ అనండి, ఒక రామానుజన్ అనండి, ఒక మంజుల్ భార్గవ అనండి – వీరంతా పాతికేళ్లు నిండే లోపునే ప్రపంచ ప్రఖ్యాతి పొందేరు. ఉదాహరణగా 1985లో, కొమ్ములు తిరిగిన పాల్ ఎర్డిష్ (ఫౌల్‌ ఏర్దొస్‌) కేవలం 10ఏళ్ల టెరెన్స్ టావ్ తో గణితంలో ఎదురయే ఒక సూక్ష్మాన్ని చర్చించాడు. దరిమిలా, 2007లో అతను సంఖ్యాశాస్త్రంలో చేసిన పనికి గుర్తింపుగా, టావ్కి ప్రతిష్టాత్మకమైన ఫీల్డ్స్ మెడల్  వచ్చింది. ఈ బాల మేధావి ఇప్పుడు కేలిఫోర్నియా విశ్వవిద్యాలయం, లాస్ ఏంజిలిస్లో ఆచార్య పదవి అలంకరించి ఉన్నాడు.
ఇలా పరిమళించిన వారంతా పాతిక, ముప్పయి సంవత్సరాల లోపునే వారు చేరుకోవలసిన శిఖరాగ్రాలు చేరుకున్నారు. ఏభయ్యవ పడి దాటిన తరువాత గణిత శాస్త్రపు పురోగతికి దోహదం చేసిన వ్యక్తులు దరిదాపుగా లేరనే చెప్పాలి. అటువంటిది, 2013లో, ఏభయ్ ఏళ్లు దాటిన వయోవృద్ధుడు, అంతవరకు గణిత ప్రపంచానికి బొత్తిగా పరిచయం లేని ఒక అనామకుడు, చదువు అయిన తరువాత ఉద్యోగం దొరకక చిల్లర పనులు చేసి పొట్ట నింపుకున్న ఒక అప్రయోజకుడు, అకస్మాత్తుగా తారాపథంలో నవ్యతారలా ఒక్క వెలుగు వెలిగిపోయి అందరినీ ఆశ్చర్యచకితులని చేసిన వైనం ఇక్కడ చెప్పబోతున్నాను.
అతని పేరు యీటాంగ్ జాంగ్ , పుట్టుక 1955లో. చైనాలో ఉన్నతపాఠశాలలో చదువుకునేటప్పుడు ఆల్జీబ్రాని చూసి ఎంతో భయపడ్డ ఈ వ్యక్తే ఆ తరువాత పర్డ్యూ యూనివర్సిటీ నుండి 1991లో పిఎచ్. డి. పట్టా పుచ్చుకున్నాడు. ఆయనకి మార్గదర్శిగా ఉన్న ఆచార్యుడితో స్పర్ధలు వచ్చిన కారణంగా, సిఫారసు ఉత్తరం లేనందువల్ల జాంగ్కి ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. ఈ పంచనీ ఆ పంచనీ చేరి పొట్టపోసుకుంటూ తాడు తెగిన గాలిపటంలా ఉన్న జాంగ్ని చూసి జాలిపడి 1999లో ఒక స్నేహితుడు న్యూ హాంప్షైర్ విశ్వవిద్యాలయంలో లెక్చరర్ ఉద్యోగం ఇప్పించేడు. అక్కడ కాల్క్యులస్ పాఠాలు చెప్పుకుంటూ, 2001లో ఒక పరిశోధనా పత్రం ప్రచురించేడు కాని అది ఆయన, ఆ పత్రికా సంపాదకుడు తప్ప మరెవ్వరూ చదివిన దాఖలాలు లేవు. తరువాత 2013లో ప్రచురించిన రెండవ పత్రంతో దిక్కులు పిక్కటిల్లేలా జాంగ్ పేరు గణిత ప్రపంచంలో మారుమోగిపోయింది. జాంగ్ పరిష్కరించిన సమస్యని నియమిత విరామ సమస్య (the bounded gap problem) అని పిలుస్తారు. ఇది ప్రధాన సంఖ్యల అధ్యయనంలో తారసపడే అతి క్లిష్టమైన సమస్య. పరిష్కారం లేకుండా రెండు శతాబ్దాల నుండి వేధిస్తూన్న  సమస్యకు పరిష్క్రారం కనుగొన్నాడు.
ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే..ఎదైనా విషయం నేర్చుకోవాలంటే దానికి ప్రత్యేక పరిమితులు పెట్టుకోకండి.ఆసక్తి,అభ్యాసం ద్వారా ఎప్పుడైనా,ఎవరైనా ,ఏదైనా సాదించొచ్చు.
***
విష్ణు శర్మ గారిల్లు...ప్రశాంతతకు,ఆహ్లాదానికి మారుపేరు.మంచికి,మానవత్వానికి మరోపేరు.నగరానికి అవతల గా ఆయన అభిరుచి కి అనుగుణం గా నిర్మించుకున్న ఒక అందమైన పొదరిల్లు.ఆనందాల హరివిల్లు.మమతాను బంధాల బొమ్మరిల్లు.
ఇంటికి పక్కనే విశాలం గా నిర్మింపబడిన పాఠశాల.అందులో శర్మ గారు వేదాన్ని భోదిస్తూవుంటారు.దానికి గాయత్రి వేద పాఠశాల అని పేరుపెట్టి,వేదం నేర్చుకోవాలనుకొనే అబిరుచి వున్న పిల్లలందర్నీ దగ్గరకు చేర్చి వారికి ఆ విద్యను భోదిస్తూవుంటారు.మరుగున పడుతున్న సనాతనాన్ని,అటకెక్కుతున్న ఆచారాల్ని ఒడిసిపట్టుకొని సత్సాంప్రదాయాల్ని ప్రోది చేయాలని ఆయన ఆశ.
శర్మ గారు పాఠం చెప్పడం ప్రారంభించారు.
" ఓం కారం సర్వ మంత్రాలకు మూల మంత్రం గా చెప్పబడింది."  న గాయత్రీ నరం మంత్రం న మాతు పర దేవతం"-అంటే తల్లిని మించిన దైవం,గాయత్రి ని మించిన మంత్రం లేవు.
పరమ శివుడు బ్రహ్మానందంతో తన ఢమరుకం తో చేసిన ఇరవై నాలుగు ధ్వనులే శ్రీ గాయత్రీ మంత్రం లోని ఇరవై నాలుగు అక్షరాలు.ఈ ఇరవై నాలుగు అక్షరాలు ఇరవై నాలుగు దైవ శక్తులకు ప్రతీకలు.వీటికి ఇరవై నాలుగు పేర్లున్నాయి.వీటిలో పన్నెండు వైదిక మార్గాలు కాగా,పన్నెండు తాంత్రిక మార్గాలు." అని గాయత్రి మంత్రం గురించి చెప్పుకుపోతున్నారు శర్మ గారు.
ఇంతలో ఒక విధ్యార్ధి లేచి ఆ మంత్రార్ధం ఏమిటి గురువుగారు అని అడిగాడు.
దానికి బదులిస్తూ " ఈ సందేహమే ఒక సారి వశిష్ట మహర్షి వారికి వచ్చింది.వెంటనే విధాత వద్దకు వెళ్ళి గాయత్రి అంటే ఏమిటి? తెలపమని అడిగాడు.అప్పుడు బ్రహ్మ చెబుతూ-నా స్ఫురణ మాత్రం గా ఏ చైత న్య శక్తి వుత్పన్నమయిందో దానినే జ్నానము లేక వేదముగా చెప్పుకోవచ్చు.దీనినే గాయత్రీ నామం తో వ్యవహరిస్తారు.నా నుండి అగ్ని,అగ్ని నుండి వాయువు,వాయువు నుండి ఓంకారం,ఓంకారం తో హృతి,హృతి తో వ్యాహృతి,వ్యాహృతి తో గాయత్రి,గాయత్రి తో సావిత్రి,సావిత్రి తో వేదాలు,వేదాలతో సమస్త క్రియలు ప్రవర్తితమవుతున్నాయి.అని తెలియచేసాడు." చెప్పారు శర్మ గారు.
ఇంతలో శర్మ గారి భార్య వేదవతి పిలవడం తో ఒక శిష్యుడికి తరగతిని అప్పచెప్పి బయటకి వెళ్ళారు శర్మ గారు.
ఈ రోజుల్లో పుటం పెట్టి వెదికినా కనబడని నియమ,నిష్టలు,భక్తి,ఆచారాలు శర్మ గారింట్లో కొలువైవుండటం అక్కడ అందరికీ ఆశ్చర్యం కలిగిస్తూ వుంటుంది.ఈ కాలమాన పరిస్తితుల్లో ఒక వేద పాఠశాల ని నడపడం అంటే అది మామూలు విషయం కాదు.ఎటువంటి లాభాపేక్ష లేకుండా నడుపుతుండడం చాలా గొప్ప విషయం గా ఆయన్ని అందరూ ప్రస్తుతిస్తుంటారు.
" అంతా పరమేశ్వరేచ్చ " అంటారు శర్మ గారు.
***
రైలుబండి నెమ్మదిగా పరుగులు పెడుతూనే వుంది..నెమ్మదిగా తెల్లారినట్టనిపించింది.
కిందకి దిగి గుడ్‌ మార్నింగ్‌ చెప్పింది కింద బెర్త్‌, మీద కూర్చొన్న ఆంటీకి ప్రణవి.
(సశేషం)

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

No Comments


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information